గూట్లో చిక్కుకున్న ప్రేమ పక్షి! (కవిత)-మౌనిక నీరుడి

ప్రేమగా ప్రేమించాను
ప్రేమే జీవితమనుకున్నాను
అందుకే ప్రేమించిన వాడినే పెళ్లాడాను
పెళ్లయ్యాకే తెలిసింది,
అది ప్రేమ కాదని!
అది తెలిసొచ్చేనాటికి,
ఓ రెండేళ్ల పాప చేతికొచ్చింది
పొద్దు పొడవక ముందే సాన్పేసి,
పొద్దు పొయినాక గుల్లెడు రొట్టెలు గొట్టి,
రోజంతా గుండెల్లో గునపాలు దింపుకొని,
సాపైన పతంగికి మల్లె నా జీవితం,
దినదినం దిగులు దివిటీలార్పుకొని దిగజారిపోయింది
చదువుకున్నది పదే అయినా,
ఏం చేయాలో తెలియని అయోమయం.
స్వేచ్ఛగా ఉండాల్సిన నా జీవితం,
ఓ రాక్షసుడి చేతిలో నలిగిన చీమయిపోయింది
తండ్రిని – తల్లి వదిలేసి చాన్నాళ్లైంది,
తండ్రి ఇంకొకరిని పెళ్లాడీ చాన్నాళ్లైంది.
ఇలా నా జీవితం అగమ్యగోచరమైంది.
తాతయ్య నాయనమ్మలు ఉన్నా,
లేనట్టే తోచింది
ఎండిపోతున్న చెట్టుకి
నీళ్లు పోసే వాడే ప్రేమికుడని నమ్మాను,
ఫలాలు పండాకే తెలిసింది,
అంగట్లో నన్ను అమ్మే వ్యాపారస్తుడని
మోసపోయానని తెలిశాక,
ఈ గందరగోళ జీవితాన,
నాకు దిక్కేది, దారేది?
ఆడపిల్లగా పుట్టి పెద్ద పాపమే చేశాను,
అందునా అంటరాని అతివగా
విడాకుల చిట్టా విసిరి,
విడివడుటే మిగిలింది
-మౌనిక నీరుడి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
గూట్లో చిక్కుకున్న ప్రేమ పక్షి! (కవిత)-మౌనిక నీరుడి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>