రాజ లక్ష్మీ పార్ధ సారధి

                        రాజ లక్ష్మీ పార్ధ సారధి మద్రాస్ లో అలివేలు ,పార్ధ సారధి దంపతులకు 8-11-1925లో జన్మించింది .తండ్రి బర్మా షెల్ కంపెనీ ఉద్యోగి .ఆయన స్వాతంత్ర సమర యోధుడు టి రాఘవాచారి గారి కుమారుడు .రాజ లక్ష్మి సెయింట్ జాన్ స్కూల్ లో హోలీ క్రాస్ కాలేజిలో చదివి డిగ్రీ చేసింది .తర్వాత జర్నలిజం లోమద్రాస్ యూనివర్సిటీ నుండి 1947లో ఇరవై రెండేళ్లకే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయింది .జర్నలిజం కాలేజీ ప్రారంభమైన మొదటి ఏడాదే జర్నలిజం చదివి పాసైన మొదటి విద్యార్ధిని గా లక్ష్మి చరిత్ర సృష్టించింది .ఎం.ఎడ్ పూర్తి చేసి మద్రాస్ విశ్వ విద్యాలయం నుండి చరిత్రలో ఏం. ఏ .చదివి సాధించింది .

               జర్నలిజం లో డిగ్రీపొందగానే ‘’ది హిందూ ‘’ఆంగ్ల పత్రికలో ‘’ కుముదం’’,’’ స్వదేశ మిత్రన్’’ అనే తమిళ పత్రికలలో జర్నలిస్ట్ అయింది .’’దిమెయిల్’’ సబ్ ఎడిటర్ గా పని చేసి ఆర్ధర్ హేలేస్ వలన అపూర్వ జ్ఞానాన్ని పొందింది .క్రీడలు మొదలైన విషయాలపై రాసేది .ఎందరో ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన ఘనత ఆమెది . నాటక రంగ నటుడు ,ప్రయోక్త దర్శకుడు అయిన పార్ధ సారధిని వివాహమాడింది .పెళ్లి చేసుకొని జర్నలిస్ట్ ఉద్యోగం మానేసింది .1958లో ‘’పద్మా శేషాద్రి బాల భవన్ ‘’స్థాపించింది .నుంగంబాకం రిక్రియేషన్ క్లబ్ కు చెందిన మహిళలతో కలిసి నుంగంబాకం లో శేషాద్రి అనే దాత ఇచ్చిన ధనం తో ఆయన కోరిక మేరకు ఆయన భార్య పద్మ పేర పద్మా శేషాద్రి బాల భవన్ ను పదమూడు మంది విద్యార్ధులతో తన ఇంట్లో పై అంతస్తులో ఉన్న రేకుల షెడ్ లో ఏర్పరచింది .విద్యార్ధులు పెరిగారు .వసతి చాలటం లేదు .ఏడాది తర్వాత స్వంత భవనాన్ని ఏర్పరిచింది .1971లో టి. పి. రోడ్ లో మొదటి బ్రాంచ్ ని ఏర్పరిచింది .రెండేళ్ళ తర్వాత మొత్తం అయిదు బ్రాంచీలను స్థాపించి సక్రమంగా నిర్వహిస్తూ సంఘంలో మంచి పేరు తెచ్చుకుంది. 8000మంది విద్యార్ధులతో 500మంది స్టాఫ్ తో మూడు పువ్వులూ ఆరుకాయలుగా విస్తరిల్లింది .

                             ఈ స్కూల్ స్థాపించిన రోజు 1958 నుండి ఆ సంస్థకు డీన్ మరియు డైరెక్టర్ గా వ్యవహరించింది .ఉదయం స్కూల్ లో పని చేసిసాయంత్రం మహిళలకు విద్య నేర్పిస్తూ ,రాత్రి వర్ధమాన నటులకు నటన లో శిక్షణ నిస్తూ క్షణం విశ్రాంతి లేకుండా పని చేసింది .ఆమె ఇల్లు ఒక విద్యా సాంస్కృతిక కేంద్రమే అయింది .స్కూల్ లో హిందూ ధర్మాన్ని సంప్రదాయాలను బోధించే ఏర్పాట్లు చేసింది .తమిళ నటుడు మాజీ ముఖ్య మంత్రి ఏం జి రామ చంద్రన్ స్కూల్ లో ‘’హేతువాదాన్ని ‘’బోధిస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు .ఎందరో సినీ నటులు నాటక రంగ నటులు ఈ సంస్థకు భారీగా విరాళాలు అందించారు వాటిని సక్రమంగా ఖర్చు చేస్తూ సౌకర్యాలు కలిగిస్తూ స్వంత భవనాలను నిర్మిస్తూ పార్ధ సారధి విద్యా సంస్థలను ( వై జి పి సంస్థలను)అభి వృద్ధి చేసింది .

                  భారత దేశం లో విద్యా వ్యాప్తికి లక్ష్మీ పార్ధ సారది అవిశ్రాంత కృషి చేసింది .అన్ని దశలలో విద్యా స్థాయిని పెంచటానికి తీవ్రంగా పని చేసింది ..విద్యా వ్యవస్థలో’’ సి.బి ఎస్.బి. ‘’విధానాన్ని ‘’ అమలు చేయటం లో భాగస్వామిని అయింది .విద్యా వ్యాప్తికి ,సాహిత్యానికి ఆమె చేసిన కృషి ని గుర్తించి భారత ప్రభుత్వం రాజ లక్ష్మీ పార్ధ సారధికి’’ పద్మ శ్రీ ‘’పురస్కారాన్ని అందజేసి గౌరవించింది .ఆమె కుమారుడు మహేంద్ర తమిళ నాటక ,సినీ నటుడుగా రాణిస్తున్నాడు .
వై జి.పి గా గుర్తింపు పొందిన రాజలక్ష్మీ పార్ధసారధి ‘’ఎక్స్ లెన్స్ బియాండ్ క్లాస్ రూమ్ ‘’అనే స్వీయ చరిత్రను రాసుకొన్నది .ఏదైనా సాధించాలనే తీవ్రమైన తపన , విజన్ ,అలుపెరుగని పోరాట పటిమ ,అపార శక్తి సామర్ధ్యాలు ,సృజనాత్మక ఆలోచన ,అద్భుత జ్ఞాపక శక్తి ,అపూర్వ భావాలు ,నిర్భీకత ,నిర్దుష్ట విధానం ,సృజన శీలత ,భగవంతునిపై అపార విశ్వాసం తిరుగులేని ఆత్మ శక్తి ,మొహమాటం లేని వాగ్భాషణం ,నిష్కపటమైన హృదయం రాజలక్ష్మికి ఉన్న అనేక సుగుణాలలో కొన్నిమాత్రమే .

                            ఈ శతాబ్ది విద్యా వేత్త .ప్రపంచ విద్యా వ్యవస్థలో చురుకైన పాత్రతో విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి కృషి చేస్తున్న విదుషీమణి .’’విద్యా సేవా రత్నం’’ అని బిరుదు పొంది ,’’నారీ రత్నం’’ గా భాసిస్తోంది .జర్నలిస్టు ‘రష్మి’’అని బంధువులు స్నేహితుల చేత ‘’రాజమ్మ’’ అని ఆప్యాయంగా పిలువబడుతోంది .ఏ ఇజానికి దగ్గర కాకుండా ,మానవతయే, ధ్యేయంగా నిర్విరామ కృషి చేస్తున్న ఆదర్శ గృహిణి .తన చరిత్రను తాను నిర్మించుకొన్న ఆదర్శ మహిళ .88 ఏళ్ళ వయసులో నిత్య యవ్వనం తో అనుక్షణం సేవా దృక్పథంతో జీవితాన్ని తీర్చిదిద్దుకొంటున్న నారీ శిరోమణి రాజలక్ష్మీ పార్ధ సారధి .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Comments are closed.