భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

వయోజన విద్యావ్యాపకురాలు, సంఘసేవిక
‘పద్మశ్రీ’  కుల్సుం సయాని
(1900-1987)

భారత జాతీయోద్యమం ఉద్యమకారులను బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించేందుకు మాత్రమే కాకుండా, సమాజ ప్రగతికి ఆటంకం అవుతున్న  సామాజికరుగ్మతలకు  వ్యతిరేకంగా పోరు సల్పడానికి చక్కని ప్రేరణ కల్గించింది.  ప్రధానంగా స్వరాజ్య స్థాపనకు కృషి సాగిస్తూ స్వరాజ్యంలో ప్రజలంతా సుఖశాంతులతో ప్రగతిపథాన నడిచేందుకు అవసరమైన చక్కటి వాతావరణం సృష్టించేందుకు  కృషిచేశారు. ఒకవైపు పరాయి పాలకులకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలకు పరోక్ష సహకారం అందిస్తూ, గాంధీజీ మార్గాన  నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేయటమే ప్రధాన ధ్యేయంగా ఉద్యమించిన మహిళలలో అగ్రగామి శ్రీమతి కుల్సుం.  

గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన కుల్సుం  స్వాతంత్య్ర సమరయోధుల కుటుం బంలో 1900 అక్టోబర్‌ 21న జన్మించారు. మహాత్మాగాంధీ వ్యక్తిగత వైద్యులు, సన్నిహిత మిత్రులు డాక్టర్‌ రజబ్‌ అలీకి ఆమె ముద్దుబిడ్డ. విద్యార్థి థలోనే జాతీయోద్యమం, సమాజ సేవ ఆమెకు పరిచయమయ్యాయి.1917 ప్రాంతంలో తండ్రితోపాటుగా ఆమె  మహాత్మాగాంధీని కలిశారు. ఆ తండ్రీకూతుళ్ళను ప్రేమతో ఆహ్వానించిన గాంధీజీ కొంత కాలం పాటు ఆమెను ప్రముఖ సంఘసేవిక జానకీ దేవి బజాజ్‌ వద్ద ఉండమన్నారు.

ఆ విధంగా మహాత్ముని సన్నిధిలో జానకీ దేవి బజాజ్‌ వద్ద ఉంటున్నప్పుడు, జాతీయోద్యమ కార్యక్రమాలు, సంఘసంస్కరణలో భాగంగా మహత్ముడి మార్గదర్శకత్వంలో ఆరంభమైన కార్యకలాపాల గురించి బేగం కుల్సుంకు ఆమె వివరిస్తూ, ముస్లిం మహిళలలో ప్రధానంగా పర్దానషి మహిళలలో పనిచేయటం చాలా కష్టతరమవుతున్న విషయాన్ని తెలిపారు. ముస్లిం మహిళలను సమావేశపర్చాలని ఎంత కష్టపడి ప్రయత్నం చేసినా పట్టుమని పదిమంది రావటం లేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఆ ప్రతికూలాంశం కుల్సుంలో ఆలోచనలను రగిలించింది. ఆ ఆలోచనలు ఆమెలో లక్ష్యాన్ని నిర్దేశించాయి.    మహిళలలో ప్రధానంగా ముస్లిం మహిళలలో పనిచేయాలని ఆమె  నిర్ణయించుకున్నారు.  ఆ నిర్ణయం మేరకు  మహాత్మా గాంధీజీ సిద్ధాంతాలతో ప్రభావితమైన కుటుంబ సభ్యురాలు కనుక కుల్సుం జాతీయోద్యమంలో భాగంగా గాంధీజీ మార్గదర్శకత్వంలో సంఘ సంస్కరణ కార్యకలాపాల దిశగా ముందుకు సాగారు.

కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌  సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రముఖ స్వాతంత్య్రసమరయోధుడు ముహమ్మద్‌ రహిమతుల్లా సయాని మేనల్లుడు డాక్టర్‌ జాన్‌ ముహమ్మద్‌ సయానీని ఆమె వివాహమాడారు. డాక్టర్‌ సయాని చాలా మృదు స్వభావులు. ఆయన ప్రజల డాక్టరుగా ఖ్యాతిగాంచిన వైద్యులు. డాక్టర్‌ సయాని కూడా ఇటు జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొనటం మాత్రమే కాకుండా అటు ప్రజాసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన  జాతీయ కాంగ్రెస్‌ సభ్యులు మాత్రమే కాక ఖిలాఫత్‌ ఉద్యమ నాయకులు.

వివాహం తరువాత పూర్తికాలం సంఘసేవికగా ప్రజాసేవకు అంకితం కావాలనుకున్న కుల్సుం నిర్ణయాన్ని డాక్టర్‌ సయానీ  బలపర్చడమే కాకుండా మరింతగా  ప్రోత్సహించి ఆమెకు తోడుగా నిలిచారు. ఆయన నుండి లభించిన ప్రోత్సాహంతో ఉత్తేజితులైన కుల్సుం సయాని తాను వివాహానికి ముందుగానే నిర్ధేశించుకున్న లక్ష్యాల సాధనకు ప్రణాళికను తయారు చేసుకున్నారు. మహిళలను చైతన్యవంతుల్ని చేయాలన్న కార్యక్రమాలలో చురుకుగా  పాల్గొన్న  ఆమె మహిళలలో  ప్రధానంగా ముస్లిం మహిళలలో, నిరక్షరాస్యులు అధికంగా ఉండటం గమనించారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు, చైతన్యరాహిత్యానికి ప్రధాన కారణం అవిద్యగా ఆమె గమనించారు. ఆ సమస్యల పరిష్కార దిశగా వయోజన విద్యా ప్రచారోద్యమాన్ని నిర్వహించాలని మహాత్ముడు చేసిన సూచనలతో ఆమె ప్రేరణ పొందారు. ఆ దిశగా నిరక్షరాస్యులలో అక్షరజ్యోతులను వెలిగించేందుకు కుల్సుం సయాని సంకల్పబద్ధులయ్యారు.

1927లో జాతీయోద్యమంలో భాగంగా జరుగుతున్న చర్ఖా క్లాసు సభ్యత్వాన్ని  కుల్సుం స్వీకరించారు. సామాజిక ప్రగతికి ఆటంకమౌతున్న  రుగ్మతల గురించి ప్రజలలో చైతన్యం కలిగించేందుకు ఉద్దేశించబడిన జనజాగరణ  కార్యక్రమాలలో భాగస్వామి అయ్యేందుకు యూనిటీ క్లబ్‌ సభ్యురాలయ్యారు.యూనిటీ క్లబ్‌ సభ్యురాలుగా ఆమె  చూపిన సేవాతత్పరత, కార్యదక్షతల ఫలితంగా క్రమక్రమంగా పలు పదవులను అథిరోహిస్తూ 1930లో ఆమె క్లబ్‌ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ ఆవకాశాన్ని వినియోగించుకుని యూనిటీ క్లబ్‌ నాయకురాలిగా ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలకు ఆమె శ్రీకారం చుట్టారు.  1936లో ఆమె ప్రయత్నాలు గొప్ప మలుపు తిరిగాయి. ఆ సమయంలో జాతీయ కాంగ్రెస్‌ నాయకులు  బాలా సాహెబ్‌ ఖేర్‌ నాయకత్వంలో బొంబాయి ప్రాంతీయ ప్రభుత్వం ఏర్పడింది. ఆయన  వ్యక్తిగతంగా కూడా వయోజన విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. బాలా సాహెబ్‌ ఖేర్‌ వయోజన విద్యా కార్యక్రమాల పట్ల ప్రత్యేక ఆసక్తిగల ప్రముఖులు కావటం కులుస్సుంకు కలసి వచ్చింది.వయోజనులలో అక్షరాస్యతను పెంపొందించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల నిర్వహణ – పర్యవేక్షణ కోసం స్వయంగా తన అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో సహజంగా కుల్సుం సయానికి తొలి సభ్యత్వం లభించింది. ఆమె ఆశయానికి అధికారం కూడా తోడవడంతో  మరింత చురుకుగా ఆమె ముందుకు కదిలారు. ఆ కృషికి గుర్తింపుగా 1939లో ఆమె ఆ కమిటీ ఉపాధ్యకక్షులుగా నియుక్తులయ్యారు.

అప్పటినుండి వయోజన విద్యా కార్యక్రమాలలో ఆమె పూర్తిగా లగ్నమయ్యారు.  ప్రధానంగా మహిళలలో అక్షరజ్ఞానం కలిగించేందుకు ఆమె నడుం కట్టారు. ఆమె ప్రయత్నాలు తొలిథలో ఫలించలేదు. ప్రధానంగా ముస్లిం మహిళలకు నచ్చచెప్పటం ఆమెకు కష్టమైపోయింది. చదువు ఎందుకని ప్రశ్నించే మహిళలకు నచ్చచెప్పేందుకు ఆమె చాలా శ్రమించారు. బొంబాయి నగరంలోని మహిళల సమస్యలు తెలుసుకుంటూ, ఆ సమస్యల పరిష్కారంలో అక్షర జ్ఞానం ఎలా ఉపయోగపడుతుందో వివరిస్తూ క్రమంగా మహిళల విశ్వాసాన్ని చూరగొన్నారు. ఆ తరువాత ఒక్కక్కొరిగా మహిళలతో సంప్రదింపులు జరుపుతూ వారందర్ని సంఘటితపర్చి, అక్షరాస్యత ఆవశ్యకతను అంగీకరింపచేశారు.  వయోజన విద్యా కార్యక్రమంలో భాగంగా అవసరమగు విద్యాసామగ్రిని స్వయంగా మహిళలకు అందచేస్తూ, వారితో కలసి మెలుగుతూ వయోజన విద్యా తరగతులను ఏర్పాటు చేయగలిగారు. ఈ మేరకు బొంబాయి నగరం, ఆ పరిసర ప్రాంతాలలోని పేటలు, మురికివాడలలో నిరంతరం పర్యటిస్తూ, కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ, వయోజన విద్యా వ్యాప్తికి అవిశ్రాంత కృషి ప్రారంభించారు.

ఆ  నిరక్షరాస్యులలో ముస్లింలు అత్యధికులు కావటంతో ఆమె ముస్లిం మహిళల పట్ల ప్రత్యేక శద్థ్రవహించి వయోజన విద్యా, వికాస కార్యక్రమాలలో భాగస్వాములను చేయగలగటంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కార్యక్రమాల పట్ల భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకులు అధిక శ్రద్ధను చూపటంతో స్వార్థ రాజకీయాలు రంగప్రవేశం చేశాయి. ఆమె కార్యక్రమాలకు వ్యతిరేకంగా  ముస్లింలీగ్‌  కార్యకర్తలు అసత్య ప్రచారాలకు దిగారు. ఆమె విూద నిందారోపణలు చేశారు. ముస్లిం జనసముదాయాలలో ఆమె కార్యక్రమాల పట్ల విముఖత కలిగించేందుకు విఫల ప్రయత్నాలు చేశారు. ఖద్దరు ధరించి వయోజన విద్యా కార్యక్రమాల పేరిట ముస్లిం మహిళలను భారత జాతీయ కాంగ్రెస్‌ వైపుకు ఆకర్షిస్తున్నారని కొందరు ముస్లింలీగ్‌ నేతలు భావించారు. అందువలన సమాంతర కార్యక్రమాలను నిర్వహించాలని ఆలోచన కూడా చేశారు.

ఆ ప్రతికూల ప్రయత్నాల వలన కుల్సుం సయాని ఏమాత్రం ప్రభావితం కాలేదు. ఆ దుష్ప్రచారాన్ని  చాలా చాకచక్యంగా ఎదుర్కొన్నారు. అన్ని అవరోధాలను తేలిగ్గా  అధిగమించారు. మహిళల్లో విద్యావ్యాప్తి కోసం ఆమె బొంబాయి నగరంలోని ఐదు అంతస్తుల ఎత్తుగల భవనాలను కూడా  ఎంతో ప్రయాసతో ఎక్కుతూ-దిగుతూ, ఆయా అపార్టుమెంట్లలో దొరికిన కొద్దిపాటి స్థలంలో మహిళలను సమావేశపర్చి వారికి విద్యాబుద్ధ్దులు గరుపుతున్న ఆమెలోని సద్భావన, నిజాయితీ, చిత్తశుద్ధిని ప్రజలు గ్రహించారు. ఆమెకు మద్దతు తెలిపారు. ఆ కారణంగా  స్వార్ధ రాజకీయ వర్గాల  ప్రచారాలు ఆమె ప్రయత్నాలకు ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోయాయి. 

అవాంతరాలు అధిగమించిన కుల్సుం సయాని మరింత ఉత్సాహంతో వయోజన విద్యావ్యాప్తి  కోసం పునరంకితమయ్యారు. ఆమె అవిశ్రాంతంగా సాగించిన కృషి ఫలితంగా 30 సంవత్సరాల కాలంలో సుమారు ఐదు లక్షల మహిళలలో అక్షరజ్యోతులు వెలిగించ గలిగారు. ఆమె అంతటితో  మిన్నకుండి పోలేదు. అక్షర జ్ఞానం గలిగిన మహిళలలో ఆ చెతన్యాన్ని మరింత సుస్థిరం చేయటమే కాకుండా,  జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలను కూడా తెలుసుకోగలిగిన స్థాయికి వారిని చేర్పించాలన్న సంకల్పంతో వయోజన విద్య పూర్తి చేసిన పాఠకులను దృష్టిలో పెట్టుకుని మార్గాన్వేషి అను అర్థ్దం వచ్చే రహబర్‌ అను  ఉర్దూ పక్షపత్రికను ప్రారంభించారు.
 భారతదేశంలో వయోజన విద్యా కార్యక్రమాల ప్రచారం కోసం ప్రారంభించబడిన తొలి పత్రికగా రహబర్‌  చరిత్ర సృష్టించింది. ఈ మేరకు  వయోజన విద్యావ్యాప్తి కోసం పత్రికను నడిపిన విద్యావేత్తగా కుల్సుం ఖ్యాతి గడించారు. ఈ రహబర్‌ పత్రికను దేవనాగరి, గుజరాతీ లిపులలో 1960 వరకు క్రమం తప్పకుండా నడిపారు. వయోజనులకు, ఉద్యమ కార్యకర్తలకు రహబర్‌ కరదీపికగా వెలిసింది. ఆమె స్వయం సంపాదకత్వంలో ప్రచురితమైన రహబర్‌ పత్రిక ఉర్దూ, దేవనాగరి, గుజరాతి లిపులను పాఠకులకు నేర్పడానికి అతి సులువైన పద్దతులను ప్రవేశపెట్టింది. ఆ కారణంగా రహబర్‌ ద్వారా డాక్టర్‌ తారాచంద్‌ లాంటి ప్రముఖ చరిత్రకారులు గుజరాతి లిపిని నేర్చుకున్నట్టు  స్వయంగా ప్రకటించటం విశేషం..
 రహబర్‌ పత్రికను కుల్సుం సయాని కేవలం వయోజన విద్యావ్యాప్తికి మాత్రమే  పరిమితం చేయలేదు. ప్రజలలో జాతీయ భావనలు పెంపొందించడానికి, మతసామరస్యం, హిందూ -ముస్లింల ఐక్యత, స్నేహం,శాంతి, సద్భావనల ప్రచారానికి కూడా రహబర్‌ను సాధనం చేసుకున్నారు. అహేతుక భావనలకు, అర్థంలేని ఆచార, సంప్రదాయాలకు వ్యతిరేకంగా మహిళలను చైతన్యవంతుల్ని చేయడానికి అవసరమగు సమాచారాన్ని సేకరించి రహబర్‌ ద్వారా పాఠకులకు అందించారు. అన్ని మతాల సాంప్రదాయాలను, అన్ని జాతుల సంస్కృతి నాగరికతలలోని విశేషాంశాలను పాఠకులకు అందుబాటులోకి తెచ్చారు. మతాలు, ఆచార సంప్రదాయాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనన్న విశ్వ మానవ సోదరభావాన్ని బలంగా ప్రచారం చేశారు.  ఈ సందర్భంగా సనాతన ఆచార, సంప్రదాయ రక్షకులమని ప్రకటించుకున్న ధార్మిక పండితులు, మౌల్వీలు ఆమె అభిప్రాయాలను వ్యతిరేకిస్తూ ఆమె విూద విమర్శల యుద్ధ్దం ఆరంభించారు. ఆ విమర్శలను ఆమె సహేతుకంగా ఎదుర్కొంటూ, తన అభిప్రాయాలను హేతుబద్దంగా సమర్ధించు కుంటూ దృఢమైన నిర్ణయాలతో కువిమర్శలను, నకారాత్మక చర్యలను సకారాత్మక సమాధానలతో తిప్పిగొట్టారు. కువిమర్శలను పక్కనపెట్టి ప్రజలలో విద్యావ్యాప్తికి, సంఘ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములయ్యేట్టుగా చేయగల నిర్మాణాత్మక కార్యక్రమాల విూద  దృష్టి సారించారు.
సమాజ సమగ్రాభివృద్ధికి వయోజన విద్యావ్యాప్తికి జరుగుతున్న ప్రయత్నాలు మాత్రమే చాలవని భావించిన కుల్సుం సయాని సంస్థల స్థాపనకు ప్రత్యేక కృషి ఆరంభించారు. వ్యక్తుల కంటే వ్యవస్థలు శాశ్వత ఫలితాలను తెచ్చిపెడతాయని ఆమె దృఢంగా నమ్మారు. ఆ నమ్మకంతో విద్యాసంస్థల స్థాపనకు కృషి చేశారు. విద్యావ్యాప్తికి కలసి వచ్చే ప్రజలు, ప్రముఖులతో కలసి ఆమె పలు విద్యాసంస్థల స్థాపనకు తోడ్పాటు అందించారు. ఆ విధంగా రంగం విూదకు వచ్చిన  విద్యాసంస్థలు సక్రమంగా నడవడానికి అవసరమగు ఆర్థిక ఆలంబన సమకూర్చిపెట్టటంలో కూడా ఆమె సహాయసహకారాలు అందించారు.
సమాజ సేవాకార్యక్రమాలలో కూడా భాగం పంచుకుంటూ సామాజిక రుగ్మతలు, మూఢనమ్మకాల విూద పోరాటాలకు మార్గదర్శిగా నిలిచారు. సమాజాభివృద్దికి  మహిళా చైతన్యం అత్యవసరమన్న మహాత్ముని ఉపదేశానికి అనుగుణంగా మహిళా సంక్షేమ, చైతన్య కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. 1943లో అఖిల భారత  మహిళా కాన్ఫెరెన్స్‌ గౌరవ కార్యదర్శిగా నిమమితులయ్యారు. ఆమె భారత దేశమంతటా పర్యటించి మహిళల్లో చైతన్యం కోసం, అక్షరాస్యత అభివృద్ధికోసం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అఖిల భారత  మహిళా కాన్ఫెరెన్స్‌ను పటిష్ట పర్చేందుకు నిరంతరం సాగించిన కృషి ఫలించి 6,500 సభ్యులున్న అఖిల భారత  మహిళా కాన్ఫెరెన్స్‌లో సభ్యుల సంఖ్య కాస్తా ఆమె హయాంలో 33,500కు చేరుకుంది.

 స్వతంత్ర భారతదేశం అవతరించాక భవ్యభారతాన్ని నిర్మించేందుకు తగిన పధకాల అమలులో కూడా ఆమె పాలుపంచుకున్నారు. అవిశ్రాంతంగా సాగిస్తున్న సమాజ సేవ, వయోజన విద్య, సాధారణ విద్యావ్యాప్తిలో సంపాదించిన అనుభవాన్ని వినియోగించు కునేందుకు ప్రభుత్వం పలు కమిటీలు, సంస్థలలో  కుల్సుం సయానికి ప్రముఖ స్థానం కల్పించింది. ఆ సందర్భంగా ఆమె ఫ్రాన్స్‌, చైనా, డెన్మార్క్‌, ఇంగ్లాండ్‌, వియన్నా తదితర దేశాలను పర్యటించారు. మక్కా మదీనాలను సందర్శించారు.1957లో యునెస్కో సమావేశంలో భారత ప్రతినిధిగా పాల్గొని మాట్లాడారు. 1958లో ఆమెను సభ్యురాలుగా ప్రభుత్వం నియమించింది. ఈ విధంగా అటు మహారాష్ట్ర ప్రభుత్వం, ఇతర పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు భారత ప్రభుత్వం ఆమెకు ప్రజాసేవా, వయోజన విద్యా, మహిళా సంక్షేమానికి సంబంధించిన పలు ప్రభుత్వ, ప్రభుత్వేతర కమిటీలలో స్థానం కల్పించి ఆయా రంగాలలో ఆమెకున్న అపార అనుభవాన్ని వినియోగించుకున్నాయి.

సుమారు ఏడు శతాబ్దాలపాటు ప్రజాసేవలో గడిన కుల్సుం సయాని మంచి రచయిత్రిగా కూడా ఖ్యాతి గడించారు. జాతీయోద్యమంలో, వయోజన విద్యావ్యాప్తిలో భాగస్వామిగా మహిళల్లో చైతన్యం కోసం నిరంతరం కృషి సల్పిన ఉద్యమకారిణిగా తన అనుభవాలను, ఆకాంక్షలను, సూచనలను పొందుపర్చుతూ పలు గ్రంథాలను రాశారు. వయోజన విద్య వ్యాప్తి కార్యక్రమాలు, స్వాతంత్య్రోద్యమంలో మహిళల పాత్ర, సమాజసేవ, భారత్‌-పాకిస్థాన్‌ల మైత్రి, తదితర అంశాలను స్పృశిస్తూ, ప్రౌఢ శిక్షా మేరే అనుభవ్‌,  భారత్‌-పాక్‌ మైత్రి మేరే ప్రయత్న్‌, భారతీయ స్వతంత్ర సంగ్రాం మేఁ మహిళావోం కీ భూమిక, భారత్‌ మేఁ ప్రౌఢశిక్షా తదితర గ్రంథాలను ఆమె రాశారు. ఈ గ్రంథాలు బహుళ ప్రజాదరణ పొందాయి.
ప్రజా సంఘాలు, ప్రభుత్వ సంస్థలు  అసంఖ్యాకంగా అవార్డులను సమర్పించుకుని కుల్సుం సయాని సేవలను పట్ల ఉన్న గౌరవాన్ని ప్రకటించుకున్నాయి. 1959లో  భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో ఆమెను గౌరవించింది. భారత దేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా వయోజన విద్యా వ్యాప్తికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 1969లో నెహ్రూ లిటరసీ అవార్డు అందించి భారత రాష్ట్రపతి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గాంధేయ మార్గంలో నిర్మాణాత్మక కృషి సల్పిన ప్రముఖ వ్యక్తిగా భారత ప్రభుత్వం ఆమెను ప్రశంసించింది. 1970లో మహాత్ముడి శాంతి సందేశాన్ని ప్రపంచ వ్యాపితం చేసే ప్రయత్నాలలో భాగంగా పదకొండు దేశాలను కుల్సుం సయాని చుట్టి వచ్చారు. ఆ దేశాలలో శాంతి-స్నేహ సందేశాలను బలంగా విన్పించారు. భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు ఆమె అవిశ్రాంతంగా శ్రమించారు. ఈ మేరకు తాను చేసిన ప్రయత్నాలను వివరిస్తూ ఆమె పుస్తకం కూడా రాశారు.
  ఈ విధంగా  ఒకవైపు జాతీయోద్యమంలో, మరొకవైపు వయోజన విద్యావ్యాప్తికి, ఇంకొక వైపు ప్రజాసేవారంగంలో నిరంతరం శ్రమించి, జనజీవితాలను  మరింతగా చక్కదిద్దేందుకు, సమాజ సమగ్రాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా సంపూర్ణ జీవితాన్ని అంకితం చేసిన వయోజన విద్యావ్యాపకురాలు, అవిశ్రాంత ఉద్యమకారిణి శ్రీమతి కుల్సుం సయాని 1987మే 27న కన్నుమూశారు.

 – సయ్యద్ నశీర్ అహమ్మద్

`~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో