తల్లి తండ్రులను మించిన త్యాగగుణశీలి
బేగం జొహరా అన్సారి

Naseer Ahammad
భారత స్వాతంత్య్రోద్యమంలో వ్యక్తులు పాల్గొనటమే కాకుండా కుటుంబాలకు కుటుంబాలు పాల్గొని బ్రిటీష్ ప్రభుత్వ దాష్టీకాలను ఓర్పుతో భరించిన త్యాగశీలురైన కుటుంబ సభ్యులు జాతీయోద్యమ చరిత్రపుటలలో దర్శనమిస్తారు. ఆ విశిష్ట కుటుంబాలలో డాక్టర్ ముక్తార్ అహమ్మద్ అన్సారి కుటుంబం ఒకటి. ఆ కుటుంబానికి చెందిన మహిళారత్నం బేగం జొహరా అన్సారి. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షపదవిని అత్యంత సమర్థ్ధవంతంగా నిర్వహించిన స్వాతంత్య్రోద్యమ నాయకులలో అగ్రగణ్యుడిగా ఖ్యాతిగాంచారు డాక్టర్ ముక్తార్ అహమ్మద్ అన్సారి. అనితర సాధ్యమైన దయాగుణంతో స్వయంగా మహాత్ముని వందనాలందుకున్న శ్రీమతి షంషున్నీసా అన్సారి, డాక్టర్ అన్సారిల పెంపుడు కూతురు బేగం జొహరా అన్సారి.
ఆనాడు జాతీయోద్యమానికి ఢిల్లీలోని డాక్టర్ అన్సారి గృహం ప్రధాన కేంద్రంగా ఉండేది. జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించిన ఏ కార్యక్రమం ఢిల్లీలో జరిగినా, ఆ సమావేశాలకు హాజరయ్యేవారికి అన్సారి ఇంట ఆతిధ్యం తప్పనిసరి. చిన్నారి జొహరా ఆ సమావేశాల ప్రాంగణంలో కలయతిరుగుతూ నాయకుల ఉపన్యాసాలు, చర్చలు వింటూ చిన్ననాటినుండే జాతీయోద్యమం పట్ల అవగాహన, ప్రముఖ నేతలతో సన్నిహిత పరిచయాలను పెంచుకున్నారు. చిన్నతనంలోనే తల్లితండ్రుల్లా తాను కూడా స్వరాజ్యం కోసం బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయాలకు తగ్గట్టుగానే 1926లో జాతీయోద్యమంలో ఉత్సాహంగా పాల్గొంటున్న యువకులు షౌకతుల్లాను ఆమె వివాహం చేసుకున్నారు. అప్పటినుండి ఆ యువ దంపతులు తమ కార్యక్షేత్రాన్ని మరింత విస్తరింపచేసుకుని జాతీయోద్యమంలో అమితోత్సాహంతో పాల్గొన్నారు.
ఆధునిక ఆంగ్ల విద్యావంతురాలైన జొహరా బేగం సాంప్రదాయ విద్యను శ్రద్ధతో అభ్యసించారు. ఆమెకు ఉర్దూ, పర్షియన్, ఆంగ్లం, హిందీ, అరబిక్ భాషలు బాగా వచ్చు. . ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని విశాల దృక్పథాన్ని సంతరించుకున్న ఆమె సాంప్రదాయ ఆచార వ్యవహారాలను పాటించటంలో తగినంత శ్రద్ధ వహించారు. జాతీయోద్యమ మార్గంలో ఆ ఆచార సాంప్రదాయాలు ఆమెకు ఏవిధంగా ఆటంకం కానివ్వకుండా, మరెవ్వరికీ బాధాకరం కాకుండా జొహరా బేగం వ్యవహరించారు.
మహాత్మాగాంధీచే బేటీ అని ప్రేమతో పిలిపించుకున్న బేగం జొహరా అన్సారి వార్ధా ఆశ్రమంలో గాంధీజీ వద్ద చాలా కాలం గడిపారు. ఆశ్రమంలో ఆమె గాంధీజీకి చేదోడువాదోడుగా వ్యవహరించి, ఆయన మన్నన పొందినట్టు, గాంధీజీ రాసిన లేఖల ద్వారా తెలుస్తుంది. వార్దా ఆశ్రమంలోని వంటగదిలో ఆమె బేగం అముత్సలాంకు సహకరించేదని గాంధీజీ పేర్కొన్నారు. ఉర్దూ భాషను నేర్పేందుకు జొహరాను తన గురువుగా వ్యవహరించమని గాంధీజీ స్వయంగా కోరటం విశేషం. ఆమె గాంధీజీకి చక్కని ఉర్దూ నేర్పారు. గాంధీజీ నేర్చుకున్న ఉర్దూభాషా పరిజ్ఞానాన్ని మరింత పెంచుకోడానికి జొహరా బేగం రాసిన లేఖలు ఎంతో తోడ్పడ్డాయి. ఆశ్రమం నుండి వెళ్ళిపోయాక కూడా ప్రతి వారం గాంధీజీకి ఉత్తరం రాయటం ఆమె అలవాటు. ఆ లేఖలు ఉర్దూ భాషాభివృద్ధికి అవసరమగు సలహాలతో నిండి ఉండేవి. ఈ లేఖలను ప్రస్తావిస్తూ, ఆమె లేఖలు నా ఉర్దూ భాషాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి…ప్రతివారం వచ్చే ఆమె లేఖల కోసం నేను ఎదురు చూసేవాడ్ని అని మహాత్ముడు పలుసార్లు పేర్కొనటం విశేషం.
జాతీయోద్యమంలో భాగంగా జైలుకెళ్ళేందుకు జోహరా అన్సారి ఉవ్విళూరారు. బ్రిటీషు బానిస బంధనాల నుండి దేశాన్ని విముక్తం చేయటంలో భాగంగా జైలుకు వెళ్ళడం ఎంతో గౌరవమని ఆమె భావించారు. ఈ విషయమై గాంధీజీ అనుమతి కోరుతూ ఆయనకు ఆమె పలు ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలకు సమాధానంగా, ఆమె ఆరోగ్యం దృష్ట్యా కొంత సహనం వహించు. నీవు జైలుకు వెళ్ళేందుకు ఒక రోజున నేను తప్పకుండా అనుమతిస్తా, అని 1941 జూన్ 19నాటి లేఖలో గాంధీజీ ఆమెకు నచ్చచెప్పారు. చిన్నతనంలో తల్లితోపాటుగా జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరిగినా అక్కడకు తాను హాజరయ్యేదానినని ఆమె స్వయంగా చెప్పుకున్నారు. ఆ సమయంలో సేవాదళం కార్యకర్తలు నిర్వహించే పనులలో తాను భాగం పంచుకునేదానినని బేగం జొహరా పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులైన తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న జోహరా అన్సారి జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాతీయోద్యమ నేతలు, ప్రధానంగా గాంధీజీ ఆమెకు అప్పగించిన ప్రతి పనిని ఎంతో సమర్థ్ధవంతంగా నిర్వహించి ప్రశంసలందుకున్నారు. భారతదేశం నుండి బ్రిటీష్ పాలకులను పూర్తిగా తరిమివేసి సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించుకోవాలంటే, భారతీయ జన సముదాయాలలో ఐక్యతావశ్యకతను అమె గ్రహించారు. ఆ కారణంగా ఆమె హిందూ – ముస్లింల ఐక్యతను ప్రగాఢంగా వాంఛించారు. మతం పేరుతో ఆనాడు సాగిన వేర్పాటువాద ధోరణులను తీవ్రంగా నిరసించారు. మత సామరస్యాన్ని కాపాడాలని, మత విద్వేషం కూడదని, మతాన్ని రాజకీయాలతో ముడి పెట్టరాదని ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు.
బేగం జొహరా అన్సారి దానగుణంలో తన తల్లిదండ్రులకు ఏమాత్రం తీసిపోకుండా వ్యవహరించారు. ఆమె తన కుటుంబానికి చెందిన ఆస్థిపాస్తులను జాతీయ ప్రయోజనాల కోసం త్యాగం చేయడానికి వెనుకాడలేదు. జాతీయోద్యమంలో పాల్గొన్న యోధుల కుటుంబాలను ఆమె ఆర్థికంగా ఆదుకున్నారు. 1946లో జరిగిన ఎన్నికల సందర్భంగా అఖిలభారత ముస్లింలీగ్ నాయకులు సాగిస్తున్న వేర్పాటువాద రాజకీయాలను ఎదుర్కొనడానికి నిధులు అవసరమని ఆమె తలచారు. ఐక్యతను చెడగొట్టి, ప్రజలలో విభజనకు కారణమవుతున్న విద్వేష, విభజన రాజకీయాలను ఆమె సహించలేకపోయారు. ఆ శక్తుల పరాజయాన్ని ఆమె ఆశించారు. అందుకు అవసరమగు నిధులను అందించేందుకు ఆమె ముందుకు వచ్చారు.
ఆనాటికి డాక్టర్ అన్సారి అపార ఆస్థిపాస్తులు జాతీయోద్యమ కార్యక్రమాల కోసం కరిగి పోయాయి. స్వాతంత్య్ర సమరయోధులకు, కార్మిక ప్రముఖులకు, దేశ, విదేశీ ప్రముఖులకు ఎంతో గౌరవాభిమానాలతో అతిధ్యమిచ్చి, జాతీయోద్యమంలో నాయకుల చారిత్రక చర్చలకు, సంచలన నిర్ణయాలకు వేదికగా నిలిచిన ఈజుష్ట్ర-ఏఐ-ఐజుఉజుఖ భవంతి తప్ప మరోక విలువైన అస్తి ఆమెకు కన్పించలేదు. ఆ సమయంలో జాతి ప్రయోజనాల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఆమె, ఆమె భర్త షౌకత్ అన్సారి ప్రకటించారు.
భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించాక ఇతర నాయకుల వారసుల్లా ఆమెగాని ఆమె భర్తగాని ప్రభుత్వంలో ఎటువంటి పదవులను స్వీకరించలేదు. లక్షలాది రూపాయల ఆస్తిని జాతీయ కాంగ్రెస్ కార్యక్రమాలకు వినియోగించి అతి సామాన్య గృహిణిగా జీవితం గడిపిన జోహరా తమ ఆర్థ్ధిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా చెయ్యిచాచి ఎవ్వరిని సహాయం అడగలేదు. ప్రభుత్వం సహాకారం ఆశించలేదు. స్వాతంత్య్రోద్యమం కోసం, ప్రజల ప్రయోజనాల కోసం, మత సామరస్యం కాపాడేందుకు, ప్రజలలో పరస్పరం సద్భావనలను పరిపుష్టం చేసేందుకు తమ జీవితాలు, ఆస్థిపాస్తులు కొంతవరకైనా ఉపయోగపడినందుకు సంతోషిస్తూ ఆమె కాలం గడిపారు. చివరకు 1988 జూలై 28న ఇంగ్లాండ్‌లో దానగుణసంపన్నురాలు శ్రీమతి బేగం జొహరా అన్సారి అంతిమ శ్వాస విడిచారు.
మాతృదేశ సేవలో సర్వస్వం త్యాగం చేసిన
ముహమ్మద్ గౌస్ ఖాతూన్
స్వాతంత్య్రోద్యమంలో ప్రత్యక్ష, పరోక్ష కార్యాచరణ కలిసికట్టుగా సాగుతుంది. ప్రత్యక్ష కార్యక్రమాలలో ధైర్యసాహసాలు ప్రధానం కాగా, పరోక్ష కార్యకలాపాలకు సమర్పణ, సహనం, ఓర్పు, త్యాగాలు ప్రాణం. పరోక్ష కార్యాచరణలో భాగంగా త్యాగాల బాటలో నడిచిన మహిళ శ్రీమతి ఖాతూన్ బీబీ.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ముహమ్మద్ గౌస్ బేగ్ జీవిత సహచరిణి ఖాతూన్ బీబీ. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో ప్రత్యేకస్థానం పొందటమేకాక, మహాత్ముని అభినందనలు అందుకున్న చీరాల-పేరాల పోరాటం, పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమంలో ముహమ్మద్ గౌస్ బేగ్ పాల్గొన్నారు. ఖాతూన్ బీబీ మాత్రం ప్రత్యక్షంగా జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొనలేదు. పరోక్షంగా జాతీయోద్యమానికి సర్వం త్యాగం చేశారు. భర్తకు అన్ని విధాల అండదండలుగా నిలవటమే కాక, జాతీయోద్యమ నేతలు భోగరాజు పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయమ్మ, టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి ప్రముఖులకు తన ఇంట ఆతిధ్యం కల్పించారు. జాతీయ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల పట్ల ఖాతూన్ ఎంతో ఆదరణ, ఆప్యాయతలు చూపారు. ఆమె ఇల్లు ఉద్యమకారులకు స్వంత గృహం లాగుండేది.
1921 నాటి సహాయ నిరాకరణ ఉద్యమంలో మహమ్మద్ గౌస్ బేగ్‌ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి ఒక సంవత్సరం జైలు, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. జరిమానా కట్టటానికి డబ్బు కావాల్సి వచ్చింది. చేతిలో చిల్లిగవ్వలేని సమయంలో ఖాతూన్ బంగారాన్ని అమ్మి జరిమానా కట్టారు. ఆ తరువాత మరోసారి గుంటూరు జిల్లా, పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించిన గౌస్ బేగ్‌ను ప్రభుత్వం అరెస్టు చేసి, సంవత్సరం జైలు, వెయ్యిరూపాయల జరిమానా విధించింది. ఆ సమయంలో కూడా జరిమానా కట్టేందుకు డబ్బు లేనందున, ఖాతూన్ తన వంటి విూద ఉన్న బంగారాన్ని పూర్తిగా అమ్మగా వచ్చిన సొమ్ముతో జరిమానా కట్టారు. ఆడంబరాలెరుగని ఆ తల్లి అప్పటి నుండి తన జీవితంలో మరెప్పుడూ బంగారం ధరించలేదు.
గౌస్ బేగ్ శాసనోల్లంఘన ఉద్యమంలో గుంటూరు జిల్లా ఉద్యమ బాధ్యతలను నిర్వహించారు. అందుకు ఆగ్రహించిన ప్రభుత్వం ఆయన చరాస్థిని వేలం వేసి, లభించిన నగదును జరిమానా క్రింద జమ చేసుకుంది. ఈ చర్యల పట్ల ఖాతూన్ ఏ మాత్రం చలించకపోగా మాతృభూమి రుణం తీర్చుకునే అవకాశం లభించిందని సంతోషించారు. బంగారం, నగదు నట్రా, పొలం పుట్రా కర్పూరంలా కరిగిపోతున్నా, పేదరికం చుట్టుముడుతున్నా, బేగ్ దంపతులు బేఖాతర్ అన్నారు. మాతృభూమి కోసం సర్వం త్యాగం చేయగలిగిన అదృష్టం లభించిందంటూ పొంగి పోయారు. జాతీయోద్యమంలో పాల్గొంటున్న కార్యకర్తలు, నాయకులు కుటుంబాలను వదలి వచ్చి బ్రిటీష్ ప్రభుత్వపు క్రూరత్వానికి గురవుతున్నప్పుడు, ఆ మాత్రం సేవలందించి మాతృభూమి రుణం తీర్చుకోలేకపోతే ఎలా? అంటూ ప్రశ్నించిన ఖాతూన్ ఆస్తిపాస్థులన్నీ హరించుకు పోతున్నా ఏమాత్రం చింతించలేదు. స్వదేశీ వస్త్రధారణకు, స్వదేశీ వస్తు వినియోగానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఆమె ఖాదీ ప్రచారంలో ఎంతో శ్రద్ధగా పాల్గొన్నారు. జీవితాంతం ఖద్దరు ధరించారు. మహమ్మద్ గౌస్ బేగ్ 1976లో మరణించగా శ్రీమతి ఖాతూన్ 1990 నవంబరు 20న తనువు చాలించారు.
సాంఘిక బహిష్కరణలకు వెరవని ధీమంతురాలు
హాజఁరా బీబీ ఇస్మాయిల్
(-1994)
జీవిత భాగస్వాములతో పాటుగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని త్యాగాలతో చరిత్ర సృష్టించిన మహిళల జీవిత విశేషాలను కొంతలో కొంతవరకు జాతీయోద్యమ చరిత్ర మనకు అందిస్తుంది. బానిస బంధనాల విముక్తి కోసం పోరాడుతున్న సహచరుడు కన్నుమూసినప్పటికీ, ఆయన నడిచిన సన్మార్గం వీడకుండా, ముందుకు సాగిన మహిళలు అరుదుగా కన్పిస్తారు. శ్రీమతి హాజఁరా బీబీ అటువంటి అరుదైన మహిళామణులలో ఒకరు.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మహమ్మద్ ఇస్మాయిల్ సాహెబ్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా తెనాలి కేంద్రంగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఆయన భార్య హాజఁరా బీబీ. గాంధీజీ ప్రబోధంతో ప్రభావితులైన ఆయన ఖద్దరు ప్రచారోద్యమంలో అమితోత్సాహంతో పాలుపంచుకున్నారు. గుంటూరు జిల్లాలో తొలి ఖద్దరు దుకాణం ప్రారంభించి, ఖద్దరు ప్రచారంలో నిత్యం నిమగ్నమై ఉండే భర్తకు హాజఁరా బీబీ అపూర్వమైన తోడ్పాటునిచ్చారు. అఖిల భారత ముస్లింలీగ్ ప్రభావం తెనాలిలో కొంత ఉండేది. ఖద్దర్ ఇస్మాయిల్ దంపతులు భారత జాతీయ కాంగ్రెస్‌లో కొనసాగటం, గాంధీజీ విధానాల పట్ల అత్యంత గౌరవభావంతో ఉండటం లీగ్ కార్యకర్తలకు, లీగ్ అభిమానులకు ఇష్టం లేకపోయింది. ఆ కారణంగా ఆ దంపతులు అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో హాజఁరా బీబీ ఎంతో ఓర్పుతో కుటుంబ వ్యవహారాలను సరిచూసుకుంటూ, తన ఇంటికి వచ్చే జాతీయోద్యమ కార్యకర్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ భర్తకు అండగా నిలిచారు.
జాతీయోద్యమకారుడు ముహమ్మద్ ఇస్మాయిల్ పలుసార్లు జైలు పాలైనప్పటికీ హాజఁరా అధైర్యపడలేదు. జాతీయోద్యమ కార్యకర్తగా భర్త జైలుకు వెళ్ళటం గౌరవంగా భావించి ప్రోత్సహించారు. పిల్లలకు జాతీయవిద్యను అందించాలన్న లక్ష్యంతో స్వసమాజం నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, ఆడబిడ్డలను జాతీయ విద్యాబోధన గావించే హిందీ పాఠశాలకు పంపారు. ఈ పద్ధతులు నచ్చని వ్యక్తులు ఇస్మాయిల్ కుటుంబాన్ని అప్రకటిత సాంఘిక బహిష్కరణకు గురిచేశారు. ఆ చర్యకు ఆమె ఏ మాత్రం చలించలేదు. భర్త ఇస్మాయిల్‌గాని తాను గాని నడుస్తున్నది గాంధీ మార్గంలో కనుక ఎవరు ఏమనుకున్నా, ఏమి చేసినా ఎదుర్కోవడం తప్ప గాంధీబాట నుండి వెనుదిరిగేది లేదని హాజఁరా స్థిరంగా నిర్ణయించుకుని, ఆ నిర్ణయం ప్రకారంగా ముందుకు సాగారు.
జాతీయోద్యంలో ముహమ్మద్ ఇస్మాయిల్ మొత్తం విూద ఏడు సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించారు. చివరి సారిగా జైలులో అనారోగ్యంపాలై, ఆ తరువాత 1948లో ఆయన కన్నుమూశారు. ఆయన కన్ను మూశాక స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే భూమిని ప్రభుత్వం ఆమెకు సంక్రమించ చేయదలచింది. స్వాతంత్య్ర సమర యోధురాలుగా తమ దేశభక్తికి విలువ కట్టటం ఇష్టం లేని ఆమె ప్రభుత్వం ఇవ్వదలచిన భూమిని తిరస్కరించారు. ప్రభుత్వం ఇస్తానన్న భూమిని తిరస్కరించటం మాత్రమే కాకుండా తన భర్త వాగ్దానం నెరవేర్చేందుకు తెనాలి సవిూపాన గల కావూరు వినయాశ్రమానికి రెండున్నర ఎకరాల విలువైన మాగాణి భూమిని ఆమె దానం చేశారు. స్వాతంత్య్రయోధుల సమావేశస్థలిగా భాసిల్లిన ఖద్దరు విక్రయశాలను భర్త మరణానంతరం కూడా తన బిడ్డల చేత నిర్వహింప చేశారు. చివరివరకు ఖద్దరు ధరించారు. చివరి క్షణం వరకు గాంధీజీ బాటలో భర్త ఆశయాలకు అనుగుణంగా జీవితం గడిపిన శ్రీమతి హాజఁరా బీబీ 1994లో తుది శ్వాస విడిచారు.
(ఇంకా ఉంది )
– సయ్యద్ నశీర్ అహమ్మద్
`~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు