భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

  జైలుకెళ్ళక పోవటం అపచారంగా భావించిన 
బేగం ఖుర్షీద్‌ ఖ్వాజా
(1896-1981)

జాతీయోద్యంలో జైలుకు వెళ్ళటం బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించారు. జైలుకు ఎప్పుడెప్పుడు పోదామని ఎదురు చూశారు. ఏ కారణంగానైనా అరెస్టు కాకపోవటం, జైలుకు వెళ్ళక పోవటం పెద్ద అపచారంగా పరిగణించారు. జైలుకెళ్ళకపోవటం అపచారంగా భావించి జైలుకెళ్లాక ఆనందాన్ని వ్యక్తం చేసిన కుటుంబాలు ఆనాడు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఉద్యమస్ఫూర్తిగల కుటుంబ సభ్యురాలు బేగం ఖుర్షీద్‌ ఖ్వాజా.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌ నగరంలో బేగం ఖుర్షీద్‌ ఖ్వాజా 1896లో జన్మించారు. ఆమె తండ్రి సర్‌ బులంద్‌ జంగ్‌. ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆమె తాత సవిూవుల్లా. ఆయన సర్‌ సయ్యద్‌ గా ప్రఖ్యాతి చెందిన సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌ ఖాన్‌ సన్నిహిత మిత్రులలో ఒకరు.

స్వగృహంలో బేగం ఖుర్షీద్‌ సాంప్రదాయక విద్యను పూర్తి చేశారు. తండ్రితో పాటుగా హైదరాబాదులో నివాసం ఉన్నప్పుడు ఆమెకు సరోజిని నాయుడుతో పరిచయమయ్యింది. ఆ పరిచయం ద్వారా ఆమె స్వేచ్ఛా, స్వాతంత్య్ర భావాలతో ప్రభావితులయ్యారు.ఆ క్రమంలో జాతీయోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు.1920లో ఆమె ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సభ్యులయ్యారు. ఆనాటి నుండి 1981లో కన్నుమూసే వరకు ఆమె కాంగ్రెస్‌ సభ్యురాలుగా ఉన్నారు.
బేగం ఖుర్షీద్‌ అలీఘర్‌కు చెందిన న్యాయవాది ఖ్వాజా అబ్దుల్‌ మజీద్‌ను వివాహం చేసుకున్నారు. భర్త మజీద్‌ జాతీయోద్యమకారులు. వివాహానంతరం భర్తతో కలిసి ఆమె జాతీయోద్యమంలో ప్రత్యక్షంగా  ప్రవేశించారు. 1921 డిసెంబరు 24, 25 తేదిలలో హైదరాబాద్‌ నగరంలో  జరిగిన ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సమావేశాలలో ఆమె ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రతినిధిగా భారత జాతీయ కాంగ్రెస్‌ సబ్జెక్ట్‌ కమిటీకి ప్రాతినిధ్యం వహించారు. ఆ సమావేశాలలో బేగం హసరత్‌ మోహాని, బేగం ముహమ్మద్‌ అలీ, కమలా నెహ్రూ, స్వరూపరాణి నెహ్రూలతో కలిసి ఆమె పని చేశారు.

జాతీయోద్యమంలో ప్రవేశించాక ఎదురైన మానసిక, ఆర్థిక కష్టనష్టాలను చిరునవ్వుతో భరిస్తూ లక్ష్యసాధనపట్ల దృఢచిత్తంతో ముందడుగు వేసిన బేగం ఖుర్షీద్‌ ప్రజల, ప్రజా నాయకుల ప్రశంసలు అందుకున్నారు. ఖిలాఫత్‌-సహాయ నిరాకరణోద్యమ కార్యకలాపాలలో అవిశ్రాంతంగా పాల్గొంటూ పలువురికి ఆదర్శమయ్యారు. ఈ సందర్భంగా అరెస్టుకావటం, జైలుకెళ్ళటం ప్రతి ఉద్యమకారుని కర్తవ్యంగా ప్రకటించారు. ఈ మేరకు గాంధీజీకి లేఖ రాస్తూ అందులో నా భర్త  సహచరులంతా జైళ్ళకు వెళ్ళారు. నా భర్త మాత్రం ఇంత వరకు స్వేచ్ఛగా ఉండటం పట్ల మాకు బాధగా ఉంది అని పేర్కొన్నారు. ఆ భావనల నేపధ్యంలో బేగం ఖుర్షీద్‌ బాధామయ వాక్యాల విూద గాంధీజీ వ్యాఖ్యానం చేస్తూ, నిజమైన నిబద్ధతతో కూడిన భావనలు ఇలా ఉంటాయి.  స్వాతంత్య్రం కోసం  స్త్రీ, పురుషులంతా ఇలాగే జైళ్ళను నింపటానికి సంతోషంగా ముందుకు వచ్చిన రోజున స్వరాజ్యం తప్పక లభిస్తుంది ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. 

ఖ్వాజా అబ్దుల్‌ మజీద్‌, బేగం ఖుర్షీద్‌ దంపతుల త్యాగగుణ సంపన్నతను వివరిస్తూ, మహానీయురాలైన ప్రతిష్టాత్మక ధర్మపత్ని అను శీర్షికతో గాంధీజీ రాసిన వ్యాసంలో  సుఖభోగాలను వదలి బేగం ఖుర్షీద్‌ కుటుంబం సాదాసీదా ఉద్యమకారుల జీవితాన్ని చేప్టటం, ఆ విధంగా ఆ దంపతులు చేసిన త్యాగం, ఆమె భర్త ఖ్వాజా అబ్దుల్‌ మజీద్‌ గుణగణాలను ప్రస్తుతించారు. బేగం ఖుర్షీద్‌  కార్యనిర్వహణాదీక్ష, జాతీయోద్యమ లక్ష్యాల పట్ల ఉన్న నిబద్ధత గురించి గాంధీజీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.సహాయనిరాకరణ ఉద్యమం సందర్భంగా ఉద్యమకారులంతా అరెస్టులవుతూ తాను తన భర్త ఖ్వాజా అబ్దుల్‌ మజీద్‌ అరెస్టు కానందుకు ఎంతో చింతిస్తూ వచ్చారు. చివరకు తన భర్త  అరెస్టు కాగానే సంతోషం వ్యక్తం చేస్తూ ఆ విషయాన్ని టెలిగ్రాం ద్వారా గాంధీజీకి తెలిపారు. ఆ టెలిగ్రాం అందుకున్న గాంధీజీ బేగం ఖుర్షీద్‌ ఉద్యమ స్ఫూర్తిని ప్రశంసిస్తూ ప్రతిష్టాత్మక మహానీయుని ధర్మపత్ని అను శీర్షికతో మరో వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో ప్రభుత్వం నా భర్తను అరెస్టు చేసిందన్న విషయం తెలుసుకున్న విూకు ఆనందం కలిగి ఉంటుంది అని బేగం ఖుర్షీద్‌ ఆయనకు రాసిన లేఖలో పేర్కొన్నట్ట్టు గాంధీజీ  తెలిపారు.  

ఈ అరెస్టు సమయంలో ఖ్వాజా అబ్దుల్‌ మజీద్‌ జాతీయ విశ్వవిద్యాలయం జామియా మిలియా ఇస్లామియా కులపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కళశాలలు బహిష్కరించిన, ప్రభుత్వ సహాయం నిరాకరించిన విద్యాసంస్థలలోని విద్యార్థుల కోసం, జాతీయ భావాలను ప్రచారం చేయడానికి ఆచరణాత్మక విద్యాభోధన గావిస్తున్న జామియా మిలియాను ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆయన అరెస్టు జరిగింది. ఆయన అరెస్టుతో ఉద్యమ కార్యకలాపాలు ఆగిపోరాదని బేగం ఖుర్షీద్‌ వాంఛించారు. ఆ విషయాన్ని కూడా గాంధీజీకి తెలియచేస్తూ,  నా భర్త గైర్హాజరీలో జామియా మిలియా ఇస్లామియా కార్యకలాపాల బాధ్యతలనన్నిటినీ నేను నిర్వహించేందుకు కృషి చేస్తాను అని రాశారు. ఈ మేరకు ఆమె భర్త అరెస్టువలన జాతీయోద్యమ కార్యకలాపాలు కుంటుపడరాదని  భావించి భర్త పక్షాన ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టి జాతీయ భావాలకు పుట్టినిల్లుగా నిలచిన జామియా మిలియా ఇస్లామియా విద్యా కేంద్రం కార్యకలాపాలను ఆమె పర్యవేక్షించారు.

జాతీయ భావాలను ప్రచారం గావించేందుకు, దేశభక్తి భావనలను ప్రోదిచేయడానికి అలీఘర్‌ కేంద్రంగా ఆమె హింద్‌  అను ఉర్దూ మాసపత్రికను 1921లో ప్రారంభించి, ఆ పత్రిక సంపాదకత్వ బాధ్యతలను చేపట్టారు. ఆ పత్రిక ద్వారా దేశభక్తి భావనల ప్రచారం, బ్రిటీషు ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని  సమర్థ్ధవంతంగా నిర్వహిస్తూ  బ్రిటీష్‌ ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు.
 

మహిళల్లో విద్య ఆవశ్యకతను గ్రహించిన ఆమె, ఆ దిశగా  చాలా శ్రద్ద చూపారు. మహిళలు చదువుకుంటే తప్ప సమాజంలో ప్రగతి సాధ్యం కాదని ఆమె నమ్మకం. జాతీయోద్యమం విజయవంతం కావాలంటే మహిళల్లో చైతన్యం రావాలనీ అది అక్షర జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమౌతుందని ఆమె విశ్వసించారు.  ఈ మేరకు తన విశ్వాసాన్ని ఆచరణలో చూపేందుకు ఎంతగానో శ్రమించారు. ప్రజలలో అక్షర జ్ఞానం కల్గించేందుకు ప్రచార కార్యక్రమాల కంటే విద్యా వ్యవస్థల నిర్మాణం ద్వారా ఆ లక్ష్యాలు సాధ్యమౌతాయని ఆమె తలిచారు. ఈ మేరకు  1930లో అలహాబాద్‌లో ఆడపిల్లలు, మహిళల కోసం   హవిూదియా బాలికల  సెకండరీ స్కూల్‌  స్థాపించారు. ఆ విద్యాసంస్థ ఆమె కళ్ళ ఎదుట  మహిళలలో విద్యాసుగంథాలను వెదజల్లుతూ క్రమక్రమంగా కళాశాల స్థాయికి ఎదిగింది.

ఖద్దరు ప్రచార కార్యక్రమాలలో ఆమె అత్యంత ఆసక్తి చూపారు. ఆశయాలను ఆచరణలో చూపటం ద్వారా ప్రజలను  ఆకర్షించారు. స్వయంగా ఖద్దరు ధారణ చేశారు. నూలు వడకటం మాత్రమే కాకుండా, నూలువడకడాన్ని అమె ప్రజలకు, ప్రధానంగా మహిళలకు, యువతులకు నేర్పారు. జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులకు కూడా ఆమె నూలు వడకటం నేర్పారని గాంధీజీ లేఖల ద్వారా వెల్లడవుతుంది.

మాతృభూమి విముక్తి కోసం ఉద్యమించిన ఫలితంగా  బ్రిటిష్‌ సామ్రాజ్య వాదుల నుండి దేశానికి విముక్తి లభించినప్పటికి, దేశం విభజనకు గురవటం పట్ల  బేగం ఖుర్షీద్‌ బాగా కదలిపోయారు. ఆనాటి నుండి రాజకీయ రంగం నుండి వైదొలగి విద్యా, సామాజిక సేవారంగాలకు ఆమె అంకితమయ్యారు. ఈ మేరకు అటు మాతృదేశ సేవ, ఇటు ప్రజాసేవకు అమూల్యమైన జీవితాన్ని అర్పితం చేసిన సమరశీల యోధురాలు బేగం ఖుర్షీద్‌ ఖ్వాజా 1981 జులైలో తుదిశ్వాస విడిచారు.

– సయ్యద్ నశీర్ అహమ్మద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో