నిద్రపట్టని నిశిరాత్రి

“భానమ్మా! నేను మరీ సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నాను. మెదడు మొద్దుబారిపోయి, ఆలోచన ముందుకెళ్ళక కూర్చున్నాను. ఈ విపత్కర పరిస్థితి నుండి నన్ను బయటపడేసే నాధుడే కనిపించడం లేదు.”
అసలే నిద్రపట్టని నిశిరాత్రిని నేను…
ఏ తెల్లవారే సమయానికో పట్టక పట్టక నిద్ర పడితే, ఈమె ఎవరు? ఇలా బాధాతప్త హృదయంతో నాతో ఏదో చెప్పుకుంటోంది?
ఆమె శిరస్సుపైనున్న చార్మినార్ మకుటాన్ని చూసి ఒక నిముషం ఆలోచనలో పడ్డాను.
ఎక్కడికక్కడ గాయాలపాలై, నెత్తురోడుతున్న ఆమె శరీరాన్ని చూసి మనసు బాధతో నిండిపోయింది.
ఆమె చెప్తున్నదేదీ అప్పటివరకూ శ్రద్ధగా వినలేదు. కళ్ళు తెరిచి చూసాక, మరి కళ్ళు రెప్పవాల్చలేనని తెలుసుకున్నాను.
“నువ్వు,,,,నువ్వు….భాగ్యనగరానివి కదూ?!” సందేహంగా అడిగాను.

“అవును! నేను భాగ్యనగరాన్ని! నన్ను సరిగానే పోల్చుకున్నావు. మతి స్థిమితం తప్పినట్లవుతోంది. అలా నడుచుకుంటూ…ఇలా వచ్చాను. తెలిసో, తెలియకో సీమాంధ్ర ప్రాంతంలో ఎవరితోనైనా మాట్లాడాలనిపించింది….వైద్యం ఏదయినా దొరుకుతుందేమోనని ఆశ!” కొన్ని మాటలు అర్థమౌతున్నాయి, కొన్ని అర్థం కావడం లేదు నాకు. తెలంగాణా భాషేమీ మాట్లాడ్డంలేదామె నాకు అర్థం కాకపోవడానికి! ఆ భాష అయినా తెలుగే కదా!
నా తింగరి చూపులు గమనించినట్లుంది. కొంత సేపు మౌనంగా ఉండిపోయింది.
అస్తవ్యస్థంగా ఉన్న ఆమెను పరికించి, ప్రథమ చికిత్స పెట్టె కోసం వెతకబోయాను. వారించింది ఆమె! “ఇవి ప్రథమ చికిత్సతో తగ్గే దెబ్బలు కావు” అంది.
“నువ్వు గొప్ప నగరానివని ప్రపంచమంతా పేరు కదా! పెట్టుబడులన్నీ నీ మీదే పెట్టామని ఆంధ్రా ప్రజలంతా అంటూ ఉంటారు. అభివృద్ధి అంటే భాగ్యనగరమని, భాగ్యనగరమంటే అభివృద్ధనీ మావాళ్ళంతా తెగ చెప్పేసుకుంటూ ఉంటారు. సంపదంతా నీలోనే ఉందనీ, నువ్వు సూపర్ ఫైనాన్స్ జెనరేటర్ వని అభివర్ణిస్తూ ఉంటారు. నువ్వేమో ఇంత దీనావస్థలో ఉన్నావు?!!…..” వళ్ళంతా సందేహాలు, మనసంతా వేదనతో ప్రశ్నించాను.
“హ్మ్….ఏం చెప్పను నా బాధలు? అభివృద్ధి అన్నావు కదా! అక్కడి నుండే మొదలు పెడ్తాను. వర్షమొస్తే నన్ను ఎప్పుడైనా చూసావా? నగరంలో చాలా ప్రాంతలు మునిగిపోయినట్లే! ఇలా ఎందుకు జరుగుతుంది? నగర నిర్మాణంలో ఉన్న లోపాలు తెలుసా మీకు? ట్రాఫిక్ ను ఎప్పుడైనా చూసారా? ఉదయం ఆరుకు ఆఫీసుకు బయలుదేరిన మనిషి పదికే ఆఫీసుకు చేరుతాడు. ఇది దేని లోపమో తెలుసా? జూబ్లీహిల్స్, సినిమా స్టుడియోలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు చూసి అభివృద్ధి అనుకుంటే ఎలా? నగరంలోని మురికివాడలు చూసారా? ఉద్యోగాలకు, విద్యకూ కేంద్రమని చెప్తున్నారు కానీ అక్కడున్న నిరుద్యోగుల్ని చూసారా? పరిశ్రమల అభివృద్ధి గురించి ఏం చెప్పమంటావ్? పర్యావరణానికి శత్రువులుగా మారాయి అవి. మూసీ నది పరిస్థితి చూసావా ఎపుడైనా? మధ్య మధ్యలో నగరానికి ఉద్యమాల సెగలు తగులుతుంటాయ్! ఏవో  రెండు సమూహాల మధ్య గొడవలు తలెత్తుతుంటాయ్! ఆ గొడవల తాకిడికి అట్టుడికిపోయేది నేనే! అవి కట్టాం, ఇవి కట్టాం అంటారే….వాటన్నింటినీ ధ్వంసం చేస్తారు. ఎప్పటికప్పుడు క్రొత్త విధ్వంసమే! చరిత్రనడుగు…..రక్తసిక్తమైన నా గతాన్ని, నిజాన్ని! ఇదంతా సరే! భూమిలో నేనొక భాగాన్నే కదా! అభివృద్ధి పుణ్యమాని ప్రతి నాయకుడూ నాపై పెట్టుబడి పెట్టేవాడే! భూ కబ్జాలకు నేను నిలయమైపోయానని నీకు తెలీదా? రాజకీయ తంత్రాలకు నన్ను ఉపయోగించుకోవడమే మీకు తెలుసు. ఎక్కడికక్కడ రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తలూ నన్ను నిలువునా దోచుకున్న సంగతి మీకు తెలుసా? సాంస్కృతికంగా ఉన్నతమైన విలువలున్న నా ప్రాంతాన్ని మతకలహాల అగ్నిశిఖల్లో మండించేసారు. నగరంలోని ఎన్ని మురికివాడల్లో తీవ్రవాదులు ప్రజలతో కలిసి జీవిస్తున్నారో తెలుసా? నగరంలో ఏ మూల దేశాన్ని ముక్కలు చేసే ఆలోచనలు ఆజ్యం పోసుకుంటున్నాయో తెలుసా? కారులోనో, స్కూటర్ సీటు క్రిందో, ఆఖరుకి చిన్న పిల్లాడు తొక్కుకునే సైకిలుకో బాంబు తగిలించి, మరణాల దీపావళి జరుపుకునే విధ్వంసకర శక్తులకు అడ్డాగా నేను మారానని తెలుసా? అభివృద్ధి అంటే కట్టడాలు, ఆసుపత్రులూ….ఒక ప్రదేశాన్నుంచి ఉత్పన్నమయ్యే రెవెన్యూ మాత్రమే అనుకునే స్థితినుండి మీరెప్పుడు బయటపడ్తారు?” ఈ చివరి ప్రశ్నకు నాకు వళ్ళు మండుకొచ్చింది.
“అంటే ఏమిటి నీ ఉద్దేశ్యం? నిన్ను వదులుకొమ్మంటావా? నీ నుండి వచ్చే రెవెన్యూ వల్ల రాష్ట్రమంతా ఆధారపడింది. రెండు రాష్ట్రాలుగా విభజిస్తే మా జిడిపి పడిపోదా? ఎన్నో విషయాల్లో ఉమ్మడి లాభాలున్న ఈ రెండు ప్రాంతాల మధ్యా ప్రతి విషయంలోనూ విభేదాలు రావా? పరిష్కారం లేని సమస్యలతో రాష్ట్రాలు అట్టుడికిపోతాయి. భాయీ భాయీ అనుకునే పరిస్థితి మారి, నీది నీదే, నాది నాదే అనుకునే పరిస్థితులు వస్తాయి. అప్పుడు కొన్ని విషయాల్లో తెలంగాణా లాభపడితే, కొన్ని విషయాల్లో సీమాంధ్ర లాభపడుతుంది. అలాగే చాలా విషయాల్లో రెండు ప్రాంతాలూ నష్టపోతాయి. రాజధాని రెండు పిల్లుల మధ్య తగవుతెచ్చిన రొట్టె ముక్క కాకూడదు కదా!” కాస్త ఆవేశంగానే అడిగాను.
“రొట్టెముక్క తినడానికి పనికిరానిదైపోతే కోతి కూడా పట్టుకెళ్ళదు. పిల్లులకు ఎలాగూ ఉపయోగపడదు.” తీవ్రంగా వచ్చింది ఆమె గొంతు.
“రొట్టెముక్కను పనికొచ్చేదిగా ఉంచండి. సక్రమంగా పంచుకోండి. ఆశతోనో, అత్యాశతోనో ఉద్దేశ్యాలు ఎందుకు? నిజమైన అభివృద్ధిని గురించి యోచించండి.
ఒక రొట్టెముక్క మీదే ఆధారపడితే పరిస్థితులు వికటించినపుడు ఇలాగే జరుగుతుంది.
ఆహారం దొరకనపుడు ఆటవిక పద్ధతి మనకు తెలియనిదా? కానీబాలిజం నాగరికతను కాటేయనీయవద్దు.
రొట్టెలు తయారుచేయడానికి పంట పండించండి. తయారీకి కావల్సిన సామాగ్రిని ఎక్కడికక్కడ ఇప్పటికైనా తయారుచేసుకోండి. ప్రపంచం ఇదివరకు ఇలాగే లేదు! ఎన్నో సార్లు భూగోళం మార్పులకు లోనైంది. అవుతూ ఉంది, అవుతూనే ఉంటుంది. మార్పుకు తగిన చర్యలు చేపట్టండి. ఇంతకన్నా నేనేం చెప్పలేను.” అంటూ నెత్తురోడుతూనే కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళిపోతున్న భాగ్యనగరాన్ని చూస్తూ నేను ఆలోచనలో పడ్డాను.

– విజయ భాను కోటే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, Permalink
0 0 vote
Article Rating
3 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
sivalakshmi
sivalakshmi
7 years ago

అమ్మతనం ఉట్టిపడుతున్నట్లు అమ్మకి పిల్లలందరూ సమానమేనన్నట్లు రాశావు భానూ,బాగుంది!

CHANDU
CHANDU
7 years ago

మేడం గారు చాల బాగుందండి మీ విశ్లేషణ

Vanaja Tatineni
Vanaja Tatineni
7 years ago

భాను గారు.. చక్కని పరిష్కారం మీ ఆలోచనలలో కనిపించింది. భాగ్యనగరం అంటే .. గాజు భవనాలు మాత్రమె కాదు, మురికివాడలు,కబ్జాలు, నీచ రాజకీయాలు, వరద ,ట్రాఫిక్ ఇలాంటి బీబత్స నగరం.. అని నా ఉద్దేశ్యం కూడా..

మీరన్నట్టు ఎన్నో మార్పులు జరుగుతాయి. నడక మొదలెట్టాలి. రొట్టె కోసం పంటలు పండించాలి.. మీ కథనం లో దార్శనికత ఉంది. నాకు బాగా నచ్చింది . అభినందనలు.