
ఎండ్లూరి సుధాకర్
ముద్దాయిలకు
ముద్దబంతుల దండలేసి
ముక్తి ప్రసాదించారు
అన్యాయమంటూ
ధర్మ దేవత గొంతు పిసికి
నిర్దోషులుగా పరిగణించారు
**** **** *****
కళ్లు మూస్తే గాయాల చుండూరు
కళ్లు తెరచి చూస్తే అన్యాయాల పుండూరు
మనుషుల్ని చంపడం ఎంత ఎడ్డి తనం
కాపు కాసి మట్టు బెట్టడం ఎంత మడ్డితనం
పోలీసు స్టేషనో న్యాయ స్థానమో ఉంది కదా
పట్టపగలే గొంతులు కోయడం ఎంత గిడ్డితనం
**** **** *****
సినిమా హాల్లో కాళ్ళు తగిలించారని
చెరువులో నీళ్ళు కలుషితం చేసారని
దళితుల్ని దారుణంగా నరికేయడం
ఏ ఆదిమ కాల కరాళ క్రూర న్యాయం ?
దొంగ నిద్ర నటించే దోషుల్లార
తుంగ భద్ర కాలువ నడగండి
నెత్తుటి అలలతో మృత్యు గీతం పాడుతూనే ఉంటుంది
ఏ ధర్మా సనానికి ఆ గొంతు వినపడుతుంది ?
**** ***** ***
ఇక్కడ వర్ణం అగ్రమై
ఆయుధమై అపరాధమై
అస్పృశ్యుల హత్యలు జరిగినప్పుడల్లా
పాలక హస్తాలో
రక్షక నేస్తాలో
దోషం మీద దుప్పటి కప్పుతాయి
అబద్ధపు సాక్ష్యాలు చెపుతాయి
***** **** ***
రాజకీయ నాయకులారా
కుల రక్త పాతం ఆపలేరా
ఓట్లు పోసి కొనుకున్నాం
కనీసం ప్రాణాలు కాపాడ లేరా
అంటరాని వీధుల్లోకి అడుక్కోవడానికి వచ్చినప్పుడు
మృత్యు ముఖాలు గుర్తుకు రావా ?
వెలి ఆత్మలు మీవి కావా ?
***** **** ***
సహనం దహనమైపోతుంది
కంటికి కన్ను
పంటికి పన్ను
మానానికి మానం…
ప్రాణానికి ప్రాణం
కావాలి సమానం
ఇదే చట్టమైతే
ఇప్పుడే ఆమలులోకి వస్తే
ఆయుధాలు శాంతి వచనాలు వల్లిస్తాయి
న్యాయ స్థానాలు శాశ్వత సెలవులు ప్రకటిస్తాయి
***** **** ***
చుండూరు మృత వీరుల
సమాధుల మీది
శిలువలు ఏమి చెబుతున్నాయి ?
కంట తడి పెట్టకండి తల్లుల్లారా
న్యాయం గెలుస్తుందని నముతున్నాయి
***** **** ***
మీ దళిత వాడను చుండూరు చేస్తాం
అడుగడుగునా మీ అంతు చూస్తాం
ఇవి చుండూరు సందర్భ వాక్యాలు
ఎవరు ఎవరితో అన్నారో
ఎవరితో అంటే ఎవరు విన్నారో
ఈ దేశంలో
ప్రతి ఊరికీ తెలుసు
ప్రతి వాడకీ తెలుసు
తెలియనిదల్లా న్యాయ దేవతలకి
చట్టాలకి … ఖాకీలకి ..
***** **** ***
దళిత దాష్టీకాల మీద
దళిత స్త్రీల దారుణాల మీద
కవితలు పలకమన్నా
కథలు రాయమన్నా
కలాలకి జ్వరం పట్టుకుంటుంది
కులాలకి కుంటు సాకు దొరుకుతుంది
అరె !
కూపస్థ కవుల్లారా
మరో జన్మంటూ ఉంటే
ఈ దేశంలో దళితుల్లా పుట్టండి
అంటరానితనం అనుభవమవుతుంది
అనుభవం దగ్ధ దళిత కవిత్వం అవుతుంది
*** **** ****
ఎక్కడో ఎడారిలో
ఒయాసిస్సులా
స్పార్టకస్ లా
దళితుల పక్షాన
ధర్మ వీరులు పోరాడుతున్నారు
” జై భీం ” వాళ్ల కోసం
పీడితుల కోసం
ఎరుపెక్కిన పిడికిళ్ల కోసం !
***** ***** *****
– ఎండ్లూరి సుధాకర్
9246650771
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
7 Responses to గాయాల చుండూరు