అంతర్వీక్షణం-3 (ఆత్మకథ )-విజయభాను కోటే
నా curiosity గురించి, అర్థం అయిపోయింది కదా.. ఇక ఎన్ని కథలు చెప్పినా, చివరికి చేరేది ఆ curiosity కొసకే.
కొన్నాళ్ళకు మా తమ్ముడు పుట్టాడు. వాడంటే మహా ముద్దు అందరికీ. చెల్లికి మరీను. నేను, చెల్లి ముందు ఒక స్కూల్ లో చదివేవాళ్ళం. తమ్ముడిని స్కూల్ లో వేసే సమయానికి డాడీకి కలెక్టర్ ఆఫీస్ కి transfer అయింది. అప్పుడు మా ముగ్గురినీ సెవెన్త్ డే స్కూల్ లో వేశారు. ముందు ఉన్న స్కూల్ లో special English ఉండేది. హిందీ లేదు. క్రొత్త స్కూల్ లో హిందీ compulsory. ఇక నా గొడవ చూడాలి. అందరూ హిందీ పాఠాలు చదువుతూ ఉంటే, నాకు హిందీ అక్షరాలు కూడా రావు. అసలే తిక్క. మా హిందీ టీచర్ శోభ. నాకు ఇంకా ఆమె పొడవాటి జడ గుర్తు.
“ఏమీ పర్వాలేదు, నీకు ముందు స్కూల్ లో నేర్పలేదు కదా! ఇపుడు నేర్చుకోవచ్చు. నేను సహాయం చేస్తాను” అని మెత్తగా, ముద్దుగా చెప్పారు ఆమె. రోజుకు కొన్ని అక్షరాలు నేర్పేవారు. క్రొత్తగా ఏర్పడిన ఫ్రెండ్స్ కూడా సహాయం చేసేవారు. అబ్బే! అయినా నాకు అదేమీ కుదిరేది కాదు. క్లాస్ లో పిల్లల్లాగే నేను కూడా హిందీ చదివేయాలి. అంతేనా, హిందీ టీచర్ తో హిందీలో మాట్లాడేయాలి! అది కూడా అతి త్వరలో! జరిగే పనేనా?
ఇంటికి వెళ్ళి తిక్క పేచీ పెట్టాను. నాకు హిందీ రాదని నాకు కోపంగా ఉందని, పాత స్కూల్ లో హిందీ ఎందుకు లేదని.. ఇలా ఒకటే గోల!
“సరే! పేచీ పెట్టకు, నీకు హిందీ నేను నేర్పిస్తాను” అంది మా మమ్మీ!
అప్పటికి మా మమ్మీ టీచర్ గా పని చేసేదని, తర్వాత మా ముగ్గురినీ సరిగా చూడడం కుదరడం లేదని ఉద్యోగం మానేసిందని తెలుసు కానీ ఆమెకు హిందీ వచ్చని నాకు తెలియదు. నాకు ప్రపంచాన్ని గెలిచినంత సంతోషం అనిపించింది.
ఇక ఆ రోజు మొదలు మా మమ్మీకి ప్రత్యక్ష నరకం ఎలా ఉంటుందో చూపించానని వేరే చెప్పాలా? స్కూల్ నుండి వచ్చింది మొదలు, రాత్రి పడుకునే వరకూ (పడుకున్నాక కూడా, నిద్ర పోకుండా) “దాన్ని హిందీలో ఏమంటారు? దీన్ని హిందీలో ఏమంటారు? హిందీలో ఈ పదం ఎలా రాయాలి? ఆ పదం ఎలా రాయాలి? నాకు ఆకలి వేస్తోంది అన్నదాన్ని హిందీలో ఏమంటారు? నాకు కోపం వచ్చింది అనేదాన్ని హిందీలో ఏమంటారు?…. అంతు లేని కథ! మా మమ్మీకి ఒకటే వ్యధ!
మా మమ్మీ అదృష్టమో ఏమో, అదే సమయంలో ఇంట్లోకి టీవీ వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ ఒనిడా! అప్పుడు దూరదర్శన్ మాత్రమే వచ్చేది. ఒక హిందీ భాష రాకపోవడం అనేది నన్ను ఎంత తిక్కకు గురిచేసిందీ అంటే, టీవీలో హిందీ కార్యక్రమాలు మాత్రమే కాదు, సంస్కృతం వార్తలు, ఆదివారం వచ్చే ఇతర భాషా సినిమాలు, ఇంగ్లీషు వార్తలు, ఆఖరికి బధిరుల వార్తలు కూడా చూసేసేదాన్ని. బధిరుల వార్తలు చూస్తూ, ఆ సంజ్ఞలు ప్రాక్టీస్ చేసేదాన్ని. స్కూల్ లో, ఇంట్లో ఆ సంజ్ఞలు అందరికీ చేసి చూపిస్తూ, దాని అర్థం వివరించేదాన్ని. ఇతర భాషా సినిమాలు తప్పకుండా చూసేదాన్ని. ఆరు నెలల తర్వాత నా తిక్క ఒక లెక్కకు వచ్చింది. నాకు హిందీ చదవడం, రాయడం మాత్రమే కాదు, మాట్లాడడం వచ్చింది. కొన్నాళ్ళకు నేను హిందీ మాట్లాడితే నేను ఉత్తరాది మనిషినేమో అనుకునేలా నా హిందీ భాష మారింది. అంటే దాని అర్థం, నిద్రలోనూ, మెలకువలోనూ నేను హిందీలోనే ఆలోచించి ఉంటాను!
ఇలా నాలా ఇష్టమైన లేదా అనుకున్న విషయాన్ని నేర్చుకోవడానికి ఎంతో మంది ఇలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలు చేసి ఉంటారు. వాళ్ళందరూ Heutagogues అని ఇపుడు అర్థం అవుతుంది. నేను Heutagogy పై ప్రయోగాలు చేయడానికి నా ఆటిట్యూడ్ కారణం అయి ఉండాలి!
నాకు అమ్మమ్మ ప్రపంచంతో పరిచయాలు ఎక్కువ. అమ్మమ్మ ఒక గ్రంధం. ఆమెతో ఉంటే సంతోషం తప్ప ఇంకేమీ ఉండదు. అసలు ఒక్కోసారి ఆమె విద్యార్థులు ఎంత అదృష్టవంతులో కదా అనిపించేది నాకు.
నేను Heutagogy Expert అయ్యే ప్రక్రియలో ముందుగా ఐదో తరగతి specialist ను ఎలాగో, మా అమ్మమ్మ కొయ్యే జానకి ఒకటి, రెండు తరగతుల specialist.
ఆమె service మొత్తంలో ఒకటి, రెండు తరగతులకు బోధించిన సంవత్సరాలే ఎక్కువ అంట. ఎప్పుడూ చెప్పేది, “పునాది సరిగ్గా ఉంటే, ఇల్లు నిలబడుతుంది, పునాది సరిగా లేకపోతే, ఇల్లు పిచ్చుకలు పీకినా పడిపోతుంది” అని. ఆమె సామెతలు ఇప్పటికీ నా చెవుల్లో మారు మ్రోగడమే కాదు, అవి alarm bells నాకు.
నా అల్లరి పెరిగినపుడు, మా మమ్మీకి ఇక భరించే ఓపిక నశించినపుడు నన్ను అమ్మమ్మ దగ్గరికి పంపేసేది. మా మేనమామలు ఇద్దరూ transporters అన్నమాట. విశాఖపట్నం నుండి కొవ్వూరు రైలులో తీసుకొచ్చేవారు. కొన్ని రోజులు అమ్మమ్మ దగ్గర ఉన్నాక మళ్ళీ తిరుగు ప్రయాణం కట్టేదాన్ని.
అమ్మమ్మ, తాతయ్య దగ్గర ఉన్నన్ని రోజులూ భలే ఉండేది. ఉదయం నా పనులు, ఇంటి పనులు చేసిన అమ్మమ్మ తాతయ్య కన్నా ముందు నన్ను తీసుకుని స్కూల్ కి వెళ్లిపోయేది. తాతయ్య హెడ్ మాస్టర్, అమ్మమ్మ అసిస్టెంట్ టీచర్.
స్కూల్ లో మట్టి బొమ్మలు తయారు చెయ్యడం, ఆకులను నూరడం, చిన్న చిన్న లక్క పిడతల్లో వంట చెయ్యడం, గ్రౌండ్ లో ఉన్న జారుడుబల్ల జారడం, అప్పుడప్పుడూ అమ్మమ్మ, తాతయ్య పిల్లలకు పాఠాలు చెప్తుంటే ఒక చూపు, ఒక చెవి అటు వేసి, మళ్ళీ ఆటల్లో పడిపోవడం. సాయంత్రం ఇంటికి వచ్చి, అమ్మమ్మ వంట చేస్తుంటే, తాతయ్య దగ్గర కాసేపు ఉండి, వంటింట్లో అమ్మమ్మ చుట్టూ తిరగడం, రాత్రి అయ్యాక అమ్మమ్మ చెప్పే మాటలు వింటూ భోజనం చేసి, పక్క ఎక్కి అమ్మమ్మ చెప్పే కథలు వింటూ నిద్రలోకి జారుకోవడం. ఎంత అద్భుతమైన రోజులు అవి!
అందరికీ ఈ తీపి రోజులు ఉంటాయి కదా!
రాబోయే రోజుల్లో ఇలాంటి రోజులు ఉండవేమో అని ఆపుడపుడూ భయంగా అనిపిస్తుంది.
అమ్మమ్మ ఒక అద్భుతం. ప్రతి ఒక్కరూ అమ్మమ్మ గురించి ఇలానే చెప్తారేమో కదా! నా అల్లరిని కూడా enjoy చేసిన మనిషి అంటూ ఉంటే మా అమ్మమ్మ మాత్రమే!
అమ్మమ్మ ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్. ఆమె ఒక జీవనది. ఎందరికో సహాయం చేసింది, ఎందరినో తీర్చిదిద్దింది. నాతో సహా!
చిన్నప్పుడు అమ్మమ్మ అంటే నాకు నచ్చిన వంటలు వండుతుంది, నా అల్లరిని ఎంజాయ్ చేస్తుంది, భరిస్తుంది, నాకు అన్ని పనులు చేసి పెడుతుంది, నాకు భోజనం తినిపిస్తుంది, నాకు కథలు చెప్తుంది, నాకు జ్వరం వస్తే తెల్లవార్లూ మేలుకుని ఉంటుంది, తాతయ్యతో డాక్టర్ దగ్గరికి పంపిస్తుంది, నేను ఎక్కడున్నానో, ఏం చేస్తున్నానో చూసుకుంటూ ఉంటుంది.. ఇవే తెలుసు!
ఎదిగే కొద్దీ అమ్మమ్మ నాకో గూడు. మమ్మీ మీద కోపం వచ్చినా, ఏదైనా బాధ అనిపించినా, బాగా నవ్వుకోవాలి అనిపించినా, ఏ పనైనా జరగాలన్నా, అన్నింటికీ అమ్మమ్మ నాకో గూడు, ఒక support system.
ఇంకాస్త ఎదిగాక అమ్మమ్మ ఒక మహోన్నత పర్వతం అనీ, జీవనది అనీ, పచ్చని అడవి అని అర్థం అయింది. అప్పటికే ఆమెలా మాట్లాడడం, ఆమెలా ఆలోచించడం, ఆమెలా నిర్ణయాలు తీసుకోవడం మొదలైనవి నాకు తెలియకుండానే వచ్చేశాయి.
ఒక అడుగు వేసే ముందు 100 అడుగుల తర్వాత ఏముందో ఆలోచించడం ఆమె నుండే వచ్చింది.
ఎవరినైనా ఆర్తిగా అర్థం చేసుకోవడం, ఎదుటివారి కోసం ఏదో ఒకటి చేయడం ఆమె నుండే వచ్చింది.
ప్రతి కాలంలోనూ ఆ కాలానికి తగ్గ సమస్యలు ఉంటాయని, వాటికి ఆ సామాజిక పరిస్థితులకు అనుగుణంగానూ, పరిస్థితిని దాటి సాధించే పరిష్కారాలు కూడా ఉంటాయని ఆమె చెప్పే anecdotes వినే తెలుసుకున్నాను.
అమ్మమ్మ అన్ని విషయాలు anecdotes గానే చెప్పేది. ఎంత ఆసక్తికరంగా చెప్పెదో! ఇంకా ఇంకా చెప్పమని అడుగుతూనే ఉండేవాళ్లం అందరం. తన చిన్నప్పటి కథలు నాకు ఇంకా కళ్ళకు కట్టినట్టే ఉన్నాయి.
తన చిన్నప్పటి విషయాలు చెప్తున్నపుడు అప్పటి సమకాలీన అంశాలు చెప్పకనే చెప్పేది. కాణీ, అణా లాంటి ఆర్థిక విషయాలు, డ్రామాలు చూడడం, ఇంట్లో తను చేసే అల్లరి, అమ్మమ్మ తండ్రి సహదేవుడుగారి ఆయుర్వేద వైద్య విద్య, ఉపాధ్యాయుడుగా ఉంటూనే, ఆయుర్వేద వైద్యునిగా ఊరి వాళ్ళకు చేసిన సేవ, ఆయన మందులు నూరే రాయి, అప్పటి రోగాలు, medical science వృద్ధి చెందని, చెందుతున్న రోజులూ, అప్పటి సమాజం, స్వాతంత్ర్య పోరాటం రోజులూ, అప్పటి ప్రభుత్వాలు, ఎన్నో విషయాలు… అన్నింటికన్నా నేను అత్యంత గౌరవించే విషయం మా అమ్మమ్మ తండ్రిగారైన సహదేవుడు గారు, ఆ కాలంలోనే ఆడపిల్లలను చదివించడం, ఉద్యోగం చేయాలని చెప్పడం.
ఎవరైనా ఆడపిల్లకు పెళ్లి ఎపుడు అని అడిగితే, “చేతికి ఒక కర్ర ఊతం ఇచ్చాకే పెళ్లి” అనేవారట! చేతికి కర్ర అంటే చదువు, ఉద్యోగం!
ఒక్కో రోజు మా మమ్మీ, మేనామామల చిన్నతనం గురించి, ఒక్కో సంఘటన చెప్పేది. వాళ్ళ విషయాలన్నీ కూడా నాకు ఇంకా కళ్ళకు కట్టినట్టే గుర్తుకు వస్తాయి. Brain Surgery తర్వాత ఈ మధ్య జరిగిన విషయాలు, మనుషుల ముఖాలు, వాళ్ళ పేర్లు మర్చిపోతున్నాను. కానీ అమ్మమ్మ ఎప్పుడో చెప్పిన చాలా విషయాలు మరుపుకే రావు.
ఒక్కో రోజు మా చిన్నప్పటి విషయాలు చెప్పేది. మా విషయాలు మేమే వింటూ ఒకటే నవ్వుకునేవాళ్ళం. ఇంకా చెప్పు, ఇంకా చెప్పు అనకుండా ఏ రాత్రీ గడిచేది కాదు.
నాలుగు తరాల విషయాలు, జ్ఞాపకాలు మాకు రోజూ కథలు. వాటిలోనే ఎన్నో విషయాలు తెలుసుకోవడం వల్ల మా జ్ఞానం ఎక్కువగా ఉండేది. అందుకే ఇలా చిన్నప్పటి విషయాలు అందరి ఇళ్ళల్లో పంచుకోవాలి. మీరు పంచుకుంటున్నారా?
-విజయభాను కోటే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
అంతర్వీక్షణం-3 (ఆత్మకథ )-విజయభాను కోటే — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>