మేడే మా కోసమేనా? నిజమా ?

సమాజంలో మా భాగం ఎంతో ఎవరో ఈ మధ్యే చెప్పారు!
మాకు ఆశ్చర్యం వేసింది.
మేమే ఎక్కువట లోకంలో
మా శ్రమ లెక్క కట్టలేనంత గొప్పదట!
అయినా….
భరోసా లేని జీవితాలు మావి!
పుట్టుకనుండి మరణం వరకూ శ్రమించడమే తెలుసు
అయినా..
మా జీవితాలకు అన్వయింపు లేదు
శ్వాస నలిగిన వృద్ధ శరీరాలకూ విలువే లేదు
పని మాత్రమే మాకు తెలిసింది!
ఒక నాడు పనిలోకి రాలేదని ఆ డాక్టరమ్మ జీతం కోసేస్తుంది
నాకామెలా రిటైర్మెంట్ ఉందా?
ఒక వారం సొంతూరికి పోయొస్తే
ఆ కాంట్రాక్టరు పనిలేదు పొమ్మంటాడు
నాకాయనలా వెనక ఆస్తులున్నాయా?
ఇంటికెడితే, తాగుబోతు మొగుడితో కష్టాలు 
పిల్లల పెంపకం కోసం మా పరుగులు…
అయినా…
పెంపకం సరిగా లేని పిల్లల్నే సమాజానికివ్వగలం
విశ్వ పట రూపాన్ని సరిదిద్దే మా జీవితాలకో రూపం ఉండదు
వాడిన రంగులతో పుట్టిన చిత్రాలం
రూపు లేని పనిముట్లం!
నిరంతరం అతలాకుతలం అవుతున్నా…
విశ్రాంతి లేని ఒడిదుడుకుల్లో నలుగుతున్నా….
ఎప్పటికీ అసంపూర్ణ పౌరులం!
ఉద్యోగ భద్రత మాకెపుడూ ప్రశ్నార్థకమే
సామాజిక భద్రతకు మేమెపుడూ ఒక అనుమానమే
ఆర్థిక భద్రత మావైపెపుడూ చూడదు
రాజకీయ లబ్ధికి మాత్రం మేము గొప్ప పాత్రలం
మేము మోస్తున్న బరువు భూగోళమంత
మా బరువును మోసే దిక్కే లేదు!
మే డే ఎవరి కోసం?
మా కోసమేనా?
శ్రమైక జీవనానికి భ్రుతి కల్పించండి మరి!
జీవిక భద్రత కల్పించండి మరి!
నిజంగా మే డే మాకోసమే ఐతే…
శ్రమకు తగిన భద్రతను కల్పించి చూపండి!

 – విజయ భాను కోటే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , , Permalink
0 0 vote
Article Rating
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
sivalakshmi
sivalakshmi
7 years ago

కవిత హృద్యంగా,సరళంగా ఉండి శ్రమైకజీవులందరికీ అర్ధమయ్యేలా ఉంది.విజయభాను గారికి మే డే విప్లవాభినందనలు!