ఒయినం

Gowri jajula లెక్క చేయకుండా ఆయాసంతో రొప్పుతూ ఊపిరి సలుపకుండా పనిచేస్తుంటే ఇక ఉండబట్టలేక గబగబా భర్తను చేరి చేతిలోని గడ్డపారను గట్టిగా పట్టుకుని ”ఏందయ్య గిది గిట్లెంద్కు జేస్తున్నవు గీ బీడుభూమి గీ రాళ్ళేంది, గింత ఎండల వీటిని దీసుడేంది కతేందో నాకు సమజైతలే మా అమ్మోళ్ల ఇంటికాడి నుంచి వచ్చినప్పటి నుంచి జూస్తున్న నువ్వు నాకు ఏం జెప్తలేవు మనోళ్ళు గూడా ఎవళు నాతో మాట్లాడ్తలేరు అసలు సుద్ది ఏంది” అంటూ మొగులయ్యని నిలదీసింది.
గడ్డపార మీద నుంచి భార్యచేతిని ఇసురుగా పక్కకు జరిపి బండరాయిని మరింత జోరుగా దొర్లిస్తూ జరిగిన సంగతంతా చెప్పి ”ఇంగ గిదే మన పొలం” అంటూన్న మొగులయ్య కండ్లల్లో కన్నీటి పొరను చూసి నిలువునా కంపించిపోతూ
”ఏందేంది ఏమన్నవు మల్లా సెప్పు” అన్నది.
”మల్లా సెప్పుడేందే నీలా ఇంగ గిదే మన పొలం” అనేసరికి
నెత్తిన పిడుగులు పడ్డట్టయి చుట్టూ పరికించి చూసింది.
సెల్క అంతా రాళ్ళురప్పలు, ముళ్ళకంపతో, ఎగుడుదిగుడు గుంతలుండి ఎడారిలా కన్పిస్తుంటే
”ఏందయ్య భూమి పంచుబాటు అయిందా” అని కన్నీళ్ళ మధ్య అడిగింది.
”ఆ పంచుబాట అయినంకనే నిన్ను తోల్కరానూ వచ్చినా” అంటుంటే మొగులయ్యకి మాటలు పెగల్లే.
”మల్ల అయాల్ల నుంచి ఈయాల్ల దాకా గీ సుద్దెందుకు సెప్పలే?” అంటూ బాధపడ్తుంటే ”చెప్తె ఏం జేస్తవు చెప్పు మా పెద్దనాయినా యింతనన్నా ఇచ్చిండు గిది గూడా ఇయ్యకుంటే ఏంజేస్తం?” అని తలొంచుకున్నాడు.
”ఏం జేస్త వేందయ్య గాయనేమన్నా మనకు ఉట్టిగిచ్చిండా ఏంది సెప్పు నీ పాలు నీ కిచ్చిండు గాయిచ్చేదేదో సరిగా ఇయ్యొచ్చుగా, నువ్వు అడ్గొచ్చుగా” అని నిలదీసింది.
”ఇగో నీలా మా పెద్దనాయినను ఎవళు గట్టిగా అడ్గుతరు జెప్పు నన్ను సిన్నప్పట్నించి సూసిండు గాయినంటే నాకు మస్తు బుగులు సరిగా ఇస్తడన్కుంటి ఇయ్యకపాయే నాకు సేతులున్నయి చేసే చేవుంది. గిన్ని దినాలవట్టి గాపొలంల గూడా కష్టపడి మస్తు పొలం సాగుజేసినా గిది గూడా గట్లనే చేస్త చూస్తుండు గీ మన్నులనే మనులను పండిస్తా” అన్నడు స్థిరంగా.
”ఓయ్యో గీ చెల్క ఎప్పుడు పంటపొలం గావాలే ఎప్పుడు పంట పండాలే గిదంతా మంచిగయేటాళ్ళకు సగం సస్తం” అంటూ చుట్టూ చూసింది.
”ఎందుకు నీలా గట్లంటవ్‌ బురదమడ్లు గూడా జెర ఓపిగ్గా జేసుకుంటే ఆండ్ల బంగారం పండుతాది” అని అంటుంటే
నీలమ్మ కాళ్ళకింది భూమి కంపించినట్లయి ”ఏందయ్య గాబురదగుంటల పంట పండిస్తవా ఆనకాలంల మస్తు పరేషానైతదని నువ్వే సెప్పినవు. ఇప్పుడు అదిగూడా నీకే ఇచ్చిండ్రా” అంటుంటే ఆమె కళ్ళనుంచి నీళ్ళు జలజలా రాలాయి.
మొగులయ్య చేతిలోని గడ్డపారను పక్కన పడేసి ”ఊర్కోయే నీలా నువ్వు గిట్లేడుస్తే నా మనస్సంతా ఎట్లనో అయితది నువ్వు నాయెంటున్నవంటే నిజంగా జెప్తున్న ఇండ్ల బంగారం పండిస్తా, అ… బంగారం పండిస్తా” అంటూ మల్ల గడ్డపారను తీసుకొని కసికసిగా రాళ్ళను తవ్వసాగాడు.
ఇంక ఆరోజునుంచి మొగులయ్య గడ్డపారతో బండరాళ్ళను పెకలిస్తుంటే నీలమ్మ గొడ్డలి తీసుకుని ముళ్ళకంపలని నరికేస్తూ చెల్కచుట్టు కంచెగా వెయ్యసాగింది.
గడ్డపారతో పెద్దరాళ్ళను పెకలించి ఇద్దరు కల్సి వాటిని దొర్లించుకుంటు పక్కనేశారు. రాళ్ళురప్పలనూ పొలంలోంచి తొలగిస్తుంటే అన్ని రోజులు వాటికింద నివాసం ఉన్న తేలుజెర్రులు, ఒక్కొక్కసారి పాములు బయటపడసాగాయి. కానీ భార్యాభర్తలు వేటికి జడవలేదు. వారి లక్ష్యం చెల్కను పంటపొలంగా మార్చటమే.
ఎత్తుగా ఉన్న గడ్డలను మొగులయ్య తవ్వుతుంటే తట్ట తీసుకుని ఆ మట్టిని ఎత్తి గుంతలు పూడ్చింది ఆ పని పూర్తయ్యాకా చెరో గడ్డపారనూ తీసుకొని మొత్తం మట్టిని పెకలిస్తూ పోయారు.
ఇలా రాత్రిపగలూ కష్టపడి నాలుగు మడులు తయారుచేశారు. ఇక నీటికాలువను తవ్వటం మిగిలింది. ఆ సమయంలోనే ఎండలు మరింత ఊపందుకున్నయి.
పాలోళ్లందరు భార్యాభర్తలనే గమనిస్తున్నారు. ఏ ఇద్దరుకల్సినా మొగులయ్య సంగతే వాళ్ల మధ్యన చర్చాంశమైంది.
తామెల్లి పనిలో సాయం చేద్దాం అని అందరి మనస్సులో ఉన్నా మొగులయ్యకి సాయం చేస్తే ”సత్తెన్న గిచ్చి కయ్యం దీస్త”డని అతడికి జడిసి ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారు.
సెల్కా సేనుగా మారటం పూర్తయ్యాకా మర్నాడు పొద్దున్నే మొగులయ్య పలుగుపార తీసుకుని గడ్డ దగ్గరకుపోతే
నీలమ్మ తట్ట నీళ్ళకుండ తీసుకుని మొగుడి వెనకాలే నడిచింది. తనంత ఎత్తున్న గడ్డను నీళ్ళుపారేంత లోతుగా తవ్వాలని నిర్ణయించుకుని గడ్డపారను బలంగా భూమిలోకి దించాడు.
అంత ఎత్తున్న గడ్డను ఎట్లా తవ్వుతాడోనని మనస్సులో బయపడింది నీలమ్మ. కానీ మొగులయ్య ప్రయత్నం ఆగలేదు. పోటు మీద పోటు ఎత్తెత్తి గడ్డపారను బలంగా భూమిలోకి దించుతుంటే అది పెల్లలు పెల్లలుగా మట్టిని పెకిలించసాగింది.
నీలమ్మ పారను తీసుకుని మట్టిని తట్టలోకి ఎత్తి పక్కన పోస్తోంది. పదకొండు అయ్యేసరికి ఎండ మరింత జోరందుకుంటోంది.
విపరీతమైన వేడి ఒంటిని కాల్చేస్తున్నట్లున్నా మొగులయ్య ఎండకు వెరవలేదు. పోటు మీద పోటు ఏస్తూనే ఉంటే గంపమీద గంప నీలమ్మ మట్టిని ఎత్తుతూనే ఉంది. ఆయాసం వచ్చినప్పుడు కాసేపు ఆగి కుండలోని చల్లని నీళ్ళు తాగి మళ్ళీ పనిలోకి దిగుతున్నారు.
ఒక్కొక్కసారి ఎండకు తాళలేక, మొగులయ్య తలకు రుమాలును చుట్టుకుంటే నీలమ్మ నెత్తిపై కొంగును కప్పుకుంటోంది.
సత్తయ్య ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. గడ్డను తవ్వుటం చేతకాక మొగులయ్య మళ్ళీ తన కాళ్ళపై పడి వేడుకుంటాడని అనుకుంటున్నాడు. బీడు పొలం సాగుపొలంగా మారేసరికి సత్తయ్య కన్ను ఆ పొలంపై కూడా పడింది.
మొగులయ్య గనుక ఈ పరిస్థితుల్లో వచ్చి తనని వేడుకుంటే ఒప్పుకుని మళ్ళీ అతన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకుందామనుకుంటున్నాడు. ఈ విషయం పాలోళ్లకు తెలియకుండా జాగ్రత్త పడ్తున్నా ఇంట్లో భార్యాభర్తల మధ్య మొగులయ్య నీలమ్మల మాటే నలుగుతోంది.
ఎత్తైన గడ్డ నువ్వానేనా అన్నట్లు మొగులయ్యకీ సవాలు విసురుతూనే ఉంది. ఆకాశంలో సూరీడు ఎంత తీక్షణంగా తన కర్తవ్యం నిర్వహిస్తున్నాడో అతను కూడా అంతే దీక్షతో గడ్డ అంతు చూస్తూ పొద్దుపొడవక ముందే వచ్చి పొద్దుగుంకినంకా ఇంటి ముఖం పడ్తున్నాడు.
ఓ రోజు పొద్దున్నే వచ్చి మొగులయ్య మట్టిగడ్డను తవ్వుతుంటే, ఎప్పట్లాగే మట్టిని గంపలోకి ఎత్తి పక్కన పోస్తోంది నీలమ్మ. కానీ ఆ రోజు మట్టిని గంపలోకి ఎత్తుతుంటే కళ్ళు బైర్లు కమ్మసాగాయి. ఎంత నిలదొక్కుకున ప్రయత్నించినా చేతకాక అ…. మ్మ…. అ…. మ్మ…. అంటూ గుంతలోనే కూలబడింది.
భార్య కిందికి ఒరిగిపోవటం చూసిన మొగులయ్య ఒక్క ఉదుటున గడ్డపారను పక్కనే పడేసి నీలమ్మను గట్టుమీదకు తీసుకునిపోయి ముఖం మీద నీళ్ళు చల్లి ”నీలా నీలా” అంటూ ఆత్రంగా పిలిచాడు. ఆమెలో చలనం లేదు.
వెంటనే సుక్కమ్మ యింటికి పరుగెత్తి ఆమెను తీసుకోచ్చేసరికి నీలమ్మ సృహతప్పి అక్కడే పడుంది. ”చిన్నమ్మ మీ కోడలికి ఏమైందో ఏమొ గుమ్ముచ్చి పడ్డదే” అని అంటుంటే అతని స్వరం భయంతో కంపించింది.
నీలమ్మ పరిస్థితి చూసి ఆమె గాబరాపడ్తూ ”ముందు పిల్లను ఎండ నుంచి యింట్లకు తీస్కుపా” అన్నది. మొగులయ్య నీలమ్మను ఎత్తి భుజంపై ఏస్కుని నడుస్తుంటే సుక్కమ్మ మొగులయ్య ముందు పరుగెత్తి ఇంట్లోకిపోయి చాపేసి బొంతేసింది.
మొగులయ్య నీలమ్మను ఎత్తుకొస్తుంటే చూసిన వాళ్ళంతా ”ఏమైందంటూ” వెనుకబడి ఆత్రంగా వచ్చి చుట్టుచేరారు. పోచమ్మ గుమ్మంలో నిలబడి అందరి దిక్కు తీక్షణంగా చూసింది.
నీలమ్మని చాపపై పడుకో పెట్టాకా ముఖం మీద చల్లని నీళ్ళు చల్లి ముకం తుడ్చి బట్టలు వదులు చేస్తుంటే కనకమ్మ పరుగున వచ్చి ”అక్కా! పిల్లకేమైందే?” అన్నది.
ఎదురుగా పోచమ్మని చూసి పోచమ్మ, కనకలచ్చిమి, దుర్గమ్మ, నాగమణి ఇంట్లోకి పోనీకి భయపడ్తుంటే కనకమ్మ అది గమనించి ”ఏందమ్మ గట్ల భయపడ్తుండ్రేంది. ఏం తప్పుజేసినమని గాడ గన్మలనే నిలవడ్డరమ్మ దిక్కులేని పచ్చిలెక్క పడ్డది మొగులయ్యకి ఏం తెల్వదు రావాల్సినోళ్ళు రారు ఇంగ గిపోల్ల నెవళు జూస్తరు జెప్పండ్రి ఎవళ్ళయినా ఆడోళ్ళమే, గట్ల సిన్మా చూసినట్లు జూస్తరేందవ్వా, ఏ రండ్రి” అనే సరికి
ఇద్దరు ముగ్గురు ధైర్యం చేసి ఇంట్లోకి వచ్చారు.
మొగులయ్య ఇంటి బయట గోడకు చేరగిలబడి భార్యకేమైందో తెలియక గాబరా పడసాగాడు. చల్లనీళ్ళతో ముఖం తుడ్చాకా బట్టతో గాలిని విసిరేసరికి నీలమ్మ స్పృహలోకి వచ్చి కండ్లు తెరిచి ఆందోళనపడ్తూ చుట్టూ చూసింది.
అత్తలు, చుట్టుపక్కల వాళ్ళు గుమిగూడి తననే గమనిస్తుండటం చూచి గబుక్కున లేవబోయింది.
”ఆ… ఆ… ఉండు పిల్లా లెవ్వకు నువ్వు గుమ్మొచ్చి పడ్డవని మొగిలిగాడొచ్చి చెప్తే ఉర్కొచ్చి గీడికి తెచ్చినం. ఎందుకు గట్ల పడ్డవే పిల్లా తిండి సరిగా తింటాలేవా ఏంది” అంటూ సుక్కమ్మ ప్రశ్నల వర్షం కురిపించింది.
”ఏదో శాతనైన కాడ్కి సేస్క బత్కక ఎందుకే గింత సిన్నతనానాన గింత కష్టపడ్తుండ్రు పోయి సత్తిబావా కాళ్ళమీద పడి మల్లా ఎట్లనో బత్కుండ్రి అంటూ పెంటమ్మ సలహా ఇచ్చింది.
అప్పటికి నీలమ్మ ఒక్క మాటా మాట్లాడలేదు.
కనకమ్మ కుండలోంచి చల్లనినీళ్ళు తెచ్చిస్తే అవి తాగి కాస్త తెరిపిపడ్డాకా ”అసలు సుద్దేందే పిల్లా” అంటూ మళ్ళీ అడిగింది పోచమ్మ.
నీలమ్మ సిగ్గతో తలదించుకుంటూ నవ్వింది.
నీలమ్మ నవ్వును చూసి అందరికి ఏదో సుద్ది ఉందని అర్థం అయింది. ముసిముసిగా నవ్వుతూ ”మైల అయిత లేదా” అన్నది.
లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపిందేగానీ తల ఎత్తలేదు. ”ఎన్ని దినాలైంది” అంటూ మళ్ళీ అడిగింది. నీలమ్మ బొటనవేలును అరిచేతిలోకి మడిచి చెయ్యెత్తి చూయిస్తుంటే ”ఏయే పిల్లా నాలుగు నెల్లనుంచి గీ సుద్ది దాచినావే అంటూ” బుగ్గమీద పొడిచింది కనకమ్మ.
”ఔనే మొన్న ఈ పిల్ల తల్లిగారింటి నుంచి వచ్చినప్పుడే నేనూ డౌటుపడ్డనే మున్పటికంటే పోల్లా మంచి రంగుదేలి పెయ్యిపట్టలే” అంటూ తన అనుమానం నిజం అయినందుకు సంతోషపడ్డది సుక్కమ్మ.
”గీసుద్ది మీ అమ్మకు ఎర్కనా బిడ్డా” అన్నది దుర్గమ్మ. లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది. ”మల్లా మొగులయ్యకు” అంటూ మళ్ళీ అడిగేసరికి మళ్ళీ అదే సమాధానం.
”ఏందే పిల్ల గిట్లయితే ఎట్లనే” అంటూ బయటికి పోయి ముందుగా  ఈ వార్తను పోచమ్మకి చెప్పి మొగులయ్య దగ్గరకు వచ్చి ”ఓరయ్య నువ్వు అయ్యవైతున్నవురా” అన్నది సంతోషంగా.
మొగులయ్య ఆ మాటవింటునే పట్టరాని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ”గిట్లాంటి సుద్దులు మనకెందుకు సెప్తది ఒదినా అది మీకే ముందుగాళ్ళ సెప్తది. మేమేమన్నా దాని అయినోళ్ళమనా, దాన్ని మొగుడ్ని సాధిసవరిచ్చినమనా లేక దానిని పెండ్లిచేసి ఈడ్ని తోల్కొచ్చినమనా” అంటూ నిష్టూరంగా మాట్లాడేసరికి మొగులయ్య సంతోషం మీద చప్పున నీళ్ళు చిలకరించినట్లయింది.
పోచమ్మ మాటలు అందరి చెవినా పడ్డాయి. సంతోషంగా వెలుగుతున్న ముఖాలు చప్పున ఆరాయి. అక్కడే ఉంటే నోరు యింకా ఎక్కువౌతుందని ఒక్కక్కరే అక్కడ్నించి వెళ్లిపోతుంటే మొగులయ్య ముఖం వెలవెలా పోయింది.
యింట్లోకి పోబోయినవాడల్లా గిరుక్కున తిరిగి గడ్డ దగ్గరకు వచ్చి కసిగా గడ్డపారను భూమిలకి దించాడు. పగలంతా గడ్డ అంతును చూస్తున్నాడే కానీ అతని మనస్సంతా నీలమ్మే నిండింది.
భార్యను తీసుకురావటానికి అత్తగారింటికి వెళ్ళినప్పుడు భార్య కొత్తగా ఎందుకు కన్పించిందో అర్థం అయి సంతోషంతో ఉప్పొంగినా ప్రస్తుత పరిస్థితికి తన మీద తనకే కోపం ముంచుకొచ్చింది.
భార్య నీరసంగా ఇంట్లో పడుంటే కనీసం పలుకరించకుండా తిరిగి వచ్చిన విషయం అతని మనస్సును కలిచేస్తోంది.
ఇప్పుడు ఇంటికిపోతే పోచమ్మ ఏదో ఒక వంకతో తిట్టడం మొదలుపెడ్తుంది. తిట్లు పడటం తనకేమి కొత్తకాదు కానీ ఆ మాటలు నీలమ్మను గాయపరుస్తాయని ఇంటికి వెళ్లకుండా తన అశక్తతను గడ్డమీద చూయిస్తూ గునపాన్ని మరింత జోరుగా భూమిలోకి దించుతున్నాడు.
సాయంసంధ్యలో సూరీడు అమ్మఒడిని చేరినా మొగులయ్య ఇల్లు చేరలేదు. ఇంటి దగ్గర భార్య ఎట్లా ఉందోననే ఆందోళన అందరి మనస్సునూ ఒక్కదగ్గర నిల్వనియ్యకున్నా యింటికి పోక పక్కతోటలో పనిచేసే రాజయ్య దగ్గరకుపోయి పొద్దున జరిగిన సంగతంతా చెప్పి మోకాళ్ళ మధ్య తలదాచుకుని బాధపడ్తూ కూర్చున్నాడు.
మొగులయ్య చెప్పిందంతా విన్న రాజయ్య పక్కున నవ్వి ”ఓ మొగులయ్య యింకా ఎన్ని దినాలు మీ పెద్దనాయినా పెద్దమ్మలకు జంకుకుంట ఉంటవు” అని అంటుంటే మౌనమే సమాధానం అయింది.
”ఇగో మొగులయ్య నువ్వు గిట్ల భయపడుడేంది నువ్వే గిట్లయితే ఆ పోల్ల గతేం కానూ తండ్రివైతున్నవని ఖుషీగుండాలే గానీ నువ్వు గిట్ల రంజిగుంటే ఎట్ల జెప్పు” అని తోటల నుంచి తెచ్చిన మామాడికాయలు చేతిలో పెడ్తు” పో పోయి నీ భార్యను జూసుకో ఎవళ్ళు నీకు తోడుగారు నీ పెండ్లామే అన్నిట్ల నీ ఎంట ఉంటది గామెను మంచిగా చూసుకోవాలే” అన్నాడు.
వాటిని రుమాలులో కట్టుకుని ఇంటిముఖం పట్టాడు. ఇంటికిపోయేసరికి ఇల్లంతా చిమ్మచీకటిగా ఉంది. చీకటిలోనే అగ్గిపెట్టె వెతికి దీపం ముట్టించి భార్య ముఖంలోకి చూశాడు. నీలమ్మ బాగా నీరసంగా సొమ్మసిల్లి పడుకునుంది.
వెంటనే మొగులయ్య బాయి దగ్గరకుపోయి నీళ్ళు తెచ్చి అన్నం వండుతుంటే పోచమ్మ సనుగుడు మళ్ళీ మొదలైంది. పొయ్యిమీద అన్నం కుతకుతా ఉడుకుతుంటే మొగులయ్య మనస్సు పరిస్థితి ఆ విధంగానే ఉంది. అయినా అటు చూడకుండా మామిడికాయలు కోసి తొక్కు నూరుతున్నాడు.
”ఓయ్యో ఇగసూస్తున్నావా ఇడి ఆడి లెక్కలు మనింట్ల ఉన్నప్పుడు గిటు సెంబు గటు పెట్టెటోడు కాడు గిప్పుడు సూడు ఆడిదాని లెక్క ఎట్ల వండి తొక్కునూరుతుండో” అంటూ మొగులయ్యకి వినపడేటట్లే మాట్లాడుతోంది పోచమ్మ.
తొక్కునూరటం పూర్తయ్యాకా గిన్నెలన్ని ఇంట్లోపెట్టి పెద్దమ్మ పెదనాయినల ముందే తలుపులు దడాల్న మూశాడు. అది చూసి సత్తయ్య, పోచమ్మల నోరు మరింత ఎక్కువైంది.
పడుకొని ఆ మాటలన్ని వింటున్న నీలమ్మ భర్త ఎదురుపడగానే అప్పటివరకు ఆపుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. భార్యను ఓదారుస్తూ ఆమె తలను నిమురుతూ పడుకుండి పోయాడు.
    క    క    క
మర్నాటి నుంచి భార్యను గడ్డ దగ్గరకు రావద్దన్నాడు. చాతనైన కాడికి తానొక్కడే గడ్డను తవ్వ నిర్ణయించుకున్నాడు. భార్య ఇప్పుడు ఉత్తమనిషి కూడా కాదు. బరువులు ఎత్తుతుంటే జరగరానిది ఏదైనా జరగొచ్చని మనస్సులో భయపడ్డాడు. వీలైనంత వరకు ఇంట్లో ఉంచ ప్రయత్నించాడు.
కానీ నీలమ్మ ఏదో ఒక వంకతో గడ్డ దగ్గరకు పోయి పనిలో తలదూరుస్తూనే ఉంది. మొగులయ్య వారింపులను చిరునవ్వుతో పక్కనపెట్టింది.
మొత్తానికి వ్యయప్రయాసల కోర్చి అనుకున్నది సాధించాడు. జరగదూ అనుకున్నది జరిగేసరికి సత్తయ్య కళ్ళు మరింత ఎర్రబడ్డాయి. ఇంట్లో ఏదో ఒక వంకతో భార్యభర్తలు మొగులయ్య నీలమ్మలని సాధిస్తూనే ఉన్నారు.
పాలోల్లు మొగులయ్య సాధించిన విజయం సత్తెన్న మీద తమ విజయంగా భావించి లోలోన సంతోషించారు. కానీ కత్తి గట్టినట్లు అతనిని అనుక్షనం సాధిస్తూ వేధింపులకు గురిచేస్తుంటే లోలోనా గొనుక్కుంటూ ఎప్పుడు ఏ అవాంతరం ముందు నిలుపుతాడోనని భయపడ్తూనే ఉన్నారు.
    క    క    క
కూతురు నీళ్ళు పోసుకుందని తెల్సి ఎల్లమ్మ ఆఘమేఘాల మీద వచ్చి నిండుకుండ లెక్కున్న కూతుర్ని కళ్ళారా చూస్తూ ”ఏమయ్య నా బిడ్డకు సిరిమంతం జెయ్యలే నీలమ్మను, నిన్ను నా యింటికి తీస్కపోతా నువ్వుగూడ రాకొడ్కా” అన్నది.
మొగులయ్య అత్తమాట విని ”గట్లనే అత్తమ్మ నీ యిష్టం” అన్నాడు. కానీ తల్లి మాటలు నీలమ్మకు నచ్చలే. ఇప్పుడున్న ఆర్ధిక ఇబ్బందులకు తోడు తానూ తల్లిగారింటికి పోతే మొగులయ్య ఒంటరి అవుతాడని ఆలోచించి ”ఓమ్మ సిరిమంత మొద్దు ఏమొద్దు మా యిద్దరికి కొత్తబట్టలు తెండ్రి చాలు” అన్నది. భార్య ఎందుకట్లా చెప్పిందో మొగులయ్యకు అర్థం అయింది. కూతురు అంత ఖచ్చితంగా చెప్పేసరికి ఎల్లమ్మ ”సరే నువ్వన్నట్లనే జేస్త తీయి బిడ్డా” అన్నది.
ఆ రోజు రాత్రి మొగులయ్య భార్యపై  మరింత ప్రేమకురిపిస్తూ దగ్గరకు తీసుకుని ”నీలా మీ అమ్మకు గట్లెంద్కు సెప్పినవు” అన్నడు. ”ఏం జెప్పిన నయ్య నువ్వు గూడా గాడనే కూకుంటివిగా నీ దగ్గరెమన్నా దాస్తినా” అని కిలకిలా నవ్వింది.
”నేనూ ఒంటరిగాడ్ని అవుతానని నన్ను ఇడ్సిపోనీకి నీ మనస్సు ఒప్పలే కదా” అంటూ కళ్ళలోకి సూటిగా చూశాడు.
”లే గట్లేం కాదు, ఊకేనే నాకు పోబుద్ది కాలే” అంటూ నిద్రొచ్చినట్లు ఆవలిస్తూ అటు తిరిగి పడుకుని లోలోన నవ్వుకుంటుంటే దీపం వెలుగులో భార్యను కన్నార్పకుండా చూస్తూ ఆలోచనలో పడ్డాడు.
”నిరుడు గీ రోజులల్ల నువ్వెవరో నాకు తెల్వదూ నేనెవలనో నీకు తెల్వదూ గానీ తెల్సినంకా నీలా నా బతుకులో సల్లని ఎన్నెలవైనవే, అమ్మ లెక్క, అక్క లెక్క, సెల్లెల్లెక్క నా దోస్తు లెక్క, నా పానం లెక్క నా ఎంటుంటే నాకెంత ధీమాగుందో నీకెర్కేనా” అనుకుంటూ నీలమ్మ కురులను ముద్దాడాడు.
    క    క    క
మర్నాడు రాజు వచ్చి ”అన్నా నిన్ను పిలుస్తుండ్రే” అంటూ మొగులయ్య గుడి దగ్గరకు తీసుకుపోయాడు. గుడి దగ్గరకి ఇద్దరు పోయేసరికి సత్తయ్యతోపాటు మిగతా పాలోల్లంతా ఉన్నారు.
మొగులయ్య ఓ పక్కగా కూకుంటూ ”ఏందే తాతా పిల్సిండ్రంట” అని పెద్దయ్య నడిగాడు.
”ఏం లే బిడ్డా మల్లా నీ పొలం నువ్వు కింద మీదపడి సాగుజేసుకుంటివి ఇంగ నీ పొలంల పంటేసేటట్లు గనవడ్తుంది గిన్ని దినాలంటే మీ పెద్దనాయినా మీ పొలం మొత్తానికి సిస్తు గట్టిండు యింగ గిప్పుడు గట్ల కాదాయే. సెల్కయినా సేనయినా భూమిశిస్తు భూమిశిస్తే ఇంగవోతే బాయిలకెని నీళ్ళు ఊకేనే పొలంలకు రావు. దానికి కరెంటు గావాలే ఇంగ గిప్పట్నించి నువ్వు భూమిశిస్తుతో పాటు కరెంటు బిల్లు గూడా కట్టాలే. గదే సుద్ది నీతోటి మాటాడాలన్నడు మీ పెద్దనాయినా. అహ గది ఆయన మాటగాకున్నా మామాట గూడా అన్కో ఒక పొత్తుల ఉన్నప్పుడు అందరం గల్సి సేస్కుంటేనే మంచిగుంటది కొడ్కా” అని చంద్రయ్య అంటుంటే మొగులయ్య గతుక్కుమన్నాడు.
పొలం తయారుచేసుడు గట్టు తవ్వుడు పనిలో పడి ఆ విషయమే మరిచాడు. పంట పండించాలంటే కరెంటు బిల్లు, భూమి శిస్తూ కట్టాల్సిందే. అది తప్పదు అన్న నిర్ణయానికి వచ్చి ”ఎంతనే” అన్నాడు.
”రెండువేలురా గది గూడా నెలలోపల కట్టాలే” కరుకుగా ధ్వనించింది సత్తయ్య గొంతు.
”సరే కడ్త” అని అక్కడ్నించి లేచి ఇంటికి వచ్చి ఆలోచనలో పడ్డాడు. ”ఇంట్లో ఉన్న రెండు సంచుల వడ్లు అమ్మినా రెండు వేలు రావు. ఎట్ల జెయ్యలే ఇర్కటంలో పడ్తిగా” అని ఆలోచిస్తుంటే నీలమ్మ గమనించి
”ఏందే రాజు వచ్చి తీస్క పోయిండు ఏం సంగతంట” అన్నది. ”ఏమ్లే” అంట అతని సమాధానం. ”ఏమెంద్కులేదు గుడికాడికి పోయొస్తివిగా మల్లెమన్నా తిర్కసుపెట్టిండ్రా” అన్నది కోపంగా.
”లేదే నీలా గట్లెంగాదూ కానీ” అంటూ ఆగాడు. ”సెప్పరాదయ్య నాకు సెప్తె నీది పోయ్యెదేంది” అన్నది. ”ఏమ్లే గా కరెంటు బిల్లు దిక్కెల్లి భూమిశిస్తు దిక్కెల్లి జెప్పిండ్రు గదే ఎట్లాని” సోంచాంచుతున్న అన్నడు.
”ఎంతట” అన్నది.
”రెండువేలు”
”అమ్మో రెండువేలా ఎట్ల జేస్తవయ్య” అని అడిగింది కంగారుగా.
”గదే ఎట్లజెయ్యాలో సమజైతలే” అంటూ బయటికి వెళ్లాడు.
వెంటనే నీలమ్మ సుక్కమ్మ ఇంటికి పరుగెత్తింది.
గబగబా వస్తున్న నీలమ్మను చూసి ”ఏంది పిల్లా గట్లా ఆత్రంగొస్తున్నవేందే” అన్నది.
”ఏమ్లే అత్తమ్మ గియ్యల గుడికాడ అందరు కూకున్నరంటగా నీకు దెల్సా” అన్నది.
”ఔ పిల్ల భూమిశిస్తు కరెంటు దిక్కెల్లి మాట్లాడపోతున్ననన్నడు మీ మామా” అన్నది.
”గదే సుద్ది మాట్లాడనీకొచ్చిన అంత గల్సి రెండుఎయ్యిలు అడ్గుతుండ్రంట గంతలమే ఎట్ల జెయ్యాలని మీ కొడుకు పిస్కాస్తుండు” అని అంటుంటే
”ఇంగో పిల్లా ఎరే ఏ సుద్దిలనన్నా మాట్లాడొచ్చుగాని గివ్వయితే అందరం గల్సి కట్టుకోవాలెగా” అని సుక్కమ్మ అనగానే ఇంటికి తిరిగి వచ్చింది.
మర్నాటి నుంచి మొగులయ్య చెప్పులరిగేలా అప్పుకోసం తిరిగాడు కానీ సత్తెయ్య నుంచి వేరుపడిన మొగులయ్య అప్పు ఎట్లా తీరుస్తాడోనని జంకి అప్పు ఇయ్యటానికి ఎవరు ముందుకు రాలేదు.
”ఇంగో గిట్ల అప్పుదిక్కెల్లి ఎంత గనం తిర్గితిర్గి తిప్పకాయ అయితవు జెప్పు యింగ పైసలియ్యనీకి మనకు ఆరు దినాలే ఉన్నది మీ పెద్దనాయినా మాటంటే మాటే పైసలు గట్టకుంటే మల్లెమన్నా తిర్కసు జెయ్యగల్ల యింత కష్టపడి పొలం జేసినం ఇంగ జెర కష్టపడ్తే అయిపాయే. నేనొక సుద్ది జెప్త నువ్వు ఏమన్కోకు” అంటూ నీలమ్మ తన ఆలోచన చెప్పేసరికి
”ఒద్దు నీలా నువ్వు గట్ల జెయ్యకు పొలం లేకపోతే లేకపాయే” అని ససేమిరా అంటుంటే ”ఇగో గిది నీ మర్జితోటి నువ్వు జేస్తే తప్పు గానీ నా మర్జితోటి నేను జేస్తున్న మావోళ్ళు ఎవళ్ళు నిన్ను తప్పుబట్టరు. ఆళ్ళు ఏదన్నా అంటే నేనూ మాట్లాడ్త. ఇంగ నాదే జిమ్మెదారి నువ్వు గమ్మునుండు” అంటూ పెట్టెతెరిచి మెడ గుండ్లు ఉంగరాలు కొంగుల కట్టుకుని సుక్కమ్మ యింటికి పోయింది.
నీలమ్మను చూస్తూనే ”ఏం పిల్లా మొగిలిగాడికి పైసలు దొర్కినయా” అన్నదామె. ‘లేదత్తమ్మ దొర్కలే గంద్కనే వచ్చినా అంటుంటే, మేము గూడా గట్టలే ఏమన్నా సొమ్ములు గిరివెట్టి వొద్దామనుకుంటున్నా” అన్నది.
”గట్లనా నేనూ గూడా గంద్కనే నీయెంట వొద్దామని వచ్చిన” అన్నది. ఇద్దరు కల్సి మార్వాడి దగ్గరకుపోయి సొమ్ములు గిరిపెట్టి వచ్చారు. సాయంత్రం మొగులయ్య అందరి సమక్షంలో డబ్బులు కట్టి ఇల్లుచేరాడు. ఇంట్లోకి వచ్చేసరికి నీలమ్మ వంటచేస్తూ కన్పించింది. మెడల గుండ్లు లేక చెవులకు కమ్మలులేక ముఖం బోసిపోయినట్లు కన్పించి మనస్సు చిన్నబోయింది.
భర్తకు అన్నం పెడ్తు ”నేను గిట్ల జేసిననని రంజిపడకు మనం సేనేసి పంట పండించిన దినం గింతకన్నా పదింతలు సేయిద్దువుగాని” అంటూ గలగలా నవ్వింది.
మొగులయ్య భార్య మాటలకి మారు మాట్లాడలే. అన్నం కలుపుకుని రెండు ముద్దలు నోట్టోపెట్టుకుంటే అన్నం మింగుడుపడక వెంటనే చేయి కడుక్కున్నాడు.”అయ్యో గట్ల సెయ్యి కడ్గుకున్న వేంది. గియ్యలగిట్ల బువ్వ తినకపోతివి యింగ నీకు యింకెట్ల నచ్చ చెప్తు” అన్నది.
ఆరోజు రాత్రి పడుకున్నాడన్న మాటేగాని మొగులయ్యకు కంటిమీద కునుకులేదు పక్క నీలమ్మ గాఢనిద్రలో ఉంది.
గజిబిజి ఆలోచనలు మనస్సును చుట్టుముడ్తుంటే లేచి కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత నీలమ్మ ఒత్తిగిలి పడుకుంటూ నిద్రలో ఇటు మర్లింది. మొగులయ్య భార్యపై దుప్పటిని కప్పుతూ అస్తవ్యస్తమైన చీరను సర్దపోయాడు. అంతే మొగులయ్య గుండె వేగంగా కొట్టుకుంది.
మెడలో పుస్తె స్థానంలో పసుపు కొమ్ము కట్టి ఉండటం చూసి నిశ్చేష్టుడై దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తుండిపోయాడు. నీలమ్మ నిద్రలో మరింత దగ్గరకు జరిగి మొగులయ్య నడుముచుట్టు చేతులేసి నిశ్చింతగా నిద్రపోతోంది.
క్షణాలు నిమిషాలుగా నిమిషాలు గంటలుగా మారుతున్నాయి. మొగులయ్య అట్లాగే కూర్చొని ఉన్నాడు. తెల్లారిజామున నీలమ్మకి మెలకువ వచ్చిచూసింది. మొగులయ్య పక్కపై అట్లాగే కూర్చుని ఉన్నాడు.
”ఏందయ్య గిట్ల కూకున్నవు” అంది ఆవలిస్తూ.
”ఏమ్లే ఊకనే” అని తల తిప్పుకుంటుంటే
”అదేంది గట్లున్నవు” అని పరిశీలనగా చూస్తూ ”రాత్రి నిద్రపోలే మొకం అంతా గుంజుకుపోయింది” అన్నది.
మొగులయ్య నుంచి ఎలాంటి సమాధానం లేదు.
అతడు అలిగాడని నీలమ్మకి అర్థం అయి ”ఏందయ్య యింకా సొమ్ముల దిక్కెల్లి ఆలోచిస్తున్నవా నేను జెప్పినగా పొలం జేసినంక కమ్మలు, ఒడ్డానం, చేతి కడియం, గుండ్లు పత్తిలు దండె కడాలు గివన్ని చేయించుకుంట తియ్యి” అని పక్కున నవ్వింది. ఆమె ముఖంలోకి దీర్ఘంగా చూసి ”మల్లా పుస్తే” అన్నాడు. ఆ మాట వినగానే స్థాణువైంది.
”చెప్పవేంది మల్లా పుస్తె జేయించుకోవా. సెప్పు నేను ముందే జెప్పినా గిట్ల జెయ్యకని సరే టయిము ఆఖరైందని ఊకున్న గానీ పుస్తె గూడా పెట్టోస్తవా పైసలు ఉంటాయి ఉండయి పంట పండుతుందో పండదోగాని ముందుగాళ్ళనే పుస్తె గిరిపెట్టోచ్చినవు గీ దిక్కుమాలిన పొలం దిక్కెల్లి గీ అర్కతు జెయ్యాల్నా” అని అంటుంటే గొంతు కూరుకుపోయింది.
”అన్ని పెట్టండ గూడ రెండువేల రూపాలు తక్వయినయి గంద్కనే పెట్టినా నాది గలతే కాని ఓయ్య నీకంటే నువ్వు కష్టపడి జేసిన మనం పొలం కంటే నాకు ఏ బంగారం ఎక్వకాదు. పొలంల బంగారం పండిస్తానన్నావు. యాదికుందా ఆ బంగారం పండించే నా మనిషీ నాకు అంతకన్నా ఎక్వ బంగారం గీ బంగారమే నాకండ్ల ముందుండగా యింగ నాకేం తక్వజెప్పు” అంటూ భర్తచేతిని తన చేతిలోకి తీసుకుంటూ, ”నీ మనస్సు రంజిపెట్టినందుకు నాది తప్పే” అంటూ మొగులయ్య చేతులను పట్టి తన చెంపపై కొట్టుకుంటుంటే…
మొగులయ్య చప్పున చేతులను వెనుకకు తీసుకుని కన్నార్పకుండా భార్యనే చూస్తుండిపోయాడు.

(ఇంకా వుంది)

– జాజుల గౌరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

36
ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో