భారతదేశంలో వలస కార్మిక స్త్రీలు(సమకాలీనం)-బంగార్రా రాజు ఎలిపే
వలస కార్మికులు అనే పదానికి ఏకరీతి నిర్వచనం లేదు. కానీ సంప్రదాయ మరియు చట్టపరమైన నిబంధనలు కొంత స్పష్టతను అందిస్తాయి.
వలస కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణపై అంతర్జాతీయ సమావేశం, 1990 ప్రకారం.
వలస కార్మికులని వారు జాతీయులు కాని స్థితిలో వేతనం పొందే కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న వ్యక్తులుగా నిర్వచిస్తుంది.
అంతర్రాష్ట్ర వలస కార్మికులు ఉపాధి నియంత్రణ మరియు సేవా పరిస్థితులు చట్టం 1979 ప్రకారం:
ప్రధాన యజమానికి తెలియకుండానే లేదా మరొక రాష్ట్రంలో ఉపాధి కోసం ఒక ఒప్పందం ప్రకారం ఒక రాష్ట్రంలోని కాంట్రాక్టర్ ద్వారా నియమించబడిన వ్యక్తులను అంతర్రాష్ట్ర వలస కార్మికులుగా నిర్వచిస్తుంది.
ఈనాటి మన భారతదేశంలో గ్రామాల సంఖ్య ఎక్కువ కానీ ఈ గ్రామాలలో ఉపాధి అవకాశాలు లేక మరియు అధిక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, స్థిరమైన జీవన ఉపాధి లేక ఉపాధి కొరకు తమ సొంత నివాస ప్రాంతాలను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లి అక్కడ పనిచేసుకుంటూ, జీవనాన్ని సాగించే వారిని వలస కార్మికులు అంటారు.
మనదేశంలో అసంఘటిత రంగంలో ఎక్కువ కార్మిక శక్తి దాగి ఉంది. వీరు భారతదేశ జిడిపికి మూలాధారం. కానీ వీరి పరిస్థితి మెరుగుపడటం లేదు. వీరు దోపిడీకి గురవుతున్నారు. వీరిలో సగభాగమైన స్త్రీలు ఇంకా ఎక్కువ దోపిడీకి గురి కాబడుతున్నారు.
వీరు ఈ వ్యవస్థలోకి నెట్టబడుటకు గల కారణాలు
1. ఆర్థిక ఇబ్బందులు: పనికి తగిన వేతనం లేక కుటుంబ భారం పెరిగి వలస కార్మికులుగా మారుతున్నారు.
2. గ్రామీణనిరుద్యోగం: గ్రామాలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటాయి సుమారు 42% మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. కానీ పూర్తి కాలం ఉపాధి ఇక్కడ ఉండదు. మరియు క్రమరహిత ఋతుపవనాల కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందువల్ల స్థిరమైన జీవనోపాధి కోల్పోతున్నారు.
3. పండించిన పంటలకు సరైన మద్దతు ధర లభించక పెట్టిన పెట్టుబడికి వడ్డీలు కట్టలేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
4. పర్యావరణ క్షీణత వల్ల కరువు, వరదలు, తుఫాన్లు మరియు పెరుగుతున్న వాతావరణ ప్రేరిత విపత్తులు.
5. సామాజిక భద్రత లేకపోవుట.
6. రాజకీయ అస్థిరతలు మరియు సంఘర్షణలు.
7. గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాల కొరత.
8 గ్రామీణ కమ్యూనిటీ ఆసుపత్రులలో 79.9% నిపుణుల కొరత వల్ల సరైన వైద్య సదుపాయం లేకపోవుట.
9. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం.
10. సరైన విద్య ఉద్యోగ అవకాశాలు లేక పట్టణాల వైపు వలస వెళ్ళుట.
ఈ విధమైన కారణాలవల్ల గ్రామీణ ప్రజలు పట్టణాలకు మరియు ఇతర రాష్ట్రాలకు వలస కార్మికులుగా వెళుతున్నారు. కానీ వీరికి సరైన న్యాయం జరగట్లేదు. ఇందులో సగభాగమైన స్త్రీలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. 2023 నుండి 2024 వరకు పట్టణ ప్రాంతాల్లో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం రేటు 22.7% నుండి 25.6% పెరిగింది.
వలస కార్మిక లలో ముఖ్యంగా స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైన సమస్య లింగ నిర్దిష్ట సవాళ్లు :
1. పురుషులతో సమానంగా వేతనాలు పొందలేకపోతున్నారు కారణం వీరు చేసే పనులు అసంఘటిత రంగంలో ఉన్నాయి కాబట్టి.
2. తక్కువ వేతనాలు.
3. వారిపై జరుగుతున్న లైంగిక వేధింపులు.
4. పిల్లల సంరక్షణ మరియు పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలకు సరైన రక్షణ సేవలను పొందలేకపోవడం.
5. వలస కార్మిక స్త్రీలు సరైన నివాస ఆవాసాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
2018 నుండి 2022 మధ్య పదివేల కంటే ఎక్కువ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. వాటిలో చాలావరకు వలస కార్మికులవే . ఇందులో ప్రస్తుతం ఉన్న లింగ వివక్షత కారణంగా పురుషులకంటే మహిళల అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుంది.
దీనితో పాటు వారు నివాసం ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువ లైంగిక వేధింపులకు గురవుతున్నారు.
వలస కార్మిక స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, వారి పిల్లలు విద్యాభ్యాసం కోల్పోతున్నారు. ఎందుకంటే వారు వలస వెళ్లే ప్రాంతాల్లో సరైన విద్యా వసతులు లేకపోవడం.
గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ 2019 ప్రకారం భారతదేశంలోని ఏడు నగరాల్లో కాలానుగుణంగా వలస పిల్లల్లో దాదాపు 80 శాతం మందికి పైనే వారి ప్రదేశాలు దగ్గర విద్య అందుబాటులో లేదు. అలాగే వీరు నిర్లక్ష్యానికి గురికాబడుతున్నారు. అందువల్ల వీరికి సరైన విద్య లేకపోవడం వల్ల వీరిలో చాలామంది సంఘ వ్యతిరేక శక్తులుగా మారే అవకాశం ఉంది. దానివల్ల సమాజ భద్రతకు పెనుముప్పు ఏర్పడే అవకాశం ఉంది. లింగ సమానత్వంతో పాటు పిల్లల భద్రత కూడా చాలా ముఖ్యమైనది.
వలస స్త్రీలు సంస్కృతి పరంగా విక్షత ఎదుర్కొంటున్నారు. వారి ప్రాంత యాస లేదా భాష వలన కూడా వివక్షతకు గురి అవుతున్నారు. తద్వారా వారు స్థానిక ప్రాంత వాసులతో ఘర్షణ వాతావరణం లో జీవించవలసిన పరిస్థితులు తలెత్తుతున్నాయి.
వలసకార్మికుల రక్షణకు మన భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు :
కేంద్ర ప్రభుత్వం:
అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం 1979ప్రకారం
1. ఒకే దేశం ఒకే రేషన్ కార్డు (ONORC) వలసదారులకు ఆహార భద్రతను నిర్ధారిస్తుంది.
2. తక్కువ ధరకు అద్దె గృహాలు అందించుట
3. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన:
దీని ద్వారా ఆర్థిక సహాయం మరియు ఆహార భద్రతను అందిస్తుంది.
4. ఈ-శ్రమ్ పోర్టల్:
అసంఘటిత కార్మికుల సమగ్ర డేటా బేస్ ను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇలా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను వలస కార్మికుల సంక్షేమం కోసం ఈ కార్యక్రమాలను కొనసాగిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం:
1. వలస కార్మికుల డేటా నిర్వహించడం మరియు వారి ఫిర్యాదులను పరిష్కరించడం.
2. వలస కార్మికుల సహాయం కోసం లేబర్ కాన్సులేట్లను ఏర్పాటు చేయడం.
ఇదే కాకుండా మరెన్నో కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి.
ఇలా ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు రూపొందించినా, వాటి అమలులో కొంత లోపం వల్ల వలస కార్మికులు మరియు వలస కార్మిక స్త్రీలు చాలా నష్టపోతున్నారు.
ఇవే కాకుండా మరికొన్ని పథకాలు:
ఉపాధి మరియు నైపుణ్య ధ్రువీకరణ యొక్క అధికరణ:
వలసదారులను వ్యవస్థీకృత రంగాలకి అనుసంధానించడానికి అధికారిక ఉపాధి ఒప్పందాలు మరియు నైపుణ్య మ్యాపింగును ప్రోత్సహిస్తుంది.
న్యాయపరమైన వేతనాలు మరియు చట్టపరమైన రక్షణను నిర్ధారిస్తుంది.
స్కిల్ ఇండియా మిషన్ మరియు PM కౌశల్ వికాస్ యోజన(PMKVY) వంటి కార్యక్రమాలు వలసదారులకు ధ్రువీకరించబడిన శిక్షణను అందించగలవు. ఇలా వారి ఉపాధి సామర్థ్యాన్ని పెంచుతుంది. తద్వారా వేతన దోపిడీని తగ్గిస్తుంది.
అలాగే వారి నివాసం ఉంటున్న గృహ సముదాయాల సమీపంలో జీవనోపాధి సమూహాలను సృష్టించడం వలన ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి మరియు పని జీవిత సమతుల్యత పెరుగుతుంది.
సంక్షేమ పంపిణీ మరియు మొబైల్ కనెక్టివిటీ యొక్క డిజిటలైజేషన్:
దీని ద్వారా రేషన్, ఆరోగ్య సంరక్షణ మరియు ఆర్థిక సేవలు వంటి హక్కులకు డిజిటల్ ప్రాప్యతను అందించడానికి వలస స్నేహపూర్వక మొబైల్ యాప్లు లేదా అప్లికేషన్లను అభివృద్ధి చేయటం.
మహిళా వలసదారులకు లింగ సున్నితమైన విధానం:
భద్రతా చర్యలు, వేతన సమానత్వం మరియు పిల్లల సంరక్షణ సౌకర్యాలు కల్పించడం.
మహిళా వలసదారుల ప్రత్యేక అవసరాలు తీర్చడానికి ప్రత్యేక లక్ష్యాలను అభివృద్ధి చేయటం.
ముఖ్యంగా వలసదారులకు నిర్మాణం మరియు మైనింగ్ వంటి ప్రమాదకర పరిశ్రమలలో పనిచేసే వారికి మొబైల్ హెల్త్ క్లినిక్లు మరియు వృత్తిపరమైన ఆరోగ్య కార్యక్రమాలను రూపొందించడం.
ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టడం వలన వలస కార్మికులు మరియు మహిళా వలస కార్మికులకు రక్షణ కల్పించబడుతుంది. తద్వారా వారి సామర్థ్యాలు పెరిగి దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇది పట్టణ వలస ఒత్తిడిని తగ్గిస్తూ గ్రామీణ సాధికారత కల్పిస్తుంది.
ముగింపు:
భారతదేశ వలస కార్మికులకు ఈ కార్యక్రమాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ అమలులో అంతరాలు, ప్రయోజనాల పోర్టబిలిటీ మరియు లింగ అసమానత్వ విధానాలు కొనసాగుతున్నాయి.
ఈ కీలకమైన శ్రామిక శక్తికి సమాన అవకాశాలు మరియు గౌరవాన్ని స్థిరీకరించడానికి సమగ్రమైన మరియు సమ్మిళిత జాతీయ వలస విధానం అవసరం.
-బంగార్రా రాజు ఎలిపే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Informative and thought-provoking article. Kudo’s.