జ్ఞాపకం – 105(ధారావాహిక) – అంగులూరి అంజనీదేవి
“అపార్ట్ మెంట్ ఎందుకవుతుంది బాబూ! సమాధినే! కాకపోతే మీ పెద్దనాన్న గారికి అంత ఘనంగా కుదురుతోంది. ఇదంతా ఆయన తెలిసో తెలియకో చేసిన మంచి పనుల ఫలితమేనయ్యా! లేకుంటే తల్లిదండ్రులతో అవసరం తీరాక వాళ్లకి అన్నం పెట్టాల్సి వస్తుందని గుట్టుగా యాక్సిడెంట్లు చేయించి చంపే కొందరు కొడుకులున్న ఈ రోజుల్లో మీ పెద్దనాన్న కడుపున ఆ బంగారు తల్లి పుట్టడమేంటి? ‘ఎంత ఖర్చయినా ఫర్వాలేదు పోలయ్యా!‘ అంటూ వెనకాడకుండా డబ్బులు ఇవ్వడమేంటి? నిజంగా చెబుతున్నాను బాబు ఇలాంటి సమాధి మన చుట్టుపక్కల మండలాల్లో ఎక్కడా లేదనుకో!” అన్నాడు.
ఆ మాటలు వింటుంటే అతని మనసును సూదులతో గుచ్చినట్లయింది.
“ఆ డబ్బుల్లో ఎంత ముడుతుందేం నీకు?” అన్నాడు.
పోలయ్యకు చురుక్కుమంది “నాకెందుకు బాబు ఆ ముడుపులు? ఇదేమైనా మీరు చేస్తున్న కాంట్రాక్ట్ పని లాంటిదా? ఏదో ప్రేమతో చేస్తున్న పని” అన్నాడు.
“ఎంత ప్రేమ వుంటే మాత్రం నువ్వు పగలే కాకుండా రాత్రిళ్లు కూడా ఇక్కడే పడుకుంటున్నావట కదా?” అడిగాడు.
“లేకుంటే సిమెంట్ బస్తాలు, ఐరన్, కంకరా, ఇసుక, ఇటుకలు వుంటాయా బాబూ! తెల్లారేసరికి మాయమైపోవూ! ఇలాంటి మెటీరియల్ ఎక్కడ దొరికినా దొంగతనంగా పట్టుకెళ్లి ఇళ్లకి వాడుకుంటున్నారు. మీకు తెలియందేముంది?” అన్నాడు.
అతను గతుక్కుమన్నాడు. తను చేస్తున్న కాంట్రాక్ట్ వర్క్ దగ్గర నుండి దొంగతనంగా ఇలాంటి మెటీరియల్ ని లారీలలో చేరవేసుకొని మూడో ఇల్లు కట్టుకున్నాడు. మొన్ననే గృహప్రవేశం కూడా జరిగింది..
“ఇక చాల్లే! కట్టినకాడికి. త్వరగా సిమెంట్ పూసి వదిలెయ్యండి! ఎందుకాపారు?” అన్నాడు సమాధినే చూస్తూ,
“ఆపలేదు బాబు! సమాధి చుట్టూ, సమాధికి మార్బుల్స్ వెయ్యాలని లేఖమ్మగారు అన్నారు. అవిగో మార్బుల్స్ ట్రాలీ ఆటోలో రానే వస్తున్నాయి” అంటూ ఆటోకి ఎదురెళ్లబోయాడు పోలయ్య.
“ఆగు పోలయ్యా!” అనగానే ఆగాడు పోలయ్య.
“మార్బుల్స్ సమాధికి అవసరమా? మనుషులు వుండే ఇళ్లకే మార్బుల్స్ లేవు. అయినా ఈ పొలంలో వాటికి ఎవరు కాపలా కాస్తారు?” అన్నాడు. మార్బుల్స్ వేస్తే ఆ సమాధి ఇంకా హైలైట్ అవుతుందన్న అసూయ ప్రారంభమైంది అతనిలో. వైట్ & వైట్ డ్రెస్ లో వున్న అతన్ని చూడగానే దారినవెళ్లే వాళ్లు ఆగి ‘నమస్తే అన్నా!‘ అని చెప్పి వెళ్తున్నారు. పోలయ్య కళ్లకి ఆటోలో కన్పిస్తున్న మార్బుల్స్ తెల్లగా కన్పించి కనువిందు చేస్తున్నాయి. ‘వీటిని గనక సమాధికి వేస్తే సమాధి అదిరిపోద్ది‘ అని మనసులో అనుకుంటూ వాటినే ఆశగా చూసాడు. “తండ్రి సమాధికి వీటిని వేయించుకోవాలని లేఖమ్మ కోరిక బాబు! నేను కాపలా కాస్తాను” అన్నాడు గుండెల మీద ఆనందంగా చేత్తో కొట్టుకుంటూ .
“గుండె పగిలి ఇప్పుడే చచ్చేలా వున్నావ్! మొన్న మా మరదలు వినీల అంటుంటే విన్నాను. మా పెద్దనాన్న ఎవరికో ఒంట్లోకి వచ్చి చెప్పాడట. ‘పోలయ్య నా మిత్రుడు, నా సమాధి పూర్తయ్యేలోపలే అతన్ని నా దగ్గరకి తీసికెళ్తాను‘ అని… ఈ వార్త నీదాకా రాలేదా?” అడిగాడు పోలయ్య కళ్లలోకే సూటిగా, భయపెడ్తున్నట్లు చూసి.
పోలయ్య ఆశ్చర్యపోతూ వినీలమ్మ ఇలా కూడా ప్రచారం చేస్తోందా? రాజారాంని కూడా ‘మీరు సమాధి వైపు వెళితే వూరుకోను. నేరుగా స్కూల్ కి వెళ్లి తిన్నగా ఇంటికి రండి! ఆ చెండాలం మనకెందుకు? అక్కడకెళితే ఆత్మలు వెంటబడతాయట. ఆ లేఖకేదో తలమీద కూర్చుని ఇలాంటి పనులు చేస్తోంది. లేకుంటే తండ్రికెక్కడైనా ఆడపిల్ల సమాధి కట్టిస్తుందా?’ అని భయ పెట్టి కట్టడి చేసిందట. పోలయ్య అది గుర్తుచేసుకున్నాడు.
“రాఘవరాయుడి ఆత్మ తీసికెళ్తే వెళతానులే బాబూ! ఇక్కడ వుండి మాత్రం చేసేదేముంది? ఇదిగో ఈ ఒక్క పని పూర్తి చేసి పోతే లేఖమ్మను సంతోషపెట్టినట్లవుతుంది. నేను పొయ్యాక ఇదిగో ఈ సమాధిని మొద్దు పోలయ్య దగ్గరుండి కట్టించాడన్న పేరు మిగిలిపోతుంది” అన్నాడు.
“పేరు ముచ్చట సరే! ఈ రాత్రికే నీ తల పగిలిపోతుందేమో చూడు! ఎక్కడా ఆ సమాధి మీదనేనా నువ్వు పడుకునేది?” వేలు చూపిస్తూ అడిగాడు.
పోలయ్య బెదిరిపోయాడు “అవును బాబు! అక్కడే! పడుకోగానే హాయిగా నిద్రపడుతుంది. తమరేమైనా నా తల పగలగొట్టే ఏర్పాట్లు చేసివుంచారా?” అన్నాడు. అప్పటివరకు నిబ్బరంగా మాట్లాడిన పోలయ్యకు వెన్నులో జలదరింపు కలిగింది.
“ఛ… ఛ.. అలాంటి పనులు నేను మానేశాను పోలయ్యా! మన చుట్టుపక్కల పల్లెల్లో ఎవడో సైకో తిరుగుతున్నాడట! ఇప్పటికి నలుగుర్ని చంపేశాడట! ఇంతకుముందే టీ.వీ. న్యూస్ లో చూశాను. బ్రేకింగ్ న్యూస్ కింద దాన్నే హైలైట్ చేసి చూపిస్తున్నారు. పొలం కదా! ఎందుకైనా మంచిది ఈ రాత్రికి ఊల్లోకి వచ్చి పడుకో” అన్నాడు.
ఆలోచనలో పడ్డాడు పోలయ్య. సైకో మన పల్లెల్లో తిరుగుతున్నాడా? నిజమా!!
“అయినా ఆ సైకో ఆడవాళ్లను కదా చంపేది? నన్నేం చేస్తాడు? నేనిక్కడే పడుకుంటాను” అన్నాడు..
“నీ ధైర్యం పెద్దది పోలయ్యా! కానీ ఆ సైకో ఆడవాళ్లనే కాదట. అర్థరాత్రి మగవాళ్లు కన్పించినా తల పగలగొట్టి పరారవుతున్నాడట. చూడటానికి చాలా వికారంగా, గుండేసుకొని తిరుగుతుంటాడట” అంటూ అతను వెళ్లిపోయాడు.
“ఓరినాయనో ఇవాళ పోలయ్యకు మూడింది” అనుకున్నారు అక్కడవాళ్ల సంభాషణ విన్నవాళ్లు.
ఏం చేయాలో తోచక మొద్దు పోలయ్య గుండె గొంతులోకి వచ్చినట్లైంది.
-– అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
జ్ఞాపకం – 105(ధారావాహిక) – అంగులూరి అంజనీదేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>