ఉగాది (కవిత)- గిరి ప్రసాద్ చెలమల్లు
విశ్వావసు వస్తుంది విశ్వాసం నింప
కానీ మతోన్మాదం కడు వేగంగా విస్తరిస్తుంది
ఇంటిముందరి వేప చెట్టు మీది కాకి అరవట్లేదు
బంధువులొస్తారనే కబురూ లేదు
యాంత్రిక జీవనంలో మనిషి
యంత్రమై భావోద్వేగాలకు దూరం
కొబ్బరి ఆకుల మధ్య కోయిల కూతలో
రామజపం వినిపిస్తుంది
తానెక్కడ జీవం విడవాల్సి
వస్తుందేమోననే భయంతో
వేపపూత రాలిపోతుంది
అందరిలో ఇమిడిపోయి రుచినిచ్చిన గతం
ఇప్పుడు ఒకే మతమనే రాజ్యం నినాదం రుచించక
మామిడి తోరణాల్లోన దాగివున్న పురికోస
ఎవరు తయారు చేసారని మావిడాకులు అడుగుతున్నాయి
అన్యమతస్థులైతే ఎక్కడ తెంపేస్తారోనని ఆవేదనతో
కలాల్లో సిరా బైటికి రానని మొరాయిస్తుంది
కవుల్లోని భావాలు అస్థిర వ్యవస్థను ప్రశ్నిస్తే
సిరా తప్పని ఖైదుని చేస్తారేమోనని
అక్షరాలు అల్లుకోట్లేదు
పదాల కూర్పు కుదురుకోట్లేదు
చింతపండు చేదెక్కి దిగనని మొరాయిస్తుంది
గలగల పారిన నీళ్ళు గరళాన్ని మోసుకొస్తున్నాయి
సీసాల్లో నీళ్లు కీళ్లనొప్పులు తెస్తున్నాయి
ప్రశ్నించే గొంతులు లేవని
ఉగాది పచ్చడి గొంతు తడపనని తెగేసి చెప్పింది
అరవై ఏళ్ళ క్రితం చూసిన
సమైక్యత సమగ్రత కానరాక
విశ్వావసు విస్తుపోతుంది
రానున్న రోజుల్లో ఇంకెన్ని
ఘోరాలు చూడాలనో అనుకుంటూ
కోయిలను వెంటేసుకుని
వెళ్ళి పోవాలనుకుంటుంది
– గిరి ప్రసాద్ చెలమల్లు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
ఉగాది (కవిత)- గిరి ప్రసాద్ చెలమల్లు — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>