నా గీత మాల ఆమనీ ! – ధరణికి గిరి భారమా?

నిత్య జీవితంలో..సమస్యలతో,చికాకులతో..అతలాకుతలం అయిపోతున్న మనిషికి..ఆహ్లాదం ని ఇచ్చి..మనసుకి సేద దీర్చే  శక్తి.. సంగీతానికి తప్ప వేరోకదానికి లేదు.అందుకే  ..నాదం లోనే మోదం ఉంది..అంటారు..కదా..! అందుకే ఇప్పుడు మనకి  చిన్నా పెద్దా అందరు  పరవశించి పోవడానికి , వినడానికి పాట ఒక సాధనం   పాట.. వినోదాన్ని  పంచి గాలి అలలపై తేలియాడించడమే కాదు,ఆలోచింపజేస్తుంది కూడా..

కొన్ని పాటలు   వింటూ ఉంటే అరటి పండు ఒలిచిపెట్టినట్లు ఉంటుంది . శ్రావ్యమైన సంగీతం,  వింటున్నపుడే అర్ధమయ్యే సాహిత్యం తో మరల మరల వినాలనిపిస్తూ ఉంటుంది . అందులో సందర్భానికి తగినట్లు ఉండే సాహిత్యం పాత సినిమా పాటలలో మనకి బాగా నచ్చే అంశం . ఇప్పటి పాటలు చూస్తుంటే అసలు పాటేందుకు వస్తుందో తెలియక తలా తోక లేని వ్యవహారంలా  ఉండి భారంగా తలలు పట్టుకు కూర్చునే బాధ అప్పటి తరం వారికి ఉండేది కాదు. పాట  పంచామృతం లా ఉండేది . పంచామృతం అంటే మనం ఇలా చెప్పుకోవచ్చు . చక్కని దృశ్యీకరణ , వినసొంపైన  సంగీతం, విలువలతో కూడిన సాహిత్యం, గాత్ర మాధుర్యం , నటీనటుల హావభావాలు అన్నీ కలబోస్తేనే ఆ పాట  పంచామృతం అనిపించుకుంటుంది   పాట  అంటే చెవి కోసుకునే వారికి అలాంటి  ఆణిముత్యం లాంటి పాటలని పరిచయం చేయాలని  .. ఈ చిన్ని ప్రయత్నం.     మంచి పాటలెన్నో ఇక్కడ పరిచయం చేసుకుంటూ  మన మనసులు వినీల గగనంలో విహంగంలా నాట్య మాడాలని కోరుకుంటూ .. 

RBSమొదటగా .. రావు బాల సరస్వతి దేవి గారి పాట .  ఆగస్ట్ 29 న ఆమె పుట్టినరోజు . ఆమె గురించి తెలియని వారు ఎవరు ఉండరు .  ఆ సందర్భంగా ఆమె పాటలని గుర్తు చేసుకుంటూ ఉంటే  జగమెరిగిన ఈ చిత్రం గుర్తుకు వచ్చింది “మంచి మనసుకు మంచి రోజులు”  చిత్రం లో పాట  1958 లో వచ్చిన చిత్రం ఇది . అబ్బా.. ఇంత పాత పాట  గురించి చెప్పబోతున్నారా ? అని ముఖం చిట్లించుకోవద్దు. నేను ఈ పాట  చాలా  పాత కాలం నాటి పాట  అని చెప్పగానే .. వద్దు, వినిపించ వద్దనే వద్దు .అని గొడవ చేసాను . మనలో చాలా మందికి పాత పాటలు నచ్చవు ..  నేను  పుట్టక ముందు  ఎప్పుడో వచ్చిన చిత్రంలో పాటని    పిచ్చ బోర్ .. అని కొట్టి పడేసాను . కానీ తర్వాతెప్పుడో యధాలాపంగా ఆ పాట  విన్నప్పుడు .. ఆరే ! ఈ పాత ఇంత బావుంది ఏమిటి .. ఎందుకు వినడంలో నిర్లక్ష్యం వహించాననుకుని మళ్ళీ మళ్ళీ విన్నాను .

అంతగా నాకు నచ్చిన అంశం  ఏమిటంటే .. పాట  యొక్క సాహిత్యం . ఎంత బావుందో .. మీరూ గమనించండి ..

పల్లవి:
ధరణికి గిరి భారమా?
గిరికి తరువు భారమా?
తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

చరణం: 1
మును నే నోచిన నా నోము పండగా
నా వడిలో వెలిగే నా చిన్ని నాయనా
పూయని తీవెననే అపవాదు రానీక – 2
తల్లిననే దీవెనతో తనియించినావయ్య

తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

ధరణికి గిరి భారమా?
గిరికి తరువు భారమా?
తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

చరణం: 2
ఆపద వేళల అమ్మమనసు చెదరునా
పాపల రోదనకే ఆ తల్లి విసుగునా
పిల్లల కనగానే తీరేనా స్ర్తీ విధి – (2)
ప్రేమగా పాపలను పెంచనిదొక తల్లియా?

తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

ధరణికి గిరి భారమా?
గిరికి తరువు భారమా?
తరువుకు కాయ భారమా?
కనిపెంచే తల్లికి పిల్ల భారమా ? 

ఈ పాట  కి సాహిత్యం అందించిన వారు సముద్రాల జూనియర్

సంగీతం :ఘంటసాల

మగువ జీవితానికి మాతృత్వం ఒక వరం అంటారు అది నిజం కూడా ! ఆ మాతృత్వంలోని ఆనందాన్ని ,అనుభూతిని అనుభవిస్తే కాని ఆ విలువ తెలియదు . 

మీకు బిడ్డలు ఎంత మంది అని అడుగుతారు కాని మీకు ఎంత ఆస్తులున్నాయని అడగరు కదా ! అందుకే .. అమ్మ గురించి చెపుతూ ఈ పాట సాగుతుంది

 భూమి కి తనపైన ఉండే కొండ భారమా ? ఆ కొండపై ఉన్న చెట్టు ఆ కొండకి భారమా ?  ఆ చెట్టుకి కాసిన కాయ ఆ చెట్టుకి భారమా? అలాగే నవమాసాలు మోసి కన్నతల్లికి పుట్టిన బిడ్డ భారమా? అని ప్రశ్నిస్తూ సాగుతుంది ఈ పాట.  .  ఆస్తికులు బిడ్డల కోసం ఎన్నో మ్రొక్కులు మ్రోక్కుతారు గుడులు చుట్టూ తిరుగుతారు , అలాగే వైద్యశాల ల చుట్టూ తిరుగుతారు.  .  ఎన్నో నోములు నోచి ఆ ఫలమే బిడ్డలు అనుకుంటారు. బిడ్డలు లేకుంటే పూయని కొమ్మ అనే అపవాదు వస్తుందని చింత పడతారు . తల్లి మనసు తలపోసినందు కేమో ఒడి నిండి తల్లినయ్యానని గర్వపడతారు . ఎన్నో ప్రయాసలకోర్చి బిడ్డలని  కంటారు . ఇంకా చాలా ప్రయాసలకోర్చి బిడ్డలని పెంచుతారు. బిడ్డలకి ఆపదలు వస్తే తల్లి బెదిరిపోదు పిల్లలు ఏడుస్తున్నా తల్లి విసుగు చెందదు  పైగా బిడ్డకి ఏమైనదో అని తల్లడిల్లిపోతుంది. పిల్లలు కనగానే   ఆమె భాద్యత తీరి పోదు ఆ పిల్లలని  ప్రేమతో,అనురాగంతో  బాగా పెంచడం  కూడా ఆమె భాద్యత అనుకుంటుంది .. తల్లి విలువను చెపుతూ ఎంతో  హృద్యంగా సాగుతుంది ఈ పాట . ప్రతి స్త్రీ మూర్తి జీవితంలో బిడ్డలా కోసం కరిగిన క్షణాలే అత్యద్భుత క్షణాలు ఏమో అనిపిస్తుంది . అలాగే బిడ్డలు కనలేని స్త్రీమూర్తులలో కన్నతల్లిని మించిన ప్రేమ పొంగిపోర్లడం చూస్తే .. అమ్మగా అరిగిపోవడానికే  ఈ స్త్రీ మూర్తులు పుట్టారా ! అందుకే జీవించి ఉన్నారా ? అనిపిస్తూ ఉంటుంది 

 ఈ పాటలో నటియించిన స్త్రీ మూర్తి .. జయచిత్ర  గారి తల్లి .”అమ్మాజీ”  (జయశ్రీ )గారట ఆమె రోజులు మారాయి చిత్రంలో ANR  గారి చెల్లెలుగా నటించారు . అలాగే రాజు -పేద చిత్రంలో  పేదబ్బాయి చెల్లెలుగా కూడా నటించారట .

పుట్టీ పుట్టగానే మురికి కాలువలు , చెత్త కుప్పలు పాల్జేసే తల్లులని తలచుకుంటే .. వారికి ఈ పాటని పదే  పదే  వినిపించాలనిపిస్తూ ఉంటుంది . 

చూడండి వద్దు వద్దు అంటూనే ..  ఆణి ముత్యం లాంటి పాట  విన్నాను . ఆ పాట  గురించి ఉత్శాహంతో పరిచయం చేసేసాను . ఈ పాత పాట  మగువలందరికి , మనసున్న మహారాజులందరికి బాగా నచ్చింది కదా !

మరో మంచి పాటతో .. ఇంకోసారి కలుసుకుందాం .

song Audio  link : http://www.divshare.com/download/24445215-6e7

song video link : http://www.youtube.com/watch?v=PhtI3pyeuHo

– వనజ వనమాలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

6 Responses to నా గీత మాల ఆమనీ ! – ధరణికి గిరి భారమా?

  1. Sharma G S says:

    పాత సినిమాల్లోని పాటలు గాని , భావం కాని సందర్భోచితంగా వుండేవి , సమాజాన్ని ముందుకు నడిపించుతూ , ప్రగతి పధం వైపు నడిపించేవి . ఈ రోజు పాటలు ఏది చూసినా ఆ ‘ అభావం ‘ తప్ప మరేదీ ( చాలా సినిమాల్లో ) కనపడటం లేదు .
    పాట వినిపించటమే కాకుండా , వీడియో కూడా చూపించినందుకు కృతజ్ఞతలు .

    • Sharma గారు… ధన్యవాదములు . సాహిత్య విలువలతో కూడిన మంచి పాటలని పరిచయం చేసేందుకే ఈ శీర్షిక ప్రారంభమైనది. అందుకే అందరం కలసి “విహంగ ” కి ధన్యవాదములు చెపుదాం .

  2. S Srinivasa Rao says:

    ధరణికి గిరి భారమా?నిన్నే ఒకరి పొస్ట్ లో చూశాను.చిన్నప్పుడు చాలా సార్లు చూశాను,విన్నాను.పల్లవి మాత్రం అర్థమయ్యేది.వివరణ సంతోషంగా ఉంది.

    • శ్రీనివాసరావు గారు .. ధన్యవాదములు .ఇకపై మరిన్ని పాటలు మీరు “విహంగ”లో చూడవచ్చు .

  3. ఉమాదేవి గారు ! తప్పకుండా మీరడిగిన పని చేస్తాను . వేచి ఉండండి ప్లీజ్ ! స్పందనకి ధన్యవాదములు

  4. sammeta umadevi says:

    సినిమా పాటలు కాకుండా ఆమె పడిన లలిత గీతాలు లింక్స్ ఇవ్వండి .
    .అవి దొరకడం కష్టం ..బాల సరస్వతి గారివే కాదు ఎవరు పాడిన పాటలయినా సరే
    వాటి రచన గానం తెలియ జేస్తూ పాటలను షేర్ చేస్తే మాలాంటి అభిమానులు సంతోష పడతాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)