వలసపక్షి(కవిత)-పంపోతు నాగేశ్వరరావు
ఊహ తెలిసినప్పటి నుంచి
ఒక పులుంగుని
బంధించాలని ఆహరహం చూస్తున్నాను
ఇక్కడ సీమ విత్తనాల ప్రతిఫలాన్ని
విదేశాల్లో ఖర్చు చేస్తుంది
వాడికి కరెన్సీ నోటు కరపత్రాల్లా కనిపిస్తుంది
వ్యాపార మంత్రముపేదేశించి
బాంకులముంగిట నీతిమంత్రం
జపించి
పొట్టనంతా కట్టలతో నింపేసి
అసలు గాక వడ్డీలెగదోసేసీ
విదేశీయానం చేస్తాడు
ఇక్కడ నక్కలు గుంట నక్కల
రాజ్యమేలుతోంది
ప్రజల నెత్తురు తాగి
దేహాలను మాత్రం వేలాడదీత్తాయి
రైతులకి
కొమ్మలపూలే చివరి అక్షింతలు
సేద్యమడేండు తూన్నా
బాంకుల దాహం తీరాల్సిందే..?
వీడి విలాసం కోసం
నాగలి పన్ను కట్టాల్సిందే.
ఎగవేతలోల్ల సూట్ బుస్కొటుకై
కార్మికుల కండలు ఖర్చు చేయాల్సిందే…!
వీళ్ళు మౌనం వహిస్తున్నారు
పచ్చని బడ్జెట్ పత్రం పరాయితనం పాలై వాడి విలాసం కోసం మాఫీ
ఫైళ్ళు మీద అనాగరిక సంతకం చేత్తాయి…!
ఓ మంత్రివర్యా..
ఈ మాఫీలైమైనా ఒకమారైనా
కాడెకి చేసుంటే నేలనవ్వి
విత్తు ప్రాణం పోసుకునేది…?
దేశమంతా మకిలి
కాల్వలెక్కువైనాయీ..!
ఏమూల చూసినా ఆర్థిక నేరగాళ్లు
వృద్ధిపథ కాల్వకు సంకెళ్లు తొడిగారీళ్ళు.
యిప్పుడు దేశదేహమంతా
ఆర్థిక సంక్షోభ గీతం వింటుంది
అప్పడ్డది నాదేశం
ముందుకెళ్ళదీ దేశం…!
ఎవరెన్ని కొట్ల చదివింపులు
సభల్లో పత్రాలను
నెమరేసినా
ముక్కుతాడు కట్టిన యెద్దుమల్లె
కల్లంలో కర్రకు కట్టబడింది నా దేశం
వాడు మాత్రం కోట్లు చప్పరించి
రూపాయి జమకడ్తాడు
వాడు
విదేశాల్లో శీతల పానీయాల తాగితే
యిక్కడ కూలీలు సుంకం కడ్తారు
బ్యాంకులన్నీ చోద్యం చూస్తూంటాయి…!!
ఎవరి వాటా వారిదే..వారి తీరు వారిదే….!
ఇదంతా ప్రజాస్వామ్య పద్మవ్యూహం
ఊబిలో చిక్కుకునేది మాత్రం
మధ్యతరగతి, రైతులు మాత్రమే
ఒకరి ఆకలి కోసం
ఎన్నెన్ని పేగులు ఉపవాస దీక్షలు
చేయాలో….!
వాడి పేగుల్లో మత్తు పానీయం పారుతుంటే
యిక్కడ సేద్యుడి పేగుల్లో పురుగు మందులే పార్తాయి.
రెండు ప్రవాహలోక్కటే
రూపం తీరు వేరు….!
ఆర్థిక గాడిని చెరిచి విదేశాలకు
ఎగురుతున్న అప్పు పక్షుల్ని
సర్కారొళ్ళేం జేస్తున్నారు..?
బ్యాంకులేంజేస్తున్నాయి…?
వీరి పనితనం రైతుల ఫోటోకి
దండలెయ్యడం..!
అయినా నాకిప్పుడు తెలియాల్సిందల్లా వొకటే
ఎరిరే ఆ కుంభకోణ పక్షిని
విదేశాల్లో పొదిగిస్తున్నది ఎవరని…?
(అప్పులు ఎగవేత చేసి విదేశాలకి వలస వెళ్లే వారి గురించి)
-పంపోతు నాగేశ్వరరావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
వలసపక్షి(కవిత)-పంపోతు నాగేశ్వరరావు — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>