ఎన్న ముద్ద నా బాస

చీలికలు పడ్డనేల 

విడివడ్డ ఖండాలం 

చూపుకు మాత్రం

ఒకలాంటి  మనుషులమే

అంతా తెలుగోల్లమే …

 

వేరు చరిత్రలు

భిన్న సంస్కృతులు

విభిన్న రాజకీయార్ధిక

జీవన ప్రపంచాలు

వేరు భాషా  వ్యక్తీకరణలు …

 

ఇప్పటిదాకా మనమొక

అసమ వ్యవస్థ  ఇరు భాగాలం

అసమాంతర  వంకర గీతలం

మనిషితనపు  హొదాలను

భాషలో సమాధి చేసిన అభాగ్యులం

 

అధికారం కదా 

అణిచివేతను ఆయుధం చేసుకునేది 

దోపిడీ కేదైతే  ఏందట 

భాషైనా  భావమైనా బతుకైనా 

పెత్తనం చాలదా 

ప్రజల మెదళ్లను

పరుల సంపదల మొదళ్ళను 

పక్కదారులంట  కొల్లగొట్టడానికి 

 

మోసీ మోసీ   వంగిపోతిమి కదా 

భరించీ  భరించీ కుంగిపోతిమి  కదా 

భాషా పరంగా సంస్కృతి చెదరంగ

అంతటా అవమానాల విష ప్పూతలు

ఎటకారాల  చీదర బాకులు

 

హృదయం లేని

మీ కట్టుకథలు పెట్టుబడుల

సినిమాల సీరియళ్ళలో

రౌడీలూ విలన్ లూ  చిన్న చితకా

పాత్రలోల్ల పెదలవులపై  మా మాటకు

కత్తిగాట్లు  అపహాస్యపు తూట్లు

 

ఇప్పటిదాకా  తెలంగాణ ప్రజల

ప్రతి కన్నీటి బొట్టు వెనకా

ఏలినవారి వికృతి వికట్ట హాసాలు

నిర్ధాక్ష్యిణ్యపు నిండా దర్పంతో

దురంహకారాలు ప్రతిధ్వనిస్తున్నాయి

 

దశాబ్దాలుగా మూసుకుపోయిన

మీ ? ఊసు కండ్లు తెరిచి

మీ హద్దుల్లోని  ‘ప్రామాణిక ‘

భాషావాద  కవ్వంతోనే

చిలకరించి చూస్తే చూడండి

తెలంగాణ బాస తల్లి

మెత్తని ఎన్న ముద్దోలె

ఎట్లా పైకి లేచి సవాల్ చేస్తదో

తల ఎత్తి నీ కళ్ళలోకి చూస్తే

నీ తల నేలకే కదా వాలేది

                                                – కందాల శోభారాణి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , , , , , , , , Permalink

One Response to ఎన్న ముద్ద నా బాస

  1. valiahamad says:

    శోభారాణి గారు మీ కవిత చాలా బాగుంది .
    తెలంగాణ ప్రజల అవస్థలను కళ్ళ ముందు నిలిపారు