ఆల్కట్రాజ్ (Alcatraz)
ఆల్కట్రాజ్ శాన్ ఫ్రాన్ సిస్కో తీరం నుంచి చూస్తే నిన్నో మొన్నో మధ్య రహదారి ఎప్పుడో సముద్ర జలాలు ముంచెత్తితే విడిపోయిన చిన్న భూభాగంలా ఎదురుగా అల్లంత దూరంలో కనిపిస్తూ ఉంటుంది. కావడానికి ద్వీపమే కానీ అతిచిన్న భూభాగం. నిజంగా కఠిన శిల కాబట్టో మరేమో గానీ దీన్ని “రాక్” అని పిలుస్తారు. ఐలాండ్ అనరు.
ఇక్కడికి వచ్చిన దగ్గర్నించీ ఎప్పుడు శాన్ ఫ్రాన్ సిస్కో వెళ్లినా అక్కడికి వెళితే బావుండునని అనుకోవడం, ఎప్పుడూ ఏదో కారణాంతరాల వల్ల దాట వేయడం జరుగుతూంది. మొదటి సారి చూసినప్పుడు బోట్ టిక్కెట్టు మనిషికి 30 డాలర్లనగానే అమ్మో! అని వెనక్కు వచ్చేసాం. ఇక ఇప్పుడు ఆలోచిస్తే అక్కడ కారు పార్కింగే ప్రత్యేకించి 40 డాలర్లు అవుతుంది. పార్కింగుకి వెరవనప్పుడు ఇక దీనికి వెరవనేల?
సాధారణంగా వారాంతాల్లో, మంచి జన సమ్మర్దమైన శలవు దినాల్లోనూ అప్పటి కప్పుడు ప్లాన్ చేసుకుని వెళ్లొద్దామనుకుంటే బోట్ టిక్కెట్లు దొరకవు. వారమో పది రోజుల ముందో ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్నాం ఈ సారి. మొత్తం ద్వీపం చుట్టి రావడానికి రెండున్నర గంటలు పడుతుందనీ, అక్కడ నుంచి బోట్ ప్రయాణం ఒక వైపు 15 నిమిషాలనీ చదివేం. మా ఇంటి నుంచి శాన్ ఫ్రాన్ సిస్కో వెళ్లడానికి 45 నిమిషాలు పడుతుంది. మేం వెళ్తున్నది మార్చి నెలలో కాబట్టి శాన్ ఫ్రాన్ సిస్కో లో ఎండ ఒంటికి తగిలినా, తగలనట్లు చలి పుడుతుంది. అందుకే మరీ ఉదయపు బోట్ కాకుండా కాస్త మంచి ఎండ వేళ మధ్యాహ్నం ఒకటిన్నర కి బోట్ బుక్ చేసుకున్నాం. ఆల్కట్రాజ్ మీద తినుబండారాలు అనుమతించరు. మధ్యాహ్నం భోజనాల వేళకి చేరుకుంటే తీరంలో మాకిష్టమైన సీఫుడ్ తిని స్థిమితంగా పడవెక్కొచ్చని అనుకున్నాం.
ఇక్కడ మరొక విషయం చెప్పాలి. ఈ రాక్ ని చూడడానికి వెళ్లేముందు ఇక్కడేముందో ముందుగా తెలుసుకునే ప్రయత్నంలో అవీ ఇవీ చదువుతూ ఆ ముందు రోజున “ఎస్కేప్ ఫ్రం ఆల్కట్రాజ్” సినిమా చూసేం. నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా తీసిన సినిమా అయినందు వల్ల ఆ ప్రయాణం లో నిజంగా అవన్నీ కళ్లెదురుగా జరుగుతున్న అనుభూతికి లోనయ్యాం.
ఒకప్పుడు ఈ చిన్న ద్వీపాన్ని ఇక్కడి ఆటవిక జాతులందరూ అశుభ ద్వీపంగా బహిష్కరించినప్పటికీ 1775 లో స్పానిష్ నావికులు దీన్ని పెలికాన్ ద్వీపంగా పిలిచారట. స్పానిష్ భాషలో “ఆల్కట్రాజ్ “అంటే పెలికాన్ పక్షి అని అర్థమట. 18 వ శతాబ్దంలో సైనిక అవసరాలకు మాత్రమే వాడిన ఈ ప్రాంతాన్ని 1861 నించీ మిలిటరీ జైలుగా మార్చినప్పటికీ 1933- 63 మధ్య దీనిని పూర్తి స్థాయి లో పటిష్టమైన సాధారణ జైలు గా మార్చారు. ఈ జైలు నుంచి ముగ్గురు ఖైదీలు 1962 లో చాలా నాటకీయంగా తప్పించుకుని పోయారట. ఎంతో పకడ్బందీగా నిర్వహించబడుతున్న జైలు నుంచి ఖైదీలు తప్పించుకు పోయిన అపప్రథ వల్లనూ, నిర్వహణ కు ఖర్చు అధికంగా కావడం వల్లనూ ఈ జైలుని మూసి వేసారు. అప్పటి నుండి ఖాళీగా ఉన్న ఈ ప్రదేశాన్ని 1969 ప్రాంతంలో ఇక్కడి స్థానిక అమెరికన్ ఇండియన్లు తమ పట్ల ప్రభుత్వ విధానాలకు నిరసనగా దీనిని ఆక్రమించుకుని దాదాపు 17 నెలలు నివసించారట. అయితే ప్రభుత్వం వారిని అక్కడి నుంచి ఆ తర్వాత బలవంతంగా ఖాళీ చేయించింది. అప్పటి వారి రాతలు, నినాదాలు అక్కడ గోడల పైన ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాతి రోజుల్లో ఈ ప్రదేశం జాతీయ సంరక్షిత ప్రడేశం గా మార్చడం వల్ల అప్పటి నుంచీ దీనిని పర్యాటక ప్రదేశం గా మార్చి వేసారు.
ప్రయాణం: ఎప్పటిలానే ముందు రోజు వెళ్లబోయే ప్రదేశపు “వెదర్ రిపోర్టు” ఆన్ లైన్ లో చూసుకున్నాం. మర్నాడు “పార్ట్లీ క్లౌడీ” అని చూడగానే నిరుత్సాహం వచ్చింది. అసలే వెళ్లేది శాన్ ఫ్రాన్ సిస్కో. అందునా బీచ్ రోడ్ లోకి. పైగా అక్కడి నుంచి ద్వీపంలోకి. టిక్కెట్లు బుక్ చేసుకున్నాకా తప్పదుగా. స్వెట్టర్లు పకడ్బందీగా వేసుకుని బయలుదేరేం. GPS ని నమ్మితే తప్పు తీసుకెళ్తుందని ఐ- ఫోను తో అడ్రస్ పెట్టుకున్నాం. ట్రాఫిక్ ఏమీ లేదు, సజావుగా వెళ్లిపోయాం అనుకున్నాం. మేం వెళ్లాల్సిన Pier-33 అనే చోటుకి దారి అంటూ సౌత్ శాన్ ఫ్రాన్ సిస్కో లో ఏదో ఒక సముద్ర తీరపు గొడౌన్స్ లాగా ఉన్న చోటుకి తీసుకుపోయింది మా ఫోన్. మొహమొహాలు చూసి నవ్వుకున్నాం. అంతకు ముందే నాలుగైదు సార్లు ఎప్పుడు వెళ్లినా మేం మొదట గోల్డెన్ గేట్ బ్రిడ్జికి వెళ్లి అక్కణ్ణించి వెళ్తాం మూలంగా ఈ దారేదో దగ్గర దారి అనుకున్నాం.
ఇక మళ్లీ ఈ సారి కొంచెం తెలివి తేటలు ఉపయోగించి “Fisherman Wharf” అన్న అడ్రసు పట్టుకుని ముందుకెళ్లేం. ఈ సారి సరైన ప్రదేశానికి మరో పదిహేను నిమిషాల్లో చేరుకున్నాం. ఓపెన్ పార్కింగు కోసం రెండు మూడు రౌండ్లు కొట్టినా ప్రయోజనం లేకపోయింది. ఇక ఎప్పటిలానే మూణ్ణాలుగు అంతస్థుల పార్కింగు లో గంటకు 7 $ చొప్పున పార్కు చేసి బయటకు వచ్చేం. పార్కింగు నుంచి రోడ్డు దాటి అటు వైపుగా వెళ్లేందుకు కట్టిన చెక్క బ్రిడ్జి మీదకొచ్చాం. బ్రిడ్జి దాటి ఇటు వైపు కొచ్చే ప్రతీ సారీ అడుగుకొకసారి ఆగాలనిపించే ఆహ్లాద దృశ్యాలు కనిపిస్తూంటాయి. ఒక పక్కగా శాన్ ఫ్రాన్ సిస్కో సిటీ పర్వతాల మీదకు ఎగబ్రాకిన భవంతులు. మరో పక్క సముద్రం లోకి ముందుకు సాగిన చిన్న వంతెనల (piers) చేతుల్తో రంగు రంగుల పూలు, దుకాణాలు, ఎప్పుడు రద్దీగా తిరిగే జనాల తో కళాత్మకంగా ఉంటుంది. అదృష్టం కొలదీ మంచి మెరిసే ఎండ తళుక్కున మెరుస్తూ ముందుకొచ్చింది. బహు చల్లని గాలి సముద్రం మీంచి రివ్వున వీస్తూంది. మార్చి నెల ప్రారంభపు రోజులు. ఇక్కడ వసంత కాలం అప్పుడప్పుడే ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి వరకూ ఉన్న చలి దినాలు పోయి ఎండ కాస్త వెచ్చనవడం ప్రారంభమవుతుంది.కానీ శాన్ ఫ్రాన్ సిస్కో సముద్ర తీరం లో మాత్రం అలా అనిపించదెప్పుడూ. ఎండ లోంచి నీడ లోకి వెళ్లామంటే వణికించే చలి మీదకు దుముకుతుంది.
ఎదురుగా మెరిసే అలల చేతులు సాచి సాదరంగా ఆహ్వానం పలుకుతూ సముద్రపు గలగలలు వినిపిస్తున్నాయి. ఆల్కట్రాజ్ మురిపిస్తూ ఇటే చూస్తూంది. బీచ్ రోడ్ లో కళకళ్లాడుతూ జనాలు తీర్థంలాగా అటూ ఇటూ తిరుగుతున్నారు. వీధి వాయిద్య ప్రదర్శణల మంచి ఇంపైన సంగీతం ఆహ్లాదంగా వినిపిస్తూంది. గాలిలో అలలుగా తేలుకుంటూ రకరకాల భోజనపు వాసనలు ముక్కుపుటాల్ని అదరగొడ్తున్నాయి. ఆ గాలి సోకంగానే పదకొండున్నరే అయినా ఆకలి వెయ్యడం మొదలు పెట్టింది మా అందరికీ.
బంగీ జంపు: మా పడవ బయలుదేరడానికి చాలా సమయం కూడా ఉండడం తో వరు బంగీ జంపు చేస్తానంటే ముందుగా అటువైపు నడిచేం. 10 డాలర్లు పెట్టి మూడు నిమిషాలు పైకీ కిందికీ రెండు వైపులా కట్టిన తాట్తతో నేలని తన్నుతూ పైకి లేవడం. గాల్లో పల్టీలు కొట్టడం. సునాయాసంగా గెంతుతూ సంతోషంగా కేరింతలు కొడుతూంది వరు. అది చూసి సిరి బేబీ కార్టు లో నుంచి తనూ వెళతానని దుముకుతూంది. సత్య ఫోటోలు తీస్తున్నాడు. నా మనసు ఏదో జ్ఞాపకాల్లోకి దూసుకు పోయింది. ఈ దృశ్యం నాకు ఎన్నో సార్లు కలల్లోకి వస్తూ ఉంటుంది. అలా ఎగురుతూ ఉండేది నేనే తాళ్లు కూడా లేకుండా స్చేచ్ఛగా గాల్లోకి అచ్చు పక్షిలా. వరు ని చూస్తూ సంతృప్తిగా ఆనందించాను. నా మనసూ అలా పిల్లతో బాటు ఉరక లేసింది. కొంత మంది పిల్లలు డబ్బులు తెచ్చుకోకుండానే లైనులో నిలబడ్డం, వాళ్ల వాళ్లొచ్చి ఎంతో అడిగి వెనక్కి తీసుకు పోవడం చేస్తున్నారు. అలా తీసుకెళ్లేవాళ్లు కేవలం మన వైపు నుంచి వచ్చిన వాళ్లేనని గమనించి నవ్వు వచ్చింది. అవును మరి మనకే డాలర్లని మన కరెన్సీ లోకి తర్జుమా చేసుకుని ఖరీదవునో కాదో బేరీజు వేసుకునే అలవాటు ఉంటుంది. ఇక్కడి వాళ్లకు అవన్నీ మామూలే గానీ.
వస్తూ వస్తూ వరు నవ్వుతూ అంది. “అమ్మా! నువ్వూ నాలా చెయ్యగలవా!” .
“అమ్మో!” అని పైకి అని ఆశ్చయం ప్రకటించి ఆ పిల్లని నవ్వించినా చిన్నప్పటి నా సాహసాలు, పదడుగుల మునగ చెట్టు మీంచి దుమికి కాలు బెణగ్గొట్టుకోవడం ( ఇంకా నయం విరగ లేదు) జ్ఞాపకం వచ్చాయి నాకు. ఇంతే కదా కాలం- వయసు పెరిగే కొలదీ శరీరం దేనికీ సహకరించదు. చిన్నతనం లో ఉన్న నిర్భయత్వం పెద్దయ్యాక ఉండదు.
ఉన్న సమయం లో చక చకా తిని బోట్ కి సమయం ఇక 10 నిమిషాలు ఉందనగా అటు పరుగెత్తేం. మేమున్న చోటు నుంచి సరిగ్గా అంతే దూరం మరో వైపు నడవాలి. పరుగున చేరేసరికి లైను లో మేం చివ్వర ఉన్నాం. అయినా మేమెక్కగానే పడవ బయలుదేరింది. రెండస్తుల్లో పైనంతా నిండి పోయింది. కిందతరగతి లో, అదీ లోపల ఒకే ఒక్క బల్ల దగ్గర మాత్రం ఖాళీ ఉంది. రివ్వున వీస్తూన్న సముద్ర విసురు గాలిని చీల్చుకుంటూ పడవ ముందుకు వెళ్తూంటే ఆల్కట్రాజ్ ఐలాండ్ మా వైపు దూసుకు వస్తూన్న అనుభూతి కలిగింది.
ఆల్కట్రాజ్: సరిగ్గా 15 నిమిషాల్లో ఆల్కట్రాజ్ మీద దిగేం. మేం చివ్వర ఎక్కేం కాబట్టి ముందు దిగగలిగేం. దిగిన వరందరినీ అక్కడే గుమి గూడి వాళ్ల గైడు ముందుగా చెప్పే ఉపోద్ఘాతం, ఆల్కట్రాజ్ వివరాలు విని వెళ్లమన్నారు. దిగంగానే ఉన్న పాత కాలపు బిల్డింగ్ గోడనానుకుని ఉన్న ఖాళీ ప్రదేశం లో నిలబడి అందరం 10 నిమిషాలు అక్కడ చెప్పినవన్నీ శ్రద్ధగా విన్నాం. ద్వీపపు చరిత్ర, ఏమేమి చూడొచ్చు అన్నీ చెబ్తూ అక్కడ నిషిద్ధ ప్రాతాలనేవి దాటి వెళితే వేసే ఫైను వివరాలు కూడా చెప్పేరు.
చిన్న కోట కట్టినట్టు పైకి తలెత్తి చూస్తే ఎత్తుగా వంపులు తిరిగిన రహదారికి పైనెక్కడో జైలు కనిపిస్తూంది. వెళ్లే దారి పొడవునా పెద్ద పెద్ద మిలటరీ కట్టడాలు ఉన్నాయి. ద్వీపం ఎక్కడా ఖాళీ లేకుండా ఏవేవో పాత బిల్దింగులు కొన్ని కూలిపోయి, కొన్ని నిరుపయోగంగానూ ఉన్నాయి. కొన్ని చోట్ల అడ్డుగా నిషిద్ధ ప్రదేశం అని రాసి ఉంది. ఇప్పటికీ అక్కడేదో మిలటరీ రహస్యాలు దాగి ఉన్నట్లు.
ముందుగా దాటుకుని వెళ్లే కట్టడం లో మ్యూజియం, వీడియో సెంటర్ ఉన్నాయి. అందులో బయట మాకు చెప్పిన వివరాలు మరలా ఒకసారి వీడియో లో చూసేం. మా వరుకి ఇలాంటి వంటే చాలా ఇష్టం. గైడు దగ్గరికి వెళ్లి ముఖం లోకి చూస్తూ శ్రద్ధగా వినడం, వీడియోలు పొల్లు పోకుండా చూడడం, మ్యూజియం లో ప్రతి ఎగ్జిబిట్ నీ పరికించి చాలా సేపు చూడడం చేస్తుంది.
అక్కడ మిలటరీ చరిత్ర, జైలు చరిత్ర, ఆల్కట్రాజ్ థీం తో తీసిన సినిమాల గురించిన ఎగ్జిబిట్ లు ఉన్నాయి. పాత కాలపు కాంక్రీటు భవంతుల్ని అలానే సంరక్షించడం బాగా నచ్చిందక్కడ. వాటి సహజత్వాన్ని అలానే ఉంచడం వల్ల అక్కడి చరిత్రలో మమేకమవడానికి మంచి వీలు కలుగుతూంది. నీళ్లు చుక్కలుగా పడుతూ ఇటుకలు బైటికి కనిపుస్తూన్న వరండా, తుప్పు పట్టిన ఇనుప ఊచలు, గుండటి ఆర్చి తో బైటి వరకు కట్టిన గుహ ద్వారం వంటి నిర్మాణం బాగా ఆకట్టుకున్నాయి.
జైలు : వరసగా మూణ్ణాలుగు రౌండ్లు కొండ మీదికి చుట్టు తిరిగినట్లున్న రోడ్డు లో పైకి ఎకాఎకి నడుస్తూ వెళ్తే చివరగా జైలు వస్తుంది. గుమ్మందగ్గర మన సినిమాల్లో జైలు ముఖ ద్వారపు ఆర్చి లాగా కాకుండా ఏదో గవర్న్మెంటాఫీసు మొదటి వరండా లోకి నడిచి వెళ్తున్నట్లు సన్నని వరండా లోంచి ముందుకు వెళ్తాం. రెండు విభాగాలుగా ఉన్న హాలు లోకి అడుగు పెట్టగానే యూనీఫారం లో ఉన్న అక్కడి ఉద్యోగులు మనల్ని ముందుకు తీసుకెళ్తారు. అక్కడ ప్రతి ఒక్కరికీ చెవులకి పెట్టుకునే సెల్ఫ్ గైడెడ్ టూర్ రికార్డరు సెట్లు ఇస్తారు.
పైకి మెట్ల మీదుగా ఏదో అటక మీదికెళ్లినట్లు ఆ వెనకేముందో తెలీని దారి ఉంది. చిన్న పిల్లల్తో ఉన్న వాళ్లని ప్రత్యేకంగా మరో మనిషి వచ్చి లిఫ్ట్ లో పైకి తీసుకు వెళ్తాడు. అక్కడ నుండి జైలు లోపలికి మన చెవుల్లో వినిపించే సూచనల్ని అనుసరిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. ప్రతి అడుగు వెనకా మనకు నిజంగా అక్కడెవరో ఉన్నట్లు శబ్దాలు, మాటలు వినిపిస్తాయి. కాస్సేపు మధ్య మధ్య నేరేషన్ ఉంటుంది. సరిగ్గా మనం ఎక్కడ నిలబడితే ఏ సంఘటన జరిగిన చోట ఉన్నామో ఆ సెల్ నంబర్లు, వరండాల పేర్లు ముందుగా చెబ్తూ ఉంటారందులో. వరు మహా ఉత్సాహంగా చాలా ఖచ్చితంగా ఒక్కోటీ వింటూ మమ్మల్ని గైడ్ చెయ్యడం మొదలు పెట్టింది. మేంఅందరం ఒకే చొట ఉందేందుకు వీలుగా వింటున్న రికార్డర్లని ఆపుతూ మళ్లా వింటూ ముందుకు సాగాం.
సెల్: వరసగా ఉన్న అతి చిన్న సెల్ ల లో ఒక గోడకి ఆనుకుని మంచం, కాళ్ల దగ్గిర చిన్న టాయిలెట్, ఒక చిన్న వాష్ బేసిన్, వాటి పైన ఒక పుస్తకాల అర. కొన్నిసెల్ లకు ఎదురుగా మరో సెల్ కనిపిస్తుంది. కొన్నిటికి అదీ లేదు. జంతువుల్ని ఉంచే పంజరాల కంటే ఘోరంగా ఉన్నాయి. ముందు రాత్రి చూసిన సినిమా జ్ఞాపకం వచ్చింది. అక్కడ వరసగా ఉన్న పంజరాల్లో కౄరంగా చూస్తున్న ఖైదీలు, వరండా లలో పహారా కాస్తున్న పోలీసులు ఉన్నట్లు భ్రాంతి కలిగింది. మనుషులు కౄరపు పనులు చేసి జైళ్లకు వచ్చే వరకు ఎలా ఉంటారో గానీ ఇలాంటి చోట్ల సంవత్సరాల తరబడి ఉండి పోయి ఎంత క్షోభ పడతారో కదా అనిపిస్తుంది. ఆ వరంఆడాలలోకి అడుగుపెట్టేసరికే నాకు ఒక విధంగా ఉద్విగ్నంగా అనిపించడం మొదలెట్టింది. ఇక అక్కడ ఉన్న సెల్ ఒక దానిలోకి వెళ్లి చూసినప్పుడు కడుపులో తిప్పినట్లయ్యింది.
“D” బ్లాకు: వరసగా నాలుగు వరుసల్లో ఆ మూల నించి ఈ మూలకి సెల్ ల వరుసల్ని “C” బ్లాకు అని, వాటిని దాటి ముందుకు వెళితే ఒక పక్కగా ప్రత్యేకమైన తలుపులతో ఉన్న ఒక వరుస సెల్ లను “D” బ్లాకు అనీ పేర్లు ఉన్నాయి. జైలు ప్రవర్తనలో అపసవ్యత ఉన్న వాళ్లని శిక్ష కోసం వాడే విభాగమది. ఇందులో ప్రత్యేకంగా ఉన్న నాలుగైదు సెల్ ల కు పూర్తి స్తాయిలో వెల్తురు కూడా జొరబడని ఇనుప తలుపులున్నాయి. ఇక అందులో బందీ అయితే ఎలా ఉంటుందో మనం కూడా ప్రత్యక్షంగా చూసేందుకు వీలు ఉంది. ఇనుప తలుపు మాత్రం మూసుకోదు పూర్తిగా. అక్కడికి వెళ్లి కళ్లు మూసుకు నిల్చుంటే ఒక్కసారిగా శరీరంలోని అన్ని కణాలు చచ్చుబడిపోయినట్లు నిస్పృహ ఆవరించింది. అందుకనుగుణంగా అందులో శిక్షననుభవించిన వ్యక్తి గొంతు చెవిలో ప్రతిధ్వనిస్తూంది.
” నా వెనుకే ఘోరంగా మూసుకుపోయింది తలుపు. ముందంతా గాడాంధకారం. కానీ గంటలు గడిచే కొలదీ క్రమేపీ ఒక వెలుగు కనబడడం మొదలు పెడుతుంది. అది స్వయంగా నా మస్తిష్కంలోంచి నాకు కనబడే వెలుగు. చీకటిలో కొన్ని సార్లు గంటలు సంవత్సరాలుగా గడుస్తాయి….”
అక్కడి నుంచి మరో వైపు ” లైబ్రరీ” అని రాసున్న పెద్ద హాలులోకి అడుగు పెడ్తాం. అక్కడ రెండు మూడు పాత పుస్తకాల అరలు తప్ప నిజంగా పుస్తకాలు ఏవీ లేవు. గది మధ్యలో వరసగా రెండు మూడు పొడవు బెంచీలు ఉన్నాయి అంతే. అక్కడ నుంచి చదువుకుని గ్రాడ్యుయేట్లయిన వాళ్లున్నారని రాసి ఉంది. ఈ వరండాలన్నిటినీ ఆనుకుని ఒక మూలగా ఉన్న తలుపు తీసుకుని బయటకు చూస్తే కిందకు మరలా రెండస్తుల పాటు ఆరుబయలు మెట్లు దిగి వెళితే చుట్టూ పెద్ద గోడలున్న చిన్న ఆట స్థలం వస్తుంది. అందులోకి ప్రవేశం లేదు. మెట్ల వరకు దిగొచ్చు కానీ గాలి అతి విసురుగా వీస్తోంది. అవతల గడ్డ కట్టించే అలల హోరు వినిపిస్తున్న సముద్రం సాక్షిగా.
ఒక మూలగా గోడకి ఉన్న ఒక ఇటుక మాత్రపు చిన్న కంతల్లో ఒక దాంట్లో నుంచి ఆశల స్వర్గంలా శాన్ ఫ్రాన్ సిస్కో నగరం ఊరిస్తూ కనిపిస్తూంది, మరొకటి జైలు ఆవరణకు వెనక భాగం ఎంత దుర్భేద్యంగా ఉందో ప్రత్యక్షంగా దర్శింపజేస్తూంది.
అంత పకడ్బందీగా ఉన్న జైలు లో నుంచి తప్పించుకునేందుకు విఫల యత్నం జరిగిందట ఒకసారి. సెల్ ఊచల్ని వంచి బయట పడి, తుపాకీలు లాక్కుని సిబ్బందిలో ఇద్దర్ని నిర్బంధించి, అందులో ఒకర్ని కాల్చి చంపి కష్టపడినా, తలుపు తెరుచుకునే తాళం చెవులు సమయానికి సరిగా పనిచెయ్యక దొరికి పోయారట.
సంచలనాత్మకం: ఇక జైలు మరో సంవత్సరం లో మూసి వేస్తారనంగా సంచలనాత్మకం గా అక్కడి నుంచి ముగ్గురు ఖైదీలు తప్పించుకు పోయిన సంఘటన అక్కడ ఎలా జరిగిందో కళ్లకు కట్టినట్లు అక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఆ ఖైదీల సెల్ లు ప్రత్యేకంగా అప్పటిలానే అలంకరించి ఉంచారు. స్పూన్లను విరిచి కాంక్రీటు గోడని తవ్వి, వచ్చిన పొడిలో కాగితాల్ని కలిపి ఎవరికీ అనుమానం రాకుండా ఎంత జాగ్రత్తగా ప్లాను వేసారో ప్రత్యక్షంగా చూస్తే భలే ఆశ్చర్యంగా ఉంటుంది. తవ్వడం ఒక ఎత్తు, దాని కప్పిపుచ్చడం మరొక ఎత్తు. అక్కడి నుండి బయటకు వెళ్లిపోతే వెంటనే అనుమానం రాకుండా ఉండేందుకు మంచమ్మీద నిజంగా మనిషి పడుకొని ఉన్న భ్రాంతి కలించే ముసుగు తలకాయలు తయారు చేసి పెట్టడం చూస్తే చోరత్వం ఒక కళ అనేది ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
ఇక అక్కడి నుంచి బయట పడడానికి, ఇనుప ఊచలు కత్తిరించడానికి వాళ్లు తయారు చేసిన పరికరాలు, అన్నీ అయ్యి జైలు బయటికి అతి కష్టమ్మీద వచ్చినా, మంచు చల్లని, నీళ్లలో పడి ఆవలి తీరానికి చేరే లోగా మరణించకుండా కాపాడే దుస్తులు, చిన్న కయాక్…. ఇవన్నీ వాళ్లకు అందించిన వాళ్లు… ఇలా ఇదొక గొప్ప సినిమా కథ అయ్యింది గానీ నిజంగా తప్పించుకుపోయిన వాళ్ల ఆచూకీ మరలా కనిపించలేదట. చనిపోయారని కేసుని మూసివేసారట.
జైలు మధ్యలో బయటి నుంచి ఖైదీల కోసం విజిటర్లు వచ్చినపుడు సంభాషించే గదిని చూసేం. ఒక గాజు కిటికీకి ఇటు వైపు ఒక గది, అటు వైపు మరో గది. రెంటికీ కట్టుదిట్టమైన తలుపులు అడ్డం. ఆ గాజు అద్దం దగ్గర కూచుని అటు వైపు ఎవరో మన మనిషి ఉన్నాడని ఊహించుకోవడానికే భయం వేసింది. అద్దాన్ని తడిమితే కన్నీళ్లేవో చేతికంటుకున్నట్టు వేదన కలిగింది. చప్పున వచ్చేసాను అక్కడి నుంచి. అక్కడి నుంచి బయటికి ఉన్న హాలు లోకి అడుగు పెట్టగానే ఉన్న జైలు సిబ్బంది గది, కమ్యూనికేషన్ సిస్టం ఉన్న గది చూడగానే జైలు లోపల, బయట ఉన్న గొప్ప తేడా బాగా కనిపించింది.
జైలు లో పనిచేసే సిబ్బందికి హాయిగా తినడానికి తాగడానికి ఏర్పాట్లు, విశాలంగా గోడంతా నిండి ఉన్న పెద్ద పెద్ద గాజు అద్దాల తలుపులు అందులోంచి అందంగా కనిపించే జైలు ముందు పచ్చని ఆవరణం, ఎదురుగా పక్షుల కిలకిలారావాలతో, సముద్రపుటలల సౌందర్యపు కుంచెలతో గీసిన అందమైన దృశ్యం శాన్ ఫ్రాన్సిస్కో అద్భుత సముద్రతీరం.
జైలు మొత్తం తిరిగి చివరిగా డైనింగు హాలు లోకి అడుగు పెడతాం. అక్కడ ఫోర్కులు ఎక్కడా అందుబాటులో ఉంచే వారు కాదట. (బహుశా: వాటితో పొడుచుకుంటారని కాబోలు). అక్కడంతా అయిదారుగురి పెద్ద పెద్ద కటౌట్ల వంటి ఫోటోలు ఉంచారు. అవన్నీ ఆ జైలు లో యావజ్జీవ శిక్షను అనుభవించి తరువాత సత్ప్రవర్తనతో ఉద్యోగాల్లో స్థిరపడిన వారివి. గోడకి నిలువుగా మనిషెత్తున ఉన్నాయవి.
అభిప్రాయాలు: ఇక ఒక బోర్డు మీద వచ్చిన వారి అభిప్రాయాలు అంటింపు కాగితాల మీద రాసి అతికిస్తున్నారంతా. ఆ గోడంతా నిండి పోయిన పసుపు కాగితాల మీద ఖైదీల పట్ల, నేర వ్యవస్థ పట్ల రాసిన సానుభూతి, తీవ్ర వ్యతిరేక భావాల వ్యాఖ్యలు చదువుతూ చాలా సేపు నేనక్కడే ఉండిపోయాను. రెపరెపలాడుతూ గోడ నుండి రాలి పడుతున్న కాగితాల్ని ఈ ఆవరణలో అటూ ఇటూ తిరుగుతూ అప్పుడు ఉన్న వాళ్లు చూస్తున్నట్లు గగుర్పాటు కలిగింది. అవన్నీ చూస్తే వారి గుండె కరుగుతుందా! మార్పు కలుగుతుందా! నేరం అనేది మనిషిని దహించదా! సినిమాల్లో చూపించేటట్లు వారి మనసులు, చూపులు పాషాణాలేనా! అంటూ ఏవేవో ఆలోచనలు కలిగాయి.
ఇలా వ్యాఖ్య రాయడం చాలా సులభం. కానీ మనుషుల్లో పశుప్రవృత్తిని రూపుమాపడం ఎంత కష్టం అనిపించింది. “వీళ్లంతా ఎవరు డాడీ! జైలు హీరోలా! “అని వరు అడుగుతోంది. సమాధానం నేను వినలేదు కానీ బయటకు వచ్చేటప్పుడు వీళ్లు సావనీర్ షాపు వైపు నడిచి జైలు ముద్ర ఉన్నవేవో కొంటున్నా నా మనసు బాగా ద్రవమయ్యింది ఎందుకో. ఎక్కడా కూర్చుందుకి లేదు లోపల. అక్కడే గోడకి జేరబడి నిస్సత్తువగా నిలబడ్డాను వీళ్లొచ్చేంత వరకు.
బయటకు రాగానే దిగువ నిలువుగా జారుడు బల్ల లాంటి వంపులు తిరిగిన బాట, చల్లని విసురు సముద్రపు గాలి ముఖాన చరిచినట్లయ్యి ముఖాన చల్ల నీళ్లు చిలకరించినట్లయ్యింది నాకు.
వస్తూ శవాలనుంచిన మార్చురీ అంటూ ఒక చిన్న సన్నని కటకటాల గది చూసేం. అక్కడ అప్పట్లో వాడిన బల్లలు, ఎక్విప్ మెంటు యధాతథంగా ఉంచేరు. అసలు బిల్డింగుకి సంబంధం లేకుండా బయటికి తెరిచి వదిలి వేసిన గది కావడం వల్ల బాగా దుమ్ము కొట్టుకుపోయినట్లు ఉందా ప్రదేశం.
ఈ నేల మనది: జైలు నుంచి మరో వైపుకి ఉన్న వేర్ హౌస్, సబ్ స్టేషన్, దూరంగా శిథిలావస్థలో ఉన్న భవంతుల వైపు నడిచాం. ప్రతి చోటా అమెరికన్ ఇండియన్సు వచ్చి ఈ రాతిని ఆక్రమించుకున్నప్పటి రాతలు చెరగని ముద్రలుగా ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. ఆది నుంచీ కోల్పోయిన భూమిని తిరిగి తెచ్చుకునే వాళ్ల గుండెల్లో మండే బాధ అక్కడ “ఈ నేల మనది” అన్న అక్షరాలు సజీవంగా నిరూపిస్తున్నాయి. పదిహేడు నెలల పాటు ఆ చలి ద్వీపంలో ఏదో జరుగుతుందనే గొప్ప ఆశతో వాళ్లా రాతి ప్రదేశం లో ఎలా ఉన్నారో పాపం అనిపించింది. అక్కడి నుంచి వాళ్లను తరిమి వేస్తున్న ప్రభుత్వ బలగాలు, నిరాశగా వెను తిరుగుతున్న వారి ఫోటోలు మనసులో మెదిలాయి.
తిరుగు ప్రయాణం: సాయంత్రం అయిదు కావస్తూంది. సూర్యుణ్ణి ఆల్కట్రాజ్ రాయి మింగడం మొదలుపెట్టింది. అంతలోనే ప్రచండమైన హిమ సమూహాలేవో ఒక పక్క నించి ఆకాశం లోంచి కురుస్తున్నట్లు చలి మొదలైంది. ఎండ ఎక్కడుందో అక్కడే అడుగులు వేస్తూన్నా, స్వెట్తరు, తొడుక్కుని, జేబుల్లో చేతులు పెట్టుకున్నా వణికిస్తున్న గాలి. ఎక్కడైనా షెల్టరు ఉందేమోనని గబగబా అడుగులు వేసి, తిరిగి వెనక్కి పడవ ఎక్కే ప్రాంతానికి కొండ దిగుతూ వచ్చేసేం. అక్కడ ఉన్న గిఫ్ట్ షాపులోకి వెచ్చదనం కోసం వెళ్లి నిలబడ్డాం కాస్సేపు.
ఎప్పుడు అక్కణ్ణించి బయటపడతామా అనిపించింది. పడవ ఎక్కి పదిహేను నిమిషాల్లో శాన్ ఫ్రాన్ సిస్కో చేరి ఒడ్డు నుంచి చీకటి పొగ లోకి నెమ్మదిగా మాయమవుతున్న ఆల్కట్రాజ్ ను వెను తిరిగి చూడాలనిపించలేదెందుకో. అయినా చూసేను. నా ముఖానికి స్వేచ్ఛగా వీస్తున్న గాలి తగులుతూంది బందిఖానాని వెక్కిరిస్తూ. పిల్లలు ఐస్ క్రీం అని దుకాణం వైపు లాగుతుంటే ఇంత చలిలో ఐస్ క్రీం ఏంటి? అని అనాలనిపించలేదు, నాక్కూడా ఒకటి అన్నాను. గొంతంతా ఆరిపోయినట్లయ్యింది అప్పటి వరకూ నాకు-
-కె.గీత
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~