Golden Mango
Director:Govinda Raju
Country:India
Language : Marathi (English Subtitles)
Duration : 10 minutes
Age Groups : 8 years and above.
“కిట్టూ” అనే ఎనిమిదేళ్ళ బాలుడికి మామిడి పళ్ళంటే వల్లమాలిన ఇష్టం.వాస్తవ పరిస్థితిని-జానపదకథల్లోని పిల్లలకి మాత్రమే సాధ్యమైన అందమైన ఊహల లోకాన్ని కలగలిపి కళాత్మకంగా రూపొందించిన 10 నిమిషాల అపురూప చిత్రమిది.
కిట్టూకి మామిడి పళ్ళు తనివితీరా తినాలనే బలమైన కోరిక ఉంటుంది. వాళ్ళుంటున్న ఊళ్ళో మామిడి పళ్ళ ఖరీదు చాలా ఎక్కువ.వాళ్ళమ్మా నాన్నల కేమో కిట్టూకి కావలసినన్ని మామిడి పళ్ళు కొనగలిగిన ఆర్ధిక స్థోమత లేదు.
రోజూ మామిడి పళ్ళు కావాలని పేచీ పెట్టే కిట్టూకి వాళ్ళమ్మ రోజూ ఏదో ఒక వంక పెట్టి రకరకాల కారణాలు చెబుతూ మామిడి పళ్ళ నుంచి కిట్టూ దృష్టిని మరలించాలని చూస్తుంది. అది అర్ధం చేసుకోలేని చిన్నారి కిట్టూ మనసు అంతులేని అసంతృప్తితో, బాధతో విల విల లాడుతుంది.
నిరాశతో నాన్నమ్మ ఒడి చేరతాడు కిట్టూ. నాన్నమ్మ ముద్దు చేస్తూ గోరుముద్దలు తినిపిస్తూ,తన చిన్నారి మనవడిని సంతోషపెట్టడానికి కిట్టూ కిష్టమైన కబుర్లు చెప్పడానికి ప్రయత్నిస్తూ, శతవిధాలుగా బుజ్జగించాలని చూస్తుంది.
నిద్రపుచ్చే ముందు మురిపెంగా ఒక కథ చెప్పడం మొదలు పెడుతుంది. “అనగనగా ఒక ఊళ్ళో ఒకాయనకి ఒక తోట ఉంటుంది. ఆ తోటలో అందంగా అల్లుకున్న తీగలూ,వాటి మధ్య పూల మొక్కలూ,రంగు రంగుల పూలూ,నిగ నిగలాడుతూ నోరూరించే పండ్లతో నిండిన రకరకాల చెట్లూ ఉంటాయి. ఒక రోజు అతనికి తన తోటలో “బంగారు మామిడి పళ్లు” దొరుకుతాయి.” అని నాన్నమ్మ కథ చెబుతుండగానే కిట్టూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు. ఇక కథ జానపద కథలా కిట్టూ కలలో కొనసాగుతుంది. అవి బంగారు మామిడి పళ్ళు కాబట్టి తోటమాలి ఒక్కో వ్యాపారి దగ్గరకెళ్ళి మంచి ధర కోసం బేరసారాలు సాగిస్తుంటాడు.ఇదంతా ప్రేక్షకుల నంతగా ఆకర్షించదు.వ్యాపారికి బంగారం ముద్ద మామిడి పండు రూపంలో బరువుగా,ఘనంగా తోస్తే,చాలా విచిత్రంగా అక్కడే ఉన్న కిట్టూ దాన్ని తీసుకుని కొరికి రుచి చూడబోతాడు.ఇక చూడాలి కిట్టూ ఆనందం! కిట్టూ కోరుకున్న తియ్యగా నోరూరించేలా ఉన్న మామిడి పండు రసాన్ని జుర్రుకుంటూ మనసారా ఆస్వాదిస్తున్నప్పుడు సినిమా ముగుస్తుంది. ఈ దృశ్యం చూస్తున్న ప్రేక్షకులు కాసేపు అది కలని మర్చిపోయి కిట్టూ మామిడి పండు తినగలుగుతున్నందుకు హృదయపూర్వకంగా ఆనందిస్తారు ! చప్పట్లే చప్పట్లే! హర్షధ్వానాలతో హాలు మారుమోగిపోయింది!!
కిట్టూగా నటించిన “సర్తాక్ కేట్కార్”(Satkar Ketkar),నాన్నమ్మగా నటించిన “అమృతా సత్ బాయి” (Amruta Satbai ) అద్భుత నటన చూడాలంటే అందరూ ఈ సినిమా చూచి తీరవలసిందే!
తిరగ బడిన “కింగ్ మిడాస్” కథ గుర్తొస్తుంది.అక్కడ ఏది ముట్టుకున్నా బంగారమే బంగారం. కానీ తిండికి అల్లాడిపోయే పరిస్థితి! ఇక్కడ ఏ రుతువు లో వచ్చే పళ్ళు ఆ రుతువులో తినాలనే కనీస ఆరోగ్యసూత్రాన్ని కూడా పాటించలేని గడ్డు ఆర్ధిక పరిస్థితి! బాలలందరూ మనదేశపు అతి విలువైన సంపదలు! వారి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సమాజమంతా పని చెయ్యాలని చెప్పుకోవడమే తప్ప ఆచరణలో ఎక్కడా కనిపించదు!!
టన్నుల కొద్దీ బంగారాలు పేర్చుకుంటూ పోతూ సంపదలు పోగేసేవారు కొందరైతే,కిలోలకు కిలోలు భగవంతుడి హుండిలలో వేసేవారింకొందరు!! కానీ అదే దేశంలో ఒక చిన్నారికి సాధారణమైన పండ్లు కూడా కొనివ్వలేని పేద తలిదండ్రుల దీన స్థితి గురించి ఆవేదనతో అతి చిన్న వయసులొ ఆవేదనతో ఇంత అద్బుతమైన చిత్రం తీసిన యువ దర్శకుడికి హేట్సాఫ్ చెప్పి తీరవలసిందే!
ఇంతకీ ఈ చిత్ర దర్శకుడు గోవింద రాజు గారు మన తెలుగువారే! ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఆయన సొంత ఊరు.హైదరాబాద్ జె ఎన్ టి యూ లో ఫైన్ ఆర్ట్స్(BFA) కోర్స్ పూర్తి చేసి , పూనే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ( FTII-Film and Television Institute of India) కి వెళ్ళారు. అక్కడ కోర్స్ లో భాగంగా ఈ చిత్ర నిర్మాణం జరిగింది. గోవింద రాజు అతి చిన్న వయసులోనే తలపండిన సినీ పండితులకు ధీటుగా ఆలోచించారు.మొదటి సినిమాలోనే మంచి నైపుణ్యం చూపించారు.
బంగారం విరివిగా పూజలకు ఉపయోగించే పరిస్తితి దేశంలో ఒకవైపుంటే, మరోవైపు పేదబాలలు ఒక మామూలు పండు కూడా తినలేని పరిస్తితికి చెందిన ఆవేదనే గోవింద రాజుకి ఈ సినిమా తియ్యడానికి ప్రేరణ నిచ్చింది. చిన్నప్పటినుంచీ సినిమాలంటే పిచ్చి ఇష్టం. రాజుగారికి మంచిర్యాలలో పైసల అవసరం లేకుండానే చెట్లకు కాసిన మామిడి పండ్లను కోసుకుని ఇష్టమొచ్చినట్లు తినడం తెలుసు. అదే పూనేలో అయితే ఒక మామిడి పండును 60 రూపాయలకి కొనవలసివచ్చేది. అమ్మమ్మలు,నాన్నమ్మలు చెప్పే జానపకథలను కూడా శ్రద్ధగా ఆలకించేవారు.అన్నిటినీ మేళవించి యువ నిర్మాత అందమైన సినిమాగా మలచిన తీరు ప్రశంసనీయం!
“తెలుగు వాడినైనప్పటికీ సినిమా సిబ్బందిని అక్కడినుంచే తీసుకుని,పూనే సంస్థ (FTII) సమకూర్చిన 15 లక్షల నిధులతో అతి తక్కువ సమయంలో(8 రోజులు) పూర్తి చేశాననీ, మానవాళి సమస్యలకు, భావోద్వేగాలకు,కష్టసుఖాలకు భాషా,ప్రాంతీయ భేదాలుండవనే ఎరుకతో “సోన్యాచా ఆం” (Sonyacha Aam ) అనే పేరుతో మరాఠీలో నిర్మించాననీ, మరాఠీ మాధ్యమంగా ఉన్నప్పటికీ అన్ని భాషల వారికీ తన సినిమా అర్ధమవుతుందన్నారు” గోవింద రాజు.
అంతర్జాతీయంగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్, బీజింగ్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇటలీ,తైవాన్-ఇలా ప్రపంచమంతా చుట్టి వస్తూ అందరి మెప్పునూ సాధిస్తోంది. జాతీయ చిత్రోత్సవాలలో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్- గోవా,18 వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం – హైదరాబాద్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ – ముంబై లలో బాలల్నీ,పెద్దల్నీ ఆకట్టుకున్న 10 చిన్న గొప్ప చిత్రాలలో ఇదొకటి! 2013 లో ఎంపికైన 10 షార్ట్ ఫిలింస్ లో ఇదొక అద్భుత చిత్రమని ప్రశంసించారు సినీ విమర్శకులు!!
భారతదేశం యొక్క 18 వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలకు గొప్ప పోటాపోటీగా నిష్ణాతులైన సినీ దర్శకుల మధ్య తన సినిమా ఒక సవాలుగా ఎంపిక కావడమంటే తన చిరకాల కలలు నిజం కావడమే నంటారు గోవిందరాజు.“గోల్డెన్ ఎలిఫెంట్” కి ఎంపికైన ఇద్దరు తెలుగు దర్శకుల్లో గోవిందరాజు గారొకరు! ఇతను మన తెలుగు వాడైనందుకు మనమూ గర్వపడదాం!
– శివ లక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`