సంపాదకీయం

మహిళా సర్పంచులు  

                     ఇటివలే జరిగిన  పంతాయితీ ఎన్నికలలో మహిళలు అధిక సంఖ్యలో పోటి చేయడం ఆనందించదగ్గ విషయంగానే కనిపిస్తుంది . మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అనుసరించి మహిళలకు 50 % స్థానాలు కేటాయించడం మంచి విషయంగానే అంగీకరించాలి .

               విజయం పొందిన ప్రతి పురుషుడి వెనక ఒక స్త్రీ ఉంటుందనే నానుడి మహిళల స్థానాల విషయంలో తారుమారైనట్టుగా కనిపిస్తుంది . ఎక్కడ చూసిన సర్పంచి పోటికి దిగిన స్త్రీల ప్లెక్సీలు , పోస్టర్లు స్త్రీలను   నిజంగానే నిద్రలేవనిచ్చారేమో   అన్నట్లుగా  సందడి సందడిగా కనిపించింది . కాని ఈ పోస్టర్ల వెనక , ఈ పదవుల వెనక , విజయం వరించిన స్త్రీల వెనక అభ్యర్ధుల పతులు పాలకులుగా చురుకైన పాత్రను  వహిస్తున్నారు . చాలా చోట్ల ఇప్పటికే ఎన్నికలలో మహిళా  కౌన్సిలర్లు , సర్పంచులు  పేరుకు మాత్రం పదవుల్లో ఉండి తమ భర్తలో , కొడుకులో యంత్రాంగాన్ని నడిపించడం జగమెరిగిన విషయమే .   పైగా  ఎక్కువ శాతం ఈ మహిళా సర్పంచులంతా రాజకీయ చరిత్ర ఉన్న నేతల భార్యలు కావటం చూస్తుంటే 50% మహిళా రిజర్వేషన్లు ఏ రకంగా ఉపయోగ పడుతున్నాయో అర్ధమవుతుంది .

                              వీటన్నింటికి తోడు దళిత రిజర్వేషన్ లతో తప్పనిసరై మహిళా సర్పంచులుగా మారిన స్త్రీలకి ఉన్న  అధికారం , హక్కు  గమనిస్తే దళిత మహిళా సర్పంచులపై ఆధిపత్య కులాలు జరుపుతున్న దాడులు ప్రత్యక్షసాక్ష్యాలుగా నిలుస్తాయి . కొన్ని పంచాయితీలలో దళిత మహిళా సర్పంచులకు కార్యాలయాలలో కూర్చోవడానికి కనీసం కుర్చీ కూడా ఇవ్వరు.  నేలపైనే కూర్చుని విధులు నిర్వహించిన సంఘటనలు కూడా ఉన్నాయి . మరికొన్ని చోట్ల మహిళా అధికారులను  వారి పై అధికారుల ముందు కూర్చోనీయక పోవడం , మహిళా సర్పంచుల్ని సంప్రదించకుండా వారిని  పక్కకు పెట్టి  అధికారులే కార్యక్రమాల్ని పూర్తి చేయటం జరుగుతూ ఉన్నాయి . మరొక చోట దళిత మహిళా సర్పంచి పదవిలోకి రాగానే ఉప సర్పంచిగా ఉన్న ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తి పంచాయితీ బల్లల్ని విరగగొట్టడం వంటి దాడులు దళిత స్త్రీలపై జరుగుతూనే ఉన్నాయి . ఇటివల లక్ష్మీం పేటలో భూమి తగాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారిని మర్చిపోవక ముందే అదే గ్రామానికి చెందిన మరొక విషయం ఆశ్చర్యానికి గురి చేసింది . ఆ గ్రామంలో దళితులకి సీటు కేటాయించినందుకు  మరొక వర్గం ఓటర్లంతా ఎన్నికల్ని బహిష్కరించారు .

              ఇవన్ని చూస్తే మహిళా సాధికారతలో ఎంత అధికారం వుందో , మహిళా సర్పంచులుగా విజయం సాధించిన తరవాత కూడా ఎంత మంది అభ్యర్ధులు తమ సొంత నిర్ణయాలతో తమ ప్రాంతాలను పరిపాలిస్తారో , ఎంత మంది  స్త్రీలు తెర ముందు వ్యక్తులుగా మిగిలిపోతారో చూడాల్సి ఉంది .

                  – హేమలత పుట్ల       

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయం, , , , , , , , , , , , , , , , , , , , Permalink

7 Responses to సంపాదకీయం

 1. anand says:

  ఈ నెల సంపాదకీయం చాలా బాగుంది . స్త్రీలు ఇంటిలో అలంకార ప్రాయంగానే ఉండి పోతున్నారు అని అనుకునే వాళ్ళం . ఇప్పుడు బయట ప్రపంచం లోకి వచ్చిన అక్కడ అలంకార ప్రాయంగా నే మిగిలి పోయారనటనికి నిదర్శనం ఈమహిళా సర్పంచులే ప్రత్యక్ష సాక్ష్యాలు . వాటి గురించి ప్రస్తావించినందుకు మీకు ధన్యవాదాలు .

 2. pravaasi says:

  ఎడిటోరియల్ చాలా చాలా బావుంది .నిజంగా నిక్కచ్చిగా వుంది. స్త్రీలే కాదు , నాకు తెలిసిన ఒక రిసర్వేడ్ మేల్ సర్పంచ్ కూడా 5 సంవత్సరాలలో ఎప్పుడూ కుర్చీ మీద కూర్చోలేదు. అదీ పైగా కమ్యూనిస్ట్ సర్పంచ్.
  హేమలత గారి సంపాదకీయం వెనుకటి బాధ మన జీవిత కాలం లో తీరితే మనం లక్కీ !
  థాంక్స్ టూ ఎడిటర్ !!!!!
  *పి.యస్: మంజరి గారి ఆవేశం సహజమైనదే “చదువు, స్వయం పోషకత్వం ఆధారంగా ఉండాల్సిందే. దాని మీద ఇటువంటి వ్యక్తుల రచనలూ, భావాలు కూడా వ్యాప్తి చెందితే అప్పుడు కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది – ”
  కాకపొతే చదువుకున్న వారికి / చదువులు కొన్న వారికీ ఇటువంటి వ్యక్తుల రచనలూ, భావాలు తలకు ఎక్కుతాయా? థాంక్స్ …

  • manjari lakshmi says:

   ప్రవాసి గారు చెప్పిన ఉదాహరణ ద్వారా ఈ రాజకీయ వ్యవస్థలో దళితులకు జరుగుతున్నా అన్యాయాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాల్సిందే. నేను ఫ్యూడల్ (భూస్వామ్య) వ్యవస్థ అని రాయకూడదు. పితృస్వామ్య వ్యవస్థ అని రాయాల్సింది. మీరు చెప్పిన ఉదాహరణ భూస్వామ్య సమాజంలో జరిగే అన్యాయాల కిందికి వస్తుంది. పితృస్వామ్య వ్యవస్థ, భూస్వామ్య సమాజంలో ఒక భాగంగా, పురుషులు స్త్రీల మీద నెరిపే ఆధిపత్యాల వరకే చూసే కోణం. పురుషాధిక్య సమాజం అని కూడా అనవచ్చు కానీ, పురుషాధిక్య సమాజం అంటే మళ్ళా ఈ వ్యవస్థల పట్టింపులు లేకుండా చెప్పినట్లవుతుంది.

 3. manjari lakshmi says:

  ఆడవాళ్ళు కుటుంబంలో ఉన్న ఫ్యూడల్ వ్యవస్థని ( తండ్రి, భర్త, కొడుకుల పెత్తనాన్ని ) ఎదిరించగలిగినప్పుడే, బయటి ప్రపంచంలో కూడా ఆ పని చెయ్యగలుగుతారు. దానికి చదువు, స్వయం పోషకత్వం ఆధారంగా ఉండాల్సిందే. దాని మీద ఇటువంటి వ్యక్తుల రచనలూ, భావాలు కూడా వ్యాప్తి చెందితే అప్పుడు కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది.

 4. అమ్మా! మీ సంపాదకీయం చదివాకే పత్రిక చదవాలని ఆగాను.కొండంత నిజాన్ని కురుచంత అద్దంలో చక్కగా చూపారుక్లుప్తంగా.కొన్నిచోట్ల అసలు మహిళా అభ్యర్ధులు ఆఫీసులకేరారు.వారిభర్తలదేహవా!చెప్పినట్లూ చేయకపోతే అభ్యర్ధులకు వారి భర్తలనుండీ దేహశుధ్ధికూడా కొండోకచో కానంబడియె!భళి భళి హేమగారూ మీసంపాదకీయానికి హేట్సాఫ్ !
  ఆదూరి.హైమవతి.

 5. Dr. vara prasad says:

  మీ సంపాదకీయం వాస్తవం. నేటి పరిస్తితులకు అద్దం పడుతున్నాయి .పత్రికను ఆలోచానాత్మకంగా నడిపిస్తున్నందుకు అభినందనలు

  .వరప్రసాద్.

 6. D.Venkateswara Rao says:

  కనబడని చేతులెన్నో తెరవేనుకనుండి నడుపుతూనే ఉంటాయి నాటకం
  కనబడుతూ మహిళా కౌన్సిలర్లు , సర్పంచులు ఆడుతారు బూటకం
  నాది నావాళ్ళని
  నాది నాదను అహంతో
  తను తనవాళ్ళు అనే దిశలో
  మహిళ ఇప్పుడు సాగుతుంది
  ఇది ఆరంభం మాత్రమె
  మహిళలు త్వరగా మేలుకుని
  తమ తప్పులు తెలుసుకుని
  కుల మతాలకు అతీతంగా
  కలసికట్టుగా ఉమ్మడి అభిప్రాయాలతో
  దేశాన్ని ముందుకు నడిపిస్తారని ఆశిద్దాం