..ఐతే ,ఆరోజు ఇంకొద్దిసేపైతే పొద్దు పొడుస్తూందనగా, సర్వలకుంటా కట్ట దాటి మారెమ్మ మర్రి దగ్గరకు చేరుకుంటున్నాను.. . వరంగల్ వైపుకు పోయే రోడ్డుకు పోతూ-పోతూ నావైపు చూస్తూ, ఈలేసి, కేకేసి..”ఇగో నేను పోతున్నా, రాయపర్తికి పోయి వరంగల్ బసేక్కుతా. నువ్వుకూడా వచ్చేయి. వరంగల్ బస్టాండు నుండి మొగిలి చెర్ల బసెక్కీ, కోళ్ళ ఫారం దగ్గర దింపమను, ఆ కోళ్ళ ఫారంలోనే నేనుంటాను.. తొందరగా వచ్చెయి..” అంటూ నెమ్మదిగా ఉరుకుతూ వెళ్లి పోతుండు ‘రవిందర్’ గాడు.
ఐతే ,నేను కూడా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. కాని నా దగ్గర పది రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఐతే పోవడానికి, పరీస్థితిని బటి, అవసరమైతే మళ్ళిఇంటకి రావడానికి అవసరమైనన్ని, అంటే కనీసం ఒక యాభై రూపాయలైన ఉండాలి.. దాని కోసం ఆలోచిస్తూ.. మా యజమాని ‘గౌరి కేదారి’ ఇంటికి చేరుకున్నాను. నెత్తికి తువ్వల చుట్టుకోని, రాళ్ళగోడమీదున్న , పెండ తట్ట తీసుకోని, దున్నపోతు తోక ఇరిసి పక్కకు జరిపి పెండ తీయ్యబోతే పక్కుకు జరిగేది పోయి నా వైపే జరిగీ దాని వెనుక కాలుతో నా ఎడమ కాలును తొకింది, వెంటనే అమ్మా.. అంటూ ఆ దున్నపోతును పక్కకు నెట్టీ, కాలు నొప్పితోనే పక్కనున్న ఓ రాయి మీద కూర్చొని చూస్తే, అది విపరీతమైన నొప్పి పెడుతుంది. అరికాలు పైభాగాన పల్చాటి చర్మం పైపొర కొటుకోపోయింది. కొద్ది సేపు ఆ గోడరాయి పైన కూర్చున్నాను. కాని నామనస్సులో కోళ్ళ ఫారంకూ వెళ్ళి పోవాలనే కోరిక బలంగా మెదులుతుంది. మల్లీ లేసి బర్లకాడి పెండతీసి పెంటమీదేసిన. ఇక రెండు పయ్యెడ్ల పెండ తీయడానికి పోతే బొల్లి పయ్యది ఎప్పూడూ లేనిది ‘ఫట్’ మని తన్నింది.ఆది వెంట్రుక పాటులో తప్పీ, కొద్దిగంత కొసతాకింది, లేకుంటే నా కాలే ఇరిగేదేమో..! .ఈ రెండు సంఘటనలు నన్ను, వెల్లిపోవలని బలంగా ప్రేరేపించినయి. ఏక్కడైనా సరే పైసలు బదులడిగీ, తొందరగా వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నాను.
నాకు తెలిసిన వాళ్ళును ఒక్కలిదరిని.. ముప్పైరూపాయలు బదులు అడిగితే లెవ్వన్నారు. చివరి ప్రయత్నంగా మా దంటగాన్ని అడిగాను. వెంటనే తన నెక్కర్ జెబునుండి తీసి 30 రూపాయలు ఇచ్చాడు. అవి తీసుకుని జాగ్రత్తగా జేబులో పెట్టుకున్న. అప్పటికే పొద్దున సమయం 8 గంటలు అయింది. మా యజమాని ‘గౌరి కేదారి’ బర్ల దొడ్లో నుండి బయటకు వెళ్లి, బడెనుకనుండీ, సంద్యొల్ల పొలం నుండి, ఎర్ర రామయ్య ఇంటెనుకబడి, వరంగల్ కు పోయే రోడ్డేమ్మడి-రోడ్డేమ్మడి, ఆ బంటాలెమ్మడి, ఆ సలేద్ర చెట్లేమ్మడి, ఎవ్వరి కంఠా బడకుండా, రాయపర్తి వాగు దాటి, కోడల్దోయి గుడిదాటీ మెల్లగా రోడ్డేక్కీ , రాయపర్తి బస్టాండ్ కు చేరుకున్న. అప్పుడే నా అదృష్టానికి బసోస్తూంది. నాకు బస్ బోర్డు చదవడం వచ్చూ కనుకా బోర్డు చూస్తే ‘వరంగల్ ‘ అని రాసి ఉంది. వెంటనే దబదబ బస్సేక్కీ కూసున్న. ఇక నన్న ఎవ్వరూ పట్టుకోలేరు అని అనుకున్నాను. బస్సు కదలగానే ఎప్పుడు లేనంత ఆనందం కలిగింది. కొంతదూరం వెళ్ళాక, కండక్టర్ టికెట్ టికెట్ అనుకుంటూ వచ్చాడు. “వరంగల్ కెంతా టికెట్?” అని అడిగాను. “రెండున్నర” అన్నాడు కండక్టర్. నెక్కర్ జెబునుండి 5 రూపాయలు తీసి ఇచ్చాను.ఆయన తిరిగి టికెట్ తో పాటు రెండున్నర రూపాయలు ఇచ్చాడు. ఇగ బస్సు పొతనే వుంది. ఇక నాలో ఏవేవో కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. కాని చిన్న భయం కూడా వెంటాడుతోంది. ‘కోళ్ళఫారం అడ్రస్ దొరికేనా!? లేదా!’ అని. అదే సమయంలో ఎట్లైన దొరకబడత అనే ధీమా కూడ నాకున్నది.
కోళ్ళఫారంలో పని దొరికితే నా కష్టాలు కొంతవరకు తీరుతాయి… అలా ఆలోచిస్తూంన్నా.. ఇంతలోనే వరంగల్ బస్టాండ్ రానే వచ్చింది. బస్సుదిగీ, అటూ -ఇటూ, చుట్టూరుగా చూస్తూ ఆశ్చర్యపోయాను. ఎందుకంటే..!? మొదటిసారి ఇంత పెద్ద సిటీని చూస్తూన్నను. అప్పటికే సమయం 12 గం. అయితుంది. కడుపులో ఆకలి దంచేస్తోంది. ఎదురుగా కొంచమంతా దూరంలో అరటీ పండ్లబండి కనబడింది. అరటీ పండ్లబండి దగ్గరికి వెళ్ళి ” అరటీ పండ్లు ఒకటి ఎంతా? ” అని అడిగాను. ” చారనా కొకటి” అని అన్నాడు” రూపాయిన్నర ఇచ్చి అరడజను అరటీపండ్లు తీసుకున్న. ఆకలేస్తూంటే సప్ప-సప్ప మూడరెటీ పండ్లు తినేశాను. మిగతా మూడు తువ్వాల కొసకు కట్టుకున్న. తిరిగి బస్టాండ్ లోకి వచ్చి, కండక్టర్ ను ” ‘మొగిలి చెర్ల’ బస్సు ఎక్కడికి వస్తూంది? ఎప్పుడొస్తుంది?” అని అడిగాను. ఐతే అతను అటువైపు చూపిస్తూ “గా తెల్ల డ్రెస్ వేసుకున్న సార్నడుగు అన్నీ వివరంగా చెప్పుతాడు..” అని అన్నాడు. అతని దగ్గరికి పొయి, “సార్ మొగిలి చెర్ల బస్సెపుడు వస్తుంది సార్” అని అడిగాను. ” నెంబర్ 2 మీదికి వచ్చి ఆగుతుంది, అరగంటకోటి ఉంటది, అక్కడ నిలబడు 15 నిమిషాల్లో ఒక బస్సున్నది..” అని అన్నాడు. అలాగే పోయి నిల్చున్న. ఆ బస్సు రానే వచ్చింది. బోర్డు చూస్తే ‘మొగిలి చెర్ల’ అని రాసి ఉంది. బస్సు దొరికిందనే సంతోషం కలిగింది, జల్ది జల్ది ఎక్కీ సీటు మీద కూర్చున్నాను. కండక్టర్ టికెట్ టికెట్ అనుకుంటూ వచ్చాడు. ” బాబు టికెట్ ఎక్కడికి తొందరగా చెప్పూ.. ” అని అన్నాడు కండక్టర్. ” సార్, ‘మొగిలి చెర్ల కోళ్ళ ఫారం’ కూ పోవాలె. ” ఏ కోళ్ళ ఫారం బాబు, అక్కడ కోళ్ళుఫారాలు చాలా వున్నాయి.” అని అన్నాడు కండక్టర్. ఏం చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడప్పుడు ఆ కోళ్ళ ఫారం గురించి నా దంటగాడు చెప్పుతుండేవాడు..” ఆ కోళ్ళఫారం ఆ పట్టెకే పేద్దదని, బస్సులో పోతుంటే అన్నింటి కంటే ముందుగా వస్తుందని, దానికి పేద్ద ఇనుప పాటక్ గేటుందనీ, అది రోడ్డుకు పక్కేంమటే ఉంటుందని..” చెప్పేవాడు. ” అదే సార్ పోతాంటే అన్నిటి కంటే ముందుగా వస్తుంది, పెద్ద కోళ్ళ ఫారం, రోడ్డుకే ఉంటుంది చూడూ అదే, అక్కడే దిగాలె..” అవ్వన్నీ నాకు తెలియదు, కానీ వచ్చే కోళ్ళఫారం దగ్గర దిగు! ఓకేనా! ” అన్నాడు కండక్టర్. ” మంచిది సార్” బారాన ఇచ్చి టికెట్ తీసుకోని కూర్చున్నాను.
బస్సు బయలు దేరింది. ఎన్నడూ చూడని ప్రాంతం.. లోలోన ఏదో తెలియని భయం. మల్లి ఏదేమైనా కాని, అనే ధైర్యం. భయము మరియు ధైర్యము, ఈ రెండీటి మద్య నా మనసు కొట్టుకొంటుంది. చెయడానికి పని దొరకడం-దొరకకపోవడం అనే విషయాన్ని పక్కన పెడితే, అసలు అడ్రస్ దొరకడం ముఖ్యం. అడ్రస్ దొరికితే, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి.. అని లోలోన ఆలోచిస్తూన్నాను… . ” కోళ్ళఫారం ఎవరు!? దిగండి తొందరగా..” అని అన్నాడు కండక్టర్. నేను లేసి దబదబ బస్సుదిగాను. చుట్టుపక్కల చూస్తే దగ్గరలో కోళ్ళ ఫారం లేదు, కాని అదే రోడ్డుకు ఫర్లాంగ్ కంటే తక్కువ దూరంలో పెద్ద పెద్ద చెట్లు, అందులో ఇండ్లు.. కనిపించినయి. భౌషా కోళ్ళ ఫారం అదేనేమో..!? అనుకున్నాను. నేను బస్సు దిగిన చోట, రోడ్డుకు పక్కన చిన్న దుకాణం ఉంది. అందులో పెద్దమనిషి ఉన్నాడు. అతన్ని అడగగా ” అగోఎదురుగా రోడ్డు పక్కన చెట్లున్నయి చూడూ, అందులోనే ఉంది కోళ్ళఫారం” అని అన్నాడు. ‘ఇక నేను ఎక్కడికైతే పోవాలనుకున్నానో అక్కడికి చేరుకున్నాను’ అని అనిపించింది. ఇక నెమ్మదిగా నడుచుకోంటూ ఆ కోళ్ళ ఫారం గేటు వద్దకు చేరుకున్నాను. చూస్తే ఆ పరిసరాలన్నీ.. వాడు చెప్పినట్టే ఉన్నాయి. అది ఇదే అని అనిపించింది. పెద్ద గేటుకు ఒకమనిసి పెట్టే అంత ఒక చిన్న గల్మవున్నది. అక్కడ ఒక మనిషి లాటి పట్టుకోని నిలబడి ఉన్నాడు. ” అన్నా .. నా పేరు బొంద్యాలు, మాది మైలారం, ఇందూలో మా దంటగాడు ఉన్నాడు, వాళ్ళ అమ్మ-నాన్నా, అక్కా-బావా అందరూ ఇందులోనే పని చేస్తూంన్నారు, వాళ్ళు మాకు చుట్టాలు, వాళ్ళ ఇంటికి వచ్చాను, వాళ్ళను కలవాలి…. ఎట్లా!? కాసంత సాయం చెయ్యవా..!?” అని అడిగాను.” పెరూ చెప్పు” “మా దంటగాని పేరు ‘రవిందర్’. ” అని అన్నాను. ఒక మనిషిని పింపీ, రవిందర్ ను రప్పించాడు. అతన్ని చూడగానే ఎనలేని ధైర్యము, సంతోషం కలిగింది. వాడు తనతోటి లోపటికి, వాళ్ళుండే చోటికి తీసుకుని పోయాడు.
ఆ కోళ్ళ ఫారం చాలా విశాలంగా ఉంది. లోపల కోళ్ళ ఫారాలు చాలానే ఉన్నాయి. రకరకాల పూల చెట్లు, పొడుగాటి చెట్లు.. ఉన్నాయి. కాని వాళ్ళు ఉండే గది చాలచిన్నదిగా,ఇరుకుగాను వున్నది. నేను పోయేసరికి 3గం.అయింది. నేను పోయేసరికి వాళ్ళ అక్కా రొట్టెలు చేస్తూంది. మా దంటగాడు ‘రవీందర్ ‘ వాళ్ళ అక్కకు సహాయం చేస్తున్నాడు. కాని ఆ ప్రాంతమంతా కోళ్ళ పెండ కంపువాసన వస్తూంది.ఆ వాసన భరించలేనిదిగా వుంది .అక్కడ గంటసేపు కూడా వుండలేని పరీస్థితి. ఇక్కడికి వచ్చి తప్పు చేసిననేమో.. అని అనిపించింది. ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’ లా తయారయింద పరీస్థితి. ” ఇంత వాసనలో ఎంట్లుంటున్నారు?” అని అడిగితే ! ” ఏది..!? వాసన..మాకేం రావడంలేదే!? “అన్నాడు నార్మల్ గా. ఒకవేళ వచ్చినా పోను పోను అదే అలవాటైపోతుంది.” అన్నాడు మా దంటగాడు. “ఇగో అక్కడ కాళ్ళు- చేతులు కడుక్కుని రా భోజనం చేద్దాం. రేపు 10గం.లకు ఓనరొచ్చినంకా, మనము పోయి పని గురించి మాట్లాడుకుందాం.” అన్నాడు మా దంటగాడు. నేను సరేనన్నాను.
ఐతే ఆరోజు తెలందాక నిద్రపట్టలేదు. మస్తిష్కంలో అనేక ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. అట్లో-ఇట్లో తెల్లారింది. అందరూ 7గం. లకే తమ తమ పనులకు వేళ్ళు తున్నారు.10గం. సమయానికి తయారై మేము కూడా,ఆ కోళ్ళఫారం ఓనర్ దగ్గరికి వెళ్ళాము. ఆయన మా దంటగాడికీ పరిచయం. ” సార్ , ఇతను నా దంటగాడు. మేమిద్దరం మైలారం ఊళ్ళో జీతమున్నం. అక్కడా జీతముండడం ఇష్టంలేక, కోళ్ళఫారంలో పనిచేద్దామని వచ్చినం. మాకేమైన పనీయ్యరా?” అని అడిగిండు నా దంటగాడు ‘భూక్యా రవీందర్’. “మీరు ఈ ఫారంలో ఏపని పని చేస్తారు?” అని అడిగాడు ఓనర్. ” మేము ఈ ఫారంలో ఏ పనైనా చేస్తాం..!” అని అన్నాము ఇద్దరమొక్కసారే..! . ” ఐతే రేపటినుండి పనిలలోకి రండి, మీ పనిని బట్టి ‘కూలి’వుంటుంది. మీ పనేమంటే..! గా బాక్స్ లో గుడ్లేరుకోరావాలి, ఒక గుడ్డు పలుగుతే ‘ఫైన్’ పావలా పైసలు బడుతుంది. మీకిచ్చే’కూలి’నుండి కట్ చేస్తాం..! .” అని అన్నాడు ఓనర్ క్లీయర్‌గా.
ఐతే ఈ పని చాలా సులభం అనిపించింది. కాని చిన్న సమస్యేమిటంటే..!? గుడ్లు పగలకుండా ఏరడమనేది. సరే ఎట్లైతే గట్లే..! చూద్దామని, పనొప్పుకున్నం. పనిలోకి దిగితే గాని తెలిసి రాలేదు గుడ్లు ఏరడం ఎంతకష్ఠమో..! . ఆ కోళ్ళు ఇటు దాన తినుకుంటూనే అటు గుడ్లు పెడుతున్నాయి. గుడ్లు ఏరలేక యాష్ఠకొచింది. దానికి తోడు ఎంత జాగ్రత్తగా ఏరినా గుడ్లు పలుగుతునేవున్నాయి. మొదటి రోజు నా కష్టం పోంగా,లెక్క చూడగా నేనే ఉల్టా 2 రూ. ఇయ్యదేలిన. ఐతే నా దగ్గర పైసల్లేవు. ఇయ్యటం కష్టమన్నాను.ఐతే, రేపటి లెక్కలో చూద్దామన్నా డు. ఈ పని నా వల్లా కాదనిపించింది. ఆ రెండు రూపాయలు నేనివ్వలేను అని దుఃఖమాగకా ఏడ్చాను. అప్పుడు ఆ ఓనర్ దగ్గరికి పిలిచి , “ఎందుకేడుస్తూన్నావు? ఇక్కడికెందుకొచ్చినవు? ఏంటీ కథ..!? నాకు చెప్పుతే ఆ రెండు రూపాయలు.. అడగను” అని అన్నాడు దయకల్గినవాడిలా..! .
* * *
ఎందుకొచ్చినమొ చెపితే, రెండు రూపాయలు ఇవ్వడం తప్పుతుంది..అని భావించి.. ఐతే, నేను ఇక్కడికి రావడానికి వెనకాల పెద్ద కథే వున్నది. చెప్పుత విను..
” ఐతే, మూడవ తరగతి చదువుతున్న నన్ను, మా పెదనాన్న, నా మాట వినలేదని ఇంటిమీదికొచ్చి గొడవ చేయడం వలన, బడిమాన్పించీ, ‘కోరెం సిరంజీ రెడ్డి’ దగ్గర రెండు సంవత్సరాలు జీతముంచిండు మా నాన్న. ఎట్లాగూ జీతమున్నడని ‘రెండు వేల అప్పూ’ తెచిండు. రెండు సంవత్సరాల్లో ఆ రెండు వేలు కాస్తా 3,000 అయింది. ఈ అప్పూ తీర్చడానికి మళ్ళీ ‘గౌరి కేదారి’ వద్దా జీతముంచ్చి, పాత అప్పూ తీర్చడానికి, కొత్త అప్పూ మరియు జీతము కలిపీ 4,000 తెచ్చాడు. ఈ సంవత్సరం నా జీతం సంవత్సరానికి 500 రూపాయలు. ముందుగా నాతో చెప్పిందేమంటే..! రెండు ఎడ్లు, రెండు దున్నపోతులు, ఒకటి పాలిచ్చే బర్రె మరియు ఒక కుర్ర దున్న.. మొత్తం ఆరు పశువులు. కేవలం వీటిని మేపుకొరావడమే నా పని అన్నారు.
సరే..! ఉగాది రోజు మంచి రోజని, ఈ రోజునుండే కొత్త జీతగాళ్ళందరూ తమ తమ జీతమున్నోళ్ళ ఇంటికి జీతం పనికి పోతున్నారు. నన్నుకూడా మా నాన్న ‘ఉగాది’ రోజున జీతం పనికి పొమ్మన్నాడు. ఐతే ఆ రోజు పొద్దుగాల పొద్దుగాల.. లేసి, పొద్దు పొడవకముందే బర్ల దొడ్లోకి పోయి, పెండతీసి, దొడ్డి ఊడ్చి, నీళ్ళు తాపీ, వరిగడ్డి వామినుంచి వరిగడ్డి గుంజీ, వాటికి మేతేసిన.అలా ఓ వారంరోజులు నేను ఈ పని మాత్రమే చేసిన. ఆతర్వాత నెమ్మదిగా ఒక్కోక్క పని చెప్పడం మొదలు పెట్టారు. వారంరోజుల తర్వాత మా యజమాని ‘గౌరి కేదారి’ భార్య ‘సూరమ్మ’ పిలిచి ” పొద్దుగాల రాగానే బర్లకొట్టంలో పెండతీసి, దొడ్డి ఊడ్చి, ఇంటికి పోయి కౌసెత్తుకొచ్చి, నీళ్ళు బెట్టీ, మేతేసి, ఇంటికొచ్చి, కాళ్ళు- చేతులు కడుక్కుని, ఐదు బిందెలు మంచినీళ్ళు చేది, ఇంట్లో బెట్టి, ఆరు బిందెలు కుడిదిగోలంలో పోసి, 10-15 బిందెలు ఉప్పునీళ్లు చేదిపోసి, ఆ తర్వాత ఇప్పుడు ఎండాకాలంలో పిడకలైతే పిడకలు లేకుంటే ఇస్తారాకులు.. వానాకాలమొస్తే పాలిచ్చే బర్రెకూ పచ్చి గడ్డి కోసుకోరావాలె.. ఆ తర్వాత బువ్వతిని బర్లీడుసుకోపోవాలె, సాయంత్రం ఇంటికి తోలుకొచ్చీ, కట్టేసి, మేతేసి, ఇంటికొచ్చి నీళ్ళో- నిప్పులో చూసి.. అప్పుడు మీఇంటికి పోవాలె..మల్లా రోజు తెల్లారక ముందే పన్లోకొచ్చేయాలె..! ఈ రోజునుండి ఇది నువ్వు చెయ్యవలసిన పని..” అని చాలా సాఫ్టుగా చెప్పింది.
మా యజమాని’ గౌరి కేదారి’ , ఆయన భార్య సూరమ్మ. వీళ్ళకు ముగ్గురు అమ్మాయిలు, ఒక్కడే కొడుకు. పెళ్ళైన తరువాత చాలా సంవత్సరాల వరకు సంతానం కలుగలేదు, అందుకే సంతానం కలగాలని ఊళ్ళో ఆంజనేయస్వామి గుడి కటీంచాడని, అందరూ అంటూంటారు. రోడ్డు మీద ఒక పెంకుటిల్లు, ఇంటేనుక పశువుల రేకులకొట్టం, గడ్డివామి వున్నాయి. ఈ ఇంటికి ఎదురుగా ఇంకో పెద్ద పెంకుటిల్లు కూడా వుంది. అది రోడ్డు మీదింటికీ ఎదూరుగా బాజార్ కు /గల్లికీ మూడో ఇల్లే.
ఐతే ఈయన ధనవంతుడే, ఊళ్ళో పైసా- పలుకుబడి ఉన్న వ్యక్తి. కాని నిరాడంబర జీవితాన్ని గడిపే వాడు. ఇంత డబ్బు పలుకుబడి ఉన్న, కష్టపడి పనిచేసేవాడు. మామూలు ఖాదీ బట్టలు ధరించేవాడు, సామాన్య ఆహారమే తినేవాడు, మా తండాలో 95% జనాలకు పెట్టుబడి కోసం నాగుతో , మిత్తీలకు డబ్బులు/పైసలు అప్పూలిచ్చేవాడు. పంటలమీద నాగుతో, మిత్తీతో వసూలు చేసేవాడు. మా తండాలో కొందరీనెను ‘ఆపదకు/సమయానికి ఆదుకునే గొప్ప ఆదుకునేగుణవంతుడు అంటే, మరికొందరు చారానిచ్చి బారాన వాసులు చేస్తాడు.. అది పాపపు సొమ్ము, చాలా కాలం ఉండదు’ అని మాట్లాడుకునే వారు.
ఐతే, నాకు మొదటి సంవత్సరం సంవత్సరానికి 500 జీతం. రెండవ సంవత్సరం సంవత్సరానికి 750 రూపాయల జీతం కరారు చేశారు. కాని ముందుగా ఒప్పుకున్నపనులకూ, తర్వాత చెప్పే పనులకు పొంతనే లేదు. నీళ్ళు చేదవలసివుంటూందని ముందుగా చెప్పలేదు, ఒప్పుకోను లేదు కాని నీళ్ళు చేదబెట్టారు. ఆ చేదబావి చాలా లోతుగా ఉంది. లోపలికి తొంగి చూస్తే కళ్లు తిరిగినట్టైయేది. చాలా పాతమొట గిరక, సగానికి అరిగిపోయి ఉంది. దానికి పెట్టిన సలాకు కూడా అరిగేవుంది. ఇక చాన్తాడంటావా..!చెప్పనక్కరలేదు, అది తెగుతుంటే ముళ్ళేసుకోంటూ పోయారు తప్పా ఒక కొత్త చాన్తాడు కొని, ఆ చేదబొక్కెనకు కట్టిన పాపాన పోలేదు. ఆ ‘చాదబొక్కెన’ చూస్తే పాపమనిపిస్తది, ఎన్ని ధక్కా-ముక్కలు తిన్నదో..! ఒక్కసారి బావిలోకిడిసి, నిండాముంచి పైకి చేదుకోస్తే, దాంట్లో సగం నీళ్లు మాత్రమే చేతికొచ్చేవి మిగతా నీళ్ళు చిల్లుల గుండా తిరిగి బావిలోనే పడిపోయేటివి. నీళ్ళు చేదీ-చేదీ అరచేతులు ఎర్రగైయేవి, యాష్టకొచ్చేది.
మొదట్లో మంచినీళ్ళు చేదమని ఐదుబిందెలు తెచ్చి బావికాడ పెట్టింది, మా ఎజమానమ్మా ‘సూరమ్మ’. వాటిలో నీళ్ళు పోసే ముందు కడగబోతే, వాటిల్లో రూపాయి, ఆటాన, పావులు..బిల్లలు ఉన్నాయి. వాటిని తీసుకుని పిప్పరమేంట్లూ కొనుక్కోవచ్చు అనిపించింది..! కాని “ బెటా..! ఒక్కమాట గుర్తూంచుకో.. ‘పరుల సోమ్మూ పాములాంటిది, దాన్ని ముట్టకూడదు, మన కష్టార్జితమే మనకు చెందుతుంది, చేతకాకపోతే అడుక్కోవాలె, అంతే తప్పా దొంగతనంతో దుఃఖమే తప్పా సుఖముండదు..!’ ” అని మా నాన్న అన్నమాటలు గుర్తుకొచ్చినయి. బిందెలు కడిగీ, ఆ బిల్లలు, దేంట్లయి దాంట్లోనే వేసి, నీళ్ళు చేది బిందెలు నింప్పీ, ఇంట్లో పెట్టాను.
ఎండా కాలంలో పొద్దటి పూట పశువుల దొడ్డి సాఫ్ చేసి, కౌసెత్తిపోసి, పశువులకు నీల్లుబెటీ, మేతేసి, నీళ్ళు చేదినంకా పిడకలకు పోయేవాణ్ణి. గోనెసంచి/యూరియబస్త పట్టుకోని, మడికట్లూ, బీళ్ళూ..తిరుగుతూ ఒక్కొక్క పిడక ఏరుకుంటూ బస్తసంచి నింపుకోని, నెత్తినెత్తుకోని ఇంటికొచ్చేవాణ్ణి. పిడకలేరుతుంటే చాలాసార్లు పిడకలకిందా తేళ్ళు ఉండేవి, రెప్పపాటులో వాటినుండి ప్రమాదం తప్పేది.
ఇస్తారాకులు లేదా మోద్గాకులకు పోయేవాణ్ణి. అడివిలకు, ఊరికి రెండు-మూడు కీ.మీ. దూరం పోయి, ఒక్కొక్కాకు తెంపీ బస్తసంచి నింపుకోని నెత్తినెత్తుకోని ఇంటికొచ్చేవాణ్ణి. ఈ ఆకులు తెంపేటప్పూడు చెట్లపై పాములుండేవి, అనేకసార్లు పాములనుండీ ప్రమాదం తప్పింది.
వర్షాకాలంలో పచ్చిగడ్డీ కోతకురాగానే పచ్చిగడ్డీ కోసుకోరమ్మనేవాళ్ళు. రోజు ఇంటి పని అయిపోగానే పచ్చిగడ్డీకి పోయేవాణ్ణి. ఒక కి.మీ. నుండి రెండు కి.మి.ల దూరం వరకూ పోయి పచ్చిగడ్డీ కోసుకొచ్చేవాణ్ణి. అంత దూరంనుండి గడ్డిమోపు మోసుకోస్తూంటే చాలా బరువయ్యేది, కొద్దిసేపు మెడలమీద, కొద్దిసేపు నెత్తిమీద ఎత్తుకొచ్చేవాణ్ణి. చాలా సార్లు గడ్డికోస్తూండగా చేతివేళ్ళు కోసుకోపోయేటివి. కొన్నిసార్లైతే పాము తోకభాగం చేతికొచ్చేది, అప్పుడు సచ్చేయంత భయమైయ్యేది. అప్పుడు కొద్దిసేపు గడ్డికోయడం ఆపేసేవాణ్ణి. ఆవిధంగా, దినదిన గండంగడ్డేకేది.
రెండు ఎడ్లు, నాలుగు ఎనపై వుండేవి. వీటిని రోడ్డేమ్మటీ, బంటాలేమ్మటీ మేపుకొచ్చేవాణ్ణి. ఇంటికి తోలుకొచ్చేటప్పుడు, అప్పుడప్పుడూ, ఆ దున్నకుర్రపై ఎక్కికూర్చునేవాణ్ణి, గుర్రంపై కూర్చూన్నటూ ఫీలైయ్యేవాణ్ణి. దానీ వీపుమీద, పక్కలకూ ‘అ, ఆ’ లు కట్టేపుల్లతో రాసేవాణ్ణి. చాలా రోజులు చెరువోరకు తోలుకోపోయి మేపుకొచ్చేవాణ్ణి. పశువులను మేపడానికీ చాలా మంది కలిసి మేపేవాళ్ళం. ఎక్కువగా నేను ‘బాదోల్ల ఈరన్నా’ కలిసి మేపేవాళ్ళం. చెరువులో గాలమేసీ చాపలు పట్టేవాళ్ళం. వాటిని అమ్మితే, వచ్చిన పైసలతో తొర్రూరులో సినిమా చూసేవాళ్ళం…!
ఇవ్వేకాకుండా ఇంకా అనేకపనులు, నా వయసుకు మించిన పనులుకూడా చెయ్యమనేవాళ్ళు. పొలంలో ఒట్టిదుక్కీ దున్నేవాళ్ళు . మా యజమాని ‘గౌరీ కేదారి’ కీ పటేల్లోల్ల కోలుకు అవతల, వాగౌతల బక్కారేగట్లా, పొలముండేది. అందులో వట్టిదుక్కీ దున్నుతున్నరు. దున్నుతుంటే పెద్ద-పెద్ద పెల్లలు పెకిలేవీ. నాగలి పట్టీ ఆ పెల్లల్లో నడవడం పెద్దోళ్ళకే నరకంలాంటిది. అటువంటీ పరీస్థితీలో, ముందునాగలి పట్టీ ‘పన్యా’ పెద్దజీతగాడు దున్నుతుంటే, ఎనక నాగలి, దున్నపోతుల నాగలి నాకు పట్టించిండు. అది ముందే బక్కరెగడి పొలం, సాలు సరీగ్గా రావడంలేదు. ఐన దున్నాలంటే..! దున్నుతున్నం. ఆపెల్లల్లో నా చేతిలో నాగలాగుతలేదు. అనేక సార్లు నాగలి చేతినుండీ జారిపడింది. కొంచమైతే నాగలికర్రు దాపలి దున్నపోతూ కాలుకు దిగేది, ఈసమంతలో తప్పింది. పాపం ‘పన్యా’ నన్ను కోప్పడ్డాడు. ఆ పెల్లల్లో నాగలితో నడిచీ-నడిచీ, కాలి వేళ్ళ మద్యపగుళ్ళై, రక్తంవస్తూండేది. ఏడ్చుకుంటూ నాగలి దున్నేవాణ్ణి.
ఒట్టిదుక్కీ అయిన తరవాత వానాకాలం బురద దున్నటం మొదలైయింది. రెండెకరాల పొలం, మొత్తం సాలిర్వాలు దున్నీ, మూల-సాలలు తీసీ, మూడవసాలు ‘పన్యా’దున్నుతున్నాడు. నన్నేమొ వరాలు పెట్టమన్నాడు. నేను వరంబెట్టీ, వరంబూస్తూంటే, ఎడమచేతి బొటన వేలుకు ‘తేలు’ కుట్టింది. అప్పుడు సమయం మద్యానం 2గం.లు. అవుతుంది. నాకు తేలు కుట్టడం మొదటిసారి. అది విపరీతమైన మంట్టా, నొప్పీ పెడుతుంది. ‘చాకలి ఎల్లయ్య’ ‘తేలు’ మందు పెడతాడంటే , వెంటనే అతని దగ్గరికి నడుచుకుంటూ పోయాను. అతను ‘శాల పుల్లయ్య’ బాయి దగ్గిర తన పొలంలో నాగలి దున్నుతున్నాడు. నన్నుచూడగానే ఆయనకు అర్థమైయిపోయింది. అక్కడా ఆగమని, తను ఆ బోడు గడ్డాకు పోయి, ఏవో పచ్చని, మెత్తని ఆకులు తెంపీ, వాటిని అరచేతిలో నలుచుకుంటూ, పచ్చని పసరు ‘తేలు’ కుట్టినచోట వేసీ, సంకలకెక్కిన ‘తేలు’ విషంను కిందికి దించిండు. రెండురోజుల వరకు నీటిలో, బురదలో పోవద్దన్నాడు. ఆవిధంగా ఆరోజున నా ‘తేలు’ గండం తప్పింది.
ఐతే ,తేలుకుట్టినచోట మంటా,నొప్పీ మాత్రం, మరుసటి రోజు కుట్టిన సమయం వరకు వుంది. అందుకే మరుసటి రోజున జీతంలోకి పోలేదు. ఆ తర్వాత రోజున జీతంలోకి పోయాను. ఐతే, నేను పోనిరోజే నాటేశారు. ఐతే, ఎన్నడూ ఏమి అనని మా యజమాని ‘గౌరీ కేదారీ’ నాటేసే రోజు ఎందుకు రాలేదని తన నోటికొచ్చినట్టూ తిట్యాడు, మీదిమీదికీ, కొట్టకొట్టా వచ్చాడు. “నువ్వు ఈ రోజునుండీ జీతంలోకి రానక్కరలేదు, ‘నాయి నాకు’ పారేసి ఎక్కడికన్నాపో..” అని బూతులు తిట్టుకుంటూ అన్నాడు. నాకు ‘తేలు’ కుట్టడం వలన జీతంలోకి పోలేదు, ఐతే ఆ విధంగా తిట్టటం నాకు దుఃఖాన్ని కల్గీంచింది. ఐతే,అదే రోజు జీతంలోకి పోయినట్టే పోయి, మెల్లేగా దొడ్డేనుకనుండీ తప్పీంచుకోని, మా మేనత్తా ‘గంగీ’ వాళ్ళా ఇంటికి పారిపోయను. ఐతే పోతుండగా రాయపర్తి బస్టాండు వద్దా ఎవరో కుట్టుంబంతో బస్సుదిగారు. లగేజీ చాలావుంది. నేను వాళ్ళవైపు చూశాను. అతను ‘ఈ ‘సుట్ కేస్’ ఎత్తుకొస్తావా? ‘ అని అడిగాడు. నేను ఓకే అన్నట్టూ తలూపాను. వాళ్ళుకూడా నేను పోయేదారిలోనే పోతున్నారు. ఒక ఫర్లాంగ్ దూరంలోనే, వాళ్ళ ఇల్లోచింది. సూట్ కేస్ తీసుకోని, నాకు ‘ఐదు’ రూపాయలిచ్చిండు. అవి తీసుకోని నెక్కర్ జేబులో పెట్టుకున్నా. నాకపుడు ఒక ఆలోచన వచ్చింది.. ” అంటే ..! జీతముండకుండా, ఇలాకూడా పనిచేసి మనము పైసలు/డబ్బులు సంపాదించీ బతకవచ్చూ..” అని నాలోనేను అనుకుంటూ, మా మేనత్త ‘గంగీ’ వాళ్ళా ఇంటికి వెళ్ళుతున్నాను.
అక్కడనుండీ అరగంటలో వాళ్ళఇంటికెళ్ళి పోయాను. వాళ్ళుకూడా బురద దున్నుతున్నారు. ఇంటివద్ద మా మేనత్త ఒక్కతే ఉంది. మా మేనత్త చిన్నకొడుకు ‘యాకు’ బడికి పోయిండు. మా మామ ‘జాద్యా’ పొలంలో నాగలి దున్నుతున్నాడు. ‘యాకు’ ‘బడికి పోయిండు’ అనగానే నాకు ‘నేను చిన్నపుడు బడికి పోయిన రోజులు గుర్తుకొచ్చనయి.’ మా మేనత్త ‘నేను రావడానికిగల కారణాలు..’ అడగగా జరిగిన విషయం చెప్పాను. మరునాడూ నన్ను వెంటపెట్టుకోని, మా ఇంటికి తీసుకోవచ్చీ నన్ను మా నాన్నకు అప్పచెప్పీ పోయింది. ఆరోజే మా నాన్న మా యజమానితో మాట్లాడి మళ్ళి జీతంలోకి పంపాడు. అలా మళ్ళి బర్లను కాసూండగా,ఈ ‘భూక్యా రవీందర్’ తో దంటకలిసింది. ఇతని తల్లిదండ్రులు, బావ, అక్కా..అందరు ఇక్కడా, ఈ కోళ్ళఫాంలో పనిచేసూంన్నారు. ఇతని బావా,అక్కా, మేనత్తా..వాళ్ళది, మా ఊరే .. . అందుకే అక్కడ ‘జీతం’ ఉండడం కంటే కోళ్ళఫాంలో పనిచేడం మంచిదని.. ఇక్కడికొచ్చినం. ఐతే ఇక్కడ అంతకంటే ఎక్కువ కష్ఠమున్నది.. అన్నిటి కంటే ఎక్కువ ఈ కోళ్ళఫాం వాసన ఘొరంగున్నది… .” అని నా బాధలన్నీ చెప్పాను, చాలా ఓపికగా వినీ ఆ గుడ్లుపలిగిన బాపతి రెండు రూపాయలు వదిలేసి, మీకు నచ్చుతే చెయ్యండీ లేకుంటే..! అది మీఇష్ఠం.. అన్నాడు. అప్పటికే సాయంత్రం కావసుంది. మేము ఇంటికి వెళ్ళిపోయాము.
మరుసటినాడు మా నాన్న నలుగురిని వెంటేసుకోని, మేమున్న చోటకొచ్చాడు. నన్ను ఇంటికి తీసుకొచ్చారు. నాకు ఏవేవో నచ్చచెప్పీ, ఇక మూడు నెలలైతే ‘ఉగాది’ వస్తుంది, ‘జీతం’ సంవత్సరం పూర్తిగ అయిపోతుందని, మళ్ళి జీతంలోకి పంపాడు.
మూడు నెలల ముందునుండే, మా యజమాని ‘గౌరీ కేదారీ’ ఉగాదికి అప్పు కట్టీ, జీతం మానెయ్యాలని ముందుగానే చెప్పగా, మా నాన్న మళ్ళి ఆలోచనలో పడ్డాడు. పరోక్షంగా అప్పు గురించీ ఇంట్లో మాట్లాడడం, భూమి అమ్ముత, పొలమమ్మత.. అని మా అమ్మతో అనడం మొదలుబెట్టాడు. నన్ను మళ్ళి ఆలోచనలో పడేశాడు. భూమి ఉన్నదే నాలుగు ఎకరాలు, ఆయింత దాన్ని అమ్మితే భవిష్యత్తులో , బతకడం ఎట్లా..!? అని ఆలోచనలో పడ్డాను. ఈ ఆలోచన నన్ను మళ్ళి జీతంముండేటట్టూ చేసింది. మా ఊరి ‘దొర’ ‘యాకుబ్ రెడ్డి’ దగ్గర నన్ను జీతముంచుతానని మాట్లాడుకున్నాడు మా నాన్న. ‘ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది.’ అంటే ఇదే నేమో..! .
Comments
నా కథ-కోళ్ళఫారం -కథ-4 — డా.బోంద్యాలు బానోత్(భరత్) — No Comments
Comments
నా కథ-కోళ్ళఫారం -కథ-4 — డా.బోంద్యాలు బానోత్(భరత్) — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>