నేనెందుకు చచ్చిపోవాలి(కథ)-శశి
“సోఫాలో టవల్స్ ఏమిటి? ఇల్లంతా ఇంత చిరాగ్గా ఉంది పొద్దుట్నుంచి ఏం చేస్తున్నావ్? ఇల్లు నీట్ గా పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు?”ఆఫీస్ నుంచి వస్తూనే చిరాకు పడిపోసాగాడు రఘు.
“అది కాదండి నాకు ఒంట్లో బాలేదు”నెమ్మదిగా చెప్పింది కీర్తన.
“ఏ ఏమొచ్చింది మాయిరోగం? ఎప్పుడు నస. పగలంతా పనిచేసే అలసిపోయి ఇంటికి వస్తే మనశ్శాంతి ఉండదు. మా ఆఫీస్ లో ఆడవాళ్ళు ఎంత హుషారుగా ఉంటారో! వాళ్లంతా ఇళ్లల్లో పనులు చేసుకొచ్చే వాళ్లే. నువ్వు కష్టపడన అవసరం లేకుండా, నేనే రెక్కలు ముక్కలు చేసుకుంటున్న ఇంకా ఏడుపు”
పొద్దుటి నుంచి హై ఫీవర్, జలుబు, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ, ‘భర్త ఎప్పుడు వస్తాడా? డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. కనీసం మందు బిళ్ళయినా తెచ్చి పెడతాడు’ .అని ఎదురుచూసిన, కీర్తన విరక్తిగా ఇంట్లో పనులు చేయడం మొదలు పెట్టింది. అలాగే ఓపిక చేసుకుని వంట, మిగిలిన పనులన్నీ పూర్తి చేసి భర్తకు భోజనం వడ్డించింది. కూరలో ఉప్పు తక్కువైందని తిడుతూనే భోజనం చేసి ‘మాటవరసకైనా నువ్వు తిను’, అని కానీ’ ఒంట్లో ఎలా ఉంది మందు బిళ్ళ తీసుకురానా’ అని కానీ, అడక్కుండానే వెళ్లి పడుకున్నాడు రఘు.
వంటింట్లో పని పూర్తి చేసి బెడ్ రూమ్ లోకి వెళ్ళాలి అనిపించక కుర్చీలో కూర్చుని డైనింగ్ టేబుల్ మీద తల పెట్టుకునీ పడుకుంది. కన్నీళ్లు ఆగటం లేదు. జ్వరభారం బాగా ఉంది. అయినా వెళ్లి పడుకోవాలనిపించడం లేదు. తనమీద తనకే కసిగా కోపంగా ఉంది. పెళ్లయిన దగ్గర నుంచి రఘు ఇంతే.
పెళ్లిచూపుల్లో తెల్లగా అందంగా ఉన్నాడు, సాఫ్ట్వేర్ జాబ్, మంచి జీవితం ,అని తెగ మురిసిపోయింది. తాంబూలాలయ్యాక ఫోన్లో పొడిపొడిగా మాట్లాడుతుంటే మితభాషి అనుకుంది. ‘జాబ్ చేయడం నాకు ఇష్టం లేద’ని చెప్పినప్పుడు, మొదటిసారి ఆలోచనలో పడింది.”అలవాటు లేని వంట పని, ఇంటి పని సమర్ధించుకోవాలి. పైగా ఈ లోపు కడుపు, పిల్లలు, వాళ్ళ ఆలనా, పాలన. పిల్లలు స్కూల్కు వెళ్లడం మొదలుపెడితే కానీ నీకు కాస్త తీరిక దొరకదు. అప్పటికీ నీకు ఉద్యోగం చేయాలనిపిస్తే, అల్లుడ్ని ఒప్పించొచ్చులే. పెళ్లయిన వెంటనే ఉద్యోగం అంటే ఇంటా బయట సమర్ధించుకోలేక ఇబ్బంది పడతావు”అని తల్లి నచ్చ చెబితే సరిపెట్టుకుంది.
పెళ్లయి, రఘు ఉద్యోగం చేస్తున్న బెంగళూరులో కాపురం పెట్టాక,” రఘులో ఉన్న పురుషాధిక్యత, ఆడవాళ్లంటే ఉన్న చిన్న చూపు” నెమ్మదిగా అర్థం అయ్యాయి.
మొదట్లో భర్తను మార్చుకోవాలని చాలా ప్రయత్నం చేసింది. కీర్తనకు విసుగు వచ్చిందే తప్ప, రఘులో కొంచెం కూడా మార్పు లేదు .పెళ్లయిన కొత్తలో ఒకసారి ప్రేమతో, ఇష్టంతో ,ఎంతో కష్టపడి, రఘు కి ఇష్టమైనవన్నీ వండి, తను వచ్చేసరికి ఇల్లంతా సర్ది, తాను చక్కగా తయారై, భోజనం వడ్డించినా ,”మా అమ్మయితే ఈ కూర ఇంకా బాగా చేస్తుంది. పప్పులో పోపు పైకి కనిపిస్తే బాగుంటుంది” అంటూ సలహాలు ఇచ్చాడు.
“మీకోసమే కష్టపడి చేశాను బాగుందని ఒక్క మాట చెప్పొచ్చుగా”అంటే
“నువ్వు విమర్శలు తీసుకోలేవు. తప్పులేమిటో చెప్తేనే కదా, వాటిని సరి చేసుకుని, రేపు ఇంకా బాగా చేయగలవు. అయినా నిన్ను పొగడటమే నా పని అనుకున్నావా? పొగడ్తలే కావాలంటే, బాగా పొగిడే వాడినే చూసుకుని పెళ్లి చేసుకోవాల్సింది” అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు.
నిశ్చేష్టురాలై నిలబడిపోయింది కీర్తన. ఆరోజు భోజనం కూడా చేయకుండా చాలా సేపు ఏడ్చింది. ఆ ఒక్కరోజే కాదు, ఆ ఒక్క సందర్భమే కాదు, చాలా సందర్భాల్లో ఏడుస్తూనే ఉంది. కోపం విసుగు వచ్చి, ఎప్పుడైనా రఘుని ఎదిరిస్తే “నా ఇంట్లోనే ఉంటూ, నా తిండి తింటూ, నన్నే నిలదీస్తావా ?”లాంటి మాటలకు జీవం లేని శవమై అవుతొంది కీర్తన.
ఇంట్లో ఎంత పని చేసినా, ఎంత బాగా వంట చేసినా, ఎంత చక్కగా తయారైన ,ఏదో ఒక వంక పెట్టి, తీసి పడేసినట్టుగా మాట్లాడతాడే తప్ప, “బాగుంది “అన్న ఒక్క మాట, అస్సలు అనడు.
తల్లిదండ్రులు ఫోన్ చేసినా, “కీర్తనా ! అల్లుడుగారు ఎలా ఉన్నారు? టిఫిన్ చేసి వెళ్ళారా ఆఫీస్ కి ?లంచ్ బాక్స్ ఇచ్చావా? వంటలు కుదురుతున్నాయా? ఉప్పుకారాలు ఎక్కువ తక్కువ వేసి ఇబ్బంది పెట్టట్లేదు కదా?” అంటారే తప్ప,
“నువ్వెలా ఉన్నావు? అలవాటు లేని వంట చేయగలుగుతున్నావా? ఇబ్బంది పడుతున్నావా? అల్లుడుగారు బాగా చూసుకుంటున్నారా?”అని మాటవరసకి కూడా అడగరు.
తనే “విసుక్కుంటున్నాడు, ప్రతిదానిలో తప్పులు వెతుకుతున్నాడు”. అని చెప్పినా,
“ఒక్కొక్కళ్ళ స్వభావం ఒక్కోలా ఉంటుంది. నెమ్మదిగా తెలుసుకుంటాడు లే ,బయట చాలామంది మందు, సిగరెట్లు, అమ్మాయిలని చెడు వ్యసనాల్లో పడి, ఇల్లు గుల్ల చేస్తుంటారు. పెళ్ళాల్ని కొడతారు ,చిత్రహింసలు పెడతారు. కానీ మన రఘు కి అలాంటి అలవాట్లు ఏమీ లేవు .మాట కరుకు గానీ, రఘు బంగారం” అంటూ అల్లుడ్ని పొగుడుతారు.
రోజురోజుకీ జీవితం మీద ఆసక్తి తగ్గిపోయి విసుకు విరక్తి పెరగసాగాయి.
చాలాసార్లు చనిపోవాలనుకుంది కానీ ధైర్యం చాలలేదు.
కానీ ఈరోజు తనకి ఒంట్లో బాగోకపోయినా, తన చేత పని చేయించుకుని, కనీసం తన స్థితిని పట్టించుకోకుండా నిద్రపోతున్న భర్త. తన బాధ ఇది అని చెప్పి నోరు తెరిచి చెప్పినా అర్థం చేసుకోని తల్లిదండ్రులు . అసలు ఈ లోకంలో తన గురించి ఆలోచించే వాళ్ళు కానీ ,తనకి ప్రేమను ఆప్యాయతను పంచేవారు గానీ ,ఎవ్వరు లేరు అనిపించింది.
తెలియని ఆవేశం పూనింది కీర్తనకు. తను వేసుకున్న చున్నీ తీసుకుని, డైనింగ్ టేబుల్ పక్కకి జరిపి, కుర్చీ వేసుకుని ,కుర్చీ ఎక్కి, ఫ్యాన్ కి చున్ని ఒకవైపు గట్టిగా ముడివేసింది. రెండోవైపు చున్నీని తన మెడకు బిగించుకుని కూర్చీని తన్నేసింది.
అంతకుముందే డైనింగ్ టేబుల్ జరిపిన చప్పుడికి మెలకువ వచ్చి, కీర్తన ను తిట్టుకుంటున్న రఘు. ఇప్పుడు కుర్చీపడిన శబ్దానికి కోపంతో కీర్తనను తిట్టాలని డైనింగ్ హాల్ లోకి వచ్చి, ఎదురుగా కీర్తన ఫ్యాన్ కి వేలాడుతూ గిలగిలలాడటం చూసి, ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే తేరుకుని, పరుగు పరుగున కీర్తన దగ్గరికి వచ్చి, కింద పడిన కుర్చీని లేపి, కీర్తనను దానిపై నిలబెట్టి, పక్కనే మరో కుర్చీ వేసుకుని, కీర్తన మెడకి ఉన్న చున్నీ లాగేసాడు.
కీర్తన కిందకు దిగి గొంతు పట్టుకుని దగ్గుతూ కుర్చీలో కూర్చుంది.
రఘు” కీర్తనా !ఇప్పుడు నీకు చచ్చేంత కష్టo ఏమీ వచ్చింది? హాయిగా ఇంట్లో తిని కూర్చోలేక, ఎదవ ఏడుపులు ,ఎదవ గోలలు, నేనేదో నిన్ను టార్చర్ పెడుతున్నట్లు లోకానికి చెప్పాలని అనుకుంటున్నావా? ఉండాలనుకుంటే ఇంట్లో ఉండు, లేకపోతే నీ పుట్టింటికి వెళ్ళిపో .అంతేగాని నువ్వు చావకు ,నన్ను చంపకు,” అంటూ కీర్తన చేయి పట్టుకుని బలవంతంగా బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్లి “నోరు మూసుకుని పడుకో” అని తను వేరే వైపు తిరిగి పడుకున్నాడు.
మంచం మీద కూలబడిన కీర్తనకు, కన్నీళ్లు ఆగటం లేదు. ఆలోచనలు ఆగటం లేదు.
“ఇప్పుడు రఘురావటం ఆలస్యం అయితే, తాను చనిపోయి ఉంటే, రఘు’ ఇది చచ్చి నన్ను ఇబ్బంది పెట్టింది’ అని తిట్టుకుంటాడేమో ?’ఆఫీస్ కి సెలవులు వేస్ట్ అయ్యాయని’ బాధపడతాడేమో”?
అమ్మ వాళ్లు ,అత్తగారు వాళ్ళు,” శుభ్రంగా కాపురం చేసుకోకుండా, పిచ్చితనంగా ప్రాణాలు తీసుకుని, మా పరువు తీసేసిoది” అనుకుంటారేమో?
అసలు నేను చచ్చిపోతే ఎవరైనా బాధపడతారా? మరి వీళ్ళ అందరి కోసం నేను ఎందుకు చచ్చిపోవాలి?” అని అనుకుని కళ్ళు గట్టిగా తుడుచుకుని టైం చూస్తుంది రాత్రి వంటి గంట . గడియారం ముళ్ళు తిరుగుతోంది తప్ప, నిద్ర మాత్రం రావటం లేదు. రఘు హాయిగా నిద్రపోతున్నాడు.
తెల్లారి ఏమీ ఎరగనట్టు ఆఫీస్ కి వెళ్ళిపోయాడు రఘు. కీర్తన ఒక దృఢ నిశ్చయానికి వచ్చి,తనబట్టలు, వస్తువులు సర్దుకుని ఇంటి తాళం పక్కింట్లో ఇచ్చి , ట్రైన్ ఎక్కి ముంబైలో ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తున్న తన ఫ్రెండ్ మౌనిక దగ్గరికి వెళ్ళింది. విషయమంతా విన్న మౌనిక, “కీర్తన మంచి పని చేసావ్. మనకి గౌరవం, మనమంటే ప్రేమా, లేని చోట మనం ఉండకూడదు. నీకు గుర్తుందా? మనం చాలా ఇష్టపడి ఇంట్లో పెద్దల్ని ఒప్పించి మరీ ,ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరాం. ఎంత ఆక్టివ్ గా ఉండే దానివి నువ్వు. పైగా మన కాలేజీకి ఫస్ట్ .ఇప్పుడు నీ వాలకం చూస్తుంటే ,అప్పటి నా ఫ్రెండ్ కీర్తనవేనా ?అనిపిస్తోంది. మూర్ఖత్వంగా ఆలోచించి, బాధలు పడుతూ అక్కడే ఉండిపోకుండా, ఏ అఘాయిత్యానికి పాల్పడకుండా, సరైన నిర్ణయం తీసుకున్నావ్ .మా ఆఫీస్ లోనే ఒక పోస్ట్ ఒకటి కాళీ ఉంది చేరుదువు .నీ మనసు కొంచెం కుదుటపడ్డాక, ఏం చేయాలో నిర్ణయం తీసుకుంది గాని” అంది.
ఆ మాటలకి కాస్త తేరుకున్న కీర్తన, తల్లికి ఫోన్ చేసి తను ఇంట్లోంచి వచ్చేసిన విషయం చెప్పింది.
తల్లి కంగారుపడి”కీర్తన ఎంత పని చేసావ్? ఎందుకిలా చేశావు? భర్తను వదిలేసిన ఆడవాళ్ళని సంఘం చాలా చిన్న చూపుతో చూస్తు0ది. నాన్న నేను ఈ పూట బెంగళూరు బయలుదేరుతాం. నువ్వు కూడా రా. అల్లుడుగారు కాళ్లు పట్టుకునయినా నిన్ను మళ్ళీ ఏలుకోమని బతిమాలుతాం”అంది.
“అమ్మ! నేను ఇక నేను రఘు తో కలిసి బతకలేను. ఆడదాన్ని ఒక పనిమనిషి కన్నా హీనంగా చూసే చోట నేనే కాదు ఏ ఆడపిల్ల కూడా బతకలేదు. పుట్టి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రులని, అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, అందరిని ,అన్నిటిని ,వదిలి అత్తారింట్లో అడుగు పెట్టే ఆడపిల్లకి, ఆ ఇంట్లో కలిసిపోయేలా ప్రేమాభిమానాలు స్వేచ్ఛ ఇవ్వాలి . తెలిసొ ,తెలియకో చేసే చిన్న చిన్న పొరపాట్లను ప్రేమతో సరి చేయాలి. అంతేకానీ అధికారం ఉంది కదా అని, తన ముందే, తనని, తన పనులని ,తన పుట్టింటి వారిని, తక్కువ చేసి మాట్లాడటం, ఏం చేసినా వంకలు పెట్టడం, వలన ఆడపిల్ల ఎంత మానసిక క్షోభకు గురవుతుందో తెలుసా? అసలు మనస్ఫూర్తిగా వాళ్లతో కలవగలదా? ఆడపిల్లకి కొన్ని ఇష్టాఇష్టాలు ఆశలు కోరికలు ఉంటాయని మరిచి,’ ఒక మర బొమ్మల ఇంటిడు చాకిరీ చేస్తూ, పిల్లల్ని కంటూ బతికేయి. ఇదే నీ జీవితం’ అనటం, ఎంతవరకు సమంజసం? నేను చదువుకున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడగలను. పెళ్లే జీవితానికి పరమావధికాదు. రఘుకు విడాకులు ఇచ్చేస్తాను. తర్వాత సంగతి నెమ్మదిగా ఆలోచిద్దాం” అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా, ఫోన్ పెట్టేసింది కీర్తన.
-శశి,
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
నేనెందుకు చచ్చిపోవాలి(కథ)-శశి — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>