మంటలు

కథ

‘ధైర్యే సాహసే, లక్ష్మీ’ అనుకుంటూ ఆ ఇంటి ముందు గేట్ తీసాను.
ఆ ‘శుభ సమయం లో’ రాకుండా ఇంత కాలానికి వస్తున్నందున ఏం కోప పడుతుందో అని భయపడుతూనే శ్రీ లక్ష్మిని ధైర్యమూ, సాహసమూ వుండి కూడా లక్ష్య సాధన కోసం దూరం చేసుకున్న – నేను.

గుమ్మం లోనే ఎదురయింది. ఎప్పటిలానే, పెదవుల చివర్ల నుంచి సాగి బుగ్గల లోతుల్లో విశ్రాంతి తీసుకుంటున్న చిరునవ్వు, విశాలమైన నుదుట నిండైన బొట్టు!

“ఇప్పుడా రావడం?” అంటోంది ఆ చిరునవ్వు లోంచి విరిసిన చిరు కోపంతో. ఇల్లు చాలా చిన్నది. అయినా ఎంతో ముచ్చటగా, పొందికగా, ఇంకా చెప్పాలంటే మనోహరంగా ఉంది. నా వెనకే వుండి  కొత్త ఇల్లంతా చూపించింది. నా కాంప్లిమెంట్లు అన్నీ చిరునవ్వుతో వింటూ చివర్న అంది.

“అసలు నువ్వు చూడవలసినదీ, నేను చాలా రోజులుగా నీకు చూపించాలని వెయిట్ చేస్తున్నదీ మా ఇల్లు కాదు చిట్టి బాబూ.”

పెరట్లో సర్వీ చెట్టు కింద తులసి కోట చూస్తున్నాను. చిన్ని కోట, మట్టితో కట్టినదది. అలికి, సున్నం ముగ్గులతో ఆ చల్లటి సర్వీ నీడన ఆ తెల్లటి ముగ్గుల్లో విశ్రాంతి తీసుకోవాలనిపిస్తోంది. ఎంత ఆర్టిస్ట్రీ!! ఉత్త ఆర్టిస్ట్రీయేనా ?

“పద చూపిస్తాను” అంటూ దారి తీసింది.

అయితే ఇవేవి కావన్నమాట. ఇంత కంటె తన మనసుని దోచి నాతో పంచుకోవాలి అనిపించే ఆ ఆనందం – ఏమిటో ? అదే అన్నాను. పైకి.

“చూస్తావుగా!” అంటూ ఇల్లు దాటి కొద్ది దూరం నడిచింది.

“చిట్టీ! ఇంత ప్రాక్టికల్ గా నాకు తెలిసే దాకా నిన్ను గుర్తించలేక పోయాను. నువ్వు వీరుడివి – నేను నీ కోసమే పుట్టాననుకునే దాన్ని కాని నువ్వు మాత్రం దేశం కోసం పుట్టావు. వెళ్ళిరా!” అంది.

దాదాపు రెండు వేల గజాల నెలలో కొంత మేర వంగ తోట, కొత్త మేర మిరప తోట. మధ్యలో చిన్న దొరువు. ఆ దొరువు చుట్టూ వేపచెట్లు. జీడి మామిడి పూల సౌరభం. అక్కడికి తీసుకు వెళ్లి – “చూడు చిట్టీ! ఇప్పుడు” అంది.

చిన్నప్పుడు ఆటల్లో కళ్ళు మూసి ఎక్కడెక్కడో తిప్పి హఠాత్తుగా ఎక్కడో వదిలేస్తే ఆ కాసేపూ ఎంతో వెలుగు – కళ్ళని పట్టనంత వెలుగులో – కళ్ళు కనపడేవి కావు కాసేపటి దాకాను. అలాగే ఇప్పుడూను. ఈ అందానికి కళ్ళు పట్టడం లేదు. కళ్ళు కనిపిస్తూనే ఉన్నా. ఆ చిన్న దొరువు నిండా ఎర్ర కలువపూలు.

కిందికి దిగి తాకబోయెను.ఆ కదలికకి జలజలజలా దొరువంతా చేపలు నీళ్ళని కొన్ని వేలు, లక్షల అలలుగా మార్చేశాయి.  చిన్ని, చిన్ని అలలు, వొళ్ళు ఝుల్లుమంది నాకు. తలెత్తి చూసాను. చుట్టూ బంతి పూలు – బొబ్బాసి చెట్లు – అక్కడలేని మొక్క లేదు.

“ఏమిటిది ? ఎవరిదీ ? నీకెలా దొరికింది” అన్నాను. “ఆగాగు ఇన్ని ప్రశ్నలా, ఇది మనదే. అంటే మనది కాదనుకో .. కాని అందమంతా మనదే. ఈ ఇంటికొచ్చిన మర్నాడు, వీర్రాజు పిలిచాడు. పిలిచి చూపించి రెండు కలువలు కోసి ఇవ్వబోయాడు. వద్దని.. కొయ్యనివ్వలేదు. “మీకేం కావాలంటే అవి తీసుకోండమ్మా , ఇది మీ తోటే అన్నాడు” అంది.

“వివరంగా చెప్పవోయ్” అన్నాను.

“చూసావా! ఇది దొరువుగానే ఉండేదన్నమాట పూర్వం. దీంట్లో ఈ ఎర్ర కలువలు వేసాడు. వీటికి తోడు కోసం అన్నట్టు కాసిని చేప పిల్లల్ని తెచ్చి ఇందులో పోసాడట. అవి తామర తంపరై పోయాయి. ఇది కొలనయి పోయింది.”

“ఏయ్! ఇందాక కలువలన్నావు. మళ్ళీ తామరలంటున్నావేమిటి?”

“అదేనోయ్, పెద్ద చిక్కొచ్చింది మన కవి సమయాలతో – ఇవి పొద్దున్నే పూసి మధ్యాహ్నానికి వాడిపోతున్నాయి. మళ్ళీ సాయంత్రం నించి విడుస్తున్నాయ్. అందుకే వీటినేమనాలో తెలీట్లేదు.”

“ఇంతకీ వీర్రాజు సంగతి?”

“ఆ! వస్తున్నా” సీరియస్ గా అయిపోయింది.

ఇలాంటి మాటలు తను చెప్తుంటేనే వినాలి. చాలా గాడంగా, గొప్పగా అనిపిస్తాయి.

“అతనికి భార్య లేదు చిట్టీ! ఇరవయ్యేళ్ళ క్రితం నించీ అంటే ఈ తోట వేసినప్పటి నించీ. తెల్లవారి నేను లేచే సరికే ఆ పక్క దొరువులోంచి నీళ్ళు తెచ్చి ఆ మొక్కలన్నీ తడుపుతూ ఉంటాడు.ఆ కలువల దొరువులో కుండ ముంచడు.

ఏనాడు వేసాడో – ఆ గుప్పెడు చేపలు అవి అలా పెరుగుతూనే వున్నాయి. కాని ఏనాడూ ముట్టుకోలేదట. అమ్ముకోవడానికి పచ్చి మిరపకాయలు కోసేటప్పుడు కూడా అతనికి చేతులాడవేమో అనిపిస్తుంది.

నేను భరించలేకపోయాను. నువ్వు ఎప్పుడెప్పుడొస్తావో ? చూపించాలని ఉవ్విళ్ళూరిపోయాను.”

ఇదెక్కడి పిల్ల? తను కొత్తగా కట్టుకున్న ఇల్లు చూపించాలని సరదా లేదేం? అనిపించలేదు నాకు – ఆ పిల్ల నా ఒక్కడికే తెలుసునన్న గర్వం ఉన్న నాకు.

“వింటున్నావా?

ఓ రోజు వంకాయలు కోసి ఇచ్చాడు.  తీసికెళ్ళి కూర వండండమ్మా! అప్పటి కప్పుడు కోసిన కాయలు. కూర బావుంటుంది అన్నాడు. దాదాపు రెండు కేజీల కాయలు, డబ్బులివ్వబోయాను చాలా నొచ్చుకున్నాడు.  అమ్మా! నాకు కలిగింది ఇదే, ఎక్కడో ఎలాగూ అమ్ముకోక తప్పదు. వద్దమ్మా?” అంటూ.

చిట్టీ! మనుషుల్లో ఇంకా ఈనాడు డబ్బు పట్ల ఇంత నిరాసక్తత ఉందా?”

అలా చెప్తూనే ఉంది. వెనక్కి వచ్చేసాం. నా కళ్ళల్లో ఆ ఎర్ర కలువలే.  నా ఒళ్ళంతా ఆ అలల పులకింతే.  నా మనసంతా లక్ష్మి చూపించిన ఆ శ్రమైక జీవన సౌందర్యమే.

వంకాయలు. బీరకాయలు తప్ప వాటికి నీళ్ళు పోసే చేతుల వెనక హృదయం ఎవరికి తెలుస్తుంది?!!

అందుకే లక్ష్మితో గడిపిన జీవితం అమూల్యం. జీవితంలో అన్నీ ఆలోచించగలగడం అనుభవించగలగడం నువ్వే నేర్పావు కదా! అంటుంది.

నిజమా?

ఋతువుల అందాలు, పూల వాసనలు. ప్రపంచంలోని సౌందర్యాన్ని చూడడం తనే నేర్పిందని కదా నేననుకుంటాను.

* * *

రెండు రోజులు కాలేదు.  ఈ సాయంత్రం తనని చూడాలని మనసు మహా ఆరాటపడి పోయింది.ఉండలేకపోయాను: లోపల ఎక్కడో ఉన్నట్టుంది. బైట పలకరింపులు. మర్యాదలు మధ్య –

సన్నటి గాజు గిన్నెలో మామిడిపండు ముక్కలు – స్పూన్ వేసి తెచ్చింది.

మహా ప్రసాదం అనుకుని తీసుకున్నాను.  ఒక్క ముక్క నోట్లో పెట్టుకున్నాను. అమృతం! ఇదేమిటి? టేస్ట్ మారిపోయింది? “అరే. ఏం ముక్కలివి? బొబ్బాసి ముక్కలా?” అన్నాను.

“కళ్ళ నిండా మెరుపులు – మొహమంతా ప్రపుల్లం, ఆనందం హృదయ దఘ్నంగా ఉన్నట్లు, నిలువెల్లా ఆవరించినట్లు.

“వీర్రాజు తోటలోవి” అంది.

అని “ఎంత నిస్సంగత్వం చిట్టీ అతనిది! ముఖ్యమైన వయసులోంచీ భార్య లేకుండాపోయింది. ఆ పూలు, ఆ పూల మధ్య తిరిగే చేపలు – ఆ తోట – వీటి మీద ఎంత ప్రేమో? – రవీంద్రుడి తపోవన సందేశం గుర్తొస్తుంది నాకు” అంది.

“కలువలు చూద్దామా?” అన్నాను. నాకు నిజానికి వీర్రాజునే చూడాలని వుంది.

“ఇప్పుడు ముడుచుకుపోతాయి – మరోసారి వెళదాం”. అంది. అని “పదేళ్ళ పిల్ల – మనవరాలు వండి తెస్తుంది. ఓ రోజు చూసాను. చిన్న ట్రాన్సిస్టర్ లో పాటలు – ఆ తోటలో ఆ తాతకి మనవరాలి చేతి భోజనం. ఆడ దిక్కు లేని సంసారం”.

అంటూనే కళ్ళ నించి నీళ్ళు జలజలా రాలాయి.

“వద్దు లక్ష్మీ! తప్పు. మరీ ఇంత సున్నితమా?” కసిరాను.

లక్ష్మే నా దిక్కు, ఆడ దిక్కు లేకుండా పోయిన నా కోసం ఏడుస్తోందా?

లక్ష్య నిర్వహణకు కట్టుపడి ‘పోయిన’ నాకు సంసారమా ? భారమైన మనసుతో వచ్చేసాను.

* * *

చాలా కాలానికి, ఏ బలమైన సిద్దాంతాల దగ్గర మేమిద్దరమూ విడిపోయామో అక్కడే కలుసుకున్నాం.

అయితే ఏం లాభం ?

మేం కలుసుకున్నా, కలిసి ఉండలేనప్పుడు. ఇలా మా లక్ష్యం ఒకటవడానికి ముందు చాలా కాలానికి – లక్ష్మిని చివరి సారేమో అన్నట్టుగా చూడ్డానికి వెళ్లాను.

చాలా దిగులుగా వుంది. పలకరించాదానికే భయం వేసింది.

“వచ్చావా! దా ! కూచో” అంది. చాలా సేపటికి నేనే అడిగాను.

“ఎర్ర కలువలు చూపించవా?”

తలెత్తింది… ఎర్రబడిపోయిన కళ్ళనిండా నీళ్ళతో.

“చూస్తావా? దా!” అంటూ పెరట్లోకి తీసికెళ్ళింది.

ఆశ్చర్యపోయాను. అక్కడ పూర్వం ఏముండేదో గుర్తు తెలీనంత మార్పు. రెండు అంతస్తుల మేడ. చుట్టూ పెద్ద ప్రహారీ.

“ఏమిటి లక్ష్మీ? ఇది” అన్నాను.

“చిట్టీ! డబ్బుంటే ఎంత తక్కువ కాలంలో ఎంతెంత భవనాలు కట్టేయ్యవచ్చో చూసావా?” అంటూ – ఏడ్చేసింది.

చటుక్కున దగ్గిరకి తీసుకుని కళ్ళు తుడిచాను.

లక్ష్మీ  స్పర్శ. హృదయమంతా శాంతి, చల్లదనం. అగ్నిలా మండవలసిన నా హృదయం ఇలా శాంతించేస్తుందని నేనిలా ఇంత దూరంగా మిగిలిపోయింది.

నెమ్మదిగా తేరుకుంది.

“ఆనాడు మధ్యాహ్నం ఆ చల్లని నీడలో ఆ కొలను గట్టున ఇసుకలో పడుకుని శరత్ బాబు “భారతి” చదివాను. ఎన్నోసారో? ఆనాడూ భారతి లాగే ఆలోచించాను.ఆ సవ్యసాచిని దూరంగానే నిలబెట్టాను. కాని నా కళ్ళ ముందే ఇంత అన్యాయమూ జరిగి పోయింది.”

“వీర్రాజు ఏడీ?”

“వున్నాడు. ఆరోజు సాయంత్రం దాకా ఉన్నాడు.

ఆ ఉదయమే వచ్చారు వాళ్ళు. వారం రోజుల ముందు నుంచీ చెప్తున్నారట – చెట్ల కాయలన్నీ కోయించేసారు. దొరువులో తామరాకులు పూలతో సహా పీకేశారు. చేపలు పట్టేసారు. దొరువు పూడ్చేశారు. లారీలతో రాయి దిగింది.

“మరి అతనేం చేసాడు?”

“ఏం చేస్తాడు చిట్టీ! మతి పోయిన వాడిలా అలా ఆమూల వేప చెట్టు కింద కూచున్నాడు.  సాయంత్రం దాకాను. నాకు భయం వేసింది. “వీర్రాజూ! కొద్దిగా అన్నం తిను వచ్చి” అన్నాను. “వద్దు తల్లీ ఆకలి లేదు” అన్నాడు.  ఋషి లా కనిపించాడు. అంతే! ఆ తర్వాత మళ్ళీ కన్పించలేదు.”

నాకు మావయ్య గుర్తొచ్చాడు.  జీవిత కాలం చాలా భాగం ఏజన్సీ అడవుల్లో గ్రామాధికారిగా గడుపుతున్న మావయ్య. తను అనేవాడు- “ఒరే అబ్బాయి! ఈ కొండ వాళ్ళు ఋషీశ్వరులు  రా! రాగ ద్వేషాలు లేవు వీళ్ళకి” అని. ఆ కొండ జాతి వ్యవసాయ జీవనం చేస్తున్న ప్రజల ప్రేమాభిమానాలతో నిండిన తన అనుభవాలు అలా ఎన్నో రాత్రులు చెప్పేవాడు. ఆ నాడు ఎంత ఉత్తేజం!.

“నాకు భూస్వామ్య దౌర్జన్యాలు, శ్రామిక శక్తి – ఇవేవి తెలియవు చిట్టీ! అలాగే నువ్వూ అర్ధం కాలేదు.  కానీ  ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరికీ ఇది అన్యాయంగా కూడా తట్టలేదు. నేను పిచ్చి దానిలా కనిపించాను తప్ప”. లక్ష్మీ నుంచి ఇంకా అడిగి తెలుసుకున్న విషయాలివి. ఇరవైయేళ్ళ క్రితం ఎవరివో పొలాలు, ఆ పొలాల్లో పనిచేసి జీవించిన వంశంలో వాడు వీర్రాజు. కొంత కాలం తర్వాత వాటిని సైట్స్ కింద విడదీసి అతి తక్కువ ధరలో అమ్ముకోవడం జరిగింది. అయితే ఈ రోజు వందల రేట్లలో ఊహించనంతగా దాని ధర పెరిగింది.

ఎవరెవరో కొనుక్కున్నారు. చేతులు మారాయి. పాపం వీర్రాజుకి ఇవేమీ తెలియవు.

వీర్రాజు పెంచిన చేపలకీ తెలియదు. చాలా కాలానికి నీళ్ళలోంచి గట్టున పడ్డ చేపలకీ వీర్రాజుకీ తేడా గుర్తించనిది లక్ష్మీ ఒక్కతే.

“చిట్టీ! ఇంత ప్రాక్టికల్ గా నాకు తెలిసే దాకా నిన్ను గుర్తించలేక పోయాను. నువ్వు వీరుడివి – నేను నీ కోసమే పుట్టాననుకునే దాన్ని కాని నువ్వు మాత్రం దేశం కోసం పుట్టావు. వెళ్ళిరా!” అంది.

వచ్చేస్తుంటే మామ్మగారు పలకరించింది.

బావున్నావా? ఇంత దాకా ఎంతో భయంగా ఉండేది వంటరిగా ఉండడానికి. ఇప్పుడు గొప్ప నిశ్చింత. చూసావుగా. రెండస్తుల మేడ లేచింది. పైన ఇంటివాళ్ళు వుండి కింద ఆఫీసుకి ఇచ్చారు. పగలూ, రాత్రీ ఈ స్కూటర్లు, జీప్ లు, ఎంతో సందడి. భయమన్నది లేదు. అలా చెప్తూనే వుంది ఆవిడ.

ఈ మనుషుల మధ్యలో వీర్రాజు, లక్ష్మీ లాంటి వాళ్ళెలా బతుకుతారు?

వీర్రజుకు నా కన్నుల్లోనూ, లక్ష్మికి నా గుండెల్లోనూ ఎర్ర కలువలు చూపించనా? !!!

                                                                                                                   – – –  వాడ్రేవువీరలక్ష్మీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

2 Responses to మంటలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో