సివంగి ద్రౌపది

            

పులికొండ సుబ్బాచారి

మనలో సామాన్య అవగాహనలో పతివ్రత అనగానే ఒక గమ్మత్తైన చిత్రం ఒకటి మనస్సులో మెదులుతుంది. సాంప్రదాయికంగా ఇలా మనకు అలవాటు అవుతూ వచ్చింది. పతివ్రతలు అనగానే, సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి, ద్రౌపది ఇలా చెబుతూ పోతాం. ఇక పతివ్రత అనగానే ఆమె భర్త గీచిన గీటు దాటదు. ఒక పల్లెత్తు అయినా భర్త మాటకు ఎదురాడదు. చెప్పినదానికి వ్యతిరేకంగా చేయదు. భర్త సేవలోనే అన్నీ ఉన్నాయి. భర్త సేవ చేయడం భగవంతునికి సేవ చేయడం కన్నా ఎక్కువ అని అనుకుంటారు. ఇది చిత్రం. మనకు విష్ణు మూర్తి పాల కడలిలో శేష తల్పం పైన పడుకుని ఉండగా లక్ష్మీ దేవి ఆయనకు పాద సంవాహనం చేయడం స్టాండర్డ్ స్టిల్‌గా మనకు ఎప్పటికీ మనకు గుర్తుండి పోతుంది. అలాగే సతీ అనసూయ కథ, సతీ సుమతి కథ, పతివ్రతల కథలకు మూసగా కూడా మనకు గుర్తు ఉండి పోతాయి. అలా భర్తకు అనుకూలవతిగా ఎదురు చెప్పకుండా కుక్కిన పేనులా ఉండేది అనే అద్భుత చిత్రం మనకు సాంప్రదాయికంగా మనస్సులో ముద్రపడి ఇదే విలువల్ని మనం కొనసాగించడానికి ప్రయత్నం చేస్తుంటాము.

కాని ఈ పాత్రలని ఆయా గ్రంథాలలో కాస్త శ్రద్ధ పెట్టి చదివితే అలా కనిపించవు. మనకు ఉన్న మూస అభిప్రాయాలకు భిన్నంగా కనిపిస్తాయి. వాటి వ్యక్తిత్వాన్ని అవి చెబుతాయి. ఇక్కడ అన్ని పతివ్రత పాత్రలను గురించి చెప్పడం చేయడం లేదు కాని. ద్రౌపది పాత్రని గురించి లోతుకు వెళ్ళి అక్కడ ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక ఘట్టం తీసుకొని ద్రౌపది అక్కడ ఎలా ప్రవర్తించిందో విశ్లేషిస్తాను.

ద్రౌపది ద్రుపదుని కూతురు. నిజానికి ద్రౌపది అనేది ఆమె పేరు కాదు. ద్రుపదుని కూతురు కాబట్టి ద్రౌపది అని అపత్యార్థకం లో వచ్చింది. ద్రౌపది అంటే ద్రుపదుని కూతురు అని అర్థం వస్తుందే కాని అది ఆమె పేరు కాదు. నిజానికి ఆమె పేరు చాలామందికి తెలియదు. అంటే ప్రచారంలో లేదు. చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసిన పేరు అది. ఆమె పేరు కృష్ణ. పాంచాలి అని పిలవడం అంటే పాంచాల రాజు కుమార్తె అని మాత్రమే. ద్రుపదుడు పాంచాల దేశానికి రాజు అలా ఆమెకు పాంచాలి అనే వ్యవహారం వచ్చింది. ఇంకా ఆమెకు యాజ్ఞసేని అనే వ్యవహార నామం ఉంది. అంటే ఆమె యజ్ఞంలో జన్మించింది అని తెలుసుకోవడం కోసం.

స్వయంవరంలో అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గెలుచుకున్నాడు. ఇంటికి వచ్చీ రాగానే అమ్మా నేను ఒక మంచి బహుమతిని గెలుచుకొని తెచ్చాను అని తల్లి కుంతితో అంటాడు. ఐదుగురు సమానంగా పంచుకోండి నాయనా అని అంటుంది. దీనిఫలితంగా ఆమె అయిదుగురు భర్తలకు ఇల్లాలు అయింది. దీనికి కారణం శివుడు కూడా ఆమెకు అయిదుగురు భర్తలకు ఇల్లాలు అవుతావని వరం ఇచ్చాడని కూడా ఉంది. మామూలుగా ఈ వివరణ అంతా ఇవ్వడం చారిత్రకంగా భారత రచనలలో చేరుస్తూ వచ్చారు. దీనికి కారణం ఒక భర్త ఒక భార్య ఉండే సమాజం వచ్చిన తర్వాత ఈ పరిణత వాతావరణంలో అయిదుగురు భర్తలు ఉండడం అనేది అదొక తప్పుగానూ, విచిత్రం గాను సామాజికంగా చాలా తక్కువ చర్య గాను భావించే స్థితి వచ్చిన తర్వాత నే ద్రౌపదికి ఇలాంటి వివరణ ఇవ్వవలసి వచ్చింది. దేవుడి వరంగా కారణంగానూ, తల్లి ఆదేశం కారణంగానూ ఈమె అయిదుగురు భర్తలకు ఇల్లాలు అయింది. అందువల్ల ఇది తప్పు కాదు అని చెప్పే ధోరణి ఇది.

కాని ఇది ఒక సామాజిక స్థితిని ‍ఒక సమాజంలో నిజంగా ఎల్ల కాలంగా ఉండే స్థితినే చెబుతుంది. ద్రౌపది ఉన్న పాంచాల దేశంలో బహు భర్తృత్వం అనేది చాలా సర్వసాధారణంగా ఉన్న సామాజిక ఆచారం. దీన్ని వారి సమాజంలో వారు ఎవరూ తప్పుగా అనుకోరు. బహు భర్తృత్వం ఉన్న సమాజాలు నేటికీ ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని ఘడ్వాల్ ప్రాంతంలోను. ఈశాన్య భారత దేశంలోని ఖాసి, జైంతియా తెగలలోను ఈ ఆచారం ఇప్పటికీ ఉంది. ఎక్కువ మంది భర్తలు అదీ ఒకేసారి ఉండడం అక్కడి సమాజాలలో మామూలు విషయం. దక్షిణ భారతదేశంలోని కేరళలో ఒక తెగలో ఇప్పటికీ ఈ ఆచారం ఉంది. కాని అది తుది దశలో ఉంది. దీన్ని పాటించడం ఇప్పుడు వారు కూడా దోషంగా పరిగణించి మాని వేస్తున్నారు.

బహు భర్తృత్వం ఉన్నప్పుడు ఎలా జీవించాలి అనే ఒక అవగాహన స్పష్టంగా ఉంటుంది. ఇది మహాభారతంలో కూడా వర్ణించబడి ఉంది. ద్రౌపది ఒక్కొక భర్తతో ఒక సంవత్సరం పాటు వరుసలో వారితో ఉంటుంది. ఆ సమయంలో మరొక భర్త ఆమె వైపు చూడడం కలవడం ఉండదు. దాన్ని తప్పుగా పరిగణిస్తారు. ద్రౌపది ధర్మరాజుతో ఉన్న కాలంలో ఆమె భర్తతో ఏకాంతంలో ఉన్న కాలంలో అర్జునుడు నియమం తప్పి వారు ఉన్న ఇంటి లోనికి పోతాడు. దీనికి ఫలితంగా ఒక సంవత్సరం పాటు వనవాసం శిక్షను అనుభవిస్తాడు. ఈ కాలంలోనే తపస్సు చేస్తాడు. శివుని మెప్పిస్తాడు, పాశుపతం సంపాదిస్తాడు. ఇలా నియమంతోనే వారి జీవితాలు ఉంటాయి. బయటి సమాజంలో ఉండే వారు భావించినట్లు అసంగతంగా కాని అడ్డగోలుగా కాని వారి జీవితాలు ఉండవు.

ద్రౌపది ఒక మహారాజు కుమార్తె. అంతే కాదు మరొక మహారాజుకు భార్య పరమ పతివ్రత. అయిదుగురు మహా వీరులకు ఇల్లాలు. వారు ఎంతటి మహావీరులు అంటే ప్రపంచంలోని మరెవ్వరూ వారిని గెలువలేరు. ఐదుగురు మహావీరులైన కుమారులకు తల్లి కూడా వీరికి ఏ మాత్రం తీసిపోని మహావీరుడు అయిన ఒక అన్నకు చెల్లెలు. మరొక మహావీరుడైన తండ్రికి కూతురు. కాని ఇంత మంది ఉండి ఏ స్త్రీకి జరగని అవమానాన్ని పొందింది. నిండు సభలో అందరి ఎదురుగా ఒకడు ఆమె బట్టలు ఊడదీసి నగ్నంగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. మరొక దుర్మార్గుడు సైంధవుడు అనే వాడు వనవాసంలో ఉండగా ఆమెను బలాత్కారం చేయడానికి ప్రయత్నించాడు. ఇంత ఘోరమైన అవమానాలు ద్రౌపదికే జరిగాయి. ఆనాడు మరో సామాన్య స్త్రీకి కూడా జరగని అవమానాలు ఆమెకు జరిగాయి. ఇది ఆమెకు జరిగిన అన్యాయం. దీనికి కారణం ఆమె భర్తలు వారు నమ్మిన న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉండడమే.

అయితే ద్రౌపది మామూలు స్త్రీగా మిగిలి పోలేదు. అశక్తురాలిగా ఉండలేదు. పగ లేని దానిలా భర్త ఏమి చెబితే అది వినుకుంటూ తన పగను మరచి పోయి ఉండలేదు. శౌర్యం లేని దానిలా పిరికి దానిలా ద్రౌపది ఎప్పుడూ లేదు. ద్రౌపది పాత్రను ఒక సంఘటనలో తిక్కన మహా కవి ఎలా వర్ణించాడో ఇక్కడ వివరించి చెప్పాలనుకుంటున్నాను.

పాండవుల వనవాసం ముగిసింది. అజ్ఞాత వాసం కూడా విజయవంతంగా ముగిసింది. దుష్టచతుష్టయం వారి అజ్ఞాత వాసాన్ని భంగం చేయాలని ఎంత ప్రయత్నించినా అది కాలేదు. పాండవులు నియమం ప్రకారం వారి రాజ్యాన్ని వారికి ఇవ్వమని కోరారు. సంజయుడిని రాయబారానికి పంపారు. అది విఫలం అయింది. చివరికి శ్రీకృష్ణని అంత వానిని రాయబారానికి పంపడానికి నిశ్చయించుకున్నారు. ఆయన కూడా అంగీకరించాడు. అయితే రాయబారానికి పోయేటప్పుడు పాండవులు వారికి ఏమి కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటాడు. ఒక్కొక్కరి ని అడుగుతాడు. ధర్మరాజును అడిగితే ఆయన, తాను యుద్ధంచేయడానికి సిద్ధంగా లేను. రాజ్యం ఇవ్వడం ఇష్టం లేకపోతే అయిదుగురు అన్నదమ్ములకు అయిదు ఊళ్ళు ఇవ్వమని అడుగు. వాటి తోనే బతుకుతాం. తాను యుద్ధం చేసి అమాయకులైన కొన్ని వేల మంది చావుకు కారణం కాలేను అని అంటాడు. తాను నెత్తురు కూడు తినలేను అని అంటాడు.

ఇక ఇక్కడ మిగతా పాండవుల అభిప్రాయం వలసిన అవసరంలేదు. దీనికి ద్రౌపది ఎలా స్పందించిందో ఇక్కడ చూడాలి. ధర్మరాజు మాటలకు ద్రౌపది బాగా హతాశురాలైంది. బాగా కోపం వచ్చింది. కోపం కాదు అది పట్టరాని ఆగ్రహం. తనను చెప్పలేని అవమానానికి గురిచేసిన దుర్యోధనుడిని మిగిలిన ముగ్గురి ని ఏ విధంగా శిక్షించాలని ఏ విధంగా పగ తీర్చుకోవాలని ఆలోచిస్తున్న ద్రౌపదికి ఈ ధర్మరాజు మాటలు శూలాలలా తగిలాయి. ఇతని పౌరుషం ఏమైంది అని అనుకుంది. ఐదు ఊళ్ళు అడుగుతాడా అని ఆగ్రహావేశాలకు గురైంది. ఇక పాండవులు ఐదుగురిని అడిగిన తర్వాత చివరిగా కృష్ణుడు తనకు అత్యంత ప్రియమైన సోదరి ద్రౌపది వద్దకు వచ్చి తన అభిప్రాయం చెప్పమని, రాయబారానికి పోయినప్పుడు అక్కడ వారితో ఏమి సంధి మాటలు మాట్లాడాలని అడిగాడు. అందుకు ద్రౌపది చెప్పిన సమాధానం తిక్కన పద్యాల లోనే తెలుసుకోవాలి.

“ధర్మ నందనుని పలుకులు ఆమెకు హృదయ తాపాన్ని కలిగించాయి. ముఖంలో దైన్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆమె బాధపడుతూ శౌరితో గద్గద కంఠంతో పలికింది. (పద్యం ౧౦౦ ఉద్యోగ పర్వం తృతీయా శ్వాసం). అంత చేసిన వారు సంజయుచేత చెప్పి పంపించిన వారు ధర్మరాజు మీద తమ్ముల మీద ప్రేమతో ఐదుగురికి ఊళ్లు ఇస్తాడా కృపావిహీనమతి సుయోధనుడేమిస్తాడు. (౧౦౧ పద్యం). తాను ఇంతకు ముందు పడ్డ కష్టాలు ధర్మరాజు మరచి పోతాడా. రాజ్యము పాలు లేదని చెప్పే తీరుకు ఒడంబడితే అందరూ అంగీకరిస్తారా. వీరికి యుద్ధం చేసి రాజ్యాన్ని పొందే శక్తి లేదని అందరూ అనరా కేశవా. (౧౦౨ పద్యం). ఏ కీడునైనా తట్టుకోవడానికి సైరించడానికి వీరు బ్రాహ్మణులా.

కేశవా. సుయోధను చిత్తంలో ఓటమి భయం ఒకింత కూడా లేదు. దురభిమానం ఎక్కువ. యుద్ధానికి సిద్ధంగా అన్నీ జరుగుతుంటే ఈ పాండవులు యుద్ధానికి సిద్ధం అవుతారా లేదా తిరిగి అడవులకు పోతారా అచ్యుతా (పద్యం 104). నీవు, ధర్మరాజు ఆయన తమ్ములు ఉచితమైనది ఆలోచించి చేయండి. మీ మంచితనం చెడకుండా గురు వర్గంతో మాట్లాడి సంధికి ఒడంబడేలా చేయండి. (పద్యం 105). అవివేకికి తిరిగి వివేకం కలుగుతుందా”.

ఈ మాటలు చెప్పిన తర్వాత క్రమంగా ద్రౌపది ఆవేశానికి గురైంది. అప్పటిదాకా పాటించిన సహనాన్ని తొక్కి పారేసింది. తనలోని శక్తి స్వరూపాన్ని క్రమంగా బయటికి తెచ్చింది. ఇక ఎలా మాట్లాడుతుందో చూడండి.

“వరమున పుట్టాను, భరత వంశానికి కోడలిగా వచ్చాను. పాండు రాజుకు కోడలిని అయ్యాను. ప్రజల చేత మెచ్చబడే వారు నీతి కలిగిన వారు పరాక్రమవంతులైన పుత్రులను కన్నాను. అన్నదమ్ములు ప్రాపును కూడా పొందాను. అన్నింటిలో ప్రశస్తికి ఎక్కాను. (పద్యం 108). నీవు ప్రత్యక్షంగా నన్ను నీ సొంత సోదరికన్నా ఎక్కువ ఆదరించిన నన్ను, రాజసూయ అవభృధ స్నానాన్ని అతి పవిత్రంగా చేసి శుచియైన ఈ వెంట్రుకలను పట్టి అంత మంది చూస్తూ ఉండగా ఈ అయిదుగురు చూస్తుండగా సభకు ఈడ్చుకొని వచ్చాడు. కులసతిని ఇలా చేస్తారా. (పద్యం 110) అలా సభకు ఈడ్చుకొని వస్తుంటే ఈ అయిదుగురు మగలు గీసిన చిత్రాలలాగా చూస్తున్నారే తప్ప చేష్టలుడిగి ఉన్నారే కాని ఏమీ చేయక పోతే నీ మీది నమ్మకంతో నిన్ను తలచుకున్నాను. (పద్యం 111). కోడలని అని కూడా తలచకుండా నన్ను దాసిని చేశాడు రాజు. వీళ్ళతో నేను పోయి కోడరికం చేయాలా దాసీగా బతకాలా చెప్పు మాధవా. అలా చెప్పుతూ ద్రౌపది తన చిక్కగా ఉన్న ఘనమైన కురులను కుడిచేతి మీదికి పెట్టుకొని ఆ వెండ్రుకలు కత్తి వాదర మెరుపులా, ఒక మహా భుజంగం మెరుస్తూ ఉన్నట్లు ఉండగా మనస్సులో విషాదము రోషముల్ తట్టుకోలేక కళ్లలో నీళ్ళు సుడి కమ్మగా దిగ్గని లేచింది. (ఈ పద్యాన్ని కింద చూడండి).

ద్రోవది బంధురం బయిన కొమ్ముడి గ్రమ్మున విడ్చి వెండ్రుకల్

దా వలచేత బూని యసితచ్ఛవి బొల్చు మహా భుజంగమో

నా విలసిల్లి వ్రేలఁగ మనంబున బొంగు విషాద రోషముల్

గావఁగ లేక బాష్పముల్ గ్రమ్మఁగ దిగ్గన లేచి యార్తయై.

ఇలా తన వెండ్రుకలని గోవిందుని ముందు పెట్టి ఆర్తయై మాట్లాడింది. ఇక్కడ తిక్కన గారి ప్రత్యేక మైన వర్ణనని చూడవచ్చు. తిక్కన చలత్ భంగిమలను వర్ణించడంలో దిట్ట అనే మాటని ఇక్కడ గమనించవచ్చు. గోరుముడి వేసిన వెండ్రుకలని కిందికి గభాలున విదిల్చి కుడిచేతి మీదికి పెట్టుకొని అవి ఒక మహా సర్పంలా వేలాడుతుండగా మనస్సులో విషాదం రోషం పొంగుతుండగా ఆర్తయై దిగ్గని లేచింది. ఈ వర్ణన అద్భుతంగా ఒక రోషావేశంతో ఉన్న ద్రౌపదిని కళ్ళకు కట్టినట్లు కనిపింప చేస్తూ ఉంది.

ఇక ద్రౌపది కోపం ఎంత తీవ్రంగా ఉందంటే ఆమె యుద్ధంలో దుర్యోధనుడు కేవలం చంపబడాలి అని మాత్రమే అనడం లేదు. ఏమంటుందో చూడండి. “ఈ వెంట్రుకలు పట్టిన ఆ దుశ్శాసనుని చేయి వాడు యుద్ధంలో వాడి శరీరం తుంపులు తుంపులై రూపం కనపడకుండా నరకాలి. మామూలుగా చల్లారే చిచ్చు కాదు ఇది. ధర్మ రాజు నేను కలిసి రాజరాజు పీనుగును కన్నులార చూడకపోతే ఈ పెద్ద గద పట్టుకున్న భీముని బాహు బలం అర్జునుని వీర విక్రమం కాల్చడానికా”. అని అన్నది. ఈ తిక్కన గారి పద్యాన్ని ప్రత్యక్షంగా చూడండి.

సీ. యీ వెంట్రుకలు పట్టి యీడ్చిన యా చేయి, దొలుతగా బోరిలో దుస్ససేను

తనువింతలింతలు దునియాలై చెదరి రూపఱి యున్నఁ గని యుడు కాఱుఁ గాక

యలుపాలఁ బొనుపాడు నట్టి చిచ్చే యిది పెనుగద పట్టిన భీమసేను

బాహుబలంబును పాటించి గాండీవ మను నొక విల్లెప్పుడు వహించు

కఱ్ఱి విక్రమంబుఁ గాల్పనే యిట్లు బ

న్నములు వడిన ధర్మనందనుండు

నేను రాజరాజు పీనుంగు గన్నారఁ

గానఁ బడయమైతి మేని గృష్ణ.

ఇంకా ద్రౌపది ఏమన్నదో చూడండి. “ఏ దో విధంగా ఈ పగ అనే చిచ్చుని రక్కెస తాల్మితో ఒడిగట్టి నిల్పుకున్నాను. చాలా కాలంగా ఇది పైటకు కట్టిన నిప్పులా ఇలా కాలుతూనే ఉంది. దీనికి ఆరటం అనేది జరగదు. దుష్టులను సంహరిస్తేనే ఈ చిచ్చు ఆరుతుంది. నాకు భర్తలు ఉన్నారు. అన్నవు నీవు ఉన్నావు. మీతోనే చిచ్చు ఆరుతుంది. అంటుంది.

ద్రౌపది అందరూ అనుకున్న పతివ్రతా లక్షణాలతో అక్కడే ఆగిపోలేదు. ఈ భర్తలు ఏవురు పిరికిపందలై అయిదూళ్ళు అడిగితే తాను తన అన్న ద్రుష్టద్యుమ్నుని దగ్గరికి పోయి పగ తీర్చుకుంటా నంటుంది. క్షత్రియుడు అయినవాడు, రక్తపు కూడు తినకపోతే భిక్షాన్నం తింటాడా అని అడుగుతుంది. శ్రీ కృష్ణుడు ఈమె దుఃఖాన్ని ఆలకించి కన్నీరు తుడిచి ఆమె వెండ్రుకలని ఒత్తి ఆమెను ఓదార్చమని అక్కడున్న స్త్రీలను అడుగుతాడు.

అంతే కాదు. యముని మహిషపు లోహ గంటల నాదాన్ని వినబోయే కౌరవులకు నేను చెప్పే మంచి మాటలు రుచించవని యుద్ధం జరుగుతుందని, కురు వీరుల భార్యల, కొడుకుల ఏడ్పులు నీకు ఆనందంగా వినబడతాయని, నీ కోరిక తీరుతుందని ద్రౌపదికి చెబుతాడు కృష్ణుడు. నిజానికి ధర్మరాజుకు కూడ సంధి పొసగదని తెలుసు కాని ప్రపంచానికి తన శాంత స్వభావం తెలియాలని తను ఎంత మంచి వాడో తెలియాలనే ఉద్దేశంతోనే అలా చెబుతాడు.

ద్రౌపది పాత్ర వీరోచితంగా భర్తలు తప్పుచేస్తే సవరించే రీతిలో వారిని తీవ్రంగా విమర్శించి దారికి తెచ్చే తీరు చాలా చోట్ల కనిపిస్తుంది. అంతే కాదు జానపద సంప్రదాయంలో ద్రౌపదిని శక్తి స్వరూపిణి అని దేవత అని భావిస్తారు. ఆమె రక్తాన్ని బలిని కోరే అమ్మవారికి ప్రతి రూపంగా భావిస్తారు. దక్షిణ భారత దేశంలో విశేషించి తమిళనాడులో ద్రౌపదికి గుడులున్నాయి. ఆమెను శక్తి దేవతగా అక్కడ ఆరాధిస్తారు. చిత్తూరు జిల్లాలో కూడా ద్రౌపది గుడులు ఉన్నాయి. ఇక్కడ కూడా పద్దెనిమిది రోజులు మహాభారతం పండుగ చేస్తారు. అక్కడ ద్రౌపది అమ్మవారి గుడి అనడమే కాని ధర్మరాజు గుడి అని అనరు. అనవలసి వస్తే ద్రౌపది ధర్మరాజులు గుడి అని అంటారు తప్ప విడిగా ధర్మరాజులు గుడి అనడం ఎక్కడా లేదు. ద్రౌపది అత్యంత ఆర్తయైన స్త్రీ. అన్యాయానికి గురైన స్త్రీ. ఏ స్త్రీకి జరగని అవమానానికి గురైన స్త్రీ. కాని వ్యక్తిత్వం లేని స్త్రీ కాదు. తాను ధర్మబద్ధంగా ఓడానా అధర్మబద్ధంగా ఓడించబడ్డానా తెలపండి అని నిండు సభలో అందరు పెద్దలను నిలదీస్తుంది. అయితే తన ప్రశ్నకు తన భర్తే పూర్తిగా అంగీకార్యం కాని స్థితిలో సమాధానం చెప్పిన తర్వాతనే తాను అత్యాచారానికి గురైంది. ఆమె ఆ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే పగ చల్లార్చే ప్రయత్నానికి గట్టిగా నిలబడింది. మహాభారత యుద్ధం ద్రౌపది వల్లనే జరిగింది అనే మాటలో నిజం ఇదే. ధర్మరాజు అమాయక ప్రజలు ఎందుకు యుద్ధంలో మరణించాలి అనే దూరదృష్టితో సంధికి ఒడబడినా ఆయిదూళ్లకు కూడా సిద్ధపడినా ద్రౌపది తన పగని చల్లార్చుకోలేదు. భర్తలను దూషించి అయినా వారిని దారికి తెచ్చింది. ఇది ద్రౌపది వ్యక్తిత్వం.

– పులికొండ సుబ్బాచారి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో