చచ్చి మీ కులానికే పుడతాం! (కవిత)- -బాలాజీ పోతుల
మా దళిత జీవితాలు చరిత్రకు ఎక్కాలంటే:
తరతరాలుగా మాపై జరుగుతున్న
ఆగడాలకీ,అఘాయిత్యాలకీ, అణచివేతలకీ,
మేము ఉరి కొయ్యలెక్కి
మీ ముందే ఉరేసుకొని చావాలి
తీసుకున్న అప్పు తిరిగి కట్టలేదని,
మీ అగ్రకుల మూకలు
మాపై రక్కుతూ బలాత్కారమాడాలి!
మీ జాతి స్త్రీలను ప్రేమించామన్న నెపంతో,
మా కళ్ళు పీకి,
మా మర్మాంగాలను కోసి చంపాలి!
మా తలలను తెగ నరుకాలి!
తెలీక మీ పవిత్ర ప్రదేశాల్లోకి చొరబడ్డామని,
మీ పూల పాన్పుల్ని తాకామని,
ముక్కుపచ్చలారని మమ్మల్ని,
మీ దౌష్ట్యానికి బలి చేయాలి!
మమ్మల్ని అన్ని విధాలా దోచుకోండి
నగ్నంగా నడి వీధుల్లో తిప్పండి
ఆ నగరపు నడి బొడ్డునే ఖననం చేయండి
సామూహిక దాడులు జరిపి,
ఉత్సవంలా ఊచ కోతలు కోయండి
నరహత్యా పాతకాలేవీ మిమ్ముల చుట్టుకోవు
మమ్మల్ని నాశనం చేసినందుకు గాను,
పెద్దపెద్ద అవార్డులు మీకై ఎదురుచూస్తున్నాయి
మా జీవితాల్ని బుగ్గిపాలు చేసినందుకు గాను,
మమ్ముల శాసించే అధికారాలు
మిమ్ముల అందలమెక్కిస్తాయి
మేం బానిసలుగా ఉన్నంతకాలం,
మమ్మల్ని చంపే అవసరం మీకెక్కడిది?
మేం తిరగబడితేనే కదా మీరిన్ని చేసేదీ!?
మీరు అణుస్తున్నంత కాలం,
విదిలించుకుని తిరగబడుతూనే ఉంటాం!
బడి, గుడి, మా వాడ, మీ వీధి,
ఎక్కడైనా మేము అంటరానివాళ్లమే!
మా బతుకులన్నీ అణగారిన అస్థి పంజరాలే!
మీరు మా కళ్లల్లో కారం కొట్టి,
మా నోటికి నీరు అందిస్తరు!
మా జీవితాలను మురికి చేసి,
ఆపై మూత్రాభిషేకం చేస్తరు!
మా స్త్రీలను నమ్మించి, మోసగించి,
ఆత్మహత్యలకే అర్పిస్తున్నరు!
చీకట్ల గొంతునులిమి,
మా బతుకు దివిటీని ఆర్పుతున్నరు!
ఇట్లైనా మా జీవితాలు
చరిత్రకి ఎక్కుతాయంటారా?
ఎక్కకపోతే,
ఈ పవిత్ర దేశంలో
దళితులుగా పుట్టినందుకు,
శిక్షల్ని ఇంకా తీవ్రతరం చేయండి!
చచ్చి మీ కులానికే పుడతాం!
మీ రంగుని మా పేయంతా పులుముకుంటాం!
లేకుంటే,
మా దళిత జీవితాల్లో మళ్లీ పువ్వులై విరబూస్తాం!
మీ అణచివేతనీ,
కమ్మ కత్తులై తెగ నరుకుతాం!
-బాలాజీ పోతుల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
చచ్చి మీ కులానికే పుడతాం! (కవిత)- -బాలాజీ పోతుల — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>