భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు


మత కలహాల మధ్యకు నడిచిన అహింసాయోధురాలు
బీబీ అమతుస్సలాం
(1907-1985)

             స్వాతంత్య్రోద్యమ చరిత్రలో భాగంగా పరాయి పాలకుల బానిసత్వం నుండి గాంధేయ మార్గాన మాత్రమే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు సాధ్యమని భావించి మహాత్ముని సాన్నిహిత్యంలో జీవితచరమాంకం వరకు గడిపిన మహత్తర చారిత్రక ఆవకాశం  అతికొద్ది మందికి మాత్రమే దక్కింది. అటువంటి అద్భుత అవకాశాన్ని సొంతం చేసుకున్న అదృష్టవంతులలో ప్రముఖస్థానం ఆక్రమించారు బీబీ అమతుస్సలాం.               

భారత జాతీయోద్యమం పట్ల అపార గౌరవాభిమానాలను ఆచరణలో వ్యక్తం చేసిన పాటియాలా రాజపుఠాణా పరివారంలో 1907లో బీబీ అమతుస్సలాం జన్మించారు. తల్లి పేరు అమతుర్రెహమాన్‌. తండ్రి కల్నల్‌ అబ్దుల్‌ హవిూద్‌ పాటియాలా సంస్థానంలో ఆర్థిక మంత్రి. ఆయన 1920 ప్రాంతంలో కన్నుమూశారు. ఆరుగురు అన్నదమ్ములకు ఏకైక చెల్లెలిగా అమతుస్సలాం గారాబంగా పెరిగారు.

           చిన్ననాటి నుండి స్వేచ్ఛా స్వభావాన్ని వ్యక్తం చేసిన ఆమె సమకాలీన సమాజాన్ని ఆధ్యయనం చేసి పురాతన రీతి రివాజులను అహేతుక ఆచార, సంప్రదాయాలను వ్యతిరేకించారు.  సామాజిక, రాజకీయ సమస్యల పట్ల మంచి అవగాహన కలిగి ఉన్నా, శారీరకంగా చాలా బలహీనం కావటంతో ఆమెకు ఆరోగ్యం అంతగా సహకరించేది కాదు.  అమతుస్సలాం 1930-1931 ప్రాంతంలో మహాత్ముని సేవాగ్రాం ఆశ్రమం వచ్చి చేరారు. పాటియాలా సంస్థానంలోని సనాతన ముస్లిం కుటుంబంలోని ఏకైక పుత్రిక ఆశ్రమంలోకి ఎలా వచ్చారన్న విషయం ఆసక్తిదాయకం. ఈ క్రమాన్ని  బాపూ కే సాత్‌  అను వ్యాసంలో ఆమె స్వయంగా వివరించారు. ఆ కథనం ఇలా సాగింది.

                 నా 13 సంవత్సరాలు వయస్సులో నేను ఖురాన్‌ మజీద్‌ను అనువాదంతో సహా పఠించాను. కొన్ని ధార్మిక గ్రంథాలను కూడా అధ్యయనం చేశాను. మా కుటుంబంలో పర్దాను కఠినంగా అమలు చేసేవారు. స్వంత అన్నదమ్ముల ఎదుట కూడా సంచరించడానికి అనుమతి లభించేదికాదు. ఆ కారణంగా స్కూలుకు వెళ్ళే ప్రశ్న తలెత్తలేదు. నాన్న నన్ను అలీఘర్‌లోని బాలికల స్కూలుకు పంపాలనుకున్నారు. జాతి అభివృద్ధి నిమిత్తం  సామాజిక ఆంక్షలను ఉల్లంఘించగల సాహసం ఆయనకుంది. ఆయన మరణించటంతో దురదృష్ట వశాత్తు ఆ ఆవకాశం నాకు లభించలేదు. ఆయన ఆకస్మికంగా మృత్యువాత పడ్డారు. ఆ కారణంగా నా చదువు ఉర్దూ రాయటం, చదవటం వరకు పరిమితమైంది.

             నా పెద్దన్న  ముహమ్మద్‌ అబ్దుర్రషీద్‌ ఖాన్‌ జాతిజనుల సేవచేయాలన్న ఆలోచనలను నాలో కల్గించారు. బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1920లో సాగిన ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. నా వివాహాన్ని త్వరితగతిన చేయాలనుకుంటున్న మా ఆమ్మకు చిన్న వయస్సులో నా వివాహం చేయటం మంచిది కాదని ఆయన నచ్చచెప్పారు.  ఒకవేళ నీవు నామాట వినకుండా చెల్లెలి వివాహం  చేయదలచుకుంటే తాను ఆ వివాహానికి రానన్నారు. ఆ హెచ్చరికతో చిన్నన్నయ్యల ప్రమేయం లేకుండా పోయింది. అప్పటికి నా వివాహప్రయత్నాలు ఆగిపోయాయి. చిన్నప్పటి నుండి విలాసవంతంగా గడపటం, విలువైన వస్త్రాలు, ఖరీదైన ఆభరణాలు ధరించటం అంటే అయిష్టత ఉండేది. నా ఎదుట ఒక లక్ష్యంగాని, నా ఇష్టాయిష్టాలను అమ్మతో, అన్నయ్యలతో వ్యక్తంచేయగల సాహసం గాని  లేదు. ఏకైక కుమార్తె కోసం అమ్మ ఎల్లప్పుడూ మంచి మంచి దుస్తులు, ఆభరణాలు తయారు చేయించేది. అవి నాకు నచ్చేవి కావు. చిన్ననాటి నుండి నా ఆరోగ్యం అంతగా మంచిది కాదు.

సబర్మతీ ఆశ్రమం వెళ్ళేముందు నేను టి.బి వ్యాధికి గురయ్యాను. ఈ మధ్యలో మళ్ళీ అమ్మ నా పెండ్లి గురించి పెద్దన్నయ్య విూద ఒత్తిడి తీసుకురా సాగింది. బొంబాయిలోని మా కుటుంబ వైద్యులు డాక్టర్‌ బలమౌర్యను ఆయన సంప్రదించారు. నిరంతరం జ్వరంతో భాథపడుతూ అమె వివాహం చేసుకోవటం ప్రమాదకరమని, మూడేండ్లు జ్వరం రానట్టయితే వివాహం చేయవచ్చని ఆయన ఆన్నారు. ఆ ఆవకాశాన్ని  నేను దొరకపుచ్చుకుని ఆరోగ్యం చెడగొట్టు కోసాగాను. ఆ దుష్ఫలితాలను ఈనాటికి కూడా నేను అనుభవిస్తున్నాను.

          ఇరవై సంవత్సరాల వయస్సులో నా ఆరోగ్యం కొంత కుదుటపడటంతో అన్నయ్యలు నా పెళ్ళి ప్రయత్నాలను మళ్ళీ ప్రారంభించారు. నా ఇష్టాయిష్టాలు ఎవ్వరికీ పట్టలేదు. ఆ అనివార్య పరిస్థితులలో విూకు ఎక్కడ మంచిది అన్పిస్తే అక్కడ నా వివాహం  చేయండి. అయితే నా భర్త రెండవ పెండ్లి చేసుకోడానికి నా పూర్తి అనుమతి ఉంటుందని నా అభిమతాన్ని నేను ప్రకటించాను. నా అభిప్రాయంతో అన్నయ్యలకు ఏకీభావన ఉన్నా, తండ్రి మరణానంతరం  ఆరుగురు అన్నదమ్ములు ఉండి కూడా చెల్లెలు వివాహం చేయలేదని సమాజం ఎత్తిపొడుస్తుందని భయం కూడా ఉంది.

        మా పెద్దన్నయ్య అబ్దుర్రషీద్‌ ఖాన్‌ 1922లో జిల్లా కాంగ్రెస్‌ కమిటి అధ్యకక్షులయ్యారు. ఆయన ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆరు మాసాలు జైలుశిక్షకు గురయ్యారు. నేను బుర్ఖా ధరించి అంబాలాలోని వీధుల్లో తిరిగి ఖద్దరు ప్రచారం చేయసాగాను. పలు సమావేశాలు, సభలకు హజరు కాసాగాను. బేగం ముహమ్మద్‌ అలీ జౌహర్‌, ఆయన తల్లి బీబీ అమ్మల పర్యటనలు తరచుగా పంజాబులో జరిగేవి. ఆ పర్యటనల ప్రభావం నావిూద ఉండేది. ప్రజాసేవ చేయాలన్న ఉత్సాహం పెరగసాగింది. మా అన్న ఆరు మాసాలు జైలులో ఉన్నప్పుడు మా పిల్లల శరీరాల విూద ఖద్దరే ఖద్దరు కన్పించింది. అమ్మ చాలా సున్నితం. అందువలన ఆమె ఖద్దరు ధరిస్తే ఆమె నాజూకు శరీరం గాయాలమయమయ్యేది. ఖిలాఫత్‌ ఉద్యమం సందర్భంగా  హిందూ-ముస్లింలలో  వ్యక్తమైన ఏకతా భావనను మరువలేను. బాపూ 21 రోజులపాటు నిర్వహించిన వ్రతం నా హృదయం విూద గాఢమైన ప్రభావం వేసింది.

నా ఎదుట భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తాయి. వివాహం చేసుకోదలచుకో లేదు, అయితే జీవితానికి ఏదో లక్ష్యం ఉండాలి.  బాపూ నిర్వహిస్తున్న పలు ఆందోళనా కార్యక్రమాల గురించి వార్తా పత్రికల ద్వారా తెలుసుకుంటున్నాను. దండి యాత్రలో పాల్గొనాలని ఆసక్తి కలిగింది. స్వయంగా స్వేచ్ఛను కోల్పోయినదానను. ఆందోళనా కార్యక్రమాలలో పాల్గొనటం ఎలా సాధ్యం?…బ్రిటీషు వారి బానిసత్వంలో న్యాయవాద వృత్తి చేయకూడదని అన్నయ్య అబ్దుర్రషీద్‌ నిర్ణయించుకున్నారు. ఆయన స్నేహితుడు ఆయనను  ఇండోరు మహారాజు కార్యదర్శిగా ఇండోరు తీసుకెళ్ళారు. 

ఆ క్రమంలో అమతుస్సలాం దేశసేవలో గడపాలని నిశ్చయించుకున్నారు. ఇండోరు వెళ్ళక ముందు జాతీయోద్యమకారుడైన అబ్దుర్రషీద్‌ జాతీయోద్యమం విశేషాలను అమతుస్సలాంకు వివరించేవారు. జాతీయ భావాలను ఉద్భోదించే గ్రంథాలను ఆయన ఇంటికి తెచ్చేవారు. ఆ గ్రంథాలను, వార్తాపత్రికలను చదువుతూ జాతీయోద్యమం పట్ల ఆమె ఆసక్తి పెంచుకున్నారు. గాంధీజీ గురించి, అలీ సోదరుల తల్లి ఆబాది బానో బేగం, ముహమ్మద్‌ అలీ భార్య అంజాది బానో బేగం  సేవల గురించి పత్రికల ద్వారా తెలుసుకున్నారు.

మహాత్ముని అహింసా సిద్థాతం, ఆయన వ్యక్తిత్వం పట్ల  అమతుస్సలాం బాగా ఆకర్షితులయ్యారు. ఆయన రాసిన ఆత్మకథను కూడా ఎంతో ఆసక్తిగా చదివారు. ఆ పుస్తకం ఆమెలో నూతన ఉత్తేజాన్ని కలిగించింది.  భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆమెకు నూతన మార్గం గోచరించింది. ఆ ప్రభావంతో మహాత్ముని బాటలో పయనించాలని ఆమె నిశ్చయించుకున్నారు. ఆ సమయంలో మహాత్ముడు సబర్మతీ ఆశ్రమంలో ఉన్నారు. అమె కూడా సబర్మతి ఆశ్రమంలో చేరాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆమె అనారోగ్యం అందుకు అడ్డుగా నిలచింది. ఆ కారణంగా, ఆశ్రమ జీవితంలోని కఠిన నియమనిబంధనల మూలంగా ఆమెకు ఆశ్రమ ప్రవేశం సులభంగా లభించలేదు.        

 ఈ విషయాన్ని కూడా ఆమె వివరించారు. ఆ వివరణ ప్రకారంగా, నేను సబర్మతీ ఆశ్రమం వెళ్ళదలిచానని అన్నయ్యలతో చెప్పాను. ఓ నవ్వునవ్వి వారు ఊరకున్నారు. నా ఇబ్బంది ఏమిటంటే నాకెవ్వరూ తెలియదు. బాపూతో కూడా ఎప్పడూ కలవలేదు. తరచుగా విూరాబెన్‌ పేరు మాత్రం చదివాను. ఆమెకు లేఖ రాశాను. చాలా కాలం ఎదురు చూశాక,  విూరు ఇక్కడకు రావటంలో ఉద్దేశ్యం ఏమిటీ అని ప్రశ్నిస్తూ , మా ఇంటి విషయాలు అడుగుతూ ఆశ్రమ నిర్వహకులు నారాయణ దాస్‌ గాంధీ నుండి ఉత్తరం వచ్చింది. ఇంటిలో ఎవ్వరూ బాధపడరు కదా అంటూ నా ఆరోగ్యం గురించిన మెడికల్‌ సర్టిఫికేట్‌ను ఆయన అడిగారు.

అబద్ధాలు చెప్పి ఫ్యామిలీ డాక్టరు నుండి తప్పుడు సర్టిఫికేట్‌ సంపాదించి ఆశ్రమంలో చేరటం ఆనాడు అమతుస్సలాంకు అంత కష్టం కాదు. అయినా ఆమె నిజాలు నిర్భయంగా తెలిపి ఆశ్రమంలో చేరాలనుకున్నారు. ఆపాటికి ఆమెను పట్టిపీడిస్తున్న టి.బి. తగ్గిపోయింది. ఆ విషయం పేర్కొంటూ సర్టిఫికేటు ఇవ్వాల్సిందిగా ఆమె తమ కుటుంబ డాక్టర్‌ను ఆభ్యర్థించి సర్టిఫికేట్‌ సంపాదించారు. ఆ సర్టిఫికేటులో నాలుగు ఏండ్ల నుండి ఆమె నా వద్ద టి.బి. వ్యాధికి చికిత్స తీసుకుంటుంది. ప్రస్తుతం ఆ వ్యాధి నయమైంది. అయితే ఆమె దేహం ఆశ్రమ నియమనిబంధనలకు తట్టుకోలేదు అని డాక్టర్‌ రాశారు. ఆ సర్టిఫికేటుతో తన అభ్యర్థ్ధన పత్రాన్ని ఆమె సబర్మతీ ఆశ్రమం పంపారు. ఆ అభ్యర్థన పత్రంతోపాటుగా విూతోపాటుగా నేను కూడా దేశసేవ చేయాలను కుంటున్నాను. శారీరక బలం లేని కారణంగా నాకు అనుమతి లభించటంలేదు.  ఈ విషయమై విూరు దయ ఉంచాలి అని గాంధీజీని వేడుకుంటూ అమతుస్సలాం  ప్రత్యేకంగా లేఖ రాశారు.

ఆ తరువాత కూడా చాలా కాలంవరకు ఆశ్రమం నుండి జవాబు రాలేదు. ప్రత్యుత్తరం కోసం ఎదురు చూస్తూ క్షణమొక యుగంగా ఆమె గడపసాగారు. చివరకు సమాధానం  వచ్చింది. ఆ లేఖలో మిమ్మల్ని ఆశ్రమంలో చేర్చుకోలేము. ఆశ్రమ జీవితం చూడాలనుకుంటే మాత్రం విూరు అతిధులుగా ఇక్కడకు రావచ్చును అని పేర్కొన్నారు. అతిథిగా అనుమతించటమే చాలనుకున్న ఆమె సబర్మతి వెళ్ళేందుకు సోదరులను డబ్బు అడగకుండా  బలవంతంగా అమ్మ ధరింపచేస్తున్న ఆభరణాలను విక్రయించి, వచ్చిన డబ్బును ప్రయాణఖర్చులకు ఉపయోగించుకుని  ఆశ్రమం చేరారు. ఈ విధంగా గాంధీజీ సన్నిహిత వర్గంలో స్థానం పొంది, స్వాతంత్రోద్యమ చరిత్రలో ప్రత్యేకతను సంతరించుకున్న గాంధేయవాది అమతుస్సలాం ఆటంకాలన్నీ అధిగమించి తన 25 సంవత్సరాల వయస్సులో సబర్మతీ ఆశ్రమనివాసి అయ్యారు.
 

– సయ్యద్ నశీర్ అహమ్మద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో