భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు

పండు వయస్సులో క్రూడా ప్రజాసేవకు వెనుకాడని 
ఫాతిమా యఫ్‌.తయ్యాబ్‌ అలీ
( 1902-)
                   ప్రఖ్యాతి నొందిన గుజరాత్‌ తయ్యాబ్జీల కుటుంబానికి చెందిన మరో మహిళ శ్రీమతి ఫాతిమా తయ్యాబ్‌ అలీ. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో తనదైన పాత్ర నిర్వహించిన ఆమె 1902 నవంబరు 2న గుజరాత్‌ రాష్ట్రంలో జన్మించారు. తండ్రి పేరు అబ్దుల్‌ అలీ.  మహాత్మాగాంధీ, పండిట్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభాయి పటేల్‌ లాంటి ప్రముఖుల రాజకీయాలోచనలతో ఆమె ప్రభావితమయ్యారు. 
             తయ్యాబ్‌ అలీతో వివాహం తరువాత ఆమె జాతీయ కాంగ్రెస్‌లో సభ్యత్వం స్వీకరించారు. జాతీయోద్యమంలో ప్రవేశించిన పిమ్మట గాంధీజీ అనుమతితో వ్యక్తిగత సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. ఖద్దరు ధరించారు. ప్రజలలో ఖద్దరు ధారణను ప్రోత్సహించారు.  మహిళలను చైతన్యపర్చేందుకు ఎంతగానో కృషి చేశారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని రెండుసార్లు కారాగారానికి వెళ్ళారు. ప్రజాచైతన్య కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఆమె పలు పర్యటనలు జరిపారు. 
 
                        బ్రిటీష్‌ బానిస బంధనాల నుండి భారతదేశం విముక్తమయ్యాక ఫాతిమా తయ్యాబ్‌ అలీ సామాజిక సేవకు అంకితమయ్యారు. గుజరాత్‌ రాష్ట్రంలోని ‘ పడేలా ‘ గ్రామాన్ని దత్తత తీసుకుని మహాత్ముని మార్గంలో ఆ గ్రామాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమించారు. ఆమె కృషి ఫలించి పడేలీ గ్రామం, అహమ్మద్‌ నగర్‌ జిల్లాలో ఆదర్శగ్రామంగా ఖ్యాతి గడించింది. ఈ మేరకు ఆమె  వృద్ధ్యాప్యాన్ని కూడా లెక్కచేయక గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు పూర్తిగా అంకితమై పనిచేశారు.  ఆ కృషికి గుర్తింపుగా శ్రీమతి ఫాతిమా తయ్యాబ్‌ అలీని  భారత ప్రభుత్వం విశిష్ట మహిళ పురస్కారం అందించి గౌరవించింది.
మాతృదేశ సేవకు ఖరీదు కట్టనిరాకరించిన 
జుబైదా బేగం దావూది
                              బ్రిటీష్‌ వ్యతిరేక పోరాటంలో సర్వం త్యాగం చేసి, జీవిత చరమాంకంలో కటిక దారిద్య్రంలో మగ్గుతున్నప్పుటికీ, ఏమాత్రం చలించకుండా, ఎవరి అండను ఆశించకుండా, చివరివరకు ఆత్మగౌరవమే పెన్నిధిగా నిలచిన స్వాతంత్య్ర సమరయోధులు స్వాతంత్య్రసమర చరిత్రలో తక్కువ మంది తారసపడతారు. అటువంటి వారిలో చిరస్మరణీయురాలు జుబైదా బేగం.  
                         1885 అక్టోబర్‌లో బీహార్‌ రాష్ట్రం, ముజఫర్‌పూర్‌ జిల్లా పారో గ్రామంలోని  అత్యంత సంపన్న కుటుంబంలో జుబైదా బేగం జన్మించారు.తండ్రి అబ్దుల్‌ ఫతేహా సాహెబ్‌ భూస్వామి. ఆయన బ్రిటీష్‌ ప్రభుత్వంలో ఉన్నతాధికారి. ప్రముఖ న్యాయవాది మౌలానా షఫీ దావూదిని  ఆమె  వివాహమాడారు. ఆయన మహాత్మాగాంధీ, డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌, పండిత మోతిలాల్‌ నెహ్రూ లాంటి ప్రముఖుల సహచరులు. మౌలానా దావూది స్వాతంత్య్రసమరంలో క్రియాశీలక పాత్ర వహిస్తున్న ప్రముఖ నాయకులు. ఆయన రాజకీయాభిప్రాయాలను, జాతీయోద్యమంలో ఆయన అనుసరిస్తున్న విధివిధానాలను జుబైదా బేగం యధావిధిగా స్వీకరించారు. మౌలానా అలీ సోదరుల తల్లి, జాతీయో ద్యమంలో బీబీ అమ్మగా ఖ్యాతిగాంచిన ఆబాది బానొ బేగం ఉద్యమ కార్యక్రమాలలో భాగంగా దావూది ఇంటికి తరచుగా వచ్చేవారు. ఆ సందర్భంగా ఆమెను కలవటానికి వచ్చిన ప్రముఖులతో జరుగు చర్చలు, సభలు-సమావేశాలలో ఆమె చేస్తున్న ప్రసంగాల  ద్వారా వ్యక్తంచేస్తున్న అభిప్రాయాలు జుబైదా బేగంను బాగా ప్రభావితం చేశాయి.  
 మౌలానా షఫీ దావూది ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మహాత్ముని పిలుపు మేరకు తన ఇంట కనక వర్షం కురిపిస్తున్న న్యాయవాద వృత్తిని వదిలి జాతీయోద్యమానికి ఆయన పూర్తిగా అంకితమయ్యారు. భారీ ఆదాయాన్ని ఒక్కసారిగా వదలుకోవటంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ ఇక్కట్లను భరిస్తూనే,  జాతీయోద్యమకారులు దావూదితోపాటుగా జుబైదా బేగం జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించి ఆయన వెంట ముందుకు సాగారు. 
                          జుబైదా ఖిలాఫత్‌ ఉద్యమం ద్వారా జాతీయోద్యమంలో ప్రవేశించారు. ఆనాటి నుండి  దావూదితో కలిసి దాస్యవిముక్తి కోసం సాగుతున్న పోరులో  క్రియాశీలక పాత్ర వహించారు. ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న భర్తకు  అన్ని విధాల సహాయకారిగా నిలచారు. అత్యంత క్లిష్ట సమయాలలో భర్త బాధ్యతలను  తాను స్వీకరించి సమర్థతతో  నిర్వహించారు.
                   ఖిలాఫత్‌-సహాయ నిరాకరణోద్యమంలో పోలీసులు మౌలానా షఫీ అహమ్మద్‌ గృహం షఫీమంజిల్‌ మీద ఆకస్మిక దాడిచేసి ఆయనను నిర్భంధంలోకి తీసుకున్నారు. ఆ సందర్భంగా ఆయన జుబైదా బేగంను పిలచి, తిలక్‌ మైదానంలోని కాంగ్రెస్‌ కార్యాలయానికి వెళ్ళమని  సూచించారు. ఆ సూచన మేరకు జుబైదా బేగం హుటాహుటిన కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి వెళ్ళి భర్త స్థానంలో నాయకత్వపు బాధ్యతలు చేపట్టారు. దావూది అరెస్టు వలన నాయకత్వం లోపించిందన్న భావన కార్యకర్తలలో రాకూడదన్న ఆలోచనతో దావూది చేసిన సూచనను ఆమె పాటించారు. మౌలానా దావూది స్థానాన్ని మరొకరు భర్తీ చేసేవరకు  ఎంతో ధైర్యసాహసాలతో భర్త కర్తవ్యాన్ని ఆమె నిర్వర్తించి శభాష్‌ అన్పించుకున్నారు.
                   సహాయనిరాకరణ ఉద్యమంలో భాగంగా సాగిన విదేశీవస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధం, ఖద్దరు ప్రచారం తదితర కార్యక్రమాలలో ఆమె భాగం పంచుకున్నారు. తొలుత తన  ఖరీదైన విదేశీ వస్తువులను తగులబెట్టి అందరికి ఆదర్శంగా నిలిచారు. భర్త, ఇతర కుటుంబ సభ్యులు ధరించే విదేశీ వస్త్రాలను ధ్వంసం చేసేందుకు తిలక్‌ రోడ్డులో గల కాంగ్రెస్‌ భవనానికి పంపి అక్కడ దహనకాండను నిర్వహించారు. ఆ రోజుల్లో అతి ఖరీదైన దుస్తులు ధరించే న్యాయవాదిగా మౌలానా దావూది ప్రసిద్ధులు. ఆయన కూడా విలువైన బట్టలను విసర్జించారనడంతో ప్రజలు ఉత్తేజం పొంది విదేశీ వస్తువులు, వస్త్రాల బహిష్కరణలో చురుకుగా పాల్గొన్నారు. జుబైదా స్వయంగా ఇల్లిల్లు తిరిగి విదేశీ వస్త్రాలను సేకరించి, వాటిని షఫీమంజిల్‌కు చేర్చటం, ఆలా చేర్చిన బట్టలను ప్రజల సమక్షంలో అగ్నికి ఆహుతిచ్చే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి విదేశీ వస్త్రాల బహిష్కరణ కార్యక్రమాన్ని ఉదృతంగా నిర్వహించారు.ఖద్దరు ప్రచారంలో ప్రత్యేక శ్రద్దచూపారు, స్వయంగా ఖద్దరు ధరించారు. ఖద్దరు ప్రచారంలో భాగంగా  తన కుమార్తెల సహాయంతో  ప్రత్యేక బగ్గీని ఏర్పాటు చేసుకుని పట్టణ వీధులలో, ఇతర గ్రామాలలో తిరుగుతూ స్వదేశీ వస్త్రధారణ ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. 
                       జుబైదా బేగం పర్దానషీ మహిళ అయినప్పటికి  భారత జాతీయ కాంగ్రెస్‌ నిర్వహించిన సభలు సమావేశాలన్నిటిలో భర్తతోపాటు పాల్గొన్నారు. ఇతర మహిళలు కూడా సమావేశాలలో పాల్గొనేట్టుగా ప్రోత్సహించారు. పలు ప్రాంతాలలో  మహిళల సమావేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సమర్థవంతంగా ఆమె  నిర్వహించారు. ఈ పర్యటనలలో ప్రధానంగా మహిళలను ప్రభావితం చేయ ప్రయత్నించారు. జాతీయోద్యమం లో పాల్గొంటున్న కుటుంబాలతో పరిచయాలు పెంచుకుని, ఆ కుటుంబాల లో మగవారు అరెస్టులు కావటం, జైళ్ళకెళ్ళటం వలన మహిళలు, కుటుంబీకులు భయపడకుండా  ధైర్యం చెప్పారు. స్వాతంత్య్రోద్యమకారుల కుటుంబాల సంక్షేమం కోసం, తాము ఆర్థిక ఇక్కట్లను ఎదుర్కొంటూ కూడా బాధితులకు సహకరించారు.
                       ఈ సమావేశాలలో ఆవేశం, ఆలోచనలతో కూడిన ప్రసంగాలు చేస్తూ మహిళల్లో ధైర్యసాహసాలను నూరిపోస్తూ, వారిలో దేశభక్తి, త్యాగనిరతిని పెంపొందించారు.  స్వయంగా ఉద్యమంలో పాల్గొనేట్టుగా మహిళలను పురికొల్పారు. షఫీమంజిల్‌ వేదికగా మహిళలకు సంబంధించిన పలు కార్యక్రమాలకు జుబైదా బేగం నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా జైలుకి వెళ్ళాల్సి వచ్చినా, పోలీసు లాఠీల దెబ్బల తీవ్రతను చవిచూడాల్సి వచ్చినా ధైర్యంగా ముందుకు  సాగారు.
                           సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ప్రభుత్వ కళాశాలలను బహిష్కరించిన  విద్యార్థుల పట్ల ఆమె ప్రత్యేక శ్రద్ధచూపారు. ఆ విద్యార్థుల  కోసం తమ  షఫీ మంజిల్‌ ఆవరణలో జాతీయ కళాశాల ప్రారంభించారు. ఆ విద్యార్థుల భోజన వసతిని స్వయంగా చూశారు. ఈ సందర్భంగా తన పిల్లల చదువు సంధ్యలను కూడా విస్మరించి జాతీయ భావాలకు ప్రతీకలైన విద్యార్థ్ధుల కోసం నిరంతరం శ్రమించారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టగా ప్రతి ఇంట గుప్పెడు బియ్యం సేకరించి కొంతకాలం జాతీయ విద్యాసంస్థను నెట్టుకొచ్చారు. కాలం గడిచే కొద్ది ఆర్థిక ఇక్కట్లు మిక్కుటం కావటం, మరోవైపు నుండి బ్రిటీషు ప్రభుత్వాధికారుల వేధింపులు  మితివిూరటంతో  ఆ సంస్థలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోయాయి. 
                       1928 నాటి పండిత మోతీలాల్‌ నెహ్రూ సమర్పించిన నివేదికతో మౌలానా షఫీ దావూదీ విభేధించారు. అప్పటి నుండి ఆయన కాంగ్రెస్‌ పార్టీకి దూరమై అరహర్‌ పార్టీలో చేరారు. చివరకు 1937లో  మౌలానా షఫీ దావూది  రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆయన మూడు సంవత్సరాల పాటు రోగగ్రస్తులవ్వటంతో చికిత్స కోసం అధిక వ్యయమైంది.
                   ఆ కారణంగా జుబైదా కుటుంబం ఆర్థిక పరిస్థితి తీవ్ర వెనుకబాటును చవి చూసింది. ఆదాయం తెచ్చిపెట్టే న్యాయవాద వృత్తిని వదలుకోవటం, జాతీయోద్యమంలో ఇతరుల సహకారం లేకుండా కార్యక్రమాలను నిర్వహించటంతో పొదుపు చేసిన ధనం కరిగిపోవటం, అనారోగ్యం వలన అదనపు వ్యయం ముంచుకు రావటంతో ఆ కుటుంబం కునారిల్లిపోయింది. రోజువారి జరుగుబాటు కూడా కష్టంకాగా  ఎందరికో ఆశ్రయం కల్పించిన  షఫీ మంజిల్‌ భవంతిని అద్దెకిచ్చి, ఆ కుటుంబం మరో చిన్న గృహంలోకి నివాసం మార్చాల్సి వచ్చింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎంతగా దిగజారినా, సన్నిహితుల నుండి గాని, ప్రభుత్వం నుండి గాని సహాయం స్వీకరించడానికి జుబైదా నిరాకరించారు. 
                చివరికి ఆస్తంతా కరిగిపోవటంతో మిగిలిన కొద్దిపాటి భూమిని అమ్ముకుని జీవిత చరమాంకం గడపాల్సివచ్చింది. ఆ దుర్భర పరిస్థితిలోనూ శ్రీమతి జుబేదా బేగం మాతృదేశ సేవకు ఖరీదు కట్టలేనంటూ, ప్రభుత్వం, ప్రముఖులు అందించవచ్చిన ఆర్థిక సహాయాన్ని నిరాకరించి కడగండ్ల జీవితాన్ని నిశ్శబ్దంగా గడిపారు.
 
అద్భుత కార్యాచరణతో అందర్ని ఆకట్టుకున్న మహిళానేత
సయ్యద్‌ కనీజ్‌ బేగం
( 1890-1955) 
                       జాతీయోద్యమంలో పాల్గొన్న మహిళలు సత్యాగ్రహోద్యమమైనా, సాయుధ పోరాటమైనా ఏమాత్రం వెనుకాడలేదు.  బ్రిటీష్‌ వ్యతిరేకపోరాటంలో మహిళలు తమ ప్రత్యేక ప్రతిభాసామర్థ్యాలను చూపారు. ఈ మేరకు అద్భుత ప్రసంగాలతో ప్రజలను ఆకట్టు కోవటమేకాకుండా, తన కార్యాచరణతో ఉద్యమ వ్యాప్తికి తోడ్పడిన మహిళా ప్రముఖులలో శ్రీమతి సయ్యద్‌ కనీజ్‌ బేగం ఒకరు. 
 
                      1890లో బీహార్‌ రాష్ట్రంలో సయ్యద్‌ కనీజ్‌ బేగం జన్మించారు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకులు సయ్యద్‌ ముబారక్‌ హుస్సేన్‌ మనుమరాలు. బీహార్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ నేత సయ్యద్‌ సలావుద్దీన్‌ కనిష్ట సోదరి. చిన్న వయస్సులోనే ఉర్దూ, అరబ్బీ, పర్షియన్‌ భాషలలో ఆమె మంచి తర్ఫీదు పొందారు. సోదరుడు సయ్యద్‌ సలావుద్దీన్‌ సహచర్యం వలన ప్రముఖ జాతీయోద్యమ నేతలు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, మహాత్మాగాంధీ, మౌలానా ముహమ్మద్‌ అలీ, మౌలానా షౌకత్‌ అలీల ఆలోచనలతో ఆకర్షితులయ్యారు. ఆ ప్రభావంతో భారత జాతీయ కాంగ్రెస్‌ క్రియాశీలక సభ్యత్వం స్వీకరించి బ్రిటీష్‌ వ్యతిరేక పోరాటాల దిశగా ముందుకు సాగారు.  స్వదేశీ ఉద్యమంలో, మద్యపాన నిషేధ కార్యక్రమాలలో చురుకైన భాగస్వామ్యం వహించారు.  ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో క్రియాశీలక పాత్రను పోషించారు. బ్రిటీష్‌ పాలకుల దుశ్చర్యలను విమర్శిస్తూ  ఆమె చేసిన ప్రసంగాలు యువతీ-యువకులను ఉత్తేజపర్చాయి. గృహిణుల కోసం ఆమెచేసిన ప్రత్యేక ప్రసంగాలు కుటుంబ స్త్రీలను ఎంతగానో ఆకట్టుకుని ఖిలాఫత్‌ పోరాటంలో పాల్గొంటున్న తమ బిడ్డలను, భర్తలను, తోబుట్టువులను చూసి గర్వపడటమే కాకుండా, స్వయంగా మహిళలను కార్యోన్ముఖులను చేయగలిగాయి. 
                      ఆమె తన ఉత్తేజిత ప్రసంగాలతో సరిపెట్టుకోకుండా కార్యక్రమాలలో స్వయంగా పాల్గొన్నారు. ఆశయాలను ఆచరణలో చూపి ఎందరికో మార్గదర్శకులయ్యారు.  జాతీయోద్యమంలో భాగంగా సాగిన పలు పోరాటాల నిర్వహణలో సమర్ధత చూపారు. ఈ మేరకు  లక్ష్యసాధన పట్ల దృఢదీక్షతో పనిచేస్తూ  బీహార్‌లోని జాతీయోద్యమకారులలో అగ్రస్థానంలో నిలచి ప్రముఖ మహిళా నాయకురాలిగా  పేర్గాంచారు. 
 ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భర్త రియాసత్‌ హుస్సేన్‌తో కలసి జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న సమయంలో ఆయన 1931లో ఆకస్మికంగా మరణించారు. ఆ దుస్సంఘటన ఆమెను మానసికంగా చాలా దెబ్బతీసింది. ఆ స్థితి నుండి ఆమె మళ్ళీ కోలుకోలేదు. 
 
                ఆ తరువాత ప్రాపంచిక విషయాల విూద పూర్తిగా ఆసక్తి కోల్పోయిన ఆ ఉద్యమకారిణి క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు.  ఆ విధంగా ప్రాపంచిక విషయాలకు దూరమైన శ్రీమతి సయ్యద్‌ కనీజ్‌ బేగం 1955లో చివరిశ్వాస విడిచేవరకు  నియమనిష్టలతో  ధార్మిక జీవితం గడిపారు.
అసాధారణ దేశభక్తికి అపూర్వ చిహ్నం
 సకీనా లుక్మాని
(1865-1960)
                    స్వాతంత్య్రోద్యమంలో ఆది నుండి  ప్రధాన పాత్ర వహించిన తయ్యాబ్జీ కుటుంబం పలువురు మహిళలను జాతీయోద్యమానికి అంకితం చేసింది. ఈ మహిళల్లో  రెండు పదులు దాటని మహిళల నుండి యనభై ఏండ్ల పెద్దామె వరకు ఉన్నారు. అ విధంగా పెద్ద వయస్సులోకూడా జాతీయోద్యమంలో పాల్గొన్న మహిళలలో బేగం సకీనా లుక్మాని ఒకరు.
             బేగం సకీనా లుక్మాని 1865 ప్రాంతంలో జన్మించారు. ఆమె స్వాతంత్రోద్యమ నేత బద్రుద్దీన్‌ తయ్యాబ్జీ కుమార్తె. తండ్రి జాతీయ భావాలను చిన్ననాటే అందిపుచ్చుకున్న ఆమె గాంధీ పిలుపు మేరకు 1930లో గుజరాత్‌లో సాగిన విదేశీ వస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధ ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర వహించారు. అప్పుడు ఆమె వయస్సు 65 సంవత్సరాలు. ఈ ఉద్యమంలో భాగంగా పెద్ద వయస్సులో కూడా విదేశీ వస్తువుల విక్రయశాలల, మద్యపాన  విక్రయకేంద్రాల ఎదుట పికెటింగ్‌ జరుపుతూ మండు టెండలను కూడా లెక్క చేయక ఉద్యమించారు. గుజరాత్‌లో విదేశీ వస్తు బహిష్కరణకు, మధ్యపాన విక్రయశాలల వద్ద పికిటింగ్‌ కార్యక్రమాలకు ప్రేరణగా నిలచిన ఆమెను అడ్డుకోవాలని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతి భద్రతలకు భంగం కల్గించారన్న నేరారోపణ చేసి ఏకపక్ష విచారణ జరిపారు. 
                   ఆమెకు నాలుగు మాసాల కఠిన కారాగార శిక్ష, వందరూపాయల జరిమానా విధించారు. ఈ వార్త గుజరాత్‌ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ప్రజలు ఆగ్రహావేశా లను వ్యక్తంచేశారు. బ్రిటీష్‌ న్యాయవ్యవస్థను, ప్రభుత్వాన్ని దుయ్యపడుతూ, సకీనా బేగంకు విధించిన శిక్షను రద్దు చేయాల్సిందిగా ప్రజలు ఉద్యమించారు. జాతీయో ద్యమ నాయకులంతా ఆమె శిక్షను రద్దు చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు. ఆమె స్వయంగా అభ్యర్థిస్తే శిక్ష తగ్గించగల అవకాశాలున్నా, ఆ మేరకు  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేందుకు సకీనా బేగం నిరాకరించారు.
                           ఆ సందర్భంగా  అమ్మను నిరోధిస్తే ఆమె ఆరంభించిన కార్యక్రమాలను కొనసాగించ డానికి మేమున్నాం. మమ్మల్ని కూడా అరెస్టు చేయండి. మాకూ శిక్షలు విధించండి, అంటూ భారీ సంఖ్యలో గుజరాత్‌ యువత ముందుకు వచ్చింది. మహిళలు ప్రభుత్వ చర్యల విూద నిరసన వ్యక్తంచేస్తూ విరుచుకుపడ్డారు. చివరకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఆమెకు విధించిన కఠిన జైలు శిక్షను కాస్తా  సామాన్య జైలుశిక్షగా మార్చక తప్పలేదు.
                        ఈ మేరకు ‘ తయ్యాబ్జీ పరివారం సభ్యులు అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించారు..’ అంటూ గాంధీజీ నుండి ప్రశంసలందుకున్న సకీనా బేగం, జాతీయోద్యమ  సంఘటనలన్నింటిలో ప్రముఖ పాత్ర వహించారు. మధ్యపాన నిషేధ ఉద్యమంలో భాగంగా వైశ్రాయికి గుజరాత్‌ రాష్ట్ర మహిళలు రాసిన చారిత్రాత్మక లేఖ మీద నా తయ్యాబ్జీతో పాటుగా సకీనా లుక్మాని కూడా మహాత్ముని విజ్ఞప్తి మేరకు సంతకం చేశారు.  గాంధీజీని బ్రిటీష్‌ ప్రభుత్వం అరెస్టుచేయగా గుజరాత్‌లో మహిళలతో భారీ సమావేశాన్ని ఆమె ఏర్పాటుచేసి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శిస్తూ  తీర్మానం చేయించారు. 
                       అపూర్వత్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధ్దించాక, దేశం రెండుగా చీలిపోవటం పట్ల ఆమె ఎంతో వ్యాకులత చెందారు. ఆ తరువాత ఆమె తన సమయాన్ని సామాజిక సేవకు అంకితం చేశారు. 1960 ఫిబ్రవరి 6న కన్నుమూసేంత వరకూ ప్రజాసేవలో గడిపిన శ్రీమతి సకీనా లుక్మాని త్యాగం చిరస్మరణీయం.

– సయ్యద్ నశీర్ అహమ్మద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో