తల్లీ పాట తెలంగాణ

పాటల పిట్టలను ఎగిరేసిన

తల్లి పాటరా బిడ్డా ఈ మట్టిగడ్డ

మన కళలను దున్ని పండించిన

సాంస్కృతిక  ఖజానాల

ధూంధాం ఆటరా బిడ్డా

మన బతుకు అడ్డా….

 

ఉద్యమాల అలలు లేచి

వేరు పాటలు పాడుతున్నయి

తల్లి తెలంగాణ పోరులో

సముద్రాలై ఉపపొంగుతున్నయి

పాట తల్లి తొడుండంగ

మన జమీన్ కై  జంగ్ హోరెత్తంగ…

 

మనకు నోరున్నది ఊరున్నది

ఊరి నిండ ఉరి బడ్డ కతలున్నయి

కతలన్ని చెరబడ్డ వెతలున్నయి

రాలుస్తున్న పచ్చి గాయాలున్నయి

గాయాల మీద కారం చల్లిన నేరాలున్నయి

 

నోరెండిన చెరువుల కింద గెలికితె

చెలిమల నీటి కన్నీటి పాటలు

అడుగంటి బాయిలు పూడికలు

తోడితె  ఊరిన ఊటల పాటలు

పాట తెలంగాణ మన చరిత్ర

తెలంగాణ పాటే మన ఆయుధం ..

 

తెలంగాణ మాదంటూ

తియ్యని బాసల పాటకట్టు

తెలంగాణ తల్లి ప్రేమను  నిలబెట్టు

తల్లిపాలు రుణం తీర్చ మన

బ్రతుకునూ ప్రేమించాలె

ఎగదన్నే పౌరుషాల పోరు సాగించాలె..

బతుకుంటే బతుకాలన్ని బతుకమ్మ

సందేశం ఆలకించు !

తెలంగాణను సాధించుకోవాల్నని

తల్లి పాట ఆదేశం గౌరవించు !

– కురిమిండ్ల సృజన

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.