కవి జోసఫ్ అధిక్షేపించిన దశపర్వాల – చెర్నాకోల శతకం (పుస్తక సమీక్ష )-డా.ఆర్. శ్రీనివాసరావు
తెలుగు సాహిత్యంలో శతక ప్రక్రియకు ఒక ప్రత్యేకత ఉంది. అందులోను అధిక్షేప శతకం మరింత ప్రత్యేకమైనది. తెలుగులో ఆధిక్షేప శతకరచనకు అద్యుడు కవిచౌడప్ప. తర్వాత చెప్పకోదగిన వారిలో వేమన, కూచిమంచి సోదరులు, ఆడిదం సూరకవి కాగా ఆధునిక అధిక్షేప శతక రచనలో తిరుపతి వేంకటకవులు రాసిన శాంకరీశతకము, ఏటుకూరి సీతారామయ్యగారి ‘రామభద్రశతకము’ శ్రీశ్రీ సిరిసిరిమువ్వ శతకము, విశ్వనాథ వారి పంచశతీ, నార్లవారి మంట మొదలైనవి.
ఈ కంప్యుటర్ యుగంలో శతక రచన చేస్తున్న అతికొద్దిమంది కవులలో జోసఫ్ ఒకరు. కవి జోసఫ్ అధిక్షేపించిన విషయములు నేటి సమాజఅభివృద్దిని అడ్డుకునేవి. అందుకే వాటి అడ్డు తొలగించాలని తన చేతిలోకి శతకమనే ‘చెర్నాకోల్’ను స్వీకరించి సమాజ ప్రగతిని పరుగులు పెట్టించాలని ఆశించారు. దానిని కొంతవరకు సాధించారు కూడా.
ఈ ‘ చెర్నాకోల శతకం’లో పది భాగాలున్నాయి. ఆ భాగాలను అది కావ్యం మహాభారతంలోని భాగాలకు పర్వాలు అని పేరు పెట్టినట్లుగా తన శతక భాగాలకు పర్యాలు అని నామకరణం చేయడంలోని అర్థం ‘అర్య వ్యవహారంబుల దృష్టంబు’ అని ప్రాచీన కవుల బాటలోనే కవి జోసఫ్ కూడా నడిచారు.
ఈ శతకంలో ఉపాధ్యాయ పర్వం, వైద్య పర్వం, రక్షకభటపర్వం, స్త్రీపర్వం, సినిమా పర్వం, రాజకీయ పర్వం, బాబాల పర్వం, విద్యార్థిపర్వం, కుటుంబ పర్వం ప్రకీర్ణ పర్వం.
కవి జోసఫ్ వృత్తి అధ్యాపకత్వం. ప్రవృత్తి కవితారచన. అధ్యాపకునిగా ఎల్లప్పుడు నిత్య విద్యార్థి. అద్భుతంగా పాఠాన్ని బోధించినపుడు విద్యార్థులు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు.
శిష్యశ్రేణి మనసు చిత్రంగ హరియించ
విషయ మెరుగువలెను ఋషియువోలె
పాఠ్యబోధనెపుడు పరమాన్న తుల్యమ్ము
గురువు నపుడు ఎవరు మరువగలరు ?
తిక్కన భారతంలో స్త్రీపర్వంలో స్త్రీల మనః ప్రవృత్తులను వర్ణించగా కవి జోసఫ్ నేటి యువతుల మానసికతను జోసఫ్ కవి ఇలా తెలుపుతున్నారు.
కురులు గాలికొదిలి మరులు గొలిపె
కురుచ దుస్తులేసి, కుర్రాళ్ల బైకుపై
తిరుగుతుంది యువతి తిక్కరేగి……………….
సినీ పర్వంలో నేటి ప్రేక్షకులు, ఘంటసాల కంచు కంఠంబు, బాలు పాట, మైథిలాజికల్లు రామన్నలను చూడలేమంటారు. నేటి విలువలు లేని సినిమాను మేడిపండుతో పోల్చారు కవి జోసఫ్.
చిన్నయసూరి బాల వ్యాకరణంలో మిగిలిపోయిన అంశాలన్నీ కలిపి ప్రకీర్ణక పరిచ్చేధంలో ఉంచినట్లుగా కవి జోసఫ్ కూడా తాను చెప్పాలనుకున్న మిగిలిపోయిన అంశాలను ప్రకీర్ణక పర్వంలో ఉంచారు.
కవి జోసఫ్ ఈ ‘చెర్నాకోల శతకం’ ఒక ప్రయోగం చేశారు. మకుటమే లేని శతకం ఇది. మకుటం లేకుండా, శతక సంఖ్య లేకుండా రాయబడిన శతకం ఇది. ఈ దశ పర్వాల భాగాలకు శతకం ఆనే పేరు పెట్టడంలోని ఔచిత్యం పాఠకునికి అంతుబట్టడు.
ప్రకీర్ణక పర్వంలోని చివరి పద్యంలోని మొదటి పాదంలో ‘చెళ్లుమనును ! చదువు చెర్నాకోల శతము‘ అని మాత్రమే ప్రయోగించబడింది.
జోసఫ్ కవి రాసిన ‘చెర్నాకోల శతకం’ ఆధిక్షేప రచనలో చక్కనైన శతకంగా అభివర్ణించవచ్చు. కవి జోసఫ్ కలం నుండి భూతకాలంలో హెల్మెట్ శతకం వెలువడగా, వర్తమానంలో ‘చెర్నాకోల శతకం’ భవిష్యత్తులో కరోనా శతకం రానుండటం అభినందిచ్చదగ్గ విషయం.
–డా.ఆర్. శ్రీనివాసరావు
మారీస్టేల్లా కళాశాల,విజయవాడ .
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
కవి జోసఫ్ అధిక్షేపించిన దశపర్వాల – చెర్నాకోల శతకం (పుస్తక సమీక్ష )-డా.ఆర్. శ్రీనివాసరావు — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>