ఒయినం

Gowri jajula మర్నాడు పొద్దునే బయలుదేరి ఊర్లె దిగేటప్పటికి పన్నెండయ్యింది.

ఊర్లో అప్పటికే అందరు పనులకి వెళ్ళటంతో దార్ల జనం పల్చపల్చగా ఉన్నారు.

మొగులయ్య పెండ్లయినప్పుడు తిరుగుడు మర్గుడు తర్వాత మళ్ళా ఇప్పుడే ఆ ఊరికి రావటం.

దారింట పోయే వాళ్ళు ఈ కొత్త మనిషి ఎవరబ్బా అని తిరిగి తిరిగి చూస్తుంటే కొందరు గుర్తు పట్టి ”నువ్వు సాలయ్య అల్లునివి గదూ బాగున్నావాయ్య నీలమ్మని తీస్కబోను వచ్చినవా యింటికాడ అందరూ మంచిగున్నరా” అంటూ కుశల ప్రశ్నలు వేస్తుంటే అందరికి సమాధానం ఇస్తు అత్తారింటికి వచ్చేసరికి తలుపుకు తాళం వేసుంది.

అది చూడగానే మొగులయ్య ప్రాణం ఉసురుమంది.

అటుఇటు చూస్తే ఎవరు లేరు కొంచెం సేపు అరుగు మీద కూర్చొని విసుగొచ్చి రెండిండ్ల అవతల ఉన్న సంగమ్మ యింటికి పోయి ”అక్కా అక్కా” అంటూ పిల్చేసరికి ”ఎవళ్ళు” అంటూ బయటికొచ్చి ”నువ్వా తమ్మి బాగున్నవా అయ్యొగాడనే నిలవడ్డవేంది యిండ్లకురా” అంటూ కాళ్ళు కడుకొనమని నీళ్ళు ఇచ్చింది చెంబుతో.

మొగులయ్యని చూడంగానే ఆమె ముఖం విప్పారింది. మొగులయ్య కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చేసరికి చాపేసి తాగేందుకు చల్లని నీళ్ళు ఇస్తూ ”ఎన్ని దినాలయ్యె తమ్మీ, యింట్ల అందరు మంచిగుండ్రా” అంటూ అడిగింది.

”అ అందరం మంచిగున్నం అక్కా నీలమ్మను దీస్కబోను వచ్చిన యింట్ల ఎవళ్ళు లేనట్లుండ్రు గంద్కనే అడ్గచ్చినా” అన్నాడు.

”అయ్యొ గట్లనా ఏడికన్నా పోయిండ్రేమో అయినా బుజ్జమ్మ యింట్లనే వుంటదిగానీ ఆడ ఎవళు లేరంటున్నవు ఎడన్నా ఆడుకుంటుందేమో నేను జూసోస్తానుండు అంటూ ఆమె బయటకు పోయి కొద్దిసేపటి తర్వాత బుజ్జితో తిరిగొస్తు

”ఇంగో బుజ్జమ్మ మా తమ్ముడొచ్చిండురా నీలక్కేది” అన్నది.

బుజ్జి, బావను చూస్తూనే సిగ్గుపడి గన్మ దగ్గర నుంచి తిరిగి చూస్తూ ”అక్క బజారుకు సౌదలకు పోయింది అని చెప్తూ, హి… హ్హి…. హ్హి… యింటికి రా బావా” అంటూ కిల్లకిల్ల నవ్వుతూ ఇంటికి పరుగెత్తి లంగా నాడకున్న తాళంగుత్తి తీసి ఇంటితాళం తీస్తుంటే మొగులయ్య వెనకాలే వెళ్ళాడు.

బుజ్జి ఇంట్లోకి పోయి చాపేస్తుంటే

”బుజ్జీ, మీ అక్క ఎప్పుడొస్తది పిల్లా” అంటూ మళ్లీ అడిగేసరికి ”అబ్బా వస్తదన్నగా వస్తది. నువ్వు కూకో” అంటూ బయటకురికింది. 

మొగులయ్య చాప మీద కూర్చున్నాడే కానీ ముళ్ళ మీద కూర్చున్నట్లుంది.

ఊర్లెకి రాగానే భార్య కనబడకపోయే సరికి ఆమెను చూడాలన్న ఆరాటం మరింత ఉధృతమైంది.

నీలమ్మ కోసం దారిలో తీసుకున్న పండ్లు పువ్వులున్న సంచిని పక్కనపెట్టుకుని వాకిలి దిక్కు చూడసాగాడు.

 

చెట్టు కింద పావులాట ఆడుకుంటున్న బుజ్జి అక్క రావటం గమనించి ఎదురుగా పరుగెత్తి చేతిలోంచి సంచిని తీసుకుంటూ ”అక్కా… అక్కా… మనింటికి ఎవలొచ్చిండ్రో తెల్సా” అన్నది సంతోషపడ్తూ.

”ఎవలొచ్చిండ్రు బుజ్జి, ఎవలొచ్చిండ్రు” అని నీలమ్మ అడిగేంతలో ”ఎవలొచ్చిండ్రో నువ్వే పోయి సూడు” అంటూ సంచిని తిరిగి అక్క చేతిలో ఉంచి హి… హ్హి… అని నవ్వుతూ అక్కడ్నించి తుర్రుమన్నది.

చెల్లెల్ని చూస్తూ ”ఎవలొచ్చిన్రబ్బా” అనుకుంటూ ఇంటి దిక్కు గబగబా అడుగులేసి ఇంటి దగ్గరకు పోయి సంచిని అరుగుమీద పెట్టి తొట్టిలోనుంచి నీళ్ళు తీసుకుని కాళ్ళు కడుక్కుంటూ ఇంట్లోకి చూసింది.

ఎదురుగా చాపేసి ఉంది కానీ అక్కడ ఎవరూ లేరు.

”ఎవళు లేరేంది” అనుకుంటూ సంచి తీసుకుని ఇంట్లోకి అడుగుపెట్టగానే తలుపు చాటునుంచి మొగులయ్య నవ్వుతూ ఎదురొచ్చాడు.

భర్తను చూడంగా నీలమ్మ సిగ్గుతో ముడుచుకుపోయి నేలచూపులు చూడసాగింది.

మొగులయ్య భార్య తలపైకెత్తి ”నీలా బాగున్నావా” అంటు మురిపెంగా చూశాడు. బాగున్నా అన్నట్లు తలాడించింది.

”నేను గిన్నిదినాలు రానందుకు కోపమొచ్చిందా” అని అంటుంటే లేదన్నట్లుగా మళ్ళి తల అడ్డంగా ఊపింది.

”మల్లా నువ్వేందుకు నాతోటి మాట్లాడ్తలే” అంటూ భార్యను కళ్ళనిండుగా చూస్తుంటే ఫక్కున నవ్వింది

వెంటనే మొగులయ్య కిందికి వంగి ఏదో వెతుకుతుంటే

”ఏం పడ్డది” అంది కంగారుగా

”ఏంలే నీ నోట్ల నుంచి ముత్యాలు రాల్నాయ అని జూస్తున్న” అంటూ పకపకా నవ్వేసరికి నీలమ్మ భర్తతో శృతికల్పింది.

మొగులయ్య తాను తెచ్చిన పండ్లుపూలు ఇచ్చేసరికి మురిపెంగా వాటిని తీసుకొని పూలను జడలో తురుముకుంటూ యింటి దగ్గరి విషయాలన్నీ అడ్గుతుంటే మొగులయ్య మాట్లాడుతూ భార్యనే గమనిస్తున్నాడు.

నీలమ్మ మునుపటికన్నా ఇప్పుడు మరింత నిండుగా తయారై ఏదో తెలియని వింత అందాలు సంతరించుకున్నట్లు అన్పించింది కానీ ఈ మార్పు ఏంటో మొగులయ్యకి అర్థం కాలేదు.

నీలమ్మ కూడా భర్తతో ఆమాటా ఈమాటా మాట్లాడుతూ తదేకంగా చూస్తోంది. మనిషి మునుపటి కన్నా బాగా చిక్కిపోయాడు కానీ తెలియని పెద్దరికమేదో మాటలల్లో చేతలల్లో కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది.

ఇద్దరి చూపులు ఒక్క దగ్గర ముడిపడేసరికి భార్యను దగ్గరకు తీసుకొని ఆర్తిగా గుండెలకు హత్తుకున్నాడు.

మూడునెలల ఎడబాటు తర్వాత భర్త బంధనంలో మొగ్గలా ముడుచుకు పోయిందామె.

నీకు నేనున్నాననే స్పర్శ తగిలేసరికి మనస్సులో చెలరేగుతున్న పెనుతుఫాను ఒక్కసారే ఆగినట్లయి మొగులయ్య మనస్సు ప్రశాంతంగా మారింది.

రెండు రోజులు అత్తగారింట్లో ఉండి మూడోనాడు భార్యను తీసుకొని యింటికి బయలుదేరాడు.

**                     **                                 **                                    **                                    **

నీలమ్మ అత్తారింటికి వచ్చి వారం రోజులైనా చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు ఎవ్వరు ఆమెతో మాట్లాడలేదు.

నీలమ్మ వారిని పలుకరించబోయినా పనున్నట్లు పక్కకు తప్పుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పొడిపొడిగా మాట్లాడుతున్నారు.

మొగులయ్య పొద్దున పొలం దగ్గరకు పోతే రాత్రికే ఇంటికి వస్తున్నాడు. వారం క్రితం తననూ తీసుకురావటానికి వచ్చిన రోజున్న హుషారు ఇప్పుడు అతనిలో మచ్చుకైనా కన్పించటం లేదు. కారణం ఏమిటో అర్థం కాలేదూ కానీ ఏదో జరిగింది అనే విషయం మాత్రం అర్థం అయింది.

”సంగతేంటో తెల్సుకోవాలి” అనుకొని ఓరోజు మధ్యాహ్నం అన్నం మూట తీసుకుని పొలంకీ బయలుదేరింది. పొలం దగ్గరకు నీలమ్మ చేరేసరికి మొగులయ్య చెల్కలో రాళ్ళురప్పలు తొలగిస్తూ కన్పించాడు.

అది చూసేసరికి నీలమ్మకు మొదట ఏమీ అర్థంగాక అట్లాగే నిలబడి పోయింది. మొగులయ్య పనిలో మునిగి భార్యను గమనించలేదు. గడ్డపార తీసుకొని పెద్ద బండరాయిని దొర్లిస్తున్నాడు. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దౌతున్నా.

(ఇంకా వుంది)

– జాజుల గౌరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో