బొంత

మా రంగు  రంగుల బొంతకు 
ఏ విమల్ డిజైన్లూ సాటిరావు 
 మా అమ్మ పదిరోజులపాటు  దీనిని కుట్టడం 
ఇంకా నాకు గుర్తుంది 
పాత బట్టలను పోగేసుకుని 
మా అమ్మ ఏర్పరచిన  సమన్వయ  వ్యవస్థ ఈ బొంత 
 
గత వర్తమానాలు ఆమె చేతుల్లో 
అలోకగా అతుక్కు పోయేవి 
దీని మీద కూచుంటే 
 
మ్యాజిక్ చాపలా  ఎగిరిపోయి 
జ్ఞాపకాల దీవులకు చేరేస్తుంది 
ఈ బొంతమీద పడుకున్నప్పుడల్లా 
అమ్మా  అమ్మమ్మా అక్కా  అందరి వొడిలో 
ఏక కాలంలో  సేదదీరినట్టుంటుంది 
మా పిల్లలు బొంత నాకంటే నాకని  పోట్లాడుకుంటారు 
ఈ తంతుని చూసి పరుపులు చిన్నబోతాయి 
తరం నుంచి తరానికి పరుచుకున్న వారసత్వ వాత్సల్యం మా బొంత 
దీని కుట్లు ఊడిపోయినప్పుడల్లా 
మా ఆవిడ సూదిరంతో  ప్రత్యక్షం 
అప్పుడామె  కరవాలం పట్టుకుని 
కాలదేవతతో  యుద్ధం చేసినట్లుగా ఉంటుంది 
 
వేసవిలో ఇది  హంస తూలికాతల్పం 
చలికాలంలో నులివెచ్చటి దుప్పటి 
నిద్రంటే నాకు బొంతే 
ఇది  నాకు  ప్రసాదించిన స్వప్నాల్లో 
ప్రాక్తన మానవీయ పరిమళాల్ని చవిచూశాను 
హిమాలయ పర్వతాల్ని కౌగిట్లో ఇముడ్చుకున్నాను 
గంగానదిని చెంబులో బంధించాను 
భూగోళాన్ని మందు బిళ్ళలా మింగాను 
బొంతను పొట్ట గోడ మీద అరవేస్తే 
ఆ ఇంట్లో  పసిపిల్లలున్నట్లు లెక్క 
ఒకసారి తడిసిందా   ఐదారు రోజుల్దాక 
బొట్టు బొట్టుగా దుఃఖ పూరితగా మారిపోతుంది 
గమనించం  గానీ 
బొంత మన శ్రామికజన సంస్కృతికి ప్రతీక 
మమకారాల సుతారపు అల్లికకు పతాక .

– ఎన్. గోపి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , , , , , , , , , , Permalink
0 0 vote
Article Rating
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
దడాల వెంకటేశ్వరరావు
దడాల వెంకటేశ్వరరావు
7 years ago

ఇంత బొంతకు అంత కవితా?

అయినా అంతా ఎంతో కొంత వింత
సంతలోకొన్న అతుకుల బొంత
ఎంతైనా ఇసుమంత చింత
మా తాత అతికిన మెత్తని బొంత
కలతను పోగొట్టి నిద్రపుచ్చే గిలిగింత