పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2012 సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రకటించి నవంబరు28, 2013న అందజేసారు.మహిళాభ్యుదయం, పత్రికారచన,గ్రంథాలయం ,సంఘసేవ వంటి రంగాల్లో నిష్ణాతులకు ఈ పురస్కారాలను హైదరాబాద్ లో, తెలుగు విద్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రదానం చేసారు.
ప్రముఖ రచయిత్రి ,అనువాదకురాలు ,’విహంగ గ్లోబల్ మాగజైన్’vihanga.org(ఆంగ్ల పత్రిక) సంపాదకవర్గ సభ్యురాలు ‘స్వాతీ శ్రీపాద’ ఉత్తమ రచయిత్రిగా వాసిరెడ్డి రంగనాయకమ్మ స్మారకకీర్తి పురస్కారాన్ని అందుకున్నారు.
స్వాతీ శ్రీపాద ‘గోడలు ‘ కథా సంపుటిపై స్పందిస్తూ కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ఇలా రాసారు.
”పల్లెటూళ్ళలోగాని, పట్టణాల్లోగాని నిత్యజీవితంలో ఎదురయ్యే కుటుంబ సంబంధాల్లోని సంక్లిష్టతల్నీ, స్త్రీ పురుష సంబంధాల్లోని వైరుధ్యాల్నీ మనస్సుని ఆకట్టుకునేట్లుగా చిన్న చిన్న కథలుగా రూపొందించగల మంచి రచయిత్రి శ్రీపాద స్వాతి. అభ్యుదయ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయగల సాహసం ఎంతగా ఉందో సంప్రదాయ జీవన రీతుల్నీ, వ్యక్తిత్వాల్నీ సహజంగా చిత్రించగల ప్రావీణ్యం అంతగా ఉంది ఈమెకి. కొన్ని కుటుంబాలలోని గర్భదారిద్ర్యాన్నీ, భోగభాగ్యాలతో కూడిన జీవన శైలినీ కూడా సాధికారికంగా చిత్రించగల రచయిత్రి ఈమె. ఎటువంటి సందర్భంలోనైనా తెలుగు నుడికారాన్ని అలవోకగా వాడగల అచ్చమైన తెలుగు కథా రచయిత్రి ఈమె. అలాగే, ఆంగ్ల పదాల్ని “అప్పుడో ఇప్పుడో” అవసరానికి మాత్రమే వాడే ఆధునిక రచయిత్రి. ”
గోడలు,మనసుంటే…,పునరాగమనం, ఎక్కడినుంచి …ఇక్కడి దాకా,పాటల మధువని ,అవతలి వైపు పుస్తకాలను రచించారు. ఎన్నో కథలను, కవితలను, ఆంగ్లంనుంచి తెలుగులోకి అనువదించారు.
సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి రచించిన నవలని Sound of Raindrops పేరుతో , రాళ్లబండి కవితాప్రసాద్,k .శివారెడ్డి తదితరుల కవితలని తెలుగులోకి, సుద్దాల అశోక్ తేజ రాసిన నేలమ్మ నేలమ్మా! తదితర తెలుగు పాటల్ని అదే ట్యూన్ లో ఆంగ్లంలో పాడుకునే విధంగా అనువదించారు.
మరిన్ని రచనలు చేస్తూ .. గొప్ప పురస్కారాలను అందుకోవాలని విహంగ మహిళా సాహిత్య పత్రిక ‘స్వాతీ శ్రీపాద’ ని అభినందిస్తోంది.
– విహంగ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~