గాయాల గాయని!(కవిత) -బాలాజీ పోతుల
మా ఇంటెన్క బాలక్క,
రాగం తీసి పాడుతుంటే,
రాళ్లైనా కరుగుతయనిపించేది!
మాయదారి మాయలోకం,
ఆడదానికి పాటెందుకని అన్నప్పుడల్లా,
“నీ గొంతెత్తి పాడే అక్క..”
అని గట్టిగా అరవాలనిపించేది!
ఐతారం దినం నాడు,
టీవీ సూడనికని ఆలింటికి పోతే,
తిన్నవారా? అని అన్నమేసిచ్చి,
టీవీలచ్చే పాటలన్నీ ఇనసొంపుగ పాడే బాలక్కకి,
తమ్మున్నై ఎందుకు పుట్టలేదా అని ఏడ్చేవాడిని
ఆడతనపు పాటనే కాదు, ఆమెనీ వెలివేసింది,
పదహారేళ్లు నిండాయో లేదో,
పెళ్లి పాటని పాడమని
లోకమంతా కోడై కూసింది
ఆ గేయపు గాయాలు, గుండెల్లో
ముళ్ళ పొదలని పెంచాయి!
పాటలు పాడకుండా ఆపే ఆ గొంతులు,
ఏనాడు మూగబోతాయో,
ఆ దినం వేయి గొంతుకల్తో,
తన తల్లి రాగాన్ని ఎత్తుకొని,
గుండెలవిసేలా పాడుతుంది
తన నోటిని కుట్టి వేయొచ్చు,
తన గొంతుని కొడవలితో కొయ్యొచ్చు
కానీ,
తన గుండెల్లో నిండుకున్న
పాటనేం చేస్తారు?
ఆమె ఇప్పుడు ఒట్టి గాయని కాదు,
గాయాల గాయాన్ని నిశ్శబ్దం
తెగిపడేంత గట్టిగా పాడే,
గాయాల గాయని!
-బాలాజీ పోతుల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
గాయాల గాయని!(కవిత) -బాలాజీ పోతుల — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>