జ్ఞాపకం – 104 – అంగులూరి అంజనీదేవి
“అరుదుగా చేస్తారు కాబట్టే ఇదెంతవరకు అవసరం అని సమాధి కట్టాక ఎవరైనా ప్రశ్నిస్తారేమో?” అనుమానంగా అడిగింది.
“ఇది అవసరం కాదు. ఒక జ్ఞాపకం. తండ్రి జ్ఞాపకాన్ని సమాధి రూపంలో పదిలపరచుకోవటం” అన్నాడు.
“అదికాదు దిలీప్! మా పెద్దనాన్నకి, పెద్దమ్మలకి సమాధులు లేవు. వాళ్ల కొడుకులు, కూతుళ్లు డబ్బులున్నప్పుడల్లా బంగారం కొని లాకర్లలో దాచుకుంటుంటారు. పొలాలు కొంటుంటారు. స్థలాలు కొంటుంటారు. నేను చేయబోయే ఈ పనిని వ్యాఖ్యానిస్తారేమో?” అంది.
“విమర్శకులు వ్యాఖ్యానిస్తారని మీరు రాయడం మానేశారా? ధైర్యంతో సాగిపోవటం వల్లనే కదా మీ అక్షరాలు దశదిశలా వ్యాపించిపోతున్నాయి. నాకు తెలిసి కొంతమంది రాసే పుస్తకాలకి కొంత పరిధి వుంటుంది. కానీ మీ పుస్తకాలకి ఒక పరిధి లేకుండా, మీ ప్రమేయం లేకుండా అన్ని భాషల్లోకి అనువాదమై ఎల్లలు దాటి పాకిపోతున్నాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే స్వతహాగా మీరు మంచివారు. ఏది చేసినా మీకు మంచే జరుగుతుంది. మీరు అనుకున్న పని ఆపకుండా చెయ్యండి!” అన్నాడు.
సంలేఖకు దిలీప్ మాటలు అర్థమవుతున్నాయి. తండ్రికి సమాధి కట్టించాలన్న కోరిక ఇంకా బలపడింది.
“ఆడపిల్లలు ఇలాంటి పనులేం చెయ్యగలరు అని అనుకుంటారు అందరు. మీరు చేసి చూపించండి! ఇలాంటివే సవాల్ గా తీసుకోవాలి” అని ప్రోత్సహించాడు.
“ఓ.కె. దిలీప్! నాకో సహాయం చెయ్యగలరా?”
“చేస్తాను. అడగండి!”
“నన్ను ఇంటర్వ్యూ చెయ్యటానికి మీరంతా ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు మీతో కలిసి ఒక డాక్యుమెంటరీ డైరెక్టర్ వచ్చారు. గుర్తుందా?”
“వుంది”
“ఆయన టి.వి. కోసం నన్నో సీరియల్ రాసిమ్మని అడిగారు. నేను పత్రికలకి రాస్తూ బిజీగా వుండి ‘నో‘ అన్నాను. ఇప్పుడు రాస్తాను. ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ గా ఇమ్మని చెప్పండి! ఇంకో లక్షరూపాయలు స్వాతి ఎడిటర్ బలరాం గారు ఇస్తానన్నారు. ఆ పత్రికకి కూడా రాస్తున్నాను. నేను అనుకున్న స్కెచ్ తో మా నాన్నగారి సమాధి తయారు కావాలంటే ఇప్పుడున్న రేట్లను బట్టి రెండు లక్షలు సరిపోతాయని అనుకుంటున్నాను. ఏమంటారు?” అంది.
“ఆ డైరెక్టర్ నాకు బాగా తెలిసిన వ్యక్తే! ఇప్పుడే కాల్ చేసి మీకు అడ్వాన్స్ వచ్చేలా చేస్తాను. మీరు అనుకున్న పనులు ఆపుకోకండి!” అంటూ కాల్ కట్ చేశాడు దిలీప్.
** ** ** ** ** **
జీవితంలో ఎదురయ్యే ప్రతి మలుపూ గమ్యాన్ని మార్చకపోవచ్చు. అలా మార్చే ప్రతిదీ గొప్ప మలుపు కాకపోనూ వచ్చు. కానీ కొందరి జీవితాలు వున్నట్టుండి అనూహ్యమైన మలుపులు తిరుగుతాయి. ఏ మార్పు ఎందుకొస్తుందో తెలియదు. ఆ మార్పు వల్ల ఏం జరుగుతుందో తెలియదు. దాన్ని ఆపటం కూడా సాధ్యం కాదు.
దిలీప్ చెప్పినట్లే టి.వి. సీరియల్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వచ్చి సంలేఖతో మాట్లాడి లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్లారు. స్వాతి బలరాం గారు కూడా ఆమె చేయబోయే పనిని అభినందిస్తూ లక్ష రూపాయల చెక్కును కొరియర్లో పంపారు.
డబ్బులయితే వున్నాయి కాని సమాధి గురించి ఎవరితో మాట్లాడినా సరిగా వినటం లేదు. ప్రేమగా మాట్లాడటం లేదు. సరైన సపోర్టు ఇవ్వటం లేదు. పనివాళ్లు దొరకటం కూడా కష్టంగా వుంది. ఒకవేళ వున్నా సమాధి కట్టడమంటే ఆ పనికి మేము రామంటున్నారు. భయపడుతున్నారు. కూలి ఎక్కువ ఇస్తామన్నా ముఖం తిప్పుకుంటున్నారు. సంలేఖ ఉసూరుమంటూ తలపట్టుకుంది. తన కోరిక తీరుతుందో లేదో అని కళ్లనీళ్లు పెట్టుకుంది.
అది చూసి మొద్దు పోలయ్య కదిలిపోయాడు. “నువ్వు బాధపడకు లేఖమ్మా! నేనున్నాను కదా! చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగి ఎలాగైనా పని వాళ్లను తీసుకొస్తాను. దగ్గరుండి కట్టిస్తాను. నువ్వేం కంగారు పడకు. ఎటువంటి పరిస్థితిలో నాన్నగారికి నువ్వు చెయ్యాలనుకున్న పని ఆగదు” అంటూ భరోసా ఇచ్చాడు.
ఆ క్షణంలో సంలేఖకు మొద్దు పోలయ్య దేవుడులా కన్పించాడు. అతను సంలేఖకు మాట ఇచ్చినట్లే వెళ్లి ఊరూరు తిరిగి పనివాళ్లను తీసుకొచ్చాడు. సంలేఖ దగ్గర డబ్బులు తీసుకొని మెటీరియల్ తెప్పించటం, పనివాళ్లతో మాట్లాడటం, సాయంత్రం పనివాళ్లు వెళ్లేంత వరకు అక్కడే వుండి పనులు చేయించటం లాంటివి మొద్దు పోలయ్య ప్రేమగా, బాధ్యతగా తన భుజాలపై వేసుకున్నాడు. ఇలాంటి పనులు ఆత్మ బంధువులైతేనే తప్ప అందరూ చెయ్యరని సంలేఖకు అర్థమైంది. చివరకి ఆమె పెద్దనాన్న కొడుకులు, చిన్నాన్న కొడుకు కూడా సమాధి కట్టే దగ్గరకి రావడం లేదు.
యుద్ధప్రాతిపదికలా రాఘవరాయుడి సమాధి పనులు నడుస్తున్నాయి. అది పండే పొలం కావటం వల్ల ఎప్పటికైనా నేలకుంగే పరిస్థితి వుందని సమాధి కట్టకముందే నాలుగు వైపుల నాలుగు పిల్లర్స్ నిర్మించారు. వాటిని నాలుగు అడుగులు ఎత్తులేపి చుట్టూ భీంలు పోశారు. ఆ బీముల మీద అతి శక్తివంతంగా వుండటం కోసం శ్లాబ్ వేశారు. శ్లాబ్ కింద వున్న రాఘవరాయుడి సమాధి మూలాలను మాత్రం కదిలించకుండా దాన్నే ఆధారంగా తీసుకొని అదే కొలతలతో శ్లాబ్ మీద సమాధి కట్టారు. ఇక ఎప్పటికీ ఆ సమాధి కదలకుండా, పగుళ్లు వచ్చే అవకాశం రాకుండా బందోబస్తుగా కట్టారు. ఆ సమాధిని అలాగే వదిలెయ్యకుండా చుట్టూ తొమ్మిది అడుగుల ఎత్తు వచ్చేలా పిల్లర్స్ లేపి మళ్లీ ఒక అడుగు ఎత్తులో చుట్టూ బీమ్‌లు పోశారు. ఎప్పటికీ ఆ సమాధి వానకి తడవకుండా ఎండకి ఎండకుండా ఆ బీముల మీద 16 అడుగుల వెడల్పుతో శ్లాబ్ వేశారు.
రాఘవరాయుడి పేరు బస్ లో వచ్చేవాళ్లకి ఒక కిలోమీటర్ దూరం నుండే కన్పించాలన్న ఉద్దేశ్యంతో ఆ శ్లాబ్ కి చుట్టూ రెండు అడుగుల ఎత్తులో పిట్టగోడ కట్టించి, ఆ గోడకి సిమెంట్ తో ప్లాస్టింగ్ చేయించి మామిడేల రాఘవరాయుడు అన్న పేరును కలర్స్ లో వచ్చేలా పెయింటర్స్ తో అద్భుతంగా రాయించారు.
ఇప్పటికే దారినపోయేవాళ్లు అదొక మాస్టర్ పీస్ అయినట్లు నిలబడి చూసి వెళ్తున్నారు. ఇంత పని జరుగుతున్నా అదేం చిత్రమో సంలేఖ పెద్దనాన్న కొడుకులు, చిన్నాన్నకొడుకు అదే దారిన రోజూ వెళ్తూ కూడా దాని దగ్గరికి వెళ్లి చూడటం లేదు. మాట్లాడటం లేదు.
ఆ రోజెందుకో సంలేఖ చిన్నాన్న కొడుకు రోడ్డుమీద ఆగి “పోలయ్యా!” అంటూ పిలిచాడు.
సమాధి పక్కన నిలబడివున్న పోలయ్య ఒక్క పరుగున వెళ్లి “ఏం బాబు!” అంటూ చేతులు కట్టుకొని అతని ముందు వినయంగా నిలబడ్డాడు. ఎప్పుడైనా చేతుల బనీను, పంచెకట్టుతో వున్న పోలయ్య నమ్మినబంటులా అన్పిస్తాడు.
పోలయ్యను చూడగానే అతను ఎండలో నిలబడినట్లు చిందులేస్తూ “ఎన్నిరోజులు కడతారయ్యా ఆ సమాధిని? వస్తూ, పోతూ చూడలేకపోతున్నాం. రోడ్డుమీద నడిచే వాళ్లకి పెద్ద ‘షో‘ అయిపోయింది. ఇప్పటికి రెండు శ్లాబులు వేశారు. సమాధి కడుతున్నారా? అపార్టమెంట్ కడుతున్నారా?” అడిగాడు.
అతనొక కాంట్రాక్టర్ అయి వుండి కూడా యాక్సిడెంట్ లో పోయిన తన తండ్రికి ఇంతవరకు సమాధి కట్టించలేదు. తన కళ్లముందే ‘ఆడపిల్ల‘ తండ్రికి సమాధి కట్టిస్తుందంటే అతనికి తలవంపుగా వుంది. ఏదో మామూలుగా కడుతుందిలే అనుకున్నాడే కాని ఇంత హంగామాగా తీర్చిదిద్దినట్లు కడతారనుకోలేదు. ఇప్పటికే కొంతమంది దారినపోతూ ఆ సమాధిని సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకొని వెళ్తున్నారు.
“మాట్లాడవేం పోలయ్యా?” అతని గొంతు గర్జించింది.
పోలయ్య ఉలిక్కిపడ్డాడు.
– అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
Comments
జ్ఞాపకం – 104 – అంగులూరి అంజనీదేవి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>