“ అమ్మా, నేను ఈ విషయం చెప్పగానే నువ్వు క్రుంగి పోయావు. అలాంటిది నేను ఆ హోటల్లో నాన్న కొత్త పెళ్ళికొడుకు లాగా ఎవరో ఒక ఆడ మనిషి నడుం చుట్టూ చెయ్యేసి తీసుకు పోతుంటే నాకు ఎలా వుంటుంది? నా కళ్ళతో చూశాను, నా కళ్ళతోనే చూశాను” కోపంగా రగిలిపోతున్నాడు మనో.
“ రిసెప్షనిస్ట్ నాన్నను గురించి చెత్తగా మాట్లాడాడు “ మనో కోపంతో పిడికిలి బిగించి టేబుల్ పై కొట్టాడు.
చంద్ర అతని వంక చూసింది. కానీ ఏమి మాట్లాడ లేదు.
కాసేపటికి మనో ఆగ్రహం కాస్త శాంతించింది. మనసులో ఉన్నదంతా బయట పెట్టేయ్యాలి. కూర్చున్న వాడు లేచి అటు ఇటూ తిరగడం మొదలుపెట్టాడు. పిడికిలి బిగించి తన రెండో చేతిలో కొట్టాడు. కోపంగా టేబుల్ పై కొట్టాడు. తలుపు విసురుగా వేశాడు. “ఛి” అంటూ చిరాకు పడ్డాడు.
ఒక నిముషం ఆగి “ రేపటి నుంచి నా స్నేహితులు అనేక కామెంట్స్ చేస్తారు. ‘మీ నాన్న గొప్ప రసికుడు రోయ్, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు’ అంటారు. మొన్న నాతొ వున్న వాళ్ళు ఏదో కామెంట్ చెయ్యబోతే నేను గట్టిగా వాళ్ళ నోరు నొక్కేసాను. కానీ అన్నీ సార్లు, అందరి నోళ్ళు మూయించ లేను కదా.”
మనో కాసేపు తిరగడం ఆపాడు. ఏదో గుర్తొచ్చినట్లు ఆగి చంద్ర వంక చూసి ఇలా అన్నాడు “ అంత క్రితం ఒక రోజు నేను, మురళి క్లబ్బుకు వెళ్ళాము. అక్కడ నాన్న అప్పటికే వచ్చి ఉన్నాడు, కానీ మమ్మల్ని చూడలేదు. అక్కడ వున్న ఆడ వాళ్ళను ఉద్దేశించి, ఏవో అసహ్యమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఏదో తాగేసి ఉన్నారు లెమ్మని నేనేమి మాట్లాడకుండా వచ్చేశాను. మరొక రోజు ఆ నళినితో చూశాను. ఆమె నాన్నతో కారులో ముందు సీట్లో ఆయన పక్కనే కూర్చుంది. ఆయనతో ఇక ఇకలు,పకపకలు. ఆయనపై వాలి పోతూ –చీ అసహ్యం వేస్తోంది తల్చుకుంటే “
మనో క్షణ క్షణం పెరిగిపోతున్న ఆవేశంతో ఏదో చెబుతూనే వున్నాడు. చంద్ర మొహం అవమానంతో ఎర్రబడింది. “ఏదో ఒకటి చెయ్యాలి. తప్పదు” అనుకుంది.
“ చీ, ఏం మనిషి అమ్మా ఆయన? యాభై ఏళ్లు వచ్చాయి. ఆడవాళ్ళ వెంట పడుతున్నాడు! సిగ్గు లేదు, నీతి లేదు,మర్యాద పోతుందన్న భయం లేదు. ఎంత దౌర్భాగ్యం!” మనో కోపంగా మాట్లాడుతూనే వున్నాడు.
అకస్మాత్తుగా మనోకు ఏదో అనుమానం వచ్చింది. అటూ ఇటూ తిరుగుతున్నవాడు ఆగి, చంద్ర మొహం వంక సూటిగా చూశాడు. “ అమ్మ నీకు ఇదంతా తెలుసా?”
చంద్ర మాట్లాడలేక పోయింది. మౌనంగా చీర చెరుగు వేలితో తిప్పుతూ తల ఎటో తిప్పి చూస్తున్నది. ఆమె మనో వంక సూటిగా చూడలేక పోయింది.
“ అమ్మా నిన్నే?” గట్టిగా అడిగాడు.
చంద్ర తలెత్తి అతని వంక చూసింది. ఆమె కళ్ళలో కాంతి లేదు. మొహం పాలి పోయింది. తల్లి మొహం వంక చూసి మనో బాధ పడ్డాడు. తల్లి ముందు కూర్చున్నాడు. ఆమె చేతులు తన చెంపకు అనిమ్చుకున్నాడు. తల్లి మొహంలోకి చూస్తూ “ సారీ, అమ్మా, కోపంలో వెనకా ముందు చూడకుండా ఏవేవో మాట్లాడేశాను. నేను అవన్నీ అని వుండాల్సింది కాదు. అది సరే, నువ్వు ఇదంతా ఎలా భరించావమ్మా? మొదట్లోనే నాన్నను అదుపులో ఉంచాల్సింది. నువ్వు ఊరుకోవడం వల్లే ఇంతవరకూ వచ్చింది” కోపంగా అన్నాడు మనో.
కొడుకు మాటలు విని చంద్రకు పెద్దగా నవ్వాలనిపించింది. ఇప్పుడలా పిచ్చిగా ప్రవర్తించడంలో అర్ధం లేదు. ఏమన్నాడు వీడు? నాదే తప్పంతా అంటాడు. వీడికేం తెలుసని? చంద్ర మనసులో ఆలోచనలు ముసురుకుంటున్నాయి. అతని విచ్చలవిడితనాన్ని అదుపు చెయ్యలేక పోయిందా? అతని బుద్ది కుక్క తోక లాంటిది. అది సాగ దీసీనా వంకరగానే వుంటుంది.
తల్లి మౌనంగా వుండడం చూసి మనో ఆమె దగ్గరగా వచ్చాడు. తన చేతులు ఆమె భుజాలపై వేసి ఆమె కళ్ళలోకి చూస్తూ, “ అమ్మా, నువ్వేం దిగులు పడకు! నేని విషయం ఏమిటో తెల్చుకోదలిచాను. నీ లాంటి అందమైన భార్య వుండగా ఇలా ప్రవర్తించడం చాలా దారుణం. అదీ గాక ఆయనేమీ చిన్న వాడా చితక వాడా? ఈ వయసులో ఎంతో హుందాగా వుండాల్సింది పోయి, ఆయన ఇంత చండాలంగా ప్రవర్తిస్తాడా? తన పిల్లలంతా పెద్ద వాళ్ళైనారు, పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలున్నారు అన్న జ్ఞానం కూడా లేదాయనకు. ఆయనకు బుద్ది చెప్పాల్సిందే! ఇక నేను చెయ్యబోయే పని అదే” అన్నాడు.
చంద్ర అతని వంక ఆందోళనగా చూసింది. మనో వైఖరి చూస్తే తండ్రితో గొడవ పడడానికి సిద్ధమైనట్లుంది. తండ్రితో కొడుకు గొడవ పడదామా? అదేమన్నా బాగుంటుందా?
పైగా మూర్తి రాక్షసుడు. తన దారి కేవరైనా అడ్డం వస్తే, ఎంతకైనా తెగిస్తాడు. చంద్ర చాలా సేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. ఈ విపత్తు నుంచి బయట పడడానికి ఏదో ఒక మార్గం ఆలోచించాలి. కాసేపు ఆలోచించాక, ఆమెకే ఒక మార్గం తట్టింది. ఇంతకంటే వేరే మార్గం లేదు.
అప్పటికీ మనో ఇంకా రుసరుస లాడుతూనే వున్నాడు. కోపంతో అతని మొహం ఎర్రగా కంది పోయింది. అతను ప్రతి మాటా బిగ్గరగా, ఊగి పోతూ మాట్లాడుతున్నాడు.
చంద్ర అతని చేతులు తన చేతి లోకి తీసుకుంది. ఏదో కోపంగా అనబోతున్న మనో ఆగిపోయాడు. తల్లి వంక ప్రశ్నార్ధకంగా చూసాడు.
చంద్ర తన ఆలోచనలకు ఒక రూపం ఏర్పరుచుకుంది. తనెలా చెప్పాలో తనలో తనే రిహార్సల్ వేసుకుంది.
“మనో, నువ్వు పడుతున్న బాధను నేను అర్ధం చేసుకున్నాను. నా పై నీకున్న ప్రేమకు, బాధ్యతకు నాకు చాలా సంతోషంగా కలుగుతోంది. నువ్వన్నది నిజమే. మీ నాన్నకు బుద్ది చెప్పాల్సిందే.అయితే ఒక్క విషయం. ఈ అవకాశం నాకు ఇవ్వు.. మళ్లీ ఆయన జీవితంలో మరిచిపోలేని విధంగా నేనే ఆయనకు సరైన బుధ్ధి చెబుతాను.”
మనో తల్లి వంక అనుమానంగా చూసాడు.” ఇన్ని సంవత్సరాలుగా చెయ్యలేని పని ఇప్పుడు ఎలా చెయ్య గలనని అనుకుంటునావు? మరీ ఇన్నాళ్ళు అదే పని ఎందుకు చెయ్యలేదు?”
“ మనో, నీ ప్రశ్నలకు నేనిప్పుడు సమాధానం చెప్పలేను. నేను ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాను. నేనే దీన్ని పరిష్కరిస్తాను. మీ నాన్న మరెప్పుడూ ఇలాంటి పని చెయ్యడు. నువ్వు చెప్పినట్లు మన కుటుంబ గౌరవం బజారున పడే పరిస్థితి వచ్చింది. నీ చెల్లెళ్ళు ఇద్దరూ పెద్ద వాళ్ళు అయ్యారు. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. ఇన్నాళ్ళు సమయం కోసం చూస్తున్నాను. ఈ విషయంలో ఇక ఏ మాత్రం ఉపేక్షించను.”
“ఓ.కే. అమ్మా అయితే, మనం ఈ సమస్య పరిష్కరించడానికి ఒక డెడ్ లైన్ పెట్టుకుందాం.”
“రైట్, మూడు నెలలు. సరేనా?”
“ ఓ.కే. అమ్మా, ఈ మూడు నెలలో నువ్వు ఏమి చెయ్యలేక పోతే నేను రంగంలోకి దిగుతాను. ఇక అప్పుడు కుటుంబ గౌరవం అంటూ నాకు అడ్డు చెప్పవద్దు.”
మనో టేబుల్ పై ఉన్న పుస్తకాలు చేతిలోకి తీసుకున్నాడు.” అమ్మా, నేను కాలేజికి వెడుతున్నాను. మధ్యాన్నం నాకు చాలా ముఖ్యమైన క్లాసులు వున్నాయి” అంటూ లేచాడు.
“మనో ఒక్క విషయం. నువ్వు ఇప్పుడు చెప్పింది, మనం మాట్లాడుకుంది ఇక్కడే మర్చిపో. ఇది ఒక దుస్వప్నం అనుకో.”
“ నో. అమ్మా, నేను ఎలా మర్చిపోతాను? నా మనసులో ఇది జీవితాతం గుర్తుండి పోతుంది. ఆయనను ఎన్నడూ నాన్న లా చూడలేను . ఆయన నాకు నాన్న కాడు, నేనాయనకు కొడుకును కాను. నాకన్నీ నువ్వే. అందుకే చెబుతున్నాను. మూడు నెలలు నీకు టైము. అది దాటితే, నేను ఏం చెయ్యాలో అది చేస్తాను, ప్రామిస్! “ అంటూ మనో వెళ్ళిపోయాడు.
మనో గొంతులో బాధను,కోపాన్ని ఆమె గుర్తించింది. ఆమెకు కొడుకుపై ప్రేమా, అదే సమయంలో గర్వము కలిగాయి. నెమ్మదిగా నడుచుకుంటూ అతని గదిలోంచి వెళ్ళిపోయింది.
(ఇంకా ఉంది )
తమిళ మూలం: శివశంకరి
తెలుగు : టి.వి.యస్. రామానుజరావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~