నా కళ్లతో అమెరికా-23

ఉత్తర కాలిఫోర్నియా యాత్ర (ఫోర్ట్ రాస్-పాయింట్ ఎరీనా-యూకై)రోజు-2

ప్రయాణంఫోర్ట్ రాస్ సముద్ర తీరం లో ఉన్న జెన్నెర్ అనే ఊరికి దగ్గర్లో ఉంది.  సఫారీ వెస్ట్ ఉన్న శాంత రోసా నించి  అక్కడికి దాదాపు నలభై, యాభై మైళ్ల దూరం. మహా అయితే గంట లో వెళ్లిపోవచ్చు.
ఉదయం పది గంటలకు తీరుబడిగా బయలుదేరి  పదకొండు గంటలకు అక్కడికి చేరిపోయాం. దారిలో గుర్నెవిల్లె అనే ఊరి దగ్గర్నించి  సముద్ర తీరపు పర్వత శ్రేణుల్ని  దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఊరి ముఖద్వారం దగ్గర రహదారి పక్కన కొండ దిగువగా ప్రవహిస్తున్న జల ప్రవాహన్ని చూసెళ్దామనుకుని ఆగాం. కానీ రాళ్ల మీంచి కిందికి పిల్లలతో దిగడం కష్టమనిపించి ముందుకు సాగాం.  ఇక పర్వత శ్రేణుల వెంబడి ప్రయాణం మామూలుగా గంట కాదు కదా, రెండు గంటలు పట్టింది. ఎత్తైన చెట్లు, చిన్న సన్నని వంపుల రహదారి వెంబడి, పర్వత సానువులలో దోబూచులాడే అడవి పచ్చని ఒడి లోంచి ప్రయాణం ఎంతో అద్భుతాహ్లాదంగా ఉంది. ఇక జెన్నర్ ఊరు భలే అందమైన ఊరు. అక్కడికి మరలా ఒకసారి రావాలని చూడగానే తీర్మానించుకున్నాం. నది ఒడ్డున, సముద్ర సంగమ ప్రాంతంలో ఉందా ఊరు. నది మీద చిన్న కయాక్ లతో విహారం సాగిస్తున్నారు కొందరు. ఒడ్డునే ఉన్న విజిటింగ్ సెంటర్ దగ్గర ఆగేం వివరాలు కనుక్కుందామని. నదీ ప్రవాహం లో నీళ్లెలా ఉన్నాయో అని చేత్తో ముట్టుకుని చూసాను. చలి కాలం లా బాగా చల్లగా ఉన్నాయి. అక్కడి నుంచి ఎదురుగా నదికి ఆవలి వైపు కనిపిస్తూంది. ఇక మరో రెండు మైళ్లు మేం వెళ్లే బాట వెంబడి ముందుకు డ్రైవ్ చేసుకెళ్లంగానే వచ్చే మొదటి విస్టా పాయింట్ దగ్గర ఆగగానే అద్భుత దృశ్యపు ఆనందంతో మైమరిచి పోయాం. అక్కడ నది, సముద్రం సంగమించే చోటు దిగువన ఎదురుగా ప్రత్యక్షమయ్యింది. మొదటి సారి అలాంటి దృశ్యాన్ని చూడడమేమో అనుభూతి వరదలై కమ్మింది. ఒక పక్క నిశ్శబ్దంగా సముద్రుడి ఒడి లోకి ప్రవహిస్తున్న నది, అలల హస్తాలతో ఉక్కిరిబిక్కిరిగా అదుముకుంటూనే వెనక్కి నెట్టేస్తున్నట్లున్న సముద్రం. సంగమ స్థానం లో అటూ ఇటూ ఇసుక కొండలా ఉండడం వల్ల నీటి రంగుల్లో తేడా స్పష్టంగా కనిపిస్తూంది. 
అక్కడి నుంచి రోజల్లా ముందుకు కదలాల్సిన ప్రయాణం ఉంది కాబట్టి అక్కడి నుంచి కదలక తప్పలేదు.

ఫోర్ట్ రాస్: ఫోర్ట్ రాస్ ఒకప్పటి రష్యన్ సెటిల్ మెంట్ కి సంబంధించిన దివాణం లాంటిది. సముద్ర తీరం లో ఎత్తైన కొండ మీద చదునైన ప్రాంతం లో ఉంది. సరిగ్గా పన్నెండు గంటలకు ఫోర్ట్ రాస్ కు చేరుకున్నాం. అక్కడ కారు పార్కు చేసి దాదాపు పావు మైలు లోపలికి నడవాల్సి ఉంటుంది. చుట్టూ ఎత్తైన చెక్క ప్రహరీ, బురుజులు  ఉన్న చిన్న సైజు కోట లాంటి ఆ చోటికి మేం చేరే సరికి యాభై మందికి పైగా జనం తో ఆ ప్రాంతమంతా కోలాహలంగా కనిపించింది. ఎవ్వరూ ఉండరనుకున్న మాకు అంత మంది జనాన్ని చూడగానే గొప్ప సంతోషంగా అనిపించింది. చుట్టూ ప్రహరీకి ఆనుకుని కట్టడాలు, మధ్యలో అంతా ఖాళీ ప్రదేశం. జనం నివసించడానికి గదులు, ఆహారం దాచుకోవడానికి గోదాములు, ప్రార్థనకు ఒక చర్చి, ఆయుధాల గదులు, వంట శాల, ప్రధాన ద్వారానికి, వెనక గోడలకి  ఒక మూలగా ఎత్తైన బురుజులు.
ఆ రోజు జూలై నాలుగు, ఇండిపెండెన్స్ డే కావడం వల్ల అక్కడి వారంతా ఆ ఫోర్ట్ కాలం నాటి వేష ధారణలతో, అలంకరణలతో తిరుగుతున్నారు.  
అప్పటికి సరిగ్గా భోజనాల వేళ అయ్యింది. మేం తినడానికి ఏవో బిస్కెట్లు తప్ప ఏమీ పట్టుకెళ్లలేదు. చుట్టూ కొనుక్కోవడానికి కూడా ఏవీ లేవు. అయినా దగ్గర్లో ఇక తినడానికి ఏవీ దొరకవని స్పష్టం అయిపోయింది కనుక పిల్లలకి బిస్కెట్లు పెట్టి, ఆకలికి మరో గంటన్నర సేపు ఓర్చుకున్నాం.

ఫోర్ట్ రాస్ చరిత్రని తెలిపే మ్యూజియం ఒకటి ఉంది ఆ లోపల. అదీగాక సందర్శకులకి చరిత్రను, అప్పటి వారు వాడిన వస్తు విశేషాలను గైడు వివరంగా చెప్తూ చూపించింది. 
అలాస్కా ప్రాంతం నుంచి కాలిఫోర్నియాకు 18 వ శతాబ్దిలో వలస వచ్చిన రష్యన్ల మొదటి నివాసమే ఈ ఫోర్ట్ రాస్. అప్పటికే ఇక్కడ  చుట్టుపక్కల ఉన్న స్పానిష్, ఇక్కడి ఆటవిక తెగలతో ఈ రష్యన్లు సంబంధ బాంధవ్యాలు వివరంగా చెప్పిన విశేషాలు బాగా ఆకట్టుకున్నాయి. చలికి దుస్తులుగా వాడడం కోసం మెత్తటి ఊలు శరీరం కలిగిన సీ ఓట్టర్లని అప్పటి వారు మొత్తం వేటాడడం ఇప్పుడవి కనుమరుగయ్యి పోయేయట.  చైనీయులకు, వీరికి ఎగుమతి, దిగుమతులు నడిచేవట. చిన్న పిల్లలెవరైనా వాలంటీరు కావాలని వరుని పిలింది గైడు. అప్పటి వివరాలు చెబ్తూ తన దగ్గరున్న దుస్తుల నమూనాల్ని వరుకి వేసింది.  మాటల మధ్యలో చైనీ అక్షరాలాతో ఉన్న ఒక పెద్ద అద్దకపు పలక లాంటిది ఇచ్చి “ఇదేమిటో” చెప్పుకోమని అందరికీ చూపించింది గైడు.  నేనేదో పెద్ద ‘గొప్పగా రంగుల అద్దకపు పలకా అని చెప్పేను. నిజానికి అది “అచ్చు గుద్దిన టీ పొడి” అని అసలు జబాబు గైడు చెప్పేసరికి ఆశ్చర్యపోయాం.
అక్కడ  ఆ రోజు జూలై 4 సందర్భంగా ప్రతీ సంవత్సరం జరిగే ఫిరంగి పేల్చే వేడుక జరుగుతూంది.
అందర్నీ ఆ చుట్టుపక్కలకి రమ్మని చెప్పింది గైడు. సైనిక సంప్రదాయాలతో అక్కడ కార్యక్రమం మొదలైంది. అందుకు పది మంది వాలంటీర్లని ముందుకు రమ్మంది. ఫిరంగి లో మందు కూరే చివరి వాలంటీర్ గా నేను కూడా వెళ్లాను. రష్యన్ భాష లో ఆర్డర్లు ఇస్తూ అచ్చుమచ్చు అక్కడేదో యుద్ధం జరుగుతున్న భావన కలగజేసారు. అంతా చేసి చిన్న ఉప్పు పొట్లమంత మందుని కూరమన్నపుడు నాకు గొప్ప భయం వేసింది. పెద్ద కర్రకు కట్టిన అగరు పుల్ల లాంటి చిన్న నిప్పుతో అంటించిన క్షణ కాలంలో పేద్ద శబ్దం వచ్చింది. అంతే అంత కంటే గట్టిగా భయంతో “ఆ…” అని నేనరిచాను. చుట్టూ ఎవ్వరూ భయపడలేదు నేను తప్ప. అంతా నవ్వుతూ చూస్తున్నారు. నాకు మాత్రం అందరిలో అలా అరిచేసినందుకు సిగ్గుగా అనిపించింది. ఆ తర్వాత నవ్వూ వచ్చింది. అదొక గొప్ప అనుభవం.

ఆ కోట ప్రాంతం భూకంపాల వల్లా, నిరాదరణ వల్లా చాలా భాగం ధ్వంసం అయిపోయినా టూరిజం కోసం దానిని పునర్నిర్మించి, సంరక్షిస్తూ ఉన్నారు. బయటకు వచ్చే సరికి ఎదురుగా దిగువన ఉత్తుంగ అలలతో పిలుస్తూన్న హోరైన సముద్రం. ఎండ బాగా కాస్తూంది కానీ సముద్రమ్మీంచి బాగా చల్లని గాలి వణికిస్తూంది. ఆ విశాలమైన కొండ కొమ్మున నిలబడి చూస్తే ఇక్కడికి వెన్నెల రాత్రి మరొక సారి రావాలనిపించింది. వెన్నెల వెలుగులో భూమీ, ఆకాశం కలిసే చోటుని, అలల నురుగునీ హత్తుకోవాలని ఊహించుకోవడానికే అద్భుత దృశ్యమది.

అప్పటికే 2 గంటలు కావస్తూంది. బాగా ఆకలి వెయ్యడం తో ఇక వెనక్కి వచ్చేటప్పుడు తాత్సారం చెయ్యకుండా కారెక్కాం. అదృష్టం కొలదీ సరిగ్గా 2 మైళ్లలో రోడ్డు పక్కన పెట్రోలు పంపుల్లో ఉండే చిన్న డెలీ లాంటి చోటు కనిపించింది. హాట్ డాగ్స్, ఫ్రోజెన్ పీజా, చల్లని సేండ్విచ్, ప్రెట్జిల్స్, డోనట్లు… ఆకలితో ఉన్నామేమో కనిపించినవన్నీ తలా ఒకటీ కొనుక్కుని తినేసాం.

పాయింట్ ఎరీనా: తర్వాత మేం యూకై అనే ఊరికి మా రాత్రి బసకు వెళ్లిపోవలసి ఉంది. ఆ ఊరికి వెళ్లాలంటే సముద్రం ఒడ్డునించి మరలా ఇన్ లాండ్ కి వెళ్లిపోవలిసి ఉంటుంది. 
కానీ ఇంకా చాలా సమయం మిగిలి ఉన్నందు వల్ల సముద్రం ఒడ్డునే మరి నలభై మైళ్లు ప్రయాణించి “పాయింట్ ఎరీనా” అనే లైట్ హౌస్ ని దర్శించి సాయంత్రానికి యూకై వెళ్లిపోవాలని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నాం.  సాయంత్రం నాలుగున్నర కి లైట్ హౌస్ పైకంటా తీసుకెళ్లి చూపించే టూరయిపోతుంది కాబట్టి మధ్యలో ఎక్కడా ఆగకుండా అటు దారి తీసాం.

పాయింట్ ఎరీనా కు వెళ్లే దారంతా ఒక పక్క సముద్ర తీరపు రహదారి లోనే వెళ్లాల్సి ఉంటుంది. ఎత్తైన పర్వత శిఖరాల మించి వంపులు తిరిగిన రహదారి, కిందంతా భీకరమైన అలలతో, భూమినంతటినీ మింగే శక్తి ఉన్నట్లు పొంగుతూ కనిపించే నురగల సముద్రం.  
సరిగ్గా మూడుంపావుకు పాయింట్ ఎరీనా కు చేరుకున్నాం.  ఆ లైట్ హౌస్ ని సందర్శించడానికి పెద్ద వాళ్లకి $7.50, పిల్లలకు $1 చొప్పున టిక్కెట్టు తీసుకోవాలి. అయితే కారెక్కడో పార్కు చేసి నడవాల్సిన పని లేదిక్కడ. సరిగ్గా లైట్ హౌస్ ముందే ఆగుతాం. నాలుగో అయిదో గదులతో అక్కడ లాడ్జ్  ఫెసిలిటీ కూడా ఉంది. కారు అద్దాలలోంచి చూస్తూంటే బయట ఎండ కింద సముద్ర కెరటాల మీద పడి దేదీప్యమానంగా వెలుగుతూంది. కారు లోంచి బయటికి కాలుపెట్టేసరికి విసురుగా చలి గాలి కారు తలుపును, మనుషుల్ని తోసుకుంటూ ప్రవేశించింది. బయట ఒక్క సారిగా ఎంత చల్లగా ఉందంటే రిఫ్రిజిరేటర్ లో ఉన్నట్లు.  మంచి వేసవి కాలం,  జూలై నెలలో అలా ఉందంటే ఇక చలికాలం అంతే సంగతులన్న మాట.  దానికి తోడు ఉధృతమైన గాలి. భలే విచిత్రం గా అనిపించింది. అసలక్కడ హఠాత్తుగా అంత గాలి ఎందుకుందో అర్థం కాలేదు. కారు పార్కింగు నించి పరుగులాంటి నడకతో గాజు అద్దాల లోపలికి, గిఫ్ట్ షాఫు లోకి పరుగెత్తాం. ఇంతలోనే పిల్లలు టోపీలు, కాగితాలు  ఎగిరిపోయాయని గోల.  మరలా బయటికి అన్నిటి వెనకా పరుగెత్తి తీసుకొచ్చేను.
మేం వెళ్లిన పదిహేను నిమిషాలలో టూర్ ప్రారంభమైంది. ముందుగా  ఉన్న గిఫ్ట్ షాపుకు ఆనుకుని ఉన్న గుండ్రని హాలులో  పైన లైట్ హౌస్ లో ఉన్న  ఆధునిక  అద్దాల దీపపు ప్రతిని పెద్దది చేసిన రూపంలో అక్కడ ప్రదర్శనకు ఉంచారు.  అద్భుతంగా ఉందది. అద్దాలతో తయారు చేసిన విరిసీ విరియని కలువ పూవులా. టూర్ లో ముందుగా లైట్ హౌస్ చరిత్ర, రూపు రేఖలు, భూకంప ప్రభావం తర్వాత పునర్నిర్మించిన విధానం తెలుసుకున్న తర్వాత లైట్ హౌస్ పైకి చూడడానికి వెళతాం.  మా ముందు బాచ్ వచ్చేసిన తర్వాత మమ్మల్ని పైకి అనుమతించారు. గుండ్రంగా తిరుగుతూ వెళ్లే మెట్లు దాదాపు వంద పైగా ఎక్కుతూ వెళ్ళాలి. మొత్తం 115 అడుగుల ఎత్తున పైకి వెళ్లగానే అద్దాల గది. బయట అతి చిన్న అద్దాల పెట్టెలో తళుక్కున మెరిసే అసలు అద్దాల లైటు. ఆ గదిలో నిలబడేసరికి ముందు బాగా కళ్లుతిరిగినట్లయ్యింది నాకు.  

అన్ని మెట్లు గుండ్రంగా తిరుగుతూ ఎక్కడం వల్లనో, చుట్టూ అంత ఎత్తున అద్దాల గదిలో నిలబడి కిందకు చూడడం వల్లనో. కానీ చుట్టూ ఉన్న అద్భుత దృశ్యాన్ని చూస్తే మనసు శరీరం నించి విడిపడి బయటకు దౌడు తీసింది. నా చుట్టూ ఉన్న జనం మాయమై ఆ గొప్ప చిత్ర పటం లో నేనూ భాగస్వామినయ్యాను. మూడు వైపులా కనుచూపు మేర సముద్రం. మధ్య లో సముద్రం లోపలికి సాగినట్లున్న భూభాగం చివర గొప్ప ఆత్మస్థయిర్యంతో నిలబడ్డట్లున్న ఒంటరి వెలుగు కాగడా లైట్ హౌస్.  చూడడానికి రెండు కళ్లూ చాలలేదు. సాయంకాలపు గొప్ప ఏటవాలు మెరుపు కళ్లల్లో ప్రతిఫలిస్తూ ఉండగా గైడు “ఎరీనా”అంటే ఏమిటో తెలుసా? స్పానిషు భాషలో “ఇసుక తిన్నె” అని అర్థం. ఈ లైట్ హౌస్ కి కనుచూపు మేర ఇసుక తిన్నెలు చుట్టూ ఉండడం వల్ల ఆ పేరు వచ్చింది అని చెప్పాడు. పైన పది నిమిషాలున్నా  10 సెకన్ల లా తనివి తీరలేదు.  ఒక్క అంతస్తు కిందికి రాగానే తలుపు తీసుకుని లైట్ హౌస్ చుట్టూ తిరిగే అవకాశం ఉంది.  బయటకు అడుగు పెట్టగానే కింద కంటే పదిరెట్లు భీకరంగా ఒక్క ఉదుటున తోసుకు వచ్చింది గాలి. ఒక్క అడుగు బయటకు పెట్టేసరికి గాలి తోసుకు పోతుందన్నట్లు భయం వేసింది. ఆకాశం లో గిరికీలు కొట్టాలని ఎంత కలలు కన్నా మానవ మాత్రులం, రెక్కలు లేవన్నది స్పష్టంగా మొదటి సారి అర్థమైంది. రెండడుగులు వేసి వెనక్కు వచ్చేసాను నేను. వరు, సత్య కించిత్ భయం లేకుండా ఉత్సాహంగా రౌండ్ చుట్టి వచ్చారు.

కిందికి వస్తూ అద్దాల కిటికి కనిపించినప్పుడల్లా బయటికి చూస్తూ వచ్చాను.  భూమికి, సముద్రానికి మధ్య ఇంతటి అపురూపమైన బంధం ఎందుకు ఉంటుందా అనిపించింది.

యూకై: నాలుగున్నర ప్రాంతంలో అక్కడి నుంచి బయలు దేరాం. మేం ఆ రోజు ఇంకా మరో యాభై మైళ్లు ప్రయాణించి యూకై చేరి అక్కడి విశేషాలు కూడా చూడాలి. అక్కడే మా రాత్రి బస. ఎండా కాలపు పొద్దు కావడం వల్ల తొమ్మిదైనా వెల్తురుగానే ఉంది.   అయితే ముందు చెప్పినట్లు మేం మరలా అడవి, కొండలు దాటి సముద్రం నుంచి దూరంగా, మైదాన ప్రాంతానికి మళ్లీ వెళ్లాలి. ఇలాంటి ప్రయాణం లో ఉన్న కష్ట నష్టాలు ముందు తెలీక అలా ప్లాను చేసాను. మరలా రేపు ఉదయం ఆ చుట్టుపక్కల అన్నీ చుట్టుకుంటూ తిరిగి సముద్రం ఒడ్డున ఉన్న మరో ఊరుకు ప్రయాణం.  ఇలా పర్వతాలు దాటడం లో ఉన్న గొప్ప చిక్కేమిటో ఆ సాయంత్రం బాగా తెలిసింది. ప్రతీ రెండు నిమిషాలకొక మలుపు ఉన్న పర్వత రహదారి అది.

దాదాపు నలభై మైళ్ల పొడవునా ఇలానే ఉంటుంది. సత్య డ్రైవ్ చేసాడాపూట.  తనసలే వంపుల దారుల్లో  కూడా వేగంగానే డ్రైవ్ చేస్తాడు. అందువల్లనో, ఆ మలుపుల వల్లనో నాకు కడుపు లో తిప్పడం మొదలైంది. మొత్తం ప్రయాణం అయ్యేసరికి విపరీతమైన తలపోటు కూడా పట్టుకుంది.  అడవి సౌందర్యాన్ని ఆస్వాదించలేకపోవడమే కాకుండా వచ్చిన ఊర్లో కూడా తిరగలేక పోయాను. అయినా తప్పదు. మాకు సమయం లేదు. తిన్నగా ఆ యూకై లోని “సిటీ ఆఫ్ టెన్ థౌసండ్ బుద్ధాస్ “కి వెళ్లాం. ప్రధాన స్వాగత తోరణాన్ని దాటుకుని లోపలికి వెళ్లగానే ఎందుకో శాంతి నికేతన్ జ్ఞాపకం వచ్చింది నాకు. రహదారులు, క్లాసు రూముల వంటి ఆ బిల్డింగులు అలా కనిపించాయి. అది అమెరికా అని గుర్తు చేస్తూ నిర్మానుష్యంగా ఉంది. 
 విజిటింగ్ సెంటర్ మొదట్లోనే ఒక్క రోడ్డు మలుపు తిరగగానే ఉంది. సాయంత్రం 5.45 కావడం తో అక్కడ ఉన్న మ్యూజియం వంటి ఒక చిన్న హాలుని దర్శించేందుకు  15 నిమిషాలు మాత్రమే వ్యవధి ఉంది. అయినా ఆ మ్యూజియం ఒక  చిన్న హాలు మాత్రమే కావడం వల్ల 10 నిమిషాల్లోనే బయటికి వచ్చేసాం. అక్కడ ఉన్న పూర్తి శాఖాహార భోజన శాల మధ్యాహ్నం 3 గంటలకే మూసివేస్తారని కౌటరు లో ఉన్న వ్యక్తి చెప్పాడు.  ఇక్కడ ప్రార్థనా కూటములు జరిగే సమయాలలో వేల మంది బౌద్ధులు ఇక్కడకు తరలి వస్తారట. అలా వచ్చే వారి కోసం విడిది గృహాలు కూడా ఉన్నాయక్కడ. 
ఇక సింగపూర్ లో ఉన్న లాంటి థౌసండ్ బుద్ధా టెంపులే ఇది కూడా.  కానీ బయటి నుంచి అక్కడ ఉన్నంత గొప్పగా లేదు.  లోపల మాత్రం అచ్చుమచ్చు అలాగే ఉంది. హాలు గోడలకు ఎక్కడ చూసినా ఒకే సైజులో చిన్న చిన్న అద్దాల అరల్లో ఉన్న బంగారు రంగు  బుద్ధ విగ్రహాలు. హాలు మధ్య అతి పెద్ద విగ్రహం, హాలంతా బంగారు రంగు  నేలబారు పీటలు. లోపలంతా ధగ ధగా మెరుస్తూ భలే అందంగా ఉంది.   ఎవరో ఒకరిద్దరు వాలంటీర్లు తప్ప నిర్మానుష్యంగా ఉందేమో గొప్ప అద్వితీయమైన ఆధ్యాత్మిక భావన కలుగుతూంది.  మేం కారు ఆపుకున్న మెయిన్ ఆఫీసు నించి పదడుగుల దూరంలో రోడ్డు దాటగానే ఉందా టెంపుల్.

అయితే బయటకు రాగానే అక్కడ కనిపించిన పురి విప్పుకుని ఆడుతున్న నెమళ్లు భలే ఆకర్షించాయి పిల్లల్ని.  మగ నెమళ్లు, ఆడ నెమళ్లు కలిపి పది వరకు అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నాయి.  మగ నెమళ్లన్నీ పురి విప్పి ఆడుతున్నాయి.  గొప్ప నిశ్శబ్దపు వాతావరణంలో శాంతి నికేతన్ లాంటి రహదారుల, భవంతుల మధ్య నుంచి వెళ్లి  ఆ ప్రార్థనా మందిరం లో కళ్లు మూసుకుని కూర్చుంటే “బుద్ధం శరణం గచ్ఛామి”  అని అనిపించింది.  ప్రార్థన్లో ఉన్న గొప్ప బలం చుట్టుముట్టిన గొప్ప అనుభూతి. 
 మా హోటల్ కు  చేరుకునేసరికి ఏడున్నరైంది. అక్కడి నుంచి బుద్ధా యూనివర్శిటీకి  3 మైళ్లు ఉంటుందేమో.  ఉదయం మరలా వీలైతే వద్దామని అనుకున్నాం కాబట్టి నేనక్కడి నుంచి రాగలిగేను. 
ఇక హోటల్ లో చెకిన్ అయ్యి మరో అరగంట లో భోజనానికి బయటికి వెళ్లేం.  8 తర్వాత బయట తినేందుకేమీ దొరక్క పోతే పిల్లలతో కష్టాలు పడలేమని.  ఆన్ లైన్ లో వెతికి దగ్గర్లో ఉన్న ఇండియన్ రెస్టారెంటు కి వెళ్లేం.  అది నిజానికి ఇండియన్ కాదు.  నేపాలీ రెస్టారెంటు.  తీరా వెళ్లిపోయేం కానీ అక్కడ కౌంటర్లో ఉన్నదీ,  సర్వ్ చేసేదీ, వండేదీ అన్నీ ఇద్దరు మనుషులు మాత్రమే. అప్పటికే మరో 10 మంది కుర్చీలలో వేచి  ఉన్నారక్కడ. “మరో గంట వేచి ఉండాలి మరి ” అని చెప్పి మరీ లోపలికి అనుమతిస్తున్నారు.  మాకు ఇక వెతికే ఓపిక లేక అక్కడే స్థిరపడ్డాం.  అయితే గంట కాదు గంటన్నర తర్వాత గానీ మాకు భోజనం రాలేదు. ఒక పక్క పేచీ పెడుతున్న పిల్లలతో ఉదయం నించీ బాగా అలిసి పోయి ఉన్న మేం అతి ఓపిగ్గా అక్కడ ఎలా వెయిట్ చేసేమో అని ఇప్పుడు తల్చుకుంటే అనిపిస్తుంది.  మొత్తానికి మధ్యస్థంగా రుచిగా ఉన్న ఆ చోట భోజనం కానిచ్చి హోటలుకి వెళ్లి ఎలా నిద్రపోయామో మాకే తెలీలేదు.
మర్నాడు ఉదయం లేటు కావడం వల్ల ఇక మరలా బుద్ధా యూనివర్శిటీకి వెళ్లడం సాధ్య పడలేదు. పైగా ముందు చూడవల్సినవి లిస్టులో ఎన్నో ఆ రోజు ఉన్నాయి.  హోటల్ లో మంచి కాంటినెంటల్  బ్రేక్ ఫాస్ట్  కానిచ్చి కారెక్కాం యూకై కు వీడ్కోలు పలికి.

– కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యంPermalink
0 0 vote
Article Rating
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
amarendra
amarendra
7 years ago

భీమ్లి లో గోస్తనీ నది సాగర సంగమం చూసారా ఎపుడైనా !!