అంతర్వీక్షణం – 1 (ఆత్మ కథ) -విజయభాను కోటే
ఏమైనా సాధిస్తే రాయాలా?
గొప్ప కథ నీదైతేనే రాయాలా?
రాసేది ఎందుకు?
అందరూ చదవడానికి!
అనుభవాల ప్రవాహానికి ఉన్న అడ్డుకట్టను తెంచడానికి!!
ఎన్నయినా చెప్పు..
ఏమైనా చెప్పు..
కథ గొప్పగా ఉంటేనే ఎవరైనా చదివేది!!!!
నీ గురించి రాస్తే దాన్ని కథంటారా?
ఆత్మకథ అంటారు.
బావుంది!
ఆత్మకథలో నువ్వు మాత్రమే ఉంటావా?
లేదు! లేదు! లెక్కలేనంత మంది జనాలు ఉంటారు.. ఇంకా.. ఎన్నో సన్నివేశాలు.. రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ప్రాపంచిక సమకాలీన సంఘటనలు.. ఇంకా ఎన్నో!!
ఎన్నో అంటే?
నా పుట్టుక నుండి, ఈ పుటను నేను రాసే వరకూ ప్రపంచపు కథలు.
మరి ఆత్మకథ అంటావేంటి?
హ్మ్..
మరి దీనికి ఏ పేరు పెట్టాలి?
పేరు లేని వృత్తాంతాన్ని ఏమని రాస్తావ్? వదిలెయ్యి!
దిజ్మండలం?
అబ్బో!! అంతోటి ఏమి సాధించావ్?
చీలిన విత్తనం?
వృక్షమైపోయావా ఏమి? అదెప్పుడు?
సరే! ఇక సెలవు!
రాద్దామనుకున్నావుగా?!!!
రాయనిస్తున్నావా?!!!!
మొదలు పెట్టు..
పదాలు, వాక్యాలేగా….
హ్మ్..
చీకటి!
చీకటి నుండి వెలుగులోకి ప్రయాణం!
అమ్మ లోంచి జీవన, జనజీవన స్రవంతిలోకి ప్రయాణం!!
అపుడేమీ తెలియదు. మన పుట్టుకను ఒక అద్భుతమైన కథగా మన అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య, మేనమామ మొదలైన వారు చెప్తారు. ఆ కథ వాళ్ళు ఉన్నంతకాలం, వాళ్ళతో మనం ఉన్నంతకాలం, మనతో వాళ్ళు ఉన్నంతకాలం పదే పదే చెప్పబడుతుంది.
అదేమిటో!! ఆ చిన్నప్పటి కథలు.. ఎన్ని సార్లు విన్నా, విసుగురాదు కదూ?!
మమ్మీ, డాడీలది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్ళంటే పిల్లల కోసమే అనుకునే రోజులు అవి. అమ్మమ్మ, తాతయ్య ఉపాధ్యాయులు. పశ్చిమ గోదావరి లో ఒక చిన్న పల్లెటూరు. పురిటికి పుట్టింటికి వచ్చిన మమ్మీ. విశాఖ జిల్లాలో ఉద్యోగంలో డాడీ. అప్పట్లో ఫోనులు ఉన్నా, ట్రంకాల్ బుక్ చేయాలనుకుంటా. ఏ విషయమైనా ఉత్తరాలు, టెలిగ్రాముల ద్వారా చేరవేయడమే.
ఇప్పటిలా సీజేరియనా? నార్మలా? అని అడిగే పని లేదనుకుంటా! కొట్నీస్ డాక్టర్! నాకు నలభై ఏళ్లు వచ్చినా నా జన్మ వృత్తాంతం వింటూనే ఉండేదాన్ని. నవంబర్ 18. మమ్మీని కొట్నీస్ డాక్టర్ గారి హాస్పిటల్ లో చేర్చారు. నొప్పులు వస్తున్నాయి. డాక్టర్ గారికి మమ్మీ అంటే చాలా ఇష్టం అంట. చేతికి వాచీ పెట్టుకుని మమ్మీ దగ్గరే కూర్చున్నారట. మధ్యాహ్నం 1.19 కి నేను పుట్టాను. అంత గొప్ప డాక్టర్ గారికి ఈ జాతకం ఆలోచన ఏమిటో!
ఇంకొక్క నిముషం ఆగి పుట్టి ఉంటే ఇందిరాగాంధీ అంతటి దాన్ని అయ్యేదాననని అన్నారట.
నేను పొట్టలో ఉన్నంత కాలం నేను అబ్బాయినే అని మా డాడీ ఆలోచన అట. ఎందుకు? ఒక్క క్షణం తీరిక లేకుండా చాలా స్పీడ్ గా పొట్టలో గెంతులు వేసేదాన్నట. అంటే.. మగపిల్లలు మాత్రమే పొట్టలో అంత కలకలం సృష్టించగలరు అన్నమాట! హన్నా!!!! ఆడపిల్లలకు కాళ్ళు, చేతులు ఉండవు మరి!
నేను పుట్టాక నన్ను చూసి, “అమ్మా, నాకు మా అత్తగారు పుట్టింది” అన్నదట మమ్మీ. నల్లని మేలిమి ఛాయ! కళ్ల వరకూ కప్పేసిన జుట్టు. ఎడమ వైపు నడుముపై పెద్ద పుట్టుమచ్చ. చూసిన వాళ్ళు ఇంత జుట్టుతో పుడితే అలా అవుతారు, పొట్ట పక్కన పుట్టుమచ్చ ఉంటే ఇలా చేస్తారు.. బోలెడు కబుర్లు!
మా డాడీకి తాతయ్య తెలిగ్రాము ఇచ్చారు. పాప పుట్టింది అని రాసారట. మా డాడీ వచ్చారు. బ్యాగ్ లోంచి తెచ్చిన బట్టలు తీశారు. “అల్లుడుగారు అబ్బాయి బట్టలు తెచ్చారు” అన్నారట అందరూ. మా డాడీ కూడా పుట్టింది అబ్బాయ్ కదా?! అన్నారట. పుట్టింది అమ్మాయి అని తెలిసినా ఆ బట్టలే వేశారు. డాడీ ఏమీ నిరాశ పడలేదు. పొట్టలో అంత అల్లరి చేస్తే అబ్బాయి అనుకున్నారు కానీ అబ్బాయి మాత్రమే పుట్టాలి అనుకోలేదు.
భీమిలి! ఎస్ కోట!
ఈ రెండు చోట్లా పని చేశారు డాడీ నాకు ఏడాది వచ్చేవరకూ అనుకుంటా. అందరూ ఎత్తుకునేవారే. అందరూ ముద్దు చేసేవారే. ఆడింది ఆట, పాడింది పాట.
ఏడాది వయసులో ఒక రోజు మా డాడీ కొన్ని పుస్తకాలు తెచ్చారట. అప్పటికే నడక వచ్చేసి, ఏవేవో కబుర్లు చెప్తూ ఉండే నన్ను కూర్చోబెట్టి ఆ పుస్తకాలు నా ముందర వేశారట. ఒక క్షణం వాటిని పరిశీలించిన పిదప.. పిదప కాలం, పిదప బుద్ధులు కాకపోతే, ఆ పుస్తకాలను రెండు చేతులతో ఎంచక్కా చించేశానట. అసలు నేను చేసిన ఈ పని గురించి తెలిసే No.1 సినిమాలో విలన్ బ్రహ్మానందాన్ని న్యూస్ పేపర్ చిన్న ముక్కలుగా చింపమనే సీన్ పెట్టి ఉంటారు. ఈ సినిమా వాళ్ళు నాకు రాయల్టీ ఎందుకు పే చేయలేదో మరి!
మా మమ్మీ! పాపం! అసలే ఇద్దరు ఉపాధ్యాయులకు పుట్టిన కుమార్తె! పుస్తకాల పట్ల మిక్కిలి భయభక్తులు కలిగిన పుత్రిక!
నేను పుస్తకాలను చించుతూ ఉంటే, మా డాడీ నవ్వుతూ ఉంటే, ఆమె ఒక్కతే వెర్రి కేకలు పెడుతూ నన్ను అడ్డుకోబోయిందట. మా డాడీ ఆ ప్రయత్నం ఫలించనివ్వలేదు.
“చించనీ విజయా”
“నువ్వు చించు తల్లీ” అన్నారట అదేదో సినిమాలో రవితేజ బ్రహ్మానందాన్ని పరమానందంగా ముఖం పెట్టి, “పాడు గజాలా” అన్నట్టు.
ఒక పద్ధతి, ఒక సంస్కృతి, ఒక కట్టుబాటు, ఒక విధానం.. ఇలాంటి వాటితో అతి జాగ్రత్తగా, పొందికగా పెరిగిన మా మమ్మీ ఆ సమయంలో మా డాడీ గురించి ఏమనుకుని ఉంటుందో అని ఆలోచించిన ప్రతి సారీ నేను ఒకటే నవ్వుకుంటాను.
దగ్గరుండి సరస్వతీ సమానమైన పుస్తకాలను చింపించడం ఏమిటి? డాడీ చింపించలేదు. వాటిని చూడగానే నా చేతులు ఆ పనే చేశాయి. నేను చేసే పనిని ఆపకుండా, డాడీ ప్రోత్సహించారు. అంతే కదా!
మా మమ్మీకి అదొక రాక్షస ప్రక్రియ! మా డాడీకి అదొక సైకోమోటార్ ఆక్టివిటీ!
ఆ రాకాసితనం అక్కడితో ఆగలేదు!
(ఇంకా ఉంది )
-విజయభాను కోటే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Such a cute one🎉🤣🤣🤩
Thank you so much Roopini