తెలుగు పద్యానికి ఉద్యమాభిషేకం చేయించిన “దాశరథి

         తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి. పద్యా న్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నానాటికీ తెలంగాణా ఉద్యమానికి ప్రేరణనందిస్తున్న కవి. ఛందస్సనబడే వాయిద్యాలలో నిప్పురవ్వల్లాంటి అక్షరాలను పోసి యుద్ధ నగారాలూ మోగిస్తే ఎలా ఉంటుందో దాశరథి కృష్ణమాచార్య పద్యాలు చదివితే అలా ఉంటుంది. మన మస్తిష్కం దానంత టదే కవాతు చేయనారంభిస్తుంది.

            సానబెట్టిన కత్తులాంటి పదునైన పద్యాలని వ్రాసిన దాశరథి వంటి తెలుగుకవి మరొకరు కనిపించరంటే అతిశ యోక్తి గాదు. పదాలలో చురుకుదనం, నడకలో పరుగులెత్తే ఉద్రేకం, భావంలో విప్లవం, వీటన్నిటినీ ఛందస్సులో సునా  యాసంగా బిగించగల నైపుణ్యం, దాశరథి సొంతం. ఆ కాలంలో అందరి కవుల్లాగానే దాశరథి కూడా భావకవిత్వం వ్రాసారు. అయితే భావకవుల్లో ఒకరిగా మిగిలిపోలేదు. అదే పద్యాన్ని ఆయుధంగా మార్చి నిజాం దౌర్జన్యాల మీద పోరా టం సాగించిన కవియోధుడు దాశరథి.

            దాశరథి పద్యాలను అర్థం చేసుకోవాలంటే పాఠకులెవ్వరూ సాహితీద్రష్టలై ఉండాల్సిన పనిలేదు. భాషా పండితు లై ఉండాల్సిన అవసరం అంతకన్నాలేదు. కవి హృదయాన్ని సరిగ్గా పట్టగలిగితే చాలు! వాళ్ళు చాలా అదృష్టవంతులు కింద లెక్క.. ఒకవేళ లేకపోయినా నష్టం లేదు. ఎందుకంటే “పదాతి దళాల పదఘట్టనల చప్పుడూ, ఉరకలెత్తి ప్రవహించే నదీ ప్రవాహపు హోరు, మత్తెక్కినట్టు ఢీకొనే మబ్బుల జోరు”– ఇవేవీ ప్రత్యేకంగా అర్థం కానవసరం లేదు, మనల్ని కది లించడానికి! అంతేకాదు దాశరథి పద్యాలు తెలంగాణ ఉద్యమస్ఫూర్తికి ఎగురవేసిన అక్షర పతాకాలు. కాబట్టి విప్లవ, అభ్యుదయ భావాలతో తెలుగు పద్యానికి ఉద్యమాభిషేకం చేయించిన దాశరథి పద్యాలలోని కత్తుల్లాంటి కొన్ని పద్యాలను విశ్లేషించడమే ప్రస్తుత వ్యాసోద్దేశం. 

చింతలతోపులో కురియు చిన్కులకున్ తడిముద్దయైన బా
లింత యొడిన్ శయించు పసిరెక్కల మొగ్గను వోని బిడ్డకున్
బొంతలు లేవు కప్పుటకు; బొంది హిమంబయి పోవునేమొ సా
గింతును రుద్రవీణపయి నించుక వెచ్చని అగ్నిగీతముల్”

(దాశరథి “రుద్రవీణ” అనే కవితా సంపుటిలో “మూర్చన” అనే కవితలోని పద్యమిది)

చింతలతోపు. హోరున కురిసే వాన. వానలో తడిసి ముద్దవుతున్న బాలెంత. ఆమె ఒడిలో పసిమొగ్గ లాంటి చిన్ని బిడ్డ. ఆ బిడ్డకి కప్పడానికి ఒక్క బొంతకూడా లేదు. ఇది కవికి కనిపించిన దృశ్యం. మనిషిగా అతని గుండె మండింది. కవి గా పద్యం పొంగింది. భౌతిక ప్రపంచంలో అలాంటి వేలమంది బాలెంతలకి పసిబిడ్డలకి ప్రతిరూపంగా కవి మనసులో కదలాడిన చిత్రమది. ఏం చెయ్యగలడు కవి? ఆ చలిలో ఆ పసిబిడ్డ శరీరం గడ్డకట్టుకు పోతుందేమో! ఎలా కాపాడడం? కవి దగ్గరున్న పరికరం ఒక్కటే, పద్యం! కవి చేతిలో ఏ రూపాన్నయినా ధరించగలదది. అగ్నిధార కురిపించగలదు. అమృతాభిషేకం చెయ్యగలదు. రుద్రవీణ వినిపించగలదు. ఇక్కడ, రుద్రవీణని మీటి తన గుండెమంటనే అగ్నిగీతాలుగా చేసి పాడుతున్నాడు కవి. ఆ గీతాలు పసిబిడ్డకి కాస్తంత వెచ్చదనాన్నిస్తాయేమోనని!

కొరగాని లోకమున కిప్పుడె నిప్పురగిల్చి కాల్చి, నా
లో కదలాడు నూహలకు రూపమొసంగి పునస్సృజింతు;
ఱ్ఱాకట గుందు పేదలకు బ్రహ్మ లిఖించిన కొంటెవ్రాతలో
వ్యాకరణమ్ములేదు, రసభంగిమ కానగరాదదేలనో!”

(దాశరథి “రుద్రవీణ” అనే కవితా సంపుటిలో “స్వామి పూజ” అనే కవితలోని పద్యమిది)

            పద్యం అనే కత్తికి రెండువైపులా పదునే అని నిరూపించిన ఏకైక కవి దాశరథి. పద్యాన్ని అభ్యుదయ భావాల వాహికగా నిర్వహించిన కవులు లేకపోలేదు. కాని దాశరథి పద్యంలోని వాడి వేడి మరెక్కడా కనిపించదు. దానికి ఈ  పద్యం ఒకానొక సాక్ష్యం. బ్రతుకుభారంతో క్రుంగిపోతున్న పేదవాళ్లున్న ఈ లోకానికి అగ్గిరాజేసి కాల్చేస్తానంటున్నాడు కవి. అంతే కాదు ఇప్పుడున్న ప్రపంచానికి బదులుగా తన మనసులో మెదిలాడే ఊహలకు రూపాన్నిచ్చి నవసమాజాన్ని సృష్టించాలనుకుంటున్నాడు. ఇలా ఎందుకు చేయాలనుకుంటున్నాడో తెలుసా? ఆకలితో బాధపడే పేదల తలరాత రాయ డంలో బ్రహ్మదేవుడు నియమరహితంగా ప్రవర్తించాడని కవి భావిస్తున్నాడు కాబట్టి. నిజమైన కవి ఇలా శ్రామికులకు, కార్మికులకు, బాధితులకు కష్టం వచ్చినప్పుడల్లా చేదోడువాదోడుగా అతని పక్కనే నిలుచుంటాడు.

పైన ఉదహరించిన పద్యాల కోవలోకి చేరే దాశరథి వారి అగ్నిధార” లోని కొన్ని పద్యాలను చూద్దాం.

పద్దెము వ్రాయుచున్ వెనుక వైపున చూడకు లేఖినీ! మహా
పద్దశ దాపురించును, గబా గబ లాగుము వేనవేలుగా
పద్దెము; లర్థవాదములపై కనులుంచకుమా! పదావళుల్
ముద్దులు గార్చుచున్ కనుల ముందర తాండవ మాచరించెడిన్మహాలేఖిని .1 : అగ్నిధార

త్వరపడు! భావసాగరము బాహువు లెత్తుచు నీ శిరస్సు పై
పొరలుచు వచ్చుచున్నది; కవుంగిలిలో కవితాకుమారి సం
బరపడి నవ్వుచున్నది; గబా గబ కూర్చుము పద్యరాశి;
ర్థ రహితమంచు పల్కెడి కళా రహితున్ పడద్రోసి సాగుమా!”మహాలేఖిని.2: అగ్నిధార

            ‘పద్యాలను రాసే కవి యొక్క లేఖినికి ఉండాల్సిన లక్షణాలను పై పద్యాలలో ఎంతో చక్కగా చెప్పాడు. పద్యాన్ని రాయడం మొదలుపెట్టిన తర్వాత వెనుకకి తిరిగి చూడకూడదట! ఒక్కసారి పద్యాలను రాయడం మొదలుపెడితే నిరాఘా తంగా గబగబా వేలకివేలు పదాలు కన్నులముందు తాండవమాడాలి. ఒడుపుగా పద్యరచనని కొనసాగించాలి అని చెప్ప గలిగాడు కాబట్టే తెలుగు పద్యాన్ని అభ్యుదయ కవితా వీధుల్లో ఊరేగించగలిగాడు.

కొండలు కొండలే అడవి కోనల భగ్గున మండిపోవ, నా
గుండెలు గుండెలే అరుణ గోళములై ప్రళయాగ్ని మాలలై
మండుట చోద్యమా? మధుర మంజుల మామక లేఖినీ ముఖం
బెండకు మండిపోయి రచియించును గ్రీష్మ మహా ప్రబంధముల్మహేలేఖిని . 5: అగ్నిధార

            ఈ పద్యంలో అయితే మధురమంజులమైన తన లేఖిని ఎండకు మండిపోయి అనేకమైన గ్రీష్మప్రబంధాలను రచి స్తుందని గర్వంగా ఎలుగెత్తి చాటాడు. ఈ సందర్భంలో కవి ఒక దార్శనికుడిగా కనిపిస్తాడు. ఆ దార్శనికతకి కారణం అతని మీద అతనికి ఉన్న నమ్మకమే.

కాలపు కంటిలో కరకు కత్తులు గ్రుచ్చి, మెరుంగు నెత్తురుల్
కాలువ కట్టి తెచ్చి, ధన కాళికకున్ బలి ఇచ్చి, యెన్ని కా
లాలు వరమ్ములందెదరురా? నిరుపేదల బూది మోమునన్
దాలిచి భక్తియుక్తుల సదాశివునన్ బులిపించ నెంచుచున్? (కాలపు కంటిలో…..1: అగ్నిధార)

ఈ పద్యంలో కూడా కవి పేదలపక్షపాతిగా కనిపిస్తాడు. కాలం కంటిలో పదునైన కత్తులు దింపి, మరిగే నెత్తురు కాలువ లని ధనదేవతకి బలి ఇస్తున్న ఈ వ్యవస్థని ఇక్కడ తీవ్రంగా నిరసించాడు.

దాశరథి గారి మరికొన్ని పద్యాలు ఎన్నెన్నో ఊసులు :

            నాజీ నైజాం రోజులు. వరంగల్ సెంట్రల్ జైలు. హఠాత్తుగా ఒక అర్థరాత్రి తమ తమ వస్తువులన్నీ సర్దుకొమ్మని రాజకీయ ఖైదీలందరికీ ఆదేశం అందింది. ఖైదీలు మరెవరో కాదు నిజాం ప్రభువు నిరంకుశత్వాన్ని ఎండగడుతున్న కవు లూ, రచయితలూను. వారిలో “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అన్న అజరామరమైన మాటలన్న మహాకవి, నాటక కర్త, అనువాదకులు, వ్యాసరచయిత అయిన దాశరథి గారు కూడా ఉన్నారు.

            అసలే నిజాం నిరంకుశుడు, పైగా మూర్ఖుడు. ఉన్నఫళాన రాజకీయ ఖైదీలందరినీ మూటాముల్లే సర్దుకొమ్మని ఆదేశాలివ్వడం అంటే, వీరికి గుండెల్లో గుబులు పుట్టకమానదు. రాత్రికి రాత్రి ఏ అడవికో తీసుకెళ్ళి కాల్చిచంపేస్తారేమో! అప్పటికే కాళోజీ నారాయణ రావును, వట్టికోట ఆళ్వారు స్వామిని ఇలాగే చెప్పాపెట్టకుండా హఠాత్తుగా ఎక్కడికో తీసుకె ళ్ళారు, తర్వాత వారి జాడ లేదు. ఈ నేపధ్యంలో భయం భయంగానే ఖైదీలందరూ తమ తమ సామాన్లు సర్దుకుని జైలు బయట ఉన్న పోలీసు వ్యాన్లు ఎక్కారు. మొత్తం ముప్ఫై మంది ఉంటారు, వీరికి కాపలాగా అరవైమంది సాయుధ పోలీ సులు.

            ఎన్నిరోజులుగా జైల్లో ఉన్నారో, ఒక్కసారిగా హేమంత కాలపు చలిగాలి, ఎల్లలు లేని స్వేచ్ఛావాయువు తాకగానే దాశరథి గారికి ఉత్సాహం వచ్చింది. పూర్వం “విక్రమాంక దేవ చరిత్ర” అనే సంస్కృత మహాకావ్యాన్ని రాసిన కవి బిల్హ ణుడు అని ఉండేవాడు. ఆయన మరో రచన “బిల్హణకావ్యం” అద్భుతమైనదిగా పండితులచే ప్రశంసలందుకోబడ్డది. కాక పోతే వచ్చిన చిక్కేంటంటే ఆ కావ్యాన్ని కవి అంతఃపుర యువరాణిని దృష్టిలో ఉంచుకుని రాసాడేమోనన్న అనుమానం బయలుదేరింది రాజుగారికి. రాజు గారికి అనుమానమొస్తే ఏం చేస్తాడో? అదే చేసాడు, బిల్హణుడికి మరణ దండన విధిం చాడు. వధ్యశిలకు వెళ్తూ వెళ్తూ కూడా బిల్హణుడు “అద్యాపి” అనే పదంతో మొదలెట్టి అద్భుతమైన శ్లోకాలు చెప్పనారం భించాడట.

            మన దాశరథి గారేం బిల్హణుడికి తీసిపోలేదు. వధ్యశిలకు వెళ్తున్న బిల్హణుడిలా రైల్లో కూర్చుని తన సహచరులను ద్దేశించి “చలిగాలి” అన్న పదంతో ప్రారంభమయ్యే కందపద్యాలను ఆశువుగా చెప్పనారంభించాడు. అక్కడ కలం లేదు, దీపం లేదు, కాగితం లేదు. మొత్తం ముప్ఫైమంది సహచరులున్నారు, ఈయన 27 పద్యాలను ఆశువుగా చెప్పాడు. తలా ఒకటి గుర్తుపెట్టుకుని ఉంటారు. అందులో ఒకటి..

చలిగాలి పలుకు వార్తలు
చెలిగాలిని బోలి వలపు చిరువెచ్చదన
మ్ములు గుండెలలో నింపెను.
చెలికాడా! జైలు బయట చిత్తమ్మలరెన్

            ఈ పద్యాన్ని  ఒక సామాన్య పాఠకుడి దృష్టి నుంచి ఆలోచిస్తే కవి ఎంత చమత్కారో తెలుస్తుంది. చలిగాలిని చెలిగాలితో పోలుస్తూ.. అది చిరు వెచ్చ దనాన్ని గుండెలలో నింపిందని చెబుతున్నాడు. చల్లని గాలి మీ గుండెలలో వెచ్చదనాన్ని నింపితే ఎలా ఉంటుందో, ఈ పద్యం చదివితే అర్థం అయిపోదూ!అన్నట్లు, ఇక్కడ “చెలి కాడా! ” అని దాశరథి గారు అన్నది పక్కనున్న తన స్నేహితుడు జంగారెడ్డిని.

            జంగారెడ్డి అన్నాడు, “చావబోతుంటే పద్యాలేంటయ్యా కవీ” అని. దాశరథి అన్నాడు – “ఇక్కడ కాగితం లేదు, కలం లేదు, దీపం లేదు. కానీ గళం ఉంది, కోపం ఉంది. మృత్యువు ముఖాన ఉమ్మేసి, శాశ్వత చైతన్య పదాలమీద అమర ప్రయాణం చెయ్యాలనే తెగువ ఉంది. ధారణాశక్తి ఉంది. ఆశుధారా కవన జవనాశ్వాలు ఉన్నాయి, ఇక దిగులేల”. “మనం బతకడానికి కాదు కదా ఉద్యమంలో దూకింది? నీకు ఇంటికి వెళ్ళే ఆశలేదు కదా? అయినప్పుడు చద్దాం. భరత మాత పాదాలకు మన రక్త పద్మాలతో పూజ ఈ రాత్రి. జంగారెడ్డీ భయపడకు, చావు కూడా పెళ్ళిలాంటిదే!”

ఒకసారి కవితావేశం వచ్చాక ఆగుతుందా చల్లారే దాకా? దాశరథి మరో పద్యం లోకి వెళ్ళిపోయాడు…

చలిగాలి పీల్చి చెలి కౌ
గిలి లో శయినించినట్లు కేవల భావో
జ్జ్వల వీధుల పయనించగ
విలపించగనేల? భీతి విడువుము మిత్రా!

            ఇలా ఏకబిగిన ఆశువుగా 27 పద్యాలు చెప్పారు దాశరథి. ఇది అంత గొప్ప విషయమా, ఇంతకు ముందు ఆశు వుగా పద్యాలు చెప్పిన వారు లేరా? ఉన్నారు. ఇక్కడ అందరినీ ఆకర్షించే విషయమేమిటంటే ఈ పద్యాలు చెప్పిన ఆ సందర్భం. దాశరథి గారి దమ్ము, చతురత. ఈ రెండు పద్యాలు దాశరథి వారి “యాత్రాస్మృతి” లోనివి. 

నిజాం నిరంకుశత్వంపై సింహంలా గర్జించిన దాశరథి:

            భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ఉధృతంగా సాగుతున్న కాలంలోనే, తెలంగాణలో కూడా నిజాం వ్యతిరేక ఉద్య మం జరుగుతున్నది.1947లో భారతావనికి స్వాతంత్ర్యం సిద్దించింది. కాని తెలంగాణకు మాత్రం నిజాం నవాబుల పాల న నుంచి విముక్తి లభించలేదు. నిజాం పాలనలో ప్రజలు దుర్భర జీవితాలను గడిపే వారు. నిజాం నిరంకుశ పరిపాలన లో ప్రజలకు ఎలాంటి స్వేచ్ఛా ఉండేది కాదు. ప్రజలు తమ మనసులోని కోర్కెలను తెలుపుకొనుటకు గాని, సభలు ఏర్పా టు చేసి తమ కష్టాలను, బాధలను చేప్పుకోవడానికి వీలుండేది కాదు. ప్రజలపై అధికపన్నులు విధించడం, వారి భూము లను లాక్కోవడం, వారిని నానారకాలుగా బాధించేవారు. రజాకార్లు ప్రజల పాలిట నరభక్షకుల్లా తయారయ్యారు. వీరు ఇండ్లపై పడి ప్రజల్ని ఊచకోతకోసేవారు. ఆడవారిని ఎత్తుకెల్లి మానభంగం చేసేవారు.

            ఈ విధంగా తెలంగాణ ప్రజలు నిజాం నవాబుల పరిపాలనలో స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు లేకుండా జీవచ్చవాల్లా బ్రతికే వారు. ఇలా వీరి మతోన్మాద, కిరాతక, నియంతృత్వ, నిరంకుశ పాలనను ఎదిరించి నిజాం నవాబుకు సింహ స్వప్నమై నిలిచి…

ప్రాణము లొడ్డి ఘోర గహనాటవులన్ బడగొట్టి మంచి మా
గాణములన్ స్రుజించి ఎముకల్ నుసిజేసి పొలాలు దున్ని భో
షాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే, తెలం
గాణము రైతుదే; ముసలి నక్కకు రాచరికంబు దక్కునే? అని గర్జించాడు.

దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడవు,
దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది,
దిగిపోవోయ్, తెగిపోనోయ్  అని నిజామును సూటిగా గద్దిస్తూ రచనలు చేసాడు.

అదె తెలంగాణలోన దావాగ్ని లేచి, చుట్టుముట్టిన భయద సంక్షోభ వేళ
అది నిజాము నృపాలుని అండదండ, చూచుకొని నిక్కినట్టి పిశాచహేల

నాడు మానవతీ నయనమ్ములందు, నాగ సర్పాలు బుసకొట్టి నాత్యమాడె
నాడు మానవతయు నవనాగరకత, తన్నులెన్నది రాక్షసర్వమ్ముచేత

            అంటూ నిజాం నిరంకుశత్యాన్ని, ఆగడాలను ఖండిస్తూ నాడు మానవతీనయనమ్ములందు, నాగసర్పాలు బుస కొట్టి నాట్యమాడె” అన్నాడు. నిజాం అనుచరుల అత్యాచారాలకు బలైన స్త్రీలు తీవ్రమైన కక్షతో అక్షుల్ని (కన్నుల్ని) కలిగి ఉన్నారు. సర్పాలలో నాగుపాము కక్షా తత్వానికి పరాకాష్ఠ. అందుకే అతివల నయనాల్లోని, కక్షాతత్వమంతా నాగసర్పా లుగా బుసకొడుతున్నదని, స్త్రీల హృదయాల్లోని ఉద్విగ్నబాధను కవి పై పంక్తుల్లో వివరించాడు.

            ఇలా ఒకటికాదు రెండుకాదు, బోలెడన్ని కత్తుల్లాంటి పద్యాల్తో ఇమిడిన ఒరని చేతబట్టుకోవాలనుకుంటే దాశ రథి రచించిన అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం అనే ఆరు ఖండ కావ్యాలను దొరకపుచ్చుకుంటే సరిపోతుంది.

 – పి.వి.లక్ష్మణరావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to తెలుగు పద్యానికి ఉద్యమాభిషేకం చేయించిన “దాశరథి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో