మీకో లేఖ …

ప్రియమైన మీకు,

                       ఏమిటీ, శనివారం నాడు పొద్దున్నే లేపి, కాఫీతో పాటు ఉత్తరం ఇచ్చి ఎక్కడికెళ్ళిపోయిందో అనుకుంటున్నారా? ఖంగారేమీ లేదు, వంటింట్లోనే మీకు ఫలహారం తయారు చేస్తున్నాను. మెల్లగా ఉత్తరం చదివి రండి. ఒకే ఇంట్లో ఉంటూ ఉత్తరమెందుకు ముఖాముఖి చెప్పొచ్చు కదా అంటారా? మీరు నాకంతటి అదృష్టమెక్కడ ప్రసాదిస్తున్నారు మహానుభావా?
 
                 పొద్దున్న లేచింది మొదలు ఉరుకుల పరుగులతో కూడిన ఉద్యోగమాయె! లేస్తూనే సమయం మించిపోతోందని హడావిడి పడుతూ వెళ్ళిపోతారు, రాత్రి ఎప్పటికో కాని రారు. ఇంక అలసటతో వచ్చి నాలుగు ముద్దలు తిన్నారనిపించుకుని  నిద్రా దేవి ఒళ్ళోకి జారిపోతారు. ఇక వారాంతాల సంగతి సరే సరి. ప్రతి వారం స్నేహితులతో ఏదో కార్యక్రమం లేదా వారంలో పడ్డ శ్రమనంతా నిద్ర రూపంలో తీర్చేసుకుంటారు. మేలుకుని ఉన్న ఆ కాసేపు వీడియో గేములని, సినిమాలని ఆ లేప్టాపును ముందేసుకుని కూర్చుంటారు. నాకైతే దాన్ని చూస్తే భలే అసూయగా ఉంటుంది. అస్తమానం మిమ్మల్ని అంటిబెట్టుకునే ఉంటుందని. 
 
                 వచ్చే పోయే నలుగురితో కళకళలాడే ఇంటి నుండి వచ్చిన నన్ను తీసుకొచ్చి ఈ నిర్జనారణ్యంలో పడేశారు. ఓ మాటా మంతీ ఆడదామన్నా ఇళ్ళల్లోంచీ ఒక్కరు బయటకు రారు. పోని కూరలవాడితోనో, చాకలి దానితోనో బాతాఖానీ కొడదామంటే కూరల వాళ్ళెవ్వరూ ఇక్కడ రోడ్లమీదకు రారు, చాకలులు లేరు..అన్నిటికీ యంత్రాలే. పిచ్చెక్కిపోతున్నాదనుకోండి! కనీసం మా ఇంట్లోలా ఓ మల్లె పందిరి, ఓ మామిడి చెట్టు ఉన్నా వాటితో నా గోడు చెప్పుకుని సరిపెట్టుకునేదాన్ని. ఇక్కడ చెట్లు, మొక్కలు కాదు కదా ఎండుగడ్డి కూడా కనుచూపు మేరలో లేదు.
 
                 మన పెళ్ళయి ఆరు నెలలు కావస్తోంది. మీ ఇష్టాలు, అభిరుచులు తెలుసుకునే నిరంతర ప్రయత్నంలోనే ఈ విషయాలు తెలుసుకున్నా. చెప్పనా? సరిగ్గా చెప్పానో లేదో మీరే చెప్పాలి. మీకు క్రికెటంటే చాలా ఇష్టం, అందులోనూ సచినంటే మరీ ఇష్టం (ఈ విషయంలో మనిద్దరి అభిప్రాయాలూ ఒకటేనండోయ్), ఇంకా వీడియో గేమ్సిష్టం (నాకవంటే మాచెడ్డ చిరాకు సుమండీ అయినా మీకిష్టం కదా నేనేమీ అనను లెండి). గోకుల్ హోటల్లో గోబీ మంచూరియా, పనీర్ బటర్ మసాలా అంటే పిచ్చి (అవి బాగుంటాయి, నేనూ ఒప్పుకుంటాను మహాప్రభో). మీ హైదరాబాదంటే వల్లమాలిన అభిమానం, ఎప్పుడెప్పుడు సెలవొస్తుందా అక్కడ వాలిపోదామా అని చూస్తూ ఉంటారు.   
 
             మరి నా ఇష్టాలు తెలుసుకున్నారో లేదో! నే చెప్పనా? నాకు పాత సినిమాలన్నా, పాత పాటలన్నా ప్రాణం.ముళ్ళపూడి వారి బుడుగు, మొక్కపాటి వారి పార్వతీశం, చిలకమర్తి వారి గణపతి నా ప్రియ నేస్తాలు. వేసవి సాయంకాలాలు, చలికాలపు ఎండలు నా నెచ్చెలులు.  మా ఊరి చెరువు గట్టు మీది రాములు వారంటే చెప్పలేనంత ఇష్టం. మా పెరట్లో, వెన్నెల్లో నులక మంచమేసుకుని మా బామ్మ తో కబుర్లాడడమంటే సీతాఫలమంతిష్టం. ఇప్పుడు మాత్రం అన్నిటికన్నా మీరిష్టం.
 
                తెలుసుకున్నారా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా మన జీవితాలని మొదలుపెడదామా? ఎందుకంటారా? యాంత్రికత.. ఇది ఎక్కడన్నా రావొచ్చు కాని జీవితాల్లో అందునా భార్యా భర్తల మధ్య అస్సలు రాకూడదండీ. అందుకని నిరంతరం మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకుంటూ జీవితాన్ని నిత్యనూతనంగా చేసుకోవాలి. మళ్ళీ మరో ఆరు నెలలు పోతే మన కోసం వెచ్చించుకోవడానికి మనకు అంతగా సమయం దొరకకపోవచ్చు. ఎందుకో చెప్పుకోండి చూద్దాం. మన మధ్యకి మరో వ్యక్తి రాబోతున్నారు. మా అమ్మా నాన్నో లేక అత్తా మామలో అనుకోకండి.తాతల మీసాలు పట్టుకుని ఆడడానికి ఒక బుజ్జి పాపాయి రాబోతోంది. ఆగండాగండి, పరిగెత్తుకు రాకండి, ఇందాకే ఇల్లంతా కడిగాను, ఇంకా తడారలేదు, జారి పడగలరు..మెల్లగా రండి.
 
ఇట్లు,
మీ సహచరి.

హరిత.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
 రచయిత్రి పరిచయం : 
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కొంత కాలం పని చేసి, ప్రస్తుతం దూరవిద్య ద్వార తెలుగు ఎం.ఏ అభ్యసిస్తూ, తెలుగు శ్రవణ ప్రతిలేఖకురాలిగా పని చేస్తున్నాను. తెలుగు రచనావ్యాసంగంలో ఓనమాలు దిద్దుతున్న విద్యార్థిని.
UncategorizedPermalink
0 0 vote
Article Rating
6 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
Harita
Harita
7 years ago

హితులకు, స్నేహితులకు.. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు

Padma
Padma
7 years ago

హరిత, నీ లిఖిత అమోఘం. నీ వర్ణన కళ్ళకు కట్టినట్టుంది. ఇంకా గొప్ప రచన రాయాలని ఆశిస్తున్నాను.

vasavi
vasavi
7 years ago

చాలా బాగుంది హారీ:)
ముఖ్యంగా ఆ చివరి పేరా చదువుతుంటే కళ్ళు చెమర్చాయి! నువ్వు ఇలా ఎన్నో వ్యాసాలు ప్రచురిస్తావని ఆశిస్తున్నాను.

Sailaja
Sailaja
7 years ago
Reply to  vasavi

బాగుంది హరీ. వాసవి చెప్పినట్లు చివరి పేరా చదివినపుడు కళ్ళు చెమర్చాయి.

...
...
7 years ago

చాల బాగుంది హార్రీ !

Kranthi
Kranthi
7 years ago

చాల బాగుంది హరిత గారు