స్త్రీ యాత్రికులు

సహారా ఎడారిలో మహాయాత్ర చేసిన
మారియాంటోనిటా పెరూ
                        మారియాంటోనిటా పెరూ అనే ఇటాలియన్‌ యువతి ఆఫ్రికాలోని సూడాన్‌లో యునెస్కో వారి విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అప్పటికి ఐదు సంవత్సరాలుగా స్థానికులకి చెప్పినపాఠాలనే చెబుతూ పోవటంవలన విసుగుపుట్టి, ఏదైనా కొత్త ప్రదేశంలో కొంతకాలం తిరిగితే బాగుంటుంది అనుకొంది. పరిసరాల్లో ఉండే ఎడారి స్థానికులతో కలసి కొన్ని చిన్నయాత్రలు కూడా చేసింది. వారికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన మొబైల్‌ పాఠశాలల్లో కూడా పనిచేసింది. సూడాన్‌ పరిసరాల్లో ఉండటం ఆమెకి ఎంతో ఇష్టమైనా, అదే ప్రదేశంలో ఎప్పుడూ ఉండటం ఇబ్బందిగా తోచింది. ఏదైనా కొత్త ప్రదేశంలో, కొంతకాలం పనిచేస్తే బాగుంటుంది అనే తన ఆలోచనని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి, తాను వారికి నేర్పేదాని కంటే, ప్రకృతిలో తిరగటంవలన తానే ఎక్కువగా నేర్చుకోవచ్చు అనే నిర్ణయానికి వస్తుంది. ఆ ఎడారిలో ఉండే వేడిని, ఒంటరితనాన్ని, అంతంత ఖాళీ ప్రదేశాల్ని యుగయుగాలుగా తట్టుకొంటూ వారు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాలి అనుకొంటుంది. రోజులు గడిచేకొద్దీ ఆ కోర్కె బలీయంగా తయారవుతుంది.
                  మారియాంటోనిటా పెరూ అలాంటి కొత్త వాతావరణాన్ని కోరుకొం టున్న సమయంలోనే మైఖేల్‌యాషర్‌ అనే ఇంగ్లండు దేశస్థుడు పరిచయ మవుతాడు. అతడు కూడా తనలాగే సూడాన్‌ దేశంలోని ఖోర్టమ్‌లో 1980 వ సం|| నుండి ఇంగ్లీషు టీచర్‌గా పనిచేస్తుంటాడు. స్థానిక దేశదిమ్మర్లయిన కబాబిష్‌ అరేబియా జాతివారితో ప్రయాణాలు చేయటం ఆయనకి గొప్ప సరదా.ఒకసారి మైఖేల్‌ ఈజిప్టులోని నైలునదికి తూర్పున తిరుగుతున్నప్పుడు, ఆ నది పడమటి ఒడ్డుకి అవతల ఇసుక దిబ్బల్ని ఆనుకొని ఉన్న సహారా ఎడారి అతన్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. కనుచూపు మేర అంతా ఇసుకే. ఆకాశం, భూమి కలిసేవరకూ ఇసుక దిబ్బలు కొండల్లాగా అల్లుకు పోయినట్లుగా ఉంటాయి. ఆ క్షితిజరేఖకి అవతలివైపున మరెంత ఎడారి పేరుకుపోయి ఉందో, ఎన్నెన్ని ఇసుక పర్వతాలు కనిపిస్తాయో తెలుసుకొం దామనీ, అక్కడివారితో పరిచయాలు పెట్టుకుందామని కోరిక పుడుతుంది. విల్‌ఫ్రెడ్‌ థెసిగర్‌ అనే బ్రిటీష్‌ యాత్రికుడు ఎడారిలో యాత్రలు చేశాడు. అతని యాత్రలే మైఖేల్‌కి స్ఫూర్తినిచ్చాయి.
                               అలాంటి ఎడారిని కళ్ళారా చూడాలంటే దాన్ని దాటుకొంటూ ప్రయా ణం చేయాల్సిందే. ఎడారుల్లో తిరిగిన అనుభవం ఇచ్చిన ధైర్యంతో సహారా ఎడారిఅంతా పూర్తిగా చూద్దామని సాహసం చెయ్యటానికి సిద్ధం అయ్యాడు. తోడుగా ఎవరైనా ఉంటే చాలా బాగుంటుందని అనుకొంటున్న సమయం లోనే, ఒక విద్యా సంస్థలో మారియాంటానిటా పెరూతో పరిచయం ఏర్పడు తుంది. ఒకరికి తెలియకుండా ఒకరు ఆ భయంకరమైన ఎడారిని ప్రేమించి నట్లే, పరిచయం అయిన కొద్ది నిమిషాల్లోనే ఒకరినొకరు ప్రేమించు కోవటం కూడా జరిగిపోతుంది. ఒకరి యాత్రానుభవాలు మరొకరు చెప్పుకొంటారు. ఇద్దరికీ కొత్త ప్రదేశాలు చూద్దామనే ఉంది. ఇద్దరికీ ఎడారిలో తిరిగిన అనుభవం ఉంది కాబట్టి సహారా యాత్రకి సిద్ధం అయ్యారు.
                               మైఖేల్‌ తలపెట్టబోతున్న ఈ సహారా ఎడారి యాత్ర 7000 కిలో మీటర్ల దూరం. ఒంటెలమీద ప్రయాణం చేస్తేనే తొమ్మిది నెలలు పడు తుంది. పశ్చిమ ఆఫ్రికాలో మొదలయ్యే ఈ యాత్ర నైలునది పడమటి ఒడ్డుమీద అంతమవుతుంది. సూడాన్‌ పరిసరాలు బాగా తెలిసినవే అయి నందువల్ల, తెలియని పశ్చిమ ఆఫ్రికా ఎడారి నుండి బయలుదేరి, ఎడారి మొత్తం దాటుకొంటూ, తెలిసిన సూడాన్‌ పరిసరాల్లోకి చేరుకుందాం అనుకొంటాడు. అలా అయితే తెలిసిన ప్రదేశానికి వెళుతున్నట్లుగా ఉండ టమే కాకుండా, ప్రయాణం త్వరగా సాగుతుంది. తమ గమ్యం నిత్యం కంటికి కనిపిస్తున్నట్లే ఉంటుంది కాబట్టి ప్రయాణం సుఖంగా సాగటానికి అవకాశం ఎక్కువ.
                      సహారా ఎడారిని పూర్తిగా ఒంటెల సహాయంతో  దాటబోతున్న మొదటివ్యక్తి తనే అవుతాడు. కానీ మైఖేల్‌ ఆలోచనలో పడతాడు. తనకి తోడుగా ఒక స్త్రీని తీసుకెళితే ఎంతవరకూ సబబుగా ఉంటుంది? ఆమెకి ఎడారి అంటే ఇష్టమైనందువల్ల అంత కఠినమైన, సుదీర్ఘమైన ఎడారి యాత్రకి ఆహ్వానించటం ప్రమాదాన్ని కొని తెచ్చుకొన్నట్లవుతుందేమో అను కొంటాడు. తాను యాత్ర చేయాలనుకున్న మార్గం ఆరు దేశాలగుండా పోతుంది. వాటిలో ఒకదేశం అప్పటికే యుద్ధాల్లో మునిగి ఉంది. రాత్రిళ్ళు గడ్డకట్టే చలి, పగలు రాళ్ళు పగిలే ఎండలు. మార్పులేని తిండి తింటూ, నిప్పులు చెరిగే సూర్యుణ్ణి నెత్తిమీద మోసుకొంటూ, మురికి నీళ్ళు రుచి చూస్తూ సాగిపోయే ఆ యాత్రలో తనతో పాటుగా ఆమె ప్రయాణం చేయగలదా అనుకొంటూ ఉన్న మైఖేల్‌ ఆలోచనలకి అడ్డం వచ్చి ‘నేను పైకి కనిపిస్తున్నట్లుగా సుకుమారిని కాదు’ అని మారియాంటోనిటా ధైర్యంగా తన అంగీకారాన్ని తెలపటంతో, ఆమెతో ఇక ఎలాంటి కష్టం ఉండదు అనుకొంటాడు. ఇతని నిర్ణయానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. మారియాంటోనిటా అరబిక్‌, ఫ్రెంచి, ఇటాలియన్‌ భాషలు బాగా మాట్లాడు తుంది. పైగా మంచి ఫొటోగ్రాఫర్‌. అన్నింటికంటే మరీ ముఖ్యంగా ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. ప్రేమతో జయించలేనిది ప్రపంచంలో ఏదీలేదు. ఒక ఎడారిని జయించటం చాలాసులభం. ఈ ఆశాభావంతోనే ఇద్దరూ కలిసి ఒక్కరిగా ముందుకి వెళ్ళటానికి నిశ్చయించుకొన్నారు.
పశ్చిమ ఆఫ్రికాలోని మారిటానియా దేశంలో చిన్‌గుట్టి అనే చిన్న ఒయాసిస్‌ పట్టణం నుండి వారి సాహసయాత్ర బయలుదేరి, నైలునది ఒడ్డున ఉన్న ఎల్‌డెబ్బా అనే పట్టణం వరకూ సాగుతుంది. ఎడారి వాతా వరణానికి మరింతగా అలవాటు పడాలనే ఉద్దేశంతో ఇద్దరూ 1986 వ సం|| ఏప్రియల్‌ నెలలో చిన్‌గుట్టి ప్రాంతానికి చేరుకొంటారు. మూడు నెలల పాటు ఆ వేసవి ఎడారిలో తిరిగి ఆ వాతావరణాన్ని వంటికి పట్టించు కోవటం వలన, రాబోయే తొమ్మిది నెలల ఎడారి ప్రయాణాన్ని తట్టుకునే శక్తి వస్తుందని వారి ఆలోచన.
                      పరిసరాల్లోని బావులన్నీ అప్పటికే పూర్తిగా ఎండి పోయాయని స్థానికులు చెబుతారు. స్థానిక షేక్‌ అయిన సిద్ధీఅహ్మద్‌, మైఖేల్‌ నిర్ణయానికి అదిరిపడి ‘ఎడారిగురించి తెలిసిన ముస్లిం ఎవరూ ఈ యాత్ర చేయడు’ అని వారి పట్ల జాలి పడతాడు. దానికి మైఖేల్‌ నవ్వుతూ ‘మేం క్రిస్టియన్లం కదా, అంటే సగం పిచ్చివాళ్ళం. అందుకే ఈ యాత్ర చేయదలిచాం’ అని ఆత్మవిశ్వాసంతో అడుగుముందుకు వేస్తాడు.
‘వీళ్ళని వెనక్కి మళ్ళించటం ఎంతో కష్టం’ అని తెలుసుకొన్న సిద్ధి అహ్మద్‌ వారికి ఒంటెల మీద ప్రయాణం చేయటానికి వీలుగా జీన్లు, నీటికోసం తోలుసంచులు, సేవకుల్ని ఇచ్చి ఆ ఎడారి చెప్పే పాఠాల్ని నేర్చుకోమని పంపుతాడు. మఫౌత్‌ అనే అనుభవంగల గైడు వారికి దొరక టంతో వారి ఎడారి పాఠాలు మొదలౌతాయి. ఈ అనుభవం వలన ఆత్మ విశ్వాసంతో పాటుగా శరీరానికి కూడా పోరాడే శక్తి ఎక్కువై తమ యాత్ర విజయవంతం అవుతుందని నమ్మకం ఏర్పడుతుంది వారికి.
                           1986 వ సం|| ఆగస్టు ఆరవ తేదీన మైఖేల్‌ యాషర్‌, మారియాంటో నిటా పెరూ తమ చారిత్రాత్మక యాత్రకి చిన్‌గుట్టి నుండి బయలుదేరారు. సహారా ఎడారికి పడమటి అంచున ఉన్న ఈ పట్టణం ఖర్జూరపు చెట్లకి బాగా పేరుగాంచింది. కెరటాల మాదిరిగా పైకి లేచివచ్చిన ఇసుక దిబ్బలుకనుచూపుమేరా జలపాతంగా సాగిపోతుంటాయి. వారిగైడు మఫౌత్‌తో కలిపి ముగ్గురికి మూడు ఒంటెలు, వాటిమీద బోలెడు సామాన్లు. వాటి ముందు మఫౌత్‌. అతని వెనుకనే మైఖేల్‌ యాషర్‌. మారియా ఫొటోలు తీసుకోవాలి కాబట్టి అందరికంటే చివరిగా బయలుదేరింది. ‘అల్లా మనకు దారిచూపుతాడు, త్వరగా కదలండి. చాలా దూరం పోవాలి’ అంటూ మఫౌత్‌ ఖర్జూరపు చెట్లనీడలోంచి నిప్పులు చెరిగే ఎండ లోకి అడుగులు వేస్తాడు. ఆ చిన్న బిడారు కదలగానే సిద్ధీఅహ్మద్‌ కూడా వారితో కలిసి ‘వాడి’ నది ఒడ్డు వరకూ వచ్చి వారి క్షేమం కోసం అల్లాని ప్రార్థించి శెలవు తీసుకొంటాడు.
                             మఫౌత్‌, మైఖేల్‌, మారియా, తమ మూడు ఒంటెలతో పాటుగా ఇసుక దిబ్బల మధ్య మార్గం వెతుక్కుంటూ చీమల బారుల్లాగా సాగి పోతారు. ఇసుక దిబ్బల చాటున చిన్‌గుట్టి కనిపించకుండా పోతుంది. ‘ఈ ఎడారిని చూస్తుంటే తిమింగలం కడుపులోకి పోయిన ‘జోనా’ మాదిరిగా ఉంది నాకు’ అంటుంది మారియా. ఒంటెలు పోతున్న మార్గం ఎన్నెన్నో ఒంపులు తిరుగుతూనే ఉంది. ప్రతి అరగంటకీ ఒక గుక్కెడు నీళ్ళు తాగుతూ ఉండాల్సిందే. ఆ ఎండల ఎడారిలో నీళ్ళు ఎంత రుచిగా ఉంటాయో తెలుసుకుంటూ సాగిపోతుంటారు. ముందుకి వెళ్ళే కొద్దీ ఇసుక దిబ్బలే. జుయ్‌ మంటూ గాలిచేసే గొడవలకి అలవాటైపోతారు. ఇసుక రేణువుల సైన్యం ఒళ్ళంతా ఆక్రమిస్తూ ఉండేది. వారు నేలమీద నడు స్తున్నాసరే, శూన్యంలో తిరుగుతున్నట్లుగానే ఉండేది. ఏకాంతానికి, మౌనానికి అలవాటైపోతారు.
                       మొదటిరోజు సాయంత్రానికి ఒక పెద్ద ఇసుకదిబ్బ చాటున ఆగి గుడారం వేసుకొంటారు. ఒంటెల మీది బరువులు దించగానే అవి పచ్చగడ్డిని వెతుక్కుంటూపోతాయి. ఈ దారిలో వారు ‘మారిటానియా’ దాటాక ‘మాలి’ చేరుకోవాలి. ఆ తరువాత టింబక్టు మీదుగా నైజర్‌, ఛాడ్‌ సరస్సుల పక్కగా సూడాన్‌ దేశం వెళ్ళి అక్కడ నైలునదిని చేరుకొంటారు. ఇదే వారి యాత్రా మార్గం. రోజుకి దాదాపు నలభై కిలోమీటర్లు సులభంగా ప్రయాణం చేయగలరు. నీటికోసం ఆగటం, బరువులు దింపడం ఎత్తడం కోసం అయ్యే ఆలస్యాలు అన్నీ కలుపుకుంటే వారు  అనుకొన్నట్లుగా ఆ ప్రయాణం తొమ్మిది నెలలకి దాటదు. అంటే 1987 వ సంవత్సరం ఏప్రిల్‌ నాటికి నైలు నదిని చేరుకోగలరు.
                           రెండవ రోజుకి వర్షం పడుతుంది. వెంటనే ఆ చిన్న వర్షం తుఫాన్‌గా మారి వారి గుడారాన్ని పల్టీలు కొట్టిస్తుంది. మారియా చలికి ఒణుకుతూ టీి చేస్తున్న మఫౌత్‌కి సహాయపడుతుంది.
ఆ మూడవ రోజు నుండీ దారిలో ఎన్నెన్నో బాధలు, ఆనందాలు పంచుకొంటూ సాగిపోతారు. దారిలో మైఖేల్‌కి చిన్న ఇనుప బాణం ములికి దొరుకుతుంది. సహారా పచ్చగా అడవులతో ఉన్నప్పుడు ఏ వేటగాడో దాన్ని ఉపయోగించి ఉంటాడు. దారిలో నీళ్ళు దొరికిన ప్రతిసారీ తమ తోలు సంచుల్ని నింపుకొంటూనే ఉంటున్నారు. ఉదయం పూట రెండు మూడు గంటల సేపు ఒంటెల వెనుక నడుస్తూ వెళ్ళి, ఇసుక వేడెక్కటం మొదలు కాగానే ఒంటెల మీదకి ఎక్కి కూర్చొనేవారు.
                       రోజులు గడిచేకొద్దీ పనులు పంచుకోవటం తప్పలేదు. ఫొటోలు తీయటం మారియా పని అయినా అది కాస్తా వంటచేయటం, పుల్లలు ఏరుకురావటం, నీళ్ళు పట్టటం వరకూ వెళ్ళింది. మఫౌత్‌కి మాత్రం దారి చూపించటమే ముఖ్యమైన పని. డైరీ రాయటం, కంపాస్‌తో దిక్కులు సరిగ్గా చెప్పటం మైఖేల్‌ బాధ్యత. వారు ముందుకు వెళ్ళే కొద్దీ ఎడారికి కాళ్ళొచ్చి, అది కూడా ముందుకి నడిచిపోతుందా అన్నట్లు ఉండేది. వారి ప్రయాణంలో మొదటిసారిగా ‘తిజిక్‌-జా’ అనేచోట ఒయాసిస్సు ని కలుస్తారు. మారియా నవ్వుతూ ‘నీతో పాటుగా నేను ప్రయాణం చెయ్య లేను అన్నావు కదా? చూడు! ఎంత దృఢంగా ఉన్నానో’ అంటూ నడుంమీద చేతులువేసుకొని మగరాయుడులా గుండెలు పొంగించి, పెద్దగా నవ్వుతూ మైఖేల్‌ని ఆశ్చర్యపరుస్తుంది.
                  ఆ ఒయాసిస్సు దాటాక వచ్చిన మార్గం అంతా స్మశాన వాటికే అను కోవాలి. ఎండిన చెట్లూ, మేకలవీ, ఒంటెలవీ ఎముకల గుట్టలు ఆ దారంతా పరచుకొనిపోతూనే ఉన్నాయి.ఒంటెలకి చెక్క జీనులు ఉండటం వల్ల అవి వాటి వీపుకి రాపాడు కుని పుళ్ళు పడుతుంటాయి. చీము పట్టిన ఆ గాయాలకి గాట్లు పెట్టి ఆ చీమంతా లాగేసి, మందు వేసి కట్లు కట్టాల్సి వస్తుండేది. ఇదంతా మఫౌత్‌కి అలవాటు. అంతకుముందు బిడారులతో పనిచేసిన అనుభవం ఉండటంతో ఒంటెలవల్ల వచ్చిన సమస్యలన్నీ సులభంగానే పరిష్కారం చేయగలిగేవాడు.
                     తిజిక్‌జా నుండి వాలెట్టా మధ్య దారిలో ఎండలు విపరీతం. అన్నిటి కంటే ఈ దారి చాలా ప్రమాదకరమైంది కూడా. అక్కడ ఒయాసిస్సులు లేవు. నిత్యం రేగే ఇసుక తుఫానులు, దారిలో ఉన్న గుర్తుల్ని కూడా చెరిపి వేస్తుంటాయి. కొన్ని సార్లు వారి ఒంటెలు గడ్డి మేస్తూనే దారి తప్పి పోతుండేవి. వాటిని వెతికి తీసుకురావటం మఫౌత్‌కు పెద్దపని. అలసి పోయిన తన బృందానికి మారియా చేసే ‘జ్రిగ్‌’ అనే పానకం ఎంతో హుషారు తెప్పించేది.
                                ఆ దారిలో రెండుసార్లు బావుల్ని మరిచిపోయి దాటి వెళతారు. మూడోసారి మాత్రం ‘బీర్‌నజరా’ అనే బావిని దూరంగానే గుర్తిస్తారు. అప్పటికి తొమ్మిది రోజులుగా వారికి మానవ సంచారం తగలదు. దూరంగా ఒంటెమీద ఎవరో వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎవరో ఒకరు తోడు దొరికారు కదా అని సంతోషపడుతూ ముందుకి వెళ్ళేసరికి అది మనిషికాదు, ఎత్తైన ఎండిన చెట్టు, అని తెలుసుకొంటారు. ఆ పరిసరాల్లో మానవ సంచారం లేకపోవటానికి కారణం వర్షాలు లేకపోవటమే. అందుకే పరిసరాల్లో గ్రామాలు ఏమీ లేవు. బీర్‌నజరా చేరగానే ఒక్కసారిగా ప్రజల్ని చూస్తారు. అంతా పచ్చిక మయం. ఒంటెలకి మంచి ఆహారం దొరుకుతుంది. కానీ బీర్‌ నజరా బావిలో నీళ్ళు అంతకు క్రితం రోజునే ఎండిపోయాయి. వట్టి బురద వారిని వెక్కిరిస్తుంది. నీళ్ళునిలవ ఉంచుకొన్న సంచులు ఉన్నాయి కాబట్టి వాటితో సర్దుకొంటారు.
                                       వాలెట్టా పట్టణానికి రాగానే ఊరిబయట గుడారం వేసుకొంటారు. ఇక్కడితో వారి ప్రయాణంలో ఒక థ పూర్తవుతుంది. ముందుగా అను కొన్నట్లుగానే మఫౌత్‌ ఇక్కడ నుండి చిన్‌గుట్టిలో ఉన్న తన ఇంటికి వెళ్ళాలి. అందువలన వాలెట్టా సంతలో ముల్లా ఆలీ అనే వ్యాపారి వద్దకి వెళ్ళి తమ సమస్యని వివరించగా వారికి ‘ముక్తార్‌’ అనే గైడును ఏర్పాటుచేస్తాడు. మఫౌత్‌ ఇంటికి బయలుదేరే ముందుగా అందరూ పెద్ద విందు చేసుకొంటారు.
                      ఇకపై వచ్చేదారిలో టారేగ్‌ తిరుగుబోతుల గుడారాలు ఎక్కువగా వస్తాయి. వాటిని జాగ్రత్తగా దాటుకొంటూ వెళ్ళి సెప్టెంబరు పదహారవ తేదీనాటికి టింబక్టు పట్టణం చేరుకొంటారు. పూర్వ గాథల్లో చెప్పినట్లుగా అక్కడ ఎలాంటి బంగారు పట్టణాలు లేవు. దాహంతో అలమటించే వీధులు, బక్క చిక్కిన ఒంటెలు, గాడిదలమీద వెళుతున్న చిన్న పిల్లలు మాత్రమే కనిపిస్తారు. బజార్లో వారికి కావాల్సిన సరుకులు మొత్తం కొనుక్కుని అగాడెజ్‌ సంతకి చేరుకుంటారు. కాళ్ళకు పుళ్ళు పడి, బాగా నడవలేకపోతున్న వారి ఒంటెల్ని ఈ సంతలో అమ్మివేయక తప్పలేదు మైఖేల్‌కి. ఇప్పటికి అవి 3000 కి.మీ. ఎడారిని దాటి వేస్తాయి. ‘నిజానికి ఆ ఒంటెలే విజయాన్ని సాధించాయి, మేముకాదు.’ అంటారు మైఖేల్‌ దంపతులు. అందుకే అరబ్బులు ఒంటెల్ని ‘దేవుడిచ్చిన వరం’ అని పిలుచుకొంటారు.అగాడెజ్‌లో ఉండి నైజర్‌ వెళ్ళటానికి సన్నాహాలు చేసుకునేసరికి ఒక నెలపడుతుంది. ఈలోగా పాస్‌పోర్టులు, వీసాలు, ఇతరత్రా అవసరమయ్యే కాగితాలు అన్నీ తీసుకొంటారు.
              నైజర్‌కి వెళ్ళే దారిపొడవునా అన్నీ ఎండలే, నీటి బావులు తక్కువ. అందువలన నీరు మోసేందుకు ప్రత్యేకంగా ఒంటెల్ని కొంటారు. వాటికి అవసరమయ్యే ఆహారాన్ని మోసేందుకు మరో రెండ్ష్ము మొత్తం ఐదు ఒంటెల్ని కొత్తగా తమ వెంట తీసుకుపోవాల్సి వస్తుంది. వీటికి తోడుగా మరో కొత్త గైడుని కూడా వెంట తీసుకెళ్ళాల్సి వస్తుంది. ఇతని పేరు ఇబ్రహీం. వయస్సు అరవై సం||లు. దారి పూర్తిగా ఎవరికీ తెలియదు. ఇలాంటి పెద్ద పరివారంతో డిశెంబరు పదమూడో తేదీన అగాడెజ్‌ దాటిపోతారు.ఈ కొత్త గైడుకి ఒంటెలుసరిగా మాటవినవు. మారియాంటోనిటా కూడా ఆ ఒంటెల్ని బాగా మచ్చిక చేసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు బరువులు అన్నీ ఒక్కసారిగా పడేసి, పరుగెత్తిపోయేవి. చిందరవందరగా పడిన ఆ సామానంతా మరలా సర్దుకునే లోపుగా ఆ ఒంటెలు హాయిగా నిలబడి ఆనందించేవి. ఈ పనులన్నీ చక్కబెట్టుకోవటానికి మారియాకి అంత శక్తి ఎలా వచ్చిందా అని  మైఖేల్‌ ఎంతో ఆశ్చర్యపోయేవాడు.
                  దారిలో ఎన్నో కొత్త దృశ్యాలు చూసే అదృష్టం వస్తుంది వాళ్ళకి. అది వర్తక బిడారులదారి  కావటం వలన ఒకరోజు వందలాది ఒంటెలతో సాగిపోయే ఉప్పు బిడారుని చూడగలిగారు. ఇసుక దిబ్బల పక్కగా సాగిపోయే చిన్న సెలయేరు మాదిరిగా ఉన్న ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది. ఈ నైజీరియన్‌ ఎడారిలో అంతా శూన్యమే తాండవం చేస్తూ ఉంటుంది. ఎక్కడా చెట్టూచేమా ఉండదు.
యాత్రికుల గుర్తుకోసం ప్రభుత్వం వారు ఆ దారి పొడవునా స్తంభాలు నాటారు. ఆ ఇసుక సముద్రంలో కనిపించే ఆశాకిరణాలు ఎండకి మెరిసే ఈ ఇనప స్తంభాలే. వేడికి ఒంటెల పాదాలు పగిలి రక్తం వస్తుంటుంది. మారియా కాళ్ళు కూడా బాగా వాచిపోతాయి. మైఖేల్‌ పరిస్థితీ అంతే. ఆ పరిస్థితుల్లో కూడా రోజుకి పన్నెండు గంటలు ప్రయాణం చేయటం తప్పటం లేదు. నైజర్‌ దాటాక వచ్చే ఛాడ్‌ దేశం అంటేనే భయం పుట్టుకురాసాగింది. ఆ దేశంలో అంతర్యుద్ధం జరుగుతూ ఉండటమే దానికి కారణం.
                        నైజర్‌ నుండి ఛాడ్‌లోకి సులభంగానే ప్రవేశించగలిగార్ష్ము ముందు గానే అన్ని ఏర్పాట్లు అగాడెజ్‌లో చేసుకున్నారు కాబట్టి. కానీ ఛాడ్‌కి అవతల ఉండే సూడాన్‌ దేశసరిహద్దు దాటటానికి పర్మిషన్‌ దొరుకుతుందా లేదా అనేది వారికి సమస్యగా మారుతుంది. సూడాన్‌ వీసా కోసం ఛాడ్‌లోని నజమీనాకి వెళ్ళాలి. తీరా అక్కడికి వెళ్ళాక పోలీసులు ప్రశ్నలతో బాధలు పెడతారేమో? అసలు వీసా ఇస్తారో లేదో కూడా అనుమానమే. గమ్యానికి ఇంత దగ్గిరకి వెళ్ళాక వారి యాత్ర ఆగిపోవటం లేదా ఇబ్బందులపాలు కావటం ఇష్టంలేదు.
                                 కానీ చాలా సులభంగానే వారికి వీసాలు దొరకటంతో ఎంతో సంతో షపడతారు. అయితే వారు నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణం చెయ్యాలి. దారిలో వచ్చే ప్రతి పోలీస్‌ పోస్టులోనూ రిపోర్టు చెయ్యాలి అనే షరతులు పెడతారు. మారియా ఆ వీసా ఆఫీసర్లవద్దకు వెళ్ళి తన అరబిక్‌ పాండి త్యంతో వారిని ఒప్పించి, తమకు ఇబ్బందులు లేకుండా చూడగలుగు తుంది. కొంతలో కొంత స్వేచ్ఛ అయినా దొరికినందుకు మైఖేల్‌ సంతోష పడతాడు.
                                 ఛాడ్‌ దాటాక వారికి గైడు అక్కరలేదు కాబట్టి ఎవర్నీ తెచ్చుకోరు. అక్కడ నుండీ అంతా పూర్తిగా తెలిసిన మార్గం. పెద్ద సమస్య ఏమిటంటే ఇకనుండి పనులన్నీ వారే పంచుకోవాలి. మారియా పెద్ద జెర్రీ కాన్‌ డబ్బాలతో కుస్తీలు పడుతూ, మైఖేల్‌ కంటే ఎక్కువగా పని చెయ్యాల్సి వచ్చింది. గమ్యం దగ్గిరపడే కొద్దీ వారిలో ఆనందం ఎక్కువై, ఎంత కష్టమైన పనైనా లెక్కచేయటంలేదు. రోజుకి యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తూనే ఉంటారు. ఇంటికి చేరుకొంటున్నామనే సంతోషంతో వారికి ఎక్కడలేని బలంవస్తుంది.
                      ఒక్కసారి సూడాన్‌ సరిహద్దులుగాని చేరిపోయారంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ ఆ సరిహద్దు మార్గంలో తోడేళ్ళు ఉంటాయనే భయం ఎక్కువైంది ఇద్దరికీ. ఒక రాత్రంతా వాటిని తరిమి వేయటంతోనే గడిచిపోతుంది. రాత్రి నెగడు వేసుకొని కాపలా ఉంటారు. అపరాత్రిలో మైఖేల్‌ నిద్రలోకి జారిపోయినా, మారియా మాత్రం బిడ్డకు కాపలా కాసే తల్లిమాదిరిగా, రాత్రంతా మేల్కొని, పెద్ద నిప్పుకట్టెతో తోడేళ్ళని తరుముతూనే గడిపింది.
         
                    ఐదువేల కిలోమీటర్ల ప్రయాణం తరువాత సూడాన్‌ సరిహద్దులు చేరుకొంటారు. ఎడారిని అంతదూరం వెనక్కినెట్టిన సంతోషంలో మరోనెల పాటు ప్రయాణం చేసి తమకి తెలిసిన కబాబిష్‌ అరబ్‌ సంచారుల గ్రామానికి వెళతారు. పాతమిత్రులు ఆహ్వానం పలుకుతూ, బరువులు దింపుతారు.
వాడ్‌హసన్‌ అధికారం కింద ఉన్న కబాబిష్‌ తిరుగుబోతులకి మైఖేల్‌ అంటే ఎంతో ఇష్టం. వారితో చాలాసార్లు ప్రయాణాలు చేసిన అనుభవం ఉంది. మిత్రుల గౌరవార్ధం ఒకమంచి పొటేలుని కోస్తారు. మారియాని చూడటానికి ఎంతోమంది వస్తారు. అతిధులకోసం ఏ జీవాన్ని కోసినా, ముందుగా దాని గుండెకాయని పచ్చిగానే తీసుకువచ్చి ముఖ్య అతిథికి ఇవ్వటం వారి ఆచారం. మారియాకి ఇది కొత్తగా ఉన్నా, ‘మీ విశాలమైన హృదయాల రుచి ముందు, ఈ గుండెమాంసం రుచి చాలా తక్కువే’ అని  చెబుతుంది. జొన్న అంబలితో వేటమాంసం కలుపుకుని తింటుంటే మిత్రులందరూ సంతోషంగా నాట్యం చేస్తారు.
                      నైలు నది చేరటానికి ఇక్కడ నుండి పదిరోజుల ప్రయాణం. అంటే చాలా దగ్గిరపడినట్లే లెక్క. ఎంతో సంతోషంతో బయలుదేరిన మైఖేల్‌, మారియాలకి మంచినీటి బావులు దొరకటం కష్టంగా ఉంటుంది. ఆ దారిలో చివరి బావి ‘అబూతబారా’. ‘రాళ్ళగుట్టలతో నిండిన  ఎడారిలో ఆ బావిని గుర్తించటం చాలా సులభం’ అని చెప్పారు కబాబిష్‌ మిత్రులు. కానీ వారికది కనిపించకపోవటంతో కంగారుపడతారు. ఆ బావిని గుర్తించలేకపోతే అంతకన్నా విషాదం మరొకటి ఉండదు. ఈ పరిస్థితుల్లో పరిసరాల్లోని గ్రామంలో ఆడమ్‌ అనే గైడుని ఆశ్రయిస్తారు మైఖేల్‌ దంపతులు.
              వారికి ఒకేఒక కొండగుర్తు ఏంటంటే రెండుతలలున్న పెద్ద బండ. అది ఎక్కడ ఉంటుందో అక్కడే అబూతబారా బావి ఉండాలి. ఆ బావికోసం రెండురోజులు తిరుగుతారు. కాని చివరికి అది మారియాంటో నిటా కంటపడటంతో ఆమె మహానందం పొందింది. దాంతో అందరూ దప్పిక తీర్చుకొని నైలునది ఒడ్డున ఉన్న ఎల్‌డెబ్బా అనే చిన్న పట్టణానికి క్షేమంగా చేరిపోతారు. మారియాకి ఆనందభాష్పాలు ఆగవు. అదే వారి గమ్యస్థానం. సరిగ్గా రెండువందల యాభైఆరు రోజుల క్రితం మైఖేల్‌ వేసుకొన్న తోలుచెప్పుల్ని తీసి, సుళ్ళు తిరుగుతూ ప్రవహించే ఆ నైలునదిలోకి విసిరివేస్తాడ్ష్ము ఆ పాదరక్షలు చెప్పే కథల్ని వింటూ నైలునదిని ప్రయాణించ మన్నట్లుగా. తొమ్మిది నెలలపాటు ఎడారి గర్భంలో జీవించి సజీవంగా బయటకి వస్తున్న ఆ దంపతుల్ని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతారు.
                  మారియా కంటే ముందుగా సహారా ఎడారిలో ప్రయాణాలు చేసిన స్త్రీ ఎవరూ లేరు. గెట్రూడ్‌బెల్‌, రోజితా ఫోబెస్‌ల సాహస ప్రయాణాలు కూడా మారియాకి స్ఫూర్తినిచ్చే ఉంటాయి. తన పట్టుదల, ప్రేమ వలన సహారా ఎడారిని పూర్తిగా దాటిన మొదటి సాహసికురాలుగా చరిత్రలో నిలిచిపోయింది మారియాంటోనిటా పెరూ.

– ప్రొ .ఆదినారాయణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యంPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)