సర్కారు తుమ్మ ముల్లు’-కథ-3-డా.బోంద్యాలు బానోత్(భరత్)
కుడి కాలుకు సర్కారు తుమ్మ ముల్లు స్లీపర్ చెప్పులనుండి దిగీ అరికాల్లో ఇరిగింది. అది మూలవాసాకు మొలగొడితే ఎట్లా నైతే అతుక్కొనుంటదో, అదేవిధంగా ఉంది. నా అరికాలు గండాన, ఎనభై శాతం అరిగిన ఈ స్లీపర్ చెప్పును, నా అరికాలుకేసి కదలకుండా, ఏసుక్రీస్తును సిలువేసినట్లూ ఉన్నది. ఆ నొప్పి భరించలేక ఎక్కెక్కి ఏడుస్తుంటే, ఆ ఏడుపు వినీ, ఎవరో…! దారెంటా పోయే పున్యాత్ముడు, నా దగ్గరకు వచ్చి, చూసి ఆ ముల్లును బయటికి లాగుదామని ప్రయత్నిస్తూంటే, ఎటూ పట్టు దొరకడం లేదు. స్లీపర్ చెప్పుల మడిమ కిందా మొత్తం అరిగినయి, బొటనవేలు కిందీ భాగం మర్ర్యాకు మందమే మిగిలింది. గూడ కింది గుండీ అరిగిపోగా, గూడ ఊడకుండా పిన్నీసు పెట్టి ఉన్నది. అరికాలు కిందా అంతగా అరగలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ సర్కారు తుమ్మ ముల్లు అవుతలికివుతలికెల్లేది.
ఏడ్చీ-ఏడ్చీ కళ్ళనీళ్ళతో రెండు చెంపలు తడిచి, ఛాతి మీద అంగీ కూడా తడిసింది. ఏదోవిధంగా నన్ను మాటల్లో దింపి, ముల్లును,
ముల్లుతోపాటూ ‘స్లీపర్ చెప్పును’ సప్పున బయటికి గుంజి తీసిండు ఆ బాటసారి. వెంటనే రక్తం కారటం మొదలయింది. రక్తం కారకుండా దాని మీద మెత్తటి మట్టేసి, నా తువ్వాలకొస చింపీ, కట్టు కట్టి, నన్ను సైకిల్ మీద ఎక్కీంచుకోని, రావోల్ల ఇంటికి ‘అంజయ్య’ డాక్టర్ వద్దకు తీసుకుని పోయిండు.
‘అంజయ్య డాక్టర్’ కాలు చూసి, క్లీన్ చేసి, ముందు రాసి, కట్టు కటిండు. “ఇంత చిన్నోడివి, అంతంతా ముళ్ళ కంపల్లోకి ఎందుకు పోయినవు..!?. ‘పాలబుగ్గల’ పిలగాడు, కన్నీళ్ళతో బుగ్గలు తడిసినయి. సంతోషంగా బడికి పోయే వయసులో.., అరే! అసలు విషయం చెప్పురా! ఈ ముల్లు ఎక్కడ ఇరిగింది? ఎందుకు ఇరిగింది..?” ఇంతపెద్ద ముల్లు ఇరగడానికి అసలు కారణం తెలుసుకొవాలని అడిగాడు, ‘అంజయ్య డాక్టర్’.
“ఐతే, అసలేమైందంటే..! నేనప్పుడు మూడవ తరగతి చదువుతున్న. రేపటినుండీ సంక్రాంతి పండుగ సెలవులు అయిపోయి, బడి నడుస్తుందనగా, ఆ సాయంత్రం 5:30.గంటలకు, బడిలోని పూల చెట్లకు, నీళ్లు పోస్తూన్న సమయంలో మా పెదనాన్న(తండా నాయకుడు), ఇంకో ముగ్గురు కలిసి, రెండు మేకలు, ఒక గొర్రెను తోలుకోని వస్తూండగా, మేకమరక తప్పించుకోని పోతుంటే, దాన్ని మలుపుకోని రమ్మనగా, నేను అతని మాట వినని కారణంగా, మా ఇంటి మీదికొచ్చి గొడవ చేశాడు. ఐతే, అతనికి మంత్ర-తంత్రాలు, చేతబడి వాస్తాయని , ఆయన కంట్లో పడితే చేతబడి చేసి చంపుతాడని, నమ్మేవాళ్ళు. అందుకు భయపడి మా నాన్నా నన్ను బడి మాన్పించిండు. అటు బడికీ పోక-ఇంటి వద్దా ఏపని చెయ్యకా ఖాలిగా ఉంటే ఎటూకాకూండా పోతాడని, దానికి తోడు పేదరికం.., ‘కర్ణూడి చావుకు అనేక కారణాలు’ అన్నట్టూ, నేను బడి మానేసి, పశువుల కాపరిగా జీతము ఉండడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి.
ఐతే మొత్తానికి, మా నాన్న నన్ను ‘కోరెం సంజీవ రెడ్డి’ ( కాపు సంజీవయ్య) వద్ద పశువుల కాపరిగా జీతము ఉంచిండు.
ఐతే, జీతముంచే ముందు కనీస ఒప్పందాలు, సదుపాయాల కల్పనలు, జీత-భత్యాలు..’కట్టు-బాట్లూ’ మెదలగు విషయాలు ..మాట్లాడుకున్నారు.
* * *
ఐతే, ‘మొదటి సంవత్సరం,’- నెలకు కుంచేడును అడ్డేడు ‘ఒడ్లూ’, 1000-2000 రూపాయలు ‘అప్పూ’, వడ్డీతో తిరిగి సంవత్సరానికి ఇచ్చే విధంగా ఒప్పందం. సంవత్సరానికి రెండు జతల ‘చెప్పులు’, ఒక వాన కోటు, పన్నేండు నాకాలు. నేను చాలా చిన్నవాన్ని( ఏడు సంవత్సరాలు దాటి, ఎనిమిదోవ సంవత్సరంలో అడుగు పెట్టానట) కనుకా ‘కేవలం పశువులను కాయడమే’ నా పని.’
ఐతే, రెండవ సంవత్సరం కూడా జీతం అతని దగ్గరే ఉంచాడు మా నాన్న. రెండవ సంవత్సరం కూడా అవ్వే ఒప్పందాలు ఒప్పుకున్నాడు. ఒక నెల-నెల జీతం మాత్రమే ‘కుంచేడును అడ్డేడు’ నుండి ‘రెండు కుంచాలును అడ్డేడు’ అంటే రెండవ సంవత్సరానికి గాను ‘ఒక కుంచేడు’ ఒడ్లు పెంచాడు.
ఐతే, ఈ పై ఒప్పందాలు, ఒప్పుకోవడమే తప్పా, ఆచరణలో ఏవి పాటించలేదు. గా జీతం తాలో-బోలో తప్పా. ఒప్పందం ప్రకారం చెప్పుల జోడు ఇప్పించి ఉంటే, ఈ ముల్లు ఇరిగేదే కాదేమో..!?” అని నాకు జరిగిన అన్యాయాన్ని పూస గుచ్చినట్లూ వివరించాను. ఇది విన్నా ఆ డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ” ఈ పిలగాడు చాలా చిన్నవాడు, చిన్న పిల్లల్ని పనిలో పెట్టుకోవడం రాజ్యంగం ప్రకారం నేరం, వాస్తవంగా నీ వయసు పిల్లలందరూ ‘బడిలో ఉండాలి కాని పశువుల దొడ్లో ‘బాండేడ్ లేబర్’ గా కాదు” అని అన్నాడు బాధపడుతూ.. .
* * *
ఐతే, ఒక రోజు పశువులకు నీళ్ళుతాపడాని సర్వలకుంటకూ కుంటుకుంటూ
తోలుకోని పోయిన. మా పశువులు నీళ్ళు తాగి వెనకకు మర్రినయే లేదో, ఇంతలోనే ‘కోరెం కిష్టయ్య'(కోరెం క్రిష్ణా రెడ్డి), ‘కోరెం భూపాల్'(కోరెం భూపాల్ రెడ్డి), ‘లచ్చు గాడు'(కాళు)..తమ తమ పశువులకు నీళ్ళు పెట్టడంకోసం తోలుకొని సర్వలకుంటకు వచ్చారు. మా అందరి పశువులు కమ్ముగా నీళ్ళు తాగి, వెనకకు మర్రి నిమ్మలంగా దొడ్డి(పశువుల కొట్టం) బాట పట్టినాయి. మేమందరం పశువుల వెనకాల నడుస్తూ పోతున్నాం. ఐతే, కుంటుతున్న నన్ను చూసి, ” ఏమయింద్రా..!?, అంతగనం కుంటుతున్నవ్!.” అన్నాడు ‘కిష్టయ్య’ నా కాలు వైపు చూస్తూ. “ముల్లిరిగిందీ పటేలా” అన్నాను కాల్నొప్పితో కుంటుకుంటూ. ” అరే..! ఎటు చూసుకుంటూ నడిసినవు?, ముళ్ళూ, పురుగూ-బుశి..జర జాగ్రత్తగా వుండాల్రా..! వింటున్నావారా..!?, గొడ్లను కొట్టంలో తోలి, తడకేసి మర్రిచెట్టు కాడికి రా..!, ముల్లు తీస్తా..” అన్నాడు ‘కిష్టయ్య’ నాకు జాగ్రత్తలు చెప్పుతూ. అనుకున్నట్టుగానే పశువులను గొడ్ల కొట్టంలో తోలి, బయటికి రాకుండా తడకేసి, కుంటుకుంటూ మర్రిచెట్టు కిందికి పోయిన. అక్కడా కోరెం ‘కిష్టయ్య’ తోపాటు ‘భూపాల్’, ‘కోరెం వెంకట రెడ్డి’ జీతగాడు, ‘లచ్చు గాడు’, ‘బుచ్చేంకయ్యా'(బుచ్చేంకట రెడ్డి), ‘బుచ్చేంకయ్యా’ జీతగాడు ‘బాదావత్ సేట్రాం’… అన్నం తిన్నా తర్వాత ఒకరి చుట్టాతో ఇంకొక్కరు చుట్టాంటు పెడుతున్నారు. ‘బుచ్చేంకయ్యా’ మాత్రం తన చకమకరాయితో ‘నిప్పుగొట్టీ’ చుట్టాంటించుకునే ప్రయత్నం చేస్తూ.. ” కిష్టయ్యా, గీ..పోరడు ఎవ్వల కొడుకు? ” అడిగిండు నా వైపు చూస్తూ. ” వీడా..! గీ.. మన లంబాడి తండా ‘భీలు’గాని కొడుకు గాదు..!?” “ఐతే ఇక్కడి కెందుకు వచ్చిండో..!?” “మన ‘సంజీవయ్య’కూ జీతమున్నడు. గొడ్ల కాడా!” “అరే..! గా వాడు గొడ్లను మర్రేస్తాడార!, పైగా అవీ దొంగ గొడ్లు, పాపం, పాలపండ్లు కూడా రాలలేదు, ఉంచేటోడి కంటే బుద్ధి లేదూ అనుకుందాం.. కాని ఉంచుకునే వాడికుండొద్దా..!?” అన్నాడు జకమక రాయితో నిప్పుకొట్టీ, చుట్టాంటుపెడుతూ.
ఈ మాటలు విన్న వెంకటరెడ్డి ” గొప్ప -గొప్పోలే పశువులను గాసిండ్రూ, ‘పోతూలూరీ వీరబ్రహ్మం’ గారు పశువుల మేపుకుంటా కాలజ్ఞానం చెప్పిండూ-రాసిండు. అతని మహిమతో పశువులను ఒకే ప్రదేశంలో మేసేవిధంగా వాటి చుట్టూరుగా గిరి గీసి, ఒక చెట్టు కింద హాయిగా కూర్చోని కాల జ్ఞానం రాసే వాడట.., అది చూసి జనాలందరూ ఆశ్చర్యపోయే వారట.., అదే విదంగా ఆ పిలగాడు కూడా పశువుల కాసీ గొప్పోడైతుండొచు చెప్పలెం..” అన్నాడు చమత్కారంగా. ఈ మాటలు నన్ను మెచ్చుకోని పొగుడుతున్న ట్టు అనిపించింది, లోలోన సంతోషమనిపించింది. ఒకవైపు ముల్లు తీయడానికి పిన్నీసు కుచ్చి ముల్లును అటూ-ఇటూ కదిలీస్తూంటే ప్రాణం పోయినంతగా నొప్పిగా వుంది. కండ్ల పంటీ నీళ్ళు కారుతూ రెండు చెంపలు తడిసినయి. “ఈ ముల్లు ఇప్పుడు ఎల్లదురా!, కాని మూడు రోజుల తర్వాత అదే బయటికొస్తది” అని ఆ గెల్లగిచ్చిన స్థానంలో, పిన్నీసుతో పళ్ళమషి పెట్టీ, కలమందా కొంచమంతా వేడి చేసి, ముల్లున్నచోట పెట్టీ, కదలకుండా గుడ్డపేగుతో కట్టీ ,” మీ పటేల్నీ ‘చెప్పుల’ జోడు కొనీయమని అడుగు లేకుంటే కాల్లకు ముండ్లు ఇరుగుతునే ఉంటాయి.” అన్నాడు. ఐతే, ఆరోజు సాయంత్రం పూటా పశువులను మేపుకొచ్చి, దొడ్లో కట్టేసి, మేతేసి, గలమకు తడకేసి.. ఖాలి-సద్దిగిన్నే పట్టుకోని కుంటుకుంటూ ఇంటికి పోతుంటే, బాటలో ‘కాళు గాడు’ కలవడంతో
మేమిద్దరం కలిసి ఇంటకెల్లిపోయినం. అదంతా చూసీ మా నాన్న బాధ పడ్డాడు, కాని చేసేది ఏమిలేకా తిరిగి నాకే జాగ్రత్తలు చెప్పడం మొదలు పెట్టాడు. రోజు తెల్లారి పొద్దున్నే , పొద్దు పొడవక ముందే రెండు కి.మీ. నడిచి పోవలసి వుంటుంది.
ఈ రోజు కూడా కుంటుకుంటూ కష్టంగానైన, మెల్లగా మెల్లగా పశువుల దొడ్డి కాడికి చేరుకుంటున్న, అప్పటికే పొద్దుగాల పొద్దుగాల ఎర్రగ పొదుపొడిసింది. రోజు పొద్దు పొడవక ముందే దొడ్డికాడుండేవాన్ని కాని ఈ రోజు ఆలస్యం అయింది. పటేలు ఏమంటాడో..! అనే భయం మొదలైంది..! . అనుకున్నట్టే, ఈ రోజు నేను దొడ్డి/కొట్టంకాడికి చేరుకునే ముందే మా పటేలు, గొడ్ల పెండకళ్ళుతీసి, ఊడ్సి, శుభ్రంచేసి, మేతేసి, బర్రెపాలు పిండి తన కూతురు చేతికి పాలచెంబు చేస్తూండగా, నేను చేరుకున్న.
“ఏంమ్రా..! నీకిప్పుడు తెల్లారిందా..!?, నీతోటి జీతగాండ్లందరు..చూడు ఎప్పుడొచ్చిండ్రొ..!?, తండా నుంచి ఈ దొడ్లకాడికీ, ఉచ్చబోసినంత దూరం కూడా లేదు..! . నూవ్వు ,ఈ గింతంత
దూరం నడవడానికి బారేడు పొద్దెక్కింది, ఈ గొడ్ల పెండకళ్ళేవరు తీయ్యలె..!?, దొడ్డెవడు ఊడువాలె..!?, వాటికి మేతెవడేయ్యలె..!?, ఈ పనులన్నీ నేన్జేసింతర్వాత..నువుండెందకురా..!?, పొయిన సంవత్సరం అంటే చిన్నపిల్లోడవని మూణ్ణెల్లదాక గొడ్లను మర్రెసుడు తప్పా..వేరె ఏపని కూడా మెంచెప్పలేదు నువ్వు చెయ్యలేదు. ఆ తర్వాత నీకు చేతనైనన్ని పెండకళ్ళు తట్టలేసుకొని పెంటమీద పడెయ్యరా..అంటే.. దానికి రెండుజామలు జేస్తివి, దొడ్డి/కొట్టం ఊడవరా..!?అంటే..! ఆనంగీనంగూడిస్తీవి..!, గడ్డి వామినుంచి వరిగడ్డి గుంజి గొడ్లకేడం చాతకాదు.. పొద్దున పూట గా పాలిచ్చే బర్రెకూ పచ్చి గడ్డి కోసుకొరా..రా..అంటే..!, అందరు మోపెడు మోపెడు గడ్డి కోసుకొస్తూంటే.. నువ్వేమో ముత్యమంత, గింతంత కోసుకొని వస్తివి.. పొయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి పనిలో-చేతల్లో ఏం తేడాలేదు కాని జీవితం మాత్రం పెరిగింది, పొయిన సంవత్సరం నెలకు కుంచేన్నడెడైతే, ఈ సంవత్సరం రెండు కుంచాల్నడ్డె డాయే..! మీదికెల్లి సంవత్సరానికి.. రెండు జతల చెప్పులు, వాన కోటు/జాబు, పన్నేండు నాకాలు..అన్ని ఇచ్చుకుంటూ..ఈ పనులన్నీ కూడా మేమే చేసుకోవాలె..ఈ యవ్వ..నీపనే బాగుందిరా..!” అంటూ తన కోపాన్నంత నా మీద ప్రదర్శించాడు మా పటెల్ ‘కోరెం సంజీవ రెడ్డి'(కాపోల్ల సంజీవయ్య).
“నేనేవన్నా కావాలని పొద్దెక్కినంకా వచ్చిన్నా..! నా కాల్కు ముల్లిరిగీ నడవనిస్తలేదు, ఐనా కూడా కుంటుకుంటూ వచ్చే వరకూ కొంచమంత పొద్దేక్కిందీ అంతే..! దానికే.. ఇన్ని మాటలు అంటున్నవు..!, పొయిన సంవత్సరం నుంచి కాళ్ళకు ముళ్ళు ఇరుగుతునే వున్నాయి, రెండు కాళ్ళకు ముల్లిరగని స్థలమే లేదు
..!, చెప్పులు కొనిస్తాని..అనబట్టీ రెండు సంవత్సరాలు కావస్తున్నా యీ.. ఇప్పటొరకు కనీసం ఒక్క జత చెప్పులు.. కూడా కొనియ్యలేదు, ఇప్పటికైనా ఒక చెప్పుల జత కొనివ్వు.. లేకపోతే ఆ ముళ్ళ కంపల్లో , ఈ దొంగ గొడ్లను మేపడం నా వల్లా కాదు..!” అని నేను అన్నాను. ” అరే..! చెప్పులు చెప్పులు..నువ్వదే పాట..నీ’అయ్య’ అదే మాట.., అరే..! చెప్పుల్లేకుండా ఎవ్వరూ నడవటంలేదా ఈ లోకంలో..!? ఐనా చెప్పులేమన్నా నేన్జేసేటీవా..!?, ఎన్ని రోజులయేనో వానికి చెప్పీ, ఇప్పటి వరకు వాని జాడలేదు-పత్తలేదు..! దానికి నేనేం చేయాల్రా.ఇగో..అప్పటిదాకా ఈ చెప్పులేసుకో ” అంటూ, మాట మార్చీ, మొత్తానికే అరిగిపోయిన తన కూతురీ ‘స్లిప్పర్లు’ నా మొఖాన పడేసిండు..మా పటేలు. ఇక ‘లేనత్తా కంటే గుడ్డ్యిత్త నయం’ అన్నట్టూ, స్వర్గానికి సమీప భవిష్యత్తున్న ఈ చెప్పులను ఏసుకోని, పశువులను కాస్తున్నా.. .
ఐతే, ముల్లిరిగిన కాలుకు కట్టిన ‘కలమందా’ కట్టూ, నడుస్తూంటే అటూ-ఇటూ జారిపోతుంది. అది జారినప్పుడల్లా, సరిచేసి కట్టుకున్న. ఇప్పటికీ రెండు రోజులైనయీ. ముల్లు బయటికి ఎప్పుడెప్పుడు వస్తుందా..!అని ఎదురుచూస్తున్న సమయంలో, ముల్లిరిగిన చోట చిట-చిట పెట్టీ, నొప్పి పెట్టగా, మర్రి చెట్టుకింద కూసోని కట్టు ఇప్పీ చూడగా, ముల్లిరిగిన చోట మెత్తగా, బోలుగా వుండీ, అందులో నున్నగా నల్లటి ముల్లు కనబడింది. రెండు చేతుల బొటనవేల్లతో రెండు వైపులనుండీ గట్టిగా ఒత్తిన. పుస్సు..మని ఒక ఇంచు పొడుగు ముల్లు బయటికి వచ్చింది. అది బయటికి రావడంతోనే కాలు నొప్పి బారాన మందం తగింది. ‘కిష్టయ్య’ చేసిన మేలు మరువలేనిది, అని అనిపించింది.. .
ఇప్పటిదాకా ‘ఉగాది’ నుండి వానాకాలం వరి నాట్లేసే వరకు పశువులను మేపడానికి విశాలమైన మడికట్లూ, బిల్లోల్లమోద్గులు, పటేలోల్లతుమ్మలు, మరీ ముఖ్యంగా మంగలగిరి/ సర్కారు తుమ్మ చెట్లతో కూడిన విశాలమైన బీడు భూములు ఉండేవి, ఐతే ఆ బిడుభూముల్లో ఉగాది నుండి ఎండాకాలం అయి పోయి వానాకాలం వరినాట్లేసి, విత్తనాలు ఏసేంతవరకు మాత్రమే, ఆ ప్రాంతమంతా తిరిగి మేసేటివి, కానీ ఒక్క సారీ వరినాట్లేసి, విత్తనాలేసిన తర్వాత, పశువులను మేపడం చాలా కష్టమైన పని అయ్యింది. ఇక ఇప్పటినుండి మా పశువులను మా కంచేలోనే మేపుకోని, ఒక నియమం ప్రకారం కంచే నుండి పశువుల దొడ్డి వరకు ఉండే పానాది/డొంక/ బాటా/దారి గుండా తోల్కొపోయే వాన్ని.. .
ఐతే ఇప్పుడు వానాకాలం మొదలైంది. అందరూ వేసన విత్తనాలు మొలకెత్తి పశువుల నోటికందేంతా ఎత్తు పెరిగినయి. ఎక్కడికక్కడ వరి నాట్లేస్తుంన్నరు. ఇక ఇప్పటి దాకా స్వేచ్ఛగా మేయటం అలవాటైన పశువులు, ఇప్పుడు పరిమితమైన ప్రాంతంలో మేపడం వలన ఒకచోట నిలిచి మేయకుండా ఎటుబడితే అటూ ఉరకడం, గంతులేయడం, రంకలేయడం, చేన్లోపడి మేయడం, మొదలు పెట్టినయి..ఎంత మర్రేసినా ఒకచోట ఆగుతలేవు, ఒక కోడే తప్పించుకోని లేతాకుల ధర్మయ్య(ధర్మా రెడ్డి) చేన్లోపడి వేరుశెనగ మొలకలు మేసింది, అందుకు ఆయన నన్ను దొరకబట్టీ , ఆ చంపా-ఈ చంపా వాయించి, నా రెండు చేతులు కట్టీ, మర్రిచెటుకు కట్టేసిండు..ఏడవంగా..ఏడవంగా ” ‘బిడ్డా’ ఇంకోసారి నీ గొడ్లూ మాచేన్లో పడాలే.. అప్పుడు చెప్పుత నీసంగతి, ఇప్పుడంటే ఉట్టిగనే కట్టేసిన, కానీ ఇంకోసారి కట్టేసి కిందా మంట
పెడుత.. బిడ్డా..!ఏ మనుకుంటున్నావో..!, నా సంగతి నీకు పూర్తీగా తెలువదీ..!, ఏమనుకుంటున్నావో మల్లా..!” అని భయపెట్టాడు ధర్మా రెడ్డి.
* * *
ఐతే, ఒక రోజు రాత్రి విపరీతంగా వర్షంవచి, కాలువల్లో, వాగుల్లో నీళ్ళు ప్రవహించి, మరునాడు ఆ ప్రవాహం తగ్గినంకా ఆ వాగులో తడీ ఇసుకా నున్నగా ఉన్నది, మోతుకుల్లో పశువులు కదలకుండా మేస్తున్నాయి.., నేను నా చూపుడు వేలుతో ఆ వాగులో నున్నటి తడి ఇసుక మీద ‘అ ఆ’ లు ..’ఱ’ వరకు, ‘ఒకట్రెండ్లు’ ‘1..100’ వరకు , నా పేరు:బొంద్యాలు, మా నాన్న పేరు: భీలు, మా అమ్మ పేరు: సీత, మా తండా పేరు: బొత్తల తండా, మా ఊరు: మైలారం, తాలుక: వర్దన్నపేట, జిల్లా: వరంగల్.. అని రాస్తుండే వాడిని. బర్రె, దున్నపోతులు నాల్లగా నేరడు పండులా వుండేవి, ఎప్పుడైనా సుద్ద రాయే లేదా చాక్ పీసో చేతికి దొరికితే నాకు పండుగే, ఎందుకంటే..!? ఆ బర్రె, దున్నపోతుల వీపు మీద, పక్కలకు అక్షరాలు, పేర్లు రాసేవాడిని. దీన్ని గమనించిన
‘భూపాల్’ ” అరే..! నీకు రాయటం-చదవడం వచ్చారా..!?” అని అడిగిండు, ఆశ్చర్యంగా. “అ.. వచ్చూ, చూస్తూన్నావు కదా..!” అన్నాను నార్మల్ గా. “ఐతే ఇన్ని రోజులు నుండి కలిసి-మెలిసి ఉంటున్నాము, ఎప్పుడూ చెప్పవైతివి..గిట్లే ఉంటదార..! ” అని అన్నాడు ‘భూపాల్ ‘. “ఎవరైనా..ఊరకనే వచ్చీ ‘నాకు చదువు వచ్చు’ అని చెప్పుకుంటార..! ఐనా చెప్పుకొని ఏమి లాభం, మూడవ తరగతి వరకు చదివి, మానేసి, ఇదిగో గొడ్లను కాసుతున్నా.. ” అని అన్నాను.
ఐతే, రోజు రోజుకు రోజులు గడుస్తునే ఉన్నాయి..పజ్జొన్న చేన్ల కోతలైనయి, లూటి పోయినయి.తమ తమ పశువులను మేపే కంచెలు కూడా లూటిపోయినయి, ఆ పట్టె పశువులు అన్ని కలిసి ఒకే ప్రాంతంలో మేస్తున్నాయి, పశువుల కాపరులు అందరూ, ఆ విశాలమైన మర్రిచెట్టు కింద ఉన్నారు. కొందరు ‘కోతికొమ్మ’ ఆట ఆడుతున్నారు. ఒక్కరిద్దరు గుండం గీసి థప్పాలాట ఆడుతున్నారు. ఇద్దరు-ముగ్గురు గుండం గీసి, పైసలాట ఆడుతున్నారు. నలుగురైదుగురు ‘జిల్లాగోనె’ ఆడుతున్నారు, నేను ‘జిల్లాగోనె’ ఆడే గుంపులో ఉన్నాను …ఈ విధంగా ఎవరికి నచ్చిన ఆటలు వారు ఆడీ, పొద్దు బూకాల్లకు, వారి వారి పశువులను, తమ తమ దొడ్లో తోలి, మేతేసి, తడక పెట్టీ, చీకటి పడుతుండగా ఇంటికి, పోతుంటారు; ఐతే ,నేను కూడా నా పశువులను దొడ్లో తోలి, మేతేసి, తడకేసి తండాకెల్లి పోయిన… .
ఐతే,అలా రోజులు, వారాలు, నెలలు.. గడిచిపోతున్నాయి.. . ఇగ ఉగాది పండుగకు మూడు నెలలు మాత్రమే ఉన్నాయి. ఈ ఉగాదికి కచ్చితంగా రెండు సంవత్సరాలు అయిపోతాయి. ఇక జీతం మానేసి, హాయిగా ఇంటివద్దనే ఉండొచ్చు అని అనుకున్నాను. కాని అన్ని మనము అనుకున్నట్టు అయితయా..!?. ఈ సంవత్సరం, ‘జీతం’ ”ఇక నా దగ్గర ఉండడు” అని తెలుసుకోని మా పటేలు ‘కోరెం సంజీవ రెడ్డి’
(కాపోల్ల సంజీవయ్య), తీసుకున్న ‘రెండువేలు’ రూపాయలు అప్పూ వడ్డీతో ఉగాదికి లేదా ‘ఉగాది’ కి ముందే కట్టీ,
‘జీతం’ మానేయాలని, మా నాన్నతో మూడు నెలల ముందునుండే హెచ్చరించడం మొదలు పెట్టాడు.. .
ఐతే, ‘ఉగాది’ రోజు రోజుకు దగ్గిర బడుతుంటే, మా నాన్న ఆ ‘అప్పూ’ గురించి ఆలోచిస్తూ..” మల్లా ఈ సంవత్సరం కూడా అక్కడే జీతముండమంటే వీడుండడూ, ‘అప్పూ’ కట్టకుంటే ఆ పటేలు ఊరుకో డూ, కనుకా,ఇప్పుడు ఇంకెక్కడైనా జీతముంచి, కొత్త ‘అప్పూ’ తెచ్చి పాత ‘అప్పూ’ కట్టడం తప్పా వేరే మార్గం లేదు.” అని భావించి.. మల్లీ నాకు తెలియకుండానే, ఊళ్ళో ‘శాల కేదారి’ వద్దా ‘జీతం’ కుదిరించుకోని.. మెల్లగా నాతో “ఈ ఒక్క సంవత్సరం, ఓపిక పట్టీ, ‘శాలోల్ల కేదారి’ దగ్గర జీతం ఉండు బేటా.., ఏం పని ఉండదటా!? నాలుగైదు బర్లను రోడేమ్మటి మేపుకొచ్చి, దొడ్లో కట్టేయలె’ ఆ తర్వాత నీ ఇష్టం, ఉంటే ఉండూ, లేకుంటే లేదు..” అని అంటుంటే..ఏమనాలో తెలియని పరిస్థితుల్లో “ నాకు ‘నిండా మునిగిన వాడికీ చిలిపెట్టదు..’ అన్న సామెత గుర్తుకు వచ్చింది … .
–డా.బోంద్యాలు బానోత్(భరత్)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
సర్కారు తుమ్మ ముల్లు’-కథ-3-డా.బోంద్యాలు బానోత్(భరత్) — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>