
Dr.గీతాంజలి
‘‘దుబయ్‌ల మస్తు జాయ్‌దాద్ ఉన్నది. నీ బేటీ సుఖపడ్తది లక్ష ఇస్తనంటున్నడు. ఒక మహీన అయినంక తను దుబయ్ పోయి పిల్లను పిలిపించుకుంటడు. ఫికరు చెయ్యకు ఆయెనకు బీవీ లేదు చచ్చిపోయింది. పది, పన్నెండేళ్ళ పోరగాళ్ళిద్దరున్నరు గంతే, ఇంగ నీ ఇష్టం’’ ఖాజీ సులేమాన్ ఫాతిమాబేగం ఇచ్చిన చాయ్ బిస్కట్ల మజా అనుభవిస్తా చెప్తున్నడు. మద్దెమద్దెల ఫాతిమా బేగం మొకంల ఒక్కసారిగ వచ్చి పోతున్న వెలుగును జూస్త ఇంక రిష్తా పక్కా అయినట్లేనని లోపట లోపట ఖుషీ అయితున్నడు. అవ్ మరి! ఈ రిష్తా గిన పక్కా అయితే నలభై వెయిలు తన చేతిల పడవు మల్ల?
‘‘అంత సయే గని పిలగాని ఉమర్ జర ఎక్కువ లేదు సులేమాన్ సాబ్?’’ ఫాతిమాబేగం గునుక్కుంట తన షొహర్.. మతీన్‌కై ఉరుముత జూస్త కండ్లతోని సైగ చేసింది మాట్లాడవేంది అన్నట్లు.’’ హా సులేమాన్ సాబ్, యాభై ఐద్దంక ఉందంట గద.. ఆ షేక్ ఉమర్.. మా యాస్మిన్ బానుకి పద్దెనిమిదేండ్లే గద! అన్నడు మతీన్ గూడ.
ఖాజీ సులేమాన్ ఉరిమి చూసిండు ‘‘అరే నీ బేటీ ఏమన్నా దూద్ పీతా బచ్చీనా ఏందీ? ఆల్లకు లక్షల జాయిదాద్ ఉన్నది.
ఇప్పుడిచ్చే లక్ష కాకుంట ఇంకింత ` ఇంకింత పంపుతనే ఉంటరు తియ్యు. నీకింకా నిఖాలు కావల్సిన ముగ్గురు జవాన్ బేటీలు ` బడికి పోతాన్న బేటా ఉన్నడు.. యాది మర్శినవా? నీ బేటా గూడా నీ తీరే ‘హరేక్ మాల్’ అన్కుంట గల్లీ గల్లీ బిచ్చపోని తీరంగ ఎండల వానల ఒర్లుత తిరగాల్నని ఉన్నద నీకు? ఈ దుబయ్ షేకు గూడంగ నీ బేటాను ఆడకు పిలిపించుకుని ఏదన్న కొల్వుల పెడ్తన్నడు. ఇంగ నీ మర్దీ.. నీ బీవీ మర్దీ..’’ అన్నడు ఖాజీ ఒర్లుతున్నట్లే. అన్నీ అబద్దాలే దుబయ్ షేక్ అట్లేమనలే గని ఎక్కడ తన ఆమ్దానీ పోతదో అన్న తొందరతోని అబద్దాలు`సుబద్దాలు చెప్తుండు ఖాజీ’’. ‘‘జల్ది చెప్పాలె. ఇంక రెండు రిష్తాలున్నయ్, నా చేతిల ఆల్లు సుగ నా ఎంట బడ్తాన్రు. గని షేక్ నీ బిడ్డ మీన మనసు పడ్డడు ఎర్రంగ`బుర్రంగ ఉన్నదని. కల్‌తక్ బోల్‌దేనా హై.. బస్! చల్తాహూ’’ అన్కుంట లేశిండు ఖాజీ సులేమాన్. అవి గూడ అబద్దాలె.. ఖాజీల పోటీ ఎక్కువైంది పాతబస్తీల. దాంతోని నెలకు ఒకటో, రెండో కేసులు తగుల్తున్నయ్ సులేమాన్‌కు.
*** *** ***
‘‘ఒక మహీన కోసానకు ఈ పక్కనున్న కమ్రగూడ కిరాయికి తీస్కుందం, ఏం జేస్తం మరి?’’ అన్నడు మతీన్. వాల్లకున్నవే రెండు చిన్న కమ్రలు అన్లనే అంత పెద్ద సంసారం. ముగ్గురు ఔరత్‌బచ్చీలు పాత బస్తీల తల్లితోని ఎంబ్రాయిడరీ పనికి పోతున్నరు గని ఆ నల్గురి ఆమ్‌దారీ నెలకు మూడు వెయిలు గూడ దాటది. ఈ మధ్యల ఫాతీమా బేగంకు కడుపుల పుండచ్చి ఆప్రేషన్ చేసిన్రు.. ఇగ అప్పటిసంది ఆమె పనికి పోవుడు బందు చేసింది. కొడుకు ఇంకా చదువుతున్నడు వాని పది అయినంక… ఎలక్ట్రీషియన్ కోర్సుల చేర్పించి దుబయ్ పంపాల్నని మతీన్ ఖ్వాయిష్. ఆడ ఈ పన్లకు మస్తు గిరాకీ ఉన్నదంట. ఇంక మతీన్ పొద్దుగల్లే హైద్రాబాద్ ` సికింద్రాబాద్ గల్లీలల్ల ` హరేక్‌మాల్ బండి మీద బతుకుతున్నడు. దానిమీద ఏమంత రాదుగని, ఏదో నడుస్తాంది జిందగీ. ఇప్పటికైనా ఆ దుబయ్ షేక్ ఇచ్చే లక్షతోని ఇద్దరు బేటీల నిఖాలు చేసుడో లేకపోతే కొడుకు జహంగీర్‌ను దుబయ్‌కు పంపుడో ఏదో చెయ్యాల.. మతీన్ కలల్ల తేలిపోతున్నడు
ఫాతీమా బేగం గూడ మస్తు ఖుషీగుంది యాస్మిన్ మొదట్ల, మొదట్ల జర్రంత జిద్దు చేసిన గని తర్వాత అమ్మీ`బావల కన్నీల్లు ` ఆల్ల పైసల అవసరాలు చూసి ఒప్పుకున్నది. మీదికెల్లి వచ్చే యాడాది బడీ బహెన్ తన తర్వాతది.. దాని నిఖా చేద్దమనుకున్నరు. తన నిఖా అయిపోతే ఇంక నుస్రత్ నిఖా గురించి ఆలోశెన చెయ్యచ్చు. ఆల్లకు చాల జాయిదాద్ ఉన్నదంట. రెండు మూడు బంగ్లలు ఉన్నయంట. మీదికెల్లి జహంగీర్ భాయ్‌కి గూడంగ దుబయ్‌ల నౌఖరీ ఇప్పిస్తున్నడంట. బడీ బెహెన్ నుస్రత్ బాను నిఖా గూడ ఏదన్న దుబయ్ రిష్తా తెద్దమని ప్లాను అమ్మీ బావాలకు. తనొక్కతి దుబయ్‌కెల్లిపోతే ఇగ బావా దిన్‌రాత్ గల్లీ గల్లీ హరేక్‌మాల్ అని గల్లా నరాలు తెగేటట్లు ఆరుసుడు బందువెట్టి, హాయిగ నవాబు తీరంగ ఇంటికాణ్ణే ఉన్న గల్లీల సంత దుకాన్ పెట్టుకోని ఆరాంగ కూసోవచ్చు. అమ్మీ గూడంగ… ఏదన్న అమ్ముకుంట చేరచ్చు అన్లనే కూసుని. ఇగ సెల్లెండ్లలో నుస్రత్‌భాను నిఖా ఎట్లయిన తను దుబయ్ పోయినంక తన షొహర్‌కు చెప్పి మంచి రిష్తా చూసి ` అగ్‌లీ సాల్ చేసేసుడే! అప్పన్దంక ఎంబ్రాయిడరీ దుక్నంలనే చేస్కుంటరు తియ్యు! లేకపోతే బావా కమాయి మంచి గుంటే… ఆరాంగ ఇంటికాణ్ణె వుంటరు నుస్రత్‌బాను, భాయ్. అమ్మీ బావాలను గూడ దుబయ్ పిలిపించుకుంటరు. అందరం ఇంక ఆడ్నే వుంటం. ఇన్ని తీర్ల ఆలోచిస్తాంది యాస్మిన్‌బాను. యాభై ఐదేళ్ళ షేకు.. వయసు ములుకు. తీరు గుచ్చుతున్న గని, ఇన్ని పనులు తనొక్క నిఖాతోని అయ్యి తమామ్ ఇంటోల్లు ఖుషీతోని ఉంటరని మనసుని సమ్జాయిస్తున్నది.. బార్.. బార్! నిన్ననే పక్కింట్ల ఉండే అజ్మత్ బేగం ఆంటీ ‘‘ఎందుకు యాస్మిన్ పోయి పోయి ముసలోడ్ని చేస్కుంటున్నవు? మీ అమ్మీ బావాల భేజీ ఖరాబైతే… నీ భేజాకేం అయ్యిందే? ఒద్దు చాలా మోసాలు జరుగుతున్నయ్ ఈ సౌదీ నిఖాల పేర్లతోని.. నక్కోమా నక్కో కరో ఏ షాదీ’’ అన్కుంట మస్తు చెప్పింది. అమ్మీ మాత్రం ‘‘జల్తీ హై వో.. దాని బేటీ గూడ నిఖాకి ఉంది గద? మీదికెల్లి నిన్ననే నీకాబోయే షొహర్ నీకు ఆరు సావరిన్‌ల సోనేకే గప్‌ానే పంపిండుగద? అవ్వి చూసి కండ్లు కుట్టినయ్ దాని తానకు పోకు.. నీకు దాని దిష్టి తగుల్తది… బురీ నజర్ హై ఉస్‌కీ..’’ అన్కుంట ఇన్ని ఎండు మిరపకాయల దిష్టి తీసింది యాస్మిన్‌కు ఫాతీమాబేగం. అంత బంగారం ఆల్లెవరూ జిందగీల చూడలె మరి.
మతీన్ పక్కల్నె ఉన్న కమ్ర గూడ కిరాయకు తీస్కున్నడు నిఖా పక్కా అయ్యింది. ఇంటికి సున్నాలేసిన్రు. రిష్తేదార్‌లందర్ని గల్లీల జాన్‌పహ్ చానత్ ఉన్నోలందర్కి చెప్పిన్రు. షాదీ ఖానా మాట్లాడుకున్నరు. షేక్ బట్టలు కొనుక్కోమని మతీన్‌కు ఇరవై వెయిలు ఇచ్చిండు. మతీన్ అందర్కి అన్లనే బట్టలు కొన్నడు. దుల్హాకు కుర్తా పైజామా కొన్నడు అంత సంబరంగున్నరు. ఇల్లంత రిష్తేదార్లతోని నిండిపొయ్యింది. షేక్ ప్రింటు చేసిచ్చిన షాదీరుఖాలు ముఖ్యమైన రిష్తేదార్లకు గొప్పగ పంపిన్రు. చూస్త చూస్తనే షేకిచ్చిన లక్ష రూపాయలల్ల నలభై వెయిలు పోయినయ్ నిఖాకు ముంగట్నె. ఇంక నిఖా తర్వాత దావత్ల ఘోష్ కా సాలన్, బిర్యానీ లేకుంటే ఊకుంటర? ఇంట్ల జరిగే మొదటి నిఖా… మతీన్‌కు దిగులేశింది. నిఖా తేదీ వచ్చేసింది.
యాస్మిన్‌బాను కుబూల్ హై ` కుబూల్ హైల మధ్య ధగ ధగ మెరుస్తున్న మెరుపు మెరుపుల బట్టలు, బంగారు జెవెరాత్ల మధ్య ఎవ్వలకు దుల్హా యాభై ఐదు ఏండ్ల ముసలితనం కనిపించలె.
‘‘అమ్మీ, డర్ లగ్‌తా హై.. ఉన్‌కే పాస్ నై జావూంగీ…’’ అమ్మీని కర్సుకుని ఏడుస్తున్నది ` ఒనుక్కుంట… పద్దెన్మిదేండ్లు గూడ నిండని పసిమొగ్గ యాస్మిన్. భయమేస్తున్నది షొహర్ తానకు పోనని జిద్దు చేస్తున్నది’’. ‘‘నై బేటీ షాదీ కే బాద్ షొహర్‌కే పాస్ హీ సోనా హై’’ (పెండ్లయినంక మొగనితాననే పండాలె బిడ్డా) అంటున్నది, ఫాతీమాబేగం బుదరకిస్త, యాస్మిన్ తలల మల్లెపూలు గుచ్చుతున్నది. యాస్మిన్ ఆ రాత్రి షేక్ కమ్రలకు పోనని మస్తేడ్సింది. పది రోజుల షేక్ రాక్షస రతిల ఆ పసిమొగ్గ చితికిపొయ్యింది. చానా గలీజు పనులు చేస్తడు ` చానా నొప్పైతుంది. నన్నాయన తానకు పంపకు అమ్మీ’’ అన్కుంట యాస్మిన్ ప్రతిరోజూ ఏడ్సుడు, ఫాతీమా బేగం నవ్వుత కొట్టిపడేసుడు. ఆ నరకకూపమసుంటి కమ్రలకు పంపుడు. పులిబోనుల బడ్డ పావురాయి లెక్క యాస్మిన్ హర్ రాత్ బలైపోవుడు మామూలైపోయింది.
*** *** ***
నెల దినాలల్ల యాస్మిన్ బానుని దుబయ్ పిలిపించుకుంటనని షేక్ దుబయ్ ఎల్లిపోయిన సంది, యాస్మిన్ ఆరాంగున్నది. జిందగీల ఆయిన తానకు పోనని మస్తు సార్లనుకున్నది. జెవరాత్‌లు ` కొత్త చెమ్కీ చెమ్కీ బట్టలు, అత్తర్లు, మల్లెపూలు, నయీదుల్హన్ ముబారక్ బాత్‌లు ` రిష్తేదార్‌ల మురిపాలు అన్నీ మంచిగున్నయ్ గని, రాత్రపూట ఆ షేక్ చేసే పనులె ఒణుకు పుట్టిస్తున్నయ్. మీద వడ్తె సాస్ ఆడక హోష్ పోయినట్లే అయితది. దిన్ రాత్… రెండు, మూడుసార్లు సతాయిస్తడు. ఒల్లంత అతని పంటిరక్కులె.. ఎంతగనం ఏడ్చిందని? పప్‌ాలీ రాత్ తలుపులు దబ్బ దబ్బ బాదింది ఒనుకుత.. ఏడుస్త.. అమ్మీ దర్వాజ ఖోలో అనుకుంట.. అమ్మీ రాలె.. బావా రాలె. ఆ ఖుదా గూడ రక్షించలె. ఈ షేక్ పప్‌ాలీ బీవీ ఇగో చేస్తనే సచ్చిపోయి వుంటది. హర్‌గీజ్ నహీ జానా ఉన్‌కే పాస్. ఖచ్చితంగ అనుకున్నది. యాస్మిన్ వందోసారి ‘నైజాతుం’ అని అమ్మీ బావాలకు గూడ చెప్పింది.
యాస్మిన్‌కు వీసా వచ్చింది, ఆమె గుండె పగిలినట్లైంది. ‘‘ఆపా హవాయీ జహాజ్‌ల ఎగురుకుంట పోతదా అమ్మీ’’ అన్కుంట సఫియాబాను సంబరంగ అడుగుతున్నది, ఫాతిమాబేగంను. అంత తమ బేటీ ఖుష్ నసీబ్ అనుకున్నరు ఫాతీమా`మతీన్‌లు. యాస్మిన్ దుబయ్ కెల్లినంక అగ్‌లే సాల్ దర్గాకొస్తమని న్యాజ్ తీస్కున్నరు.
ఏడుస్త`ఏడుస్తనే హవాయి జహాజ్‌ల దుబయ్ పయనమయ్యింది యాస్మిన్ బాను.. పోతున్న హవాయి జహాజ్‌లకెల్లి దుంకెయ్యాలని గూడ అన్పించింది యాస్మిన్‌కు.
దుబయ్‌ల షేక్ ఇల్లు చూసి మస్తు తాజూబ్ అయ్యింది, పరేషానైపోయింది. సిన్మలల్ల చూసింది అసుంటి మహల్‌ను. ఇల్లంత నౌఖర్లె. నాలుగు దినాలు షేక్ మంచిగనే చూస్కున్నడు రాత్రి పూట నరకం ఎట్లైన తప్పలేదు. అంత పెద్ద ఇంటికి.. తనొక్కతేనా? తమ ఈ ఇంటికి బేగంసాహిబా అన్కుంట తాజూబైంది యాస్మిన్. గానీ, వారం దినాలైనంక ఇంట్లకెవలో కొత్తోల్లు ఆడోల్లు, మగోల్లు వచ్చి చేరిన్రు. నౌఖరానీ`ఖలీదా చెప్పిన సంగతి ఇనుకుంట పరేషానైపోయింది యాస్మిన్ బాను.
ఆ వచ్చిన ఆడోలిద్దరు షేక్ బీవీలు. పెద్దామెకు ఇద్దరు జవాన్ కొడ్కులు ఒక్కోల్లకు ఇరవై నాలుగు, ఇరవై ఐదు ఏండ్లు. రెండో బీవీకు ముగ్గురు జవాన్ బేటీలు తన తీరంగ. హైద్రాబాదుల ఖాజీ అబద్దం చెప్పిందు బీవీ సచ్చిపోయిందని. ఒకల్లు కాదు ఇద్దరున్నరు వీనికి. ఆల్లు తనను ఎక్కిరింతగ చూసిన్రు, నగిన్రు.. గని మాట్లాడలె.. తన కమ్రల తను అకేలీగ పడి ఉండుడే. ఎప్పుడైనా షేక్ వస్తడు. ఆయనా మాట్లాడడు తన జిసమ్‌తోని ఆడుకొని ఎల్లి పోతడు. తనతోని కలిసి తినరు. తన టైం అలగే ఉంటది. తను గరీబింటి పోరినని ఎత్తిపొడుస్తరు. ఆల్ల నౌఖరానీ ఖలీదాకు ఉన్నంత హైసియత్ గూడలేదంట తనకు. ఇదంత ఒకటైతే, బడీ బీవీ ఇద్దరు కొడుకులు, ఆల్ల చూపులు కంపరం కల్గిస్తున్నయ్. ఒంటరిగ కన్పిస్తే కన్నుగొడ్తరు, గలీసు సైగలు చేస్తరు. ఆడీడ తాకనీకి కోషిస్ చేస్తరు. తన కొడుకుల తీరు వాండ్లు. అది వాళ్ళకు లేదు. షేక్‌కు చెప్తే? వాండ్ల కండ్లల్ల షేక్ కండ్లల్ల కనపడే కోర్కె చూస్తది తను. షేక్‌ని ఒక దినం ‘‘నీ బీవీ చనిపోయిందని ఎందుకు అబద్దం చెప్పినవ’’ని నిలదీస్తే.. చెంపలు పగులగొట్టి ఆ రాత్రి మళ్ళా నరకం చూపించిండు.
అమ్మీ`బావాలకు ఫోన్ చెయ్యనియ్యరు. ఒకసారి చేసి ఇట్ల ఈయనకిక్కడ ఇద్దరు బీవీలు ` నాకంటె పెద్ద కొడ్కులున్నరు ఆల్లు తనతోని మంచిగ బర్‌తావ్ చేస్త లేరని చెప్తుంటే షేక్ ఆ టెలిఫోను వైరు తన పీకకు నొక్కి కొట్టుకుంట కొట్టుకుంట ఒక చీకటి కమ్రల ఏసి ‘‘ఏ రండీ కో దో దిన్ తలక్ ఖానా నక్కో దేవ్’’ అని బీవీలకు సెప్పి ఊరెల్లిపోయిండు.
*** *** ***
షేక్ చెప్పిండని రెండు దినాలు ఎవరు ఖానా ఇయ్యలె. ఆకలికి కడుపుల నొప్పి షురు అయ్యింది. తలుపులు ఎన్నిసార్లు బాదినగని తియ్యలె. ఆ కమ్రల ఒక హమామ్‌ఖానా ఉంది కాబట్టి బత్కిపోయింది. తాగనీకి ఇన్ని నల్ల నీల్లన్న దొర్కినయ్. మూడోదినం రాత్రి ఎవరో దర్వాజ తీసిన్రు. ఆకలికి ఏడ్సి ఏడ్సి గిన్ని నీల్లు తాగి శోషచ్చినట్లై కూలవడ్డది తను.. ఆ వచ్చినోడు షేక్ పెద్దకొడుకు ఖాదిర్‌కాన్. చేతిల రొట్టెలు కూరలు`గిలాసిల నీల్లు తన ముంగట పెడితే ఆకలితోని పిచ్చి లేశినట్లై ఉన్నదేమో ఎగబడి తిన్నది. ఖాదిర్‌ఖాన్ అట్లనే ఉన్నడు, తను తిన్నంక మెల్లంగ దర్వాజ దిక్కుకు పోతున్నడు. ఎల్లిపోతుండేమో కమ్రలకెల్లి గొల్లెం పెడతడేమో అనుకుని అతని ఎనకాతలే తను గూడా కమ్ర బయటకు ఉర్కాలని చూసింది గని, అతను దర్వాజ బందువెట్టి ఎనక్కి తిరిగి తనమీద సైతాన్ తీరు బడ్డడు. వరుసకు కొడుకైతడు తనకు ‘‘ఒదులు ఏ హరాం హై ` అల్లా మాఫ్ నై కరేగా’’ అన్కుంట కాల్లమీద పడ్డగని, ఇనకుంట మీదబడి రాక్షసంగ అనుభవించిండు. అబ్బాకు చెప్పే చంపేస్తనన్నడు ‘‘నీ కమ్రలకు పో… పిల్చినప్పుడు దర్వాజ తియ్యాలె.. లేకపోతే..’’ అన్కుంట చూపుడు వేలుతోని బెదిరిచ్చిండు. తన ఏడ్పు ఎవరికి ఇనస్తదని? తన కమ్రలకు వచ్చింది స్నానం చేసింది. షేక్ వస్తే చెప్పాల.. కొడుకు వరస అయితవు ఒద్దని కాళ్ళమీద పడ్డగని ఇనలె.. యాస్మిన్‌కు చెప్పలేనంత దు:ఖం వచ్చింది. సానాసేపు ఏడ్చింది, అట్లనే, ఏడుస్త.. పండుకుంది. రాత్రయ్యింది షేక్‌రాలె. వేరే దేశం పోయిండంట నెలదంక రాడంట.. ఖలీదా చెప్పింది.
రాత్రి తనమింద ఏదో పాకినట్లైంది. మెల్కువ వచ్చింది యాస్మిన్‌కు. చూస్తే షేక్ రెండో కొడుకు మొహసిన్ ఖాన్ అప్పట్కే గొల్లం పెట్టేసిండు. ఒదులుమని ఎంత గింజుకున్న కొట్టి కొట్టి లొంగదీస్కున్నడు. ఇక్కడ తన బతుకేందో అర్థమైపోయింది యాస్మిన్‌కు. ఒప్పుకోకపోతే అన్నదమ్ములిద్దరు కొరడాలతోని కొడ్తరు, సిగరెట్టు వాతలు పెడ్దరు. పిడిగుద్దులు గుద్దుతరు. షేక్ పెద్ద బీవీలిద్దర్కి చెప్పుకుని ఏడిస్తే.. ‘‘మా కొడుకులు అసొంటోల్లు కాదు.. నువ్వే బజారుదానివి’’ అనుకుంట యాస్మిన్ చెంపల పగలగొట్టిన్రు. షేక్ ఒక్కడే దిక్కు, ఆయెన రాంగనే చెప్పాలె.. యాస్మిన్ షేక్ కోసం ఎదురుచూడబట్టింది. అమ్మీ బావాలకు ఫోన్ చేద్దామంటే ` గదిల బంధించిన్రు ` ఫోన్ తీసేసిన్రు ` రోజూ ఇదే దంద… ఒకల్ల తర్వాత ఒకల్లు.. అమ్మీ`బావాలకీ సంగతి తెలిస్తే.. తట్టుకుంటర? అంతకుముందే తనకు మౌత్ వస్తే ఎంత మంచిగుంటది?
నెలైనంక షేక్ వచ్చిండు. ఏడుస్త చెప్పింది తన బదన్ మీద ఉన్న వాతలు చూపుకుంట… కాలిబొగ్గైన కర్ర ముక్కలు తనను కణ కణ కాల్చిన పొయ్యికి మొరపెట్టుకున్నట్లు.. షేక్ నగిండు నగినంక.. ‘‘తో క్యా హువా? ఖామోషగ ఉండు. ఎవలకు తెలవద్దు చెప్పద్దు.. చెప్తె నీ పని కతమ్’’ అన్కుంట పీక తెగ్గోస్తున్నట్లు నిశానీ చేసి కమ్రలకెల్లి ఎల్లి పోయిండు.
కొడుకులను పిల్చి తిడ్తడనుకుంది… యాస్మిన్‌కు నోట్లకెల్లి మాట రాలె. కొడుకులు`తండ్రి ఒగల తర్వాత ఒగలు తన బదన్‌తోని ఆడుడు ఒప్పుకోకపోతే కొట్టుడు, యా… ఖుదా ఈ దోరaుఖ్ కెల్లి ఎట్ల బయటపడాలె!
యాస్మిన్ యంత్రం తీరే తయారయ్యింది. ఎవరు ఎప్పుడస్తరో తెలవది. వాండ్ల కామం తీర్చే యంత్రం తీరే తయారయ్యింది. ఒక్కసారి అమ్మీ బావాల తోని మాట్లాడ్తనంటే కొడ్తరు. ఇండియా పంపమంటే అన్నం పెట్టరు మాడుస్తరు. రాత్`దిన్ ఎట్ల`ఎంత నీచంగ నడుస్తున్నయో.., తండ్రి తర్వాత కొడుకులు తనను అనుభవిస్తుంటే ఆ బదన్‌ని కాల్చుకు సచ్చిపోవాల్నని అనిపిస్తున్నది గని ఒక్కసారి అమ్మీ బావాలను సూడాల్నని ఉన్నది. తన బహెన్లు నుస్రత్, సాదియా, భాయ్ జహంగీర్‌లను చూడాల్నని ఉన్నది. తమ పెరండ్ల పూసిన మల్లెలతోని మాట్లాడాల్నని ఉననది. అన్నింటికంటే ముంగట ఈ నిఖా చేస్కోవద్దని చెప్పిన అజ్మత్ అంటీని పట్కొని కరువుతీర ఏడ్వాల్నని ఉన్నది.
*** *** ***
ఒకసారి యాస్మిన్‌కు నెల బందైంది గని ఆ రాక్షస రతిల అబార్షను గూడ అయ్యింది. మంచిదే అయ్యింది. షొహర్`బేటాల కామ ఫలం పుట్టుడెందుకు? తండ్రి ఎవలో తెల్సుడెట్లు? తన కొడుకులా? షొహరా? పుట్టిన ఆ పిల్లలు బావా అని ఎవలను అనాల? అసలు వాండ్లు తనను ఛోటే అమ్మీ అన్కుంటే కద? యాస్మిన్ బతికే శవం తీరె అయ్యింది. చూస్త… చూస్తనే సాల్ అయిపోయింది. రెండుసార్లు పారిపోతే దొరకబుచ్చుకుని చావుదెబ్బలు కొట్టిన్రు. అన్నం బందువెట్టించి నౌఖర్ల నిగరానీల ఉంచిన్రు. ఒక దినం షేక్ కుటుంబం మొత్తం దావత్‌కు పొయ్యిన్రు. ఇంట్ల ఎవలు లేరు. ఖలీదా నిద్ర పోతున్నది. ఇంగొక నౌఖరు సిన్మకు పొయ్యిండు.. యాస్మిన్‌కు మళ్ళీ ఏదో ఆత్రం మొదలయ్యింది. పారిపోతే? ఎక్కడకు పొవ్వాల? ఎవ్వరు తెల్వది.. ప్రాణం తీసినా సరె పారిపోవాల. అంతే! భయం.. భయంతోని గేటు దంక అడుగులు వేసింది. ఇంతట్ల ఒక కారు లోపట్కి వచ్చింది. యాస్మిన్ గుండెలు ఆగిపోయినయ్… బేహోష్ అయిత అన్కుంది. ఆ కార్లకెల్లి షేకు దోస్తు అఫ్సర్ సాబ్ దిగిండు. ఖుదా అసొంటోడు… చాలా మంచి పేరున్నది. ఆయెనకు యాస్మిన్ని సూడంగనే.. ‘‘సలాం వాలేకుం’’ అన్నడు, ఎంతో మర్యాదతోని. యాస్మిన్ ‘సలాం వాలేకుం’ అంటనే బోరుమని ఏడుస్త కుప్పకూలింది. అఫ్సరుసాబు తెల్లబోయిండు. అటెన్క తేరుకున్నడు ఆమెను మెల్లగ లోపట్కి తీస్కపోయిండు. విషయమేందో కనుక్కున్నడు.
యాస్మిన్ అబ్బా బేటాలంత కల్సి… తనపైన చేసిన అత్యాచారాలు చెప్త, ఒంటిమీన ఉన్న వాతలు చూపిస్త.., అక్కడికెల్లి తన అమ్మీ బావాల తానకు పంపమని… ఆయన కాల్లమింద పడి ఏడుస్తనే వున్నది సానాసేపు.
అఫ్సర్ సాబ్‌కి దిమ్మ తిరిగి పొయ్యింది. అతనికి తన స్నేహితుడి సెక్సు బలహీనత తెల్సుగని.. కొడుకులు గూడ తల్లి వర్స గూడ చూస్కోకుండగ అతని కండ్ల పొంటి నీల్లు తిర్గినయ్. అఫ్సర్ సాబ్‌కు ఇవ్వన్ని ఇష్టముండయి. ఆయన`రెండు, మూడు నిఖాలు చేస్కొనే పద్దతికి ఖిలాఫ్ ఉన్నడు. బీవీని చానా మంచిగ మొహబ్బత్ తోని చూస్కుంటడు. ఆయెన చాలా సేపు అట్లనే కూసున్నంక ‘బేటీ`తుమ్హారా ఏక్ తస్వీర్ హైతో దేవ్’’ (నీ ఫోటో ఉంటే ఇయ్యు తల్లీ) అంటనే.. మల్ల ఆమె ఇక్కడ్కి రాంగ తెచ్చిన వీసాను గూడ ఇమ్మన్నడు. యాస్మిన్ ఉరుక్కుంట తెచ్చిచ్చింది అఫ్సర్ సాబ్., యాస్మిన్ చేతిల తన జేబులున్న పైసలు తీసిపెట్టిండు పెట్టి.. ‘‘సంబల్‌కే రఖో… నువ్వు వెళ్ళడానికి ఇంతెజామ్ చేస్త’’ అని ఆమెను సమ్‌రఝాయించి ఎల్లి పోయిండు.
*** *** ***
జహానుమా… గల్లీ నంబరు దో.. ఎంబ్రాయిడరీ షాపు.., ‘‘ఇంటినిండ బంగారు జెవరాత్‌లు దిగేస్కుని హవాయ్ జహాజ్‌ల గిట్ల ఎల్లిందో లేదో మల్ల క్షనంల ఈడకే వచ్చిపడిపొయ్యింది. ఆడ ఆ ముసలి మొగుడు ఒక్క తన్ను తన్నిండు గావచ్చు’’ కిసుక్కుమని నగుతు అంటున్నరు షాపుల. సూదితోని చీరమీన చంకీలు కుడ్తున్న యాస్మిన్ వేలికి సూది కసుక్కుమని దిగి అమ్మీ అన్కుంట బాధతోటి నోట్లె వేళ్లు పెట్టుకున్నది… కండ్లపొంటి సరసరమని నీల్లు ధారలు కట్టినయ్. పక్కనె ఉన్న ఫాతీమాబేగం తలెత్తి గూడ సూడలె.. గుండెల్ల బాధ మెలి పెడ్తాన్న గని నోరిప్పకుంట ఆ ఎకసెక్కాలు ఇనుకుంట తన పని తను చేస్కుంటున్నది. నుస్రత్`సాదియా బానులు ఆపా వేల్లు పట్టి చున్నీతోని నొక్కుత ` ‘‘జుబాన్ జాదా నక్కో చలావ్, అప్‌నా కామ్ కర్తె బైఠ్ నహీ సక్తేహా క్యా…’’ (ఎక్కువ మాట్లాడకున్రి మీ పని మీరు చప్పుడు చెయ్యక చేస్కుంట చేరున్రి) అంట వాండ్లను కసిరిన్రు.. ఆ ఆడోల్లు మూతులు ఉబ్బించుకుని కూసున్నరు. యాస్మిన్ గుండెల్ల లావా ఉడుకుతున్నది గని ఏం చేస్తది?
అఫ్సర్ సాబ్ ఎట్నో కష్టపడి వాండ్ల కళ్ళు గప్పి.. తమ ఇంట్ల దావత్ ఉన్నదని యాస్మిన్‌ని పంపమని… తోడుకోసానకు పనిల సాయం గుంటదని యాస్మిన్‌ని పంపమని.. ఆయెన బేగంసాహిబా అడుగుతున్నదని చెప్పి తన ఇంటికి తొల్కపోయి విమానం ఎక్కించిండు. ఇంగ ఆడ్నించి., ఈడకొచ్చి పడేదాంక తన గుండెల్ల గాబర తగ్గలేదు.
తన ఖుష్ నసీబీ.. లేకపోతే ఖుదా అసుంటి అఫ్సర్ సాబ్ తన బాధ వినుడేంది? తనకింద మదత్ చేసుడేంది? జిందగీ ఖరాబైందని.. అప్పుడున్నంత దు:ఖమయితే లేదు.. ఆ నరకం కెల్లి అయితే బయట పడ్డది. ఎట్నో ఒకతీరు బతుకుతది. ముందు బతుకులేదా? చేతిల పని ఉండనే ఉంది. కానీ ఒక్కటే గమ్. తననిట్ల చూసిన బావా. గుండె ఆగి ఇంతెఖాల్ అయిపోయిండు. యాస్మిన్ కండ్లపొంటి కారిన కన్నీళ్ళను తుడ్చుకున్నది. చెల్లెండ్లని పని చేస్కోమన్నది, తను దీక్షతోని చమ్కీలు కుట్టుడు షురు చేసింది.
*** *** ***
యూసుఫ్‌గూడా.. గల్లీ నంబరు చార్.. అక్బర్ పాషా ఇల్లు., ‘‘దుబయ్‌ల లక్షల జాయదాద్ ఉన్నది. బీవీ సచ్చిపొయ్యింది ఒక్కతే బేటీ.. నీ ఛోటీ బేటీ.. రుక్సానాని ఇస్తివంటే., ఆమె.. ఆమెతోని మీరూ సుఖ పడ్తరు. నీ గరీబీ గాయబ్ అయితది, అక్బర్ భాయ్..’’ ఖాజీ సులేమార్ చెప్పుకుంట పోతుండు.
*** *** ***
‘‘హరేక్‌మాల్…’’ మతీన్ కొడుకు జహంగీర్ పాషా గల్లా తెగిపోతదేమో అన్నంతగ ఒర్లుతున్నడు గల్లీల పొంటి. ఒక్కసారి యాస్మిన్ ఆపా దుబాయ్ కెల్లి రాంగనే అసలు సంగతులు తెల్సుకున్న బావా బీపీ పెరిగిపొయ్యింది కోపంతోని. ఖాజీని వెతికి పట్టుకున్నడు నిలేసిండు.. ‘‘నాకేం తెల్సు? ఆల్లు ఏం చెప్తే అదే నేన్ భీ చెప్త గద? నేనేమన్న ఆడకి పోయిననా.. చూసిననా? ఇచ్చుడు నీది బుద్ధి తక్కువ నువ్వు సోంచాయించుకోవాల.. నేనేం జేస్త?’’ నంగి నంగిగ అంటున్న ఖాజీ మీదకు పులి లెక్క బడ్డడు బావా.. ఖాజీ.. బచావ్ అన్కుంట ఒర్లుత బావాను ఇదిలించుకుని పారిపొయ్యిండు.. బావా గూడంగ ఇర్సుకు బడిపోయిండు. ఉస్మానియాల.. డాక్టర్లు బత్కించనీకి మస్తు ఖోషిష్‌లు చేసిన్రు గని., అన్ని నాకామియాబ్ అయినయి. ‘‘యాస్మిన్ బేటీ యాస్మిన్.. మాఫ్ కర్‌నా’’ అన్కుంట కలవరిస్తానే చనిపోయిండు.
‘‘హరేక్‌మాల్… దో రూపయ్‌కో ఏక్..’’ జహంగీర్ గొంతు గల్లీ`గల్లీ ఇనిపిస్తుంది.. ఆ బీద తురక గల్లీలల్ల.. బావా.. ఎన్ని కలలు కన్నడు? తనను గూడ దుబయ్ పంపుతునన్నడు.. ఎలక్ట్రీషియన్ కోర్సు చేపిస్తనన్నడు… షేక్ ఇచ్చిన డబ్బులు అయిపొయినయ్.. షేక్ ఆడ్నించి పంపిస్తనన్న డబ్బులు గూడంగ పంపలె.. ఇంక ఎట్లైన తనను మాత్రం.. ఎలక్ట్రీషియన్ కోర్సు చేయించాలనన్న పట్టుదలతోని రాత్ దిన్ కష్టబడెటోడు.. హరేక్‌మాల్ అని ఒర్లుత ఒర్లుత బావా గొంతు గీరపొయ్యింది. రాత్రి వచ్చి గరం పానీల ఉప్పేస్కుని గరారా చేస్కునేటోడు. మల్ల తెల్లారంగ ఒర్లుడు షురు.. మీదికెల్లి., యాస్మిన్ ఆపా దుబయ్‌కెల్లి తనకు జర్గిన దోఖా చెప్పిన సంది… మనిషి ఇంకా క్రుంగి పోయిండు… ఆ దిగులే ఆయనను చంపేసింది. జహంగీర్.. ఆలోచిస్త బండి ముందుకు దొబ్బుతున్నడు. ఇంతట్ల ఒక్కసారి ఖాజీ సులేమాన్ ఒక ఇంట్ల కెల్లి బయటకు వస్త కనపడ్డడు.
జహంగీర్‌కు రక్తం మరిగిపోయింది. ఒక్కసారి బండి వదిలి అటు దిక్కు ఉరికిండు. ఇంతట్ల సులేమాన్ జహంగీర్‌ను చూసుడు, ఆడికెల్లి ఉరుకుడు షురు అయ్యింది. ఇంతట్ల సులేమాన్ దమ్ముతోని ఉర్కలేకపోతున్నడు. జహంగీర్ ఉగ్రరూపం చూస్త గభరాయిస్తున్నడు, సంపుతడేమోనని.. వీడి అబ్బా మతీన్ నించి తప్పించుకుండు గని.. వీడు జవాన్ లడ్‌కా… పానాలు తీస్తడో ఏమో…. సులేమార్ ఉర్కుతున్నడు. ఇంతట్ల జహంగీర్`సులేమాన్‌కీ మద్దెల ఒక జులూస్ వచ్చింది. ఆల్లంత ముసల్‌మాన్‌లె.. తెలుగుల, ఇంగ్లీష్‌ల, ఉర్దూల ముసల్మాన్లకు 5 శాతం రిజర్వేషన్లు ఇయ్యాలని రాసి ఉన్న బ్యానర్లను పట్కోని… గట్టిగ.. రిజర్వేషన్లు కావాల్నని నారాలిస్త.. అందర్కి ఏవో కాయితాలు పంచుత పోతాన్రు.. జహంగీర్ ఆగిపొయ్యిండు. అసొంటి జులూస్‌లు ఎప్పుడు సూడలే… పీర్ల పండగ జులూస్‌లు చూసిండు.
హిందువులల్ల… మాల మాదిగోల్లు.. బీసీలు రిజర్వేషన్లు కావాల్నని చేసే జులూస్ చూసిండు. తమ ఇంటిపక్కన నారాయణ వాల్లు ఎస్సీలు. ఆల్ల అబ్బా యాదయ్య ఎస్సీల సంఘం లీడరు. ఆయన పిలిస్తె రెండు మూడుసార్లు వాల్ల జులూస్‌ల పోయి నారాలిచ్చిండు గని ముస్లింలకు రిజర్వేషన్లు కావాల్నని ముస్లింలు చేసే జులూస్‌లు.. నారాలు తీసుడు ఇగొ మొదటిసారి చూస్తున్నడు. కాంగ్రెస్`మజ్లిస్ పార్టీ ఓల్లు.. ఇంకా తెలుగుదేశం పార్టీవోల్లు గెల్సెతందుకు తీసిన జులూస్‌లు చూసిండు. ఇసిత్రం ఏమిటంటే.. ఆ జులూస్‌ల కొద్దిమంది ఔరత్‌లు గూడంగ ఉన్నరు బ్యానర్లు పట్కోని.. జహంగీర్ నోరెల్ల బట్కోని చూస్తా నిలబడ్డడు తాజూబ్ తోని. ఎవరో ఆయెన చేతిల గూడ కరపత్రం పెట్టి పొయిన్రు… చూస్త చూస్తనే జులూస్ ముంగట్కి ఎల్లి పొయ్యింది. సులేమాన్ లేడు.. ‘ఛత్ తేరీ’కి అన్కుంట ఎనకకి తిర్గిండు. ‘బతికిపొయ్యిండు ఆ ఖాజా నా కొడుకు., ఏం చేసెటోడ్నో ఈ దినం ఆన్ని..’ అన్కుంట.. నడుస్తు.. నడుస్తనే జహంగీర్.. వచ్చీరాని తెలుగుల ఆ కాగజ్‌ల ఉన్నదాన్ని చదివెతందుకు కోషిష్ చేస్తున్నడు… ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు.. కావాలె… అన్కుంట..
– డా .గీతాంజలి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
4 Responses to జహానుమా గల్లీ నంబర్ దో