“చర్యను వేగవంతం చేద్దాం” -(సమకాలీనం ) -బంగార్రాజు ఎలిపే
ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీన చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని థీమ్ ప్రకటించడం జరిగింది. “Accelerate Action” అంటే “చర్యను వేగవంతం చేద్దాం” అని.
ఎటువంటి చర్యలు? లింగ సమానత్వంలో వేగవంతమైన పురోగతి వైపు అడుగులు వేసే చర్యలు. విద్య, ఉపాధి మరియు నాయకత్వంలో మహిళల పురోగతిని నడిపించే వ్యూహాలు మరియు సాధనాలను గుర్తించడంపై దృష్టి సారించేందుకు, క్రియాత్మకత వైపు అడుగులు వేసేందుకు చర్యలు.
ఈ దృక్పథంలో ప్రధానమైనది తరువాతి తరాన్ని – యువతను, ముఖ్యంగా యువతులను మరియు యుక్తవయస్సులోని బాలికలను – శాశ్వత మార్పుకు ఉత్ప్రేరకాలుగా శక్తివంతం చేయడం,” అని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
వివిధ రంగాల్లో మహిళలు సహకారాన్ని గుర్తించి, లింగ సమానత్వాన్ని గుర్తించి, అవగాహన పెంచాలి. సాధికారతను మెరుగుపరచి, వేతన సమానత్వాన్ని ప్రోత్సహించాలి. ప్రపంచ వ్యాప్తంగా మహిళల హక్కుల కోసం వాదిస్తూనే వారి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలు కూడా మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలి.
ఈ సందర్భంగా మన భారతీయ మహిళల కోసం చరిత్రలో ఎంతోమంది మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వారి జీవిత విజయాల ద్వారా, పోరాటాల ద్వారా మనకు బాటలు వేశారు. అలా మొట్టమొదటిసారి బాటలు వేసిన వారిలో కొందరిని మనం స్మరించుకోవాలి అనుకుంటే, మొట్టమొదట మహిళల్లో విద్యను పెంపొందించేందుకు మొదటి ఉపాధ్యాయురాలుగా శ్రీమతి సావిత్రిబాయి పూలే, తర్వాత మొట్టమొదటి డాక్టర్ ఆనంది భాయ్ గోపాల్ రావు జోషి, మొట్టమొదటి లాయర్ మన్మోహన్ గోషి, మొట్టమొదటి డిగ్రీ పూర్తి చేసిన మహిళ కాదంబరి గంగూలీ, మొట్టమొదటి ఇంజనీర్ అయ్యల సోమయాజుల లలిత, మొట్టమొదటి ఆర్మీ ఆఫీసర్ ప్రియా జహంగీర్ వంటి ఎందరో స్ఫూర్తివంతమైన మహిళలను మనం జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు.
1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలో 14 నుండి 16 వరకు ఉన్న ఆర్టికల్స్ ప్రకారం పురుషులు మరియు మహిళలకు సమాన హక్కులు పొందుపరచబడ్డాయి. లింగ ఆధారంగా వివక్షత ఖచ్చితంగా నిషేధించబడింది.
భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మహిళా సాధికారతతో సహా సామాజిక మరియు మానవ అభివృద్ధిపై మరింత శ్రద్ధ వహించాలని అర్థం అవుతుంది. లింగ సమానత్వాన్ని సాధించడంలో మహిళా సాధికారత ఒక కీలకమైన అంశం, ఇక్కడ పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ సమాన శక్తి మరియు విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక భాగస్వామ్యం మరియు వ్యక్తిగత అభివృద్ధికి అవకాశాలు ఉండాలి.
భారత న్యాయ వ్యవస్థ కూడా విధానం మరియు ఆచరణ మధ్య అంతరాలను ఎదుర్కొంటోంది. మహిళలు మరియు బాలికలను రక్షించడానికి ఇప్పటికే చట్టాలు ఉన్నప్పటికీ, ఈ చట్టాల అమలు మరియు నిందితులను దోషులుగా నిర్ధారించడం బలహీనంగా ఉంది. ఈ ప్రక్రియలలో అంతరాలు వ్యవస్థాగత అధికారస్వామ్యం, అవినీతి వలన ఏర్పడ్డాయని అర్థం అవుతుంది. అపఖ్యాతి పాలైన “నిర్భయ” సామూహిక అత్యాచార కేసులో నిందితులను ఉరితీయడానికి ఏడు సంవత్సరాలు పట్టింది. పట్టణ ప్రాంతాలలో కంటే గ్రామీణ భారతదేశంలో మహిళా సాధికారత తక్కువగా కనిపించడం కూడా ఉంది. పెరుగుతున్న పట్టణీకరణ మరియు నగరాల పెరుగుదల ఉన్నప్పటికీ గ్రామీణ జనాభా 65.97 శాతంగా ఉన్నందున భారతదేశంలో ఇది ఆందోళన కలిగించే విషయం. పట్టణ ప్రాంతాలలోని మహిళలకు విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు నిర్ణయం తీసుకునే శక్తికి ఎక్కువ ప్రాప్యత ఉన్నట్లు కనబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా నిర్ణయాధికారం మహిళల చేతుల్లో ఉన్నట్లు కనపడదు.
ప్రస్తుత సమాజంలో ఎంతో మంది మహిళా మూర్తులు గుర్తింపు కలిగిన రంగాలలో పని చేస్తున్నారు, దేశాభివృద్ధికి తమ సహకారం అందిస్తున్నారు. ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన మహిళ ఇందిరాగాంధీ, మొట్టమొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు వంటి మహిళలు దేశంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మన దేశానికి ఆర్థిక మంత్రిగా శ్రీమతి నిర్మలా సీతారామన్ ఉన్నారు. ఈమె మొట్టమొదటి రక్షణ మంత్రిగా కూడా చేశారు. అలా ఎందరో మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. కానీ ఈనాటి సమాజంలో మన దేశంలో ఎంతమంది మహిళలు దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారు? దేశ పరిపాలనలో భాగస్వాములుగా ఉన్నారు? ఎన్నో సంవత్సరాలుగా ఈ మహిళా దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. మహిళల గురించి ఆ రోజు చర్చిస్తాం. కానీ ఇప్పటికీ మహిళలు వెనకబడే ఉన్నారు. ఎన్నో చట్టాలు చేశారు. కానీ అవి అరా కొరగా కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా మన దేశంలో మహిళా జనాభా 49.7% ఉంది. మహిళా అక్షరాస్యత 65.46% ఉంది. అలాగే లింగ బేధం ప్రతి 1000 మంది పురుషులకు 949 మంది స్త్రీలు ఉన్నారు. జిడిపి లో మహిళలు యొక్క భాగస్వామ్యం కేవలం 18 శాతం మాత్రమే. అంటే భారతదేశంలో మహిళలకు ఆర్థిక విభాగంలో ఎంత శాతం ఉందో మనం ఆలోచించాలి. మహిళలకు ఆర్ధిక సమానత్వం చాలా తక్కువగా ఉంది. ఇది మనం గమనించాలి. మరి మనం మహిళా సాధికారత గురించి మాట్లాడుతాం. ఎంతవరకు సాధ్యమైంది? ఈ మహిళా సాధికారత అనేది మనల్ని మనం ప్రశ్నించుకుంటే చాలా తక్కువనే మనకు అర్థమవుతుంది. అలాగే రాజకీయ రంగంలో మహిళల యొక్క భాగస్వామ్యం ఎంత ఉంది అంటే కేవలం 14 శాతం మాత్రమే ఉంది. అన్ని రాష్ట్రాల్లో సగటున శాసనసభలో మహిళలకు భాగస్వామ్యం కేవలం తొమ్మిది శాతం మాత్రమే. దీనిని బట్టి మనం ఆలోచిస్తే, ఇంకా ఎంత పురోగతిని తీసుకురావాలో అర్థమవుతుంది. నేడు మనకు తెలిసిన “మహిళా సాధికారత” అనే భావన 1970లలో ఐక్యరాజ్యసమితి 1975 నుండి 1985 వరకు “మహిళల దశాబ్దం”గా ప్రకటించడంతో గణనీయమైన ఆదరణ పొందింది, ఇది మహిళల హక్కులు మరియు సమానత్వం చుట్టూ ప్రపంచవ్యాప్త చర్చలో కీలకమైన అంశంగా గుర్తింపు పొందింది.
అయితే, ఈ పదం 19వ శతాబ్దం ప్రారంభంలోనే ప్రారంభ స్త్రీవాద ఉద్యమాల పెరుగుదలతో ఉద్భవించింది.. అందులో ఎంత శాతం మనం సాధించామో ఆలోచించాలి. ఈనాటి సమాజంలో గ్రామీణ మహిళల్లో చైతన్యం తీసుకురావాలి. వారిని దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేయాలి. గ్రామీణ మహిళా సాధికారత సాధించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలు ఇప్పుడు సరిపోవని అర్థం అవుతుంది. ఇంకా వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. అలాగే వారిపై జరిగే దాడులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మన న్యాయ శాస్త్రంలో వారికి ఎన్నో చట్టాలు చేశారు, చేస్తున్నారు. కానీ వాటి అమలులో అలసత్వం కనిపిస్తుంది. మహిళలపై జరుగుతున్న దాడులు ఖండించడం తప్ప మనం ఏమీ పెద్దగా చర్యలు తీసుకోలేకపోతున్నాం. న్యాయస్థానం ముందుకు వచ్చిన వాటిని మాత్రమే పరిష్కరించగలుగుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడవలసింది గ్రామీణ మహిళల గురించి వారికి ఉపాధి లేక సరైన గౌరవం లేక సమాజంలో గుర్తింపు లభించడం లేదు. గ్రామీణ మహిళా సాధికారత కోసం మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఎస్ హెచ్ జి (స్వయం సహాయక సంఘాలు)లను ఏర్పాటు చేసినా, అంతంత మాత్రమే మహిళలకు గుర్తింపు లభిస్తుంది. ప్రతి కుటుంబంలో ప్రతి మహిళా ఆర్థిక భాగస్వామ్యం కలిగి ఉండాలి. వారు కూడా ఆర్థిక ప్రగతిలో భాగస్వాములు అవ్వడానికి ప్రయత్నించాలి.
సామాజిక కట్టుబాట్ల వల్ల చాలామంది మహిళలు చైతన్యం లేకుండా ఉండిపోతున్నారు. వారిని మార్చాలి .ముఖ్యంగా ఇంకా గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని ప్రశ్నించాలి. వాటిని పూర్తిగా రూపుమాపేందుకు ప్రయత్నించాలి. పాఠ్యపుస్తకాలలో లింగ సమానత్వం గురించి పాఠ్యాంశాలు ఉన్నా, మరెన్నో పాఠ్యాంశాలు కల్పించి విద్యార్థి దశలోనే ఈ లింగ సమానత్వాన్ని పిల్లలకు నేర్పించాలి. అలాగే ప్రతి కుటుంబంలోనూ ఈ లింగ సమానత్వాన్ని పాటించేటట్టు ఒక నైతిక బాధ్యతను నేర్పించాలి. మనం ఎన్నో చట్టాలు చేసి ఈ సమానత్వం కోసం ప్రయత్నిస్తున్నాం కానీ ఇది తాత్కాలికంగా కనిపిస్తుంది. శాశ్వతమైనదిగా కావాలి అంటే కుటుంబ వ్యవస్థ నుంచే ప్రారంభం కావాలి. ఎప్పుడైతే సమానత్వం వస్తుందో అప్పుడు అన్ని రంగాల్లోనూ మహిళలు విజయాలు సాధిస్తారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు అవుతారు. వారి భాగస్వామ్యం ఉన్నప్పుడే దేశం ఇంకా ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతుంది. మన దేశంలో భవిష్యత్తులో మహిళలు తమ సమానత్వం గురించి ప్రశ్నించే రోజు లేకుండా, సమసమాజ స్థాపన జరగాలి!
-బంగార్రాజు ఎలిపే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
“చర్యను వేగవంతం చేద్దాం” -(సమకాలీనం ) -బంగార్రాజు ఎలిపే — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>