ఠాకూర్ బరి మహిళలు- జ్ఞానదానందినీదేవి విశిష్టత!

మే నెల 7వ తేదీ రవీంద్రనాథ్ టాగోర్ జయంతి సందర్భంగా శివ లక్ష్మి ప్రత్యేక వ్యాసం…..

అంతర్జాలంలో “జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్”ని యధాలాపంగా చూస్తున్నప్పుడు  నా అభిమాన నటి, సత్యజిత్ రే మొట్ట మొదటి హీరోయిన్ షర్మిలా టాగోర్, రచయిత్రి అరుణా చక్రవర్తితో కనిపించారు. కుతూహలంగా  అనిపించి  రెప్పలార్పకుండా కళ్ళను కంప్యూటర్ కతికించి మొత్తం చర్చను  ఆనందంగా చూశాను. అరుణా చక్రవర్తి గారి ఇటీవలి నవల ” జోరశాంకొ ” (JorasankO) మీద సాహిత్యచర్చా గోష్టిని యాంకర్ మాలాశ్రీ నిర్వహించారు.

 ప్రముఖ రచయిత్రి అరుణా చక్రవర్తి  అనేక సృజనాత్మకరచనలు,అనువాదాలు చేశారు.అనువాదాల్లో శరత్ “శ్రీకాంత్”, సునీల్ గంగోపాధ్యాయ “దోజ్ డేస్”,ఫస్ట్ లైట్” ,బెంగాల్ సమకాలీన ప్రముఖ రచయితల 14 కథలు ముఖ్యమైనవి. సాహిత్యంలో ఆమె కృషికి వైతాళిక్,సాహిత్య అకాడెమీ,శరత్ పురస్కార్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు ఆమెను వరించాయి.ఆమె రాసిన మొదటి నవల “The inheritors”ని 2004 లో కామన్ వెల్త్ రైటర్స్ ప్రైజ్ కి నామినేట్ చేశారు.

జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ లో చర్చించిన ‘జోరశాంకొ’  కాల్పనిక రచనే అయినా ఆ పాత్రలకు ప్రేరణ టాగోర్ కుటుంబంలోని మహిళలు.రచయిత్రి పుస్తకం లోని కొన్ని భాగాలను చర్చలో భాగంగా చదువుతుంటే ఆ స్త్రీల  అనుభవంలో కొచ్చిన ఆశా-నిరాశలు,జయాపజయాలు మనకు (ప్రేక్షకులకు) తెలుస్తాయి.బెంగాల్లోని టాగోర్ స్త్రీల గురించి రచయిత్రి పరిశోధన చేసి చెప్తున్నప్పటికీ ఆ విషయాలు భారతదేశం లోని 18 వ శతాబ్ధపు అంధకారపు చీకటి గదుల్లో బందీలైఉన్న మహిళల దీనమైన పరిస్థితుల్ని పట్టిస్తాయి! ఆ స్త్రీలు ఎక్కడా అప్పటి పరిస్థితుల్ని ఏమీ వివరంగా చెప్పలేదు కదా మీరెలా పరిశోధించి రాశారని యాంకర్ మాలాశ్రీ అడిగిన ప్రశ్నకు రచయిత్రి కొన్ని లేఖల ఆధారంగా, పంక్తుల మధ్య(Between the lines)నున్న సమాచారంతో రచన జరిగిందని చెప్పారు!!

“జోరశాంకొ  ఠాకూర్ బరి” లేదా  “జోరశాంకొ”  అంటే టాగోర్ ల వంశస్థులందరూ నివశించిన సంస్థానం. కోల్ కతా లోని ఠాకూర్ కుటుంబాల పూర్వీకుల భవనం . (ఠాకూర్ అనే పదానికి  ఆంగ్లీకరణ  రూపమే టాగొర్) దీన్ని 18 వ శతాబ్దంలో యువరాజు ద్వారకానాథ్ టాగోర్ నిర్మించారు.కాబట్టి ఇది మామూలు భవనం కాదు,రాజ ప్రాసాదమే! ఇందులోనే మన కవీంద్రుడు రవీంద్రనాథ్ టాగోర్(ద్వారకానాథ్ టాగోర్ గారి మనవడు)నివశించారు. టాగోర్ కుటుంబ పరివారమంతా నివశించినప్పటి పరిస్థితులతో ఇప్పుడు ఆ ఇంటిని వెస్ట్ బంగాల్ ప్రభుత్వం ‘టాగోర్ మ్యూజియం’ గా తీర్చిదిద్దింది . ప్రస్తుతమైతె ఇది కోల్ కతా లోని రవీంద్ర భారతి యూనివర్శిటీ కేంపస్ లో ఉంది. . ప్రతి సంవత్సరం బెంగాల్ ప్రభుత్వం రవీంద్రనాథ్ టాగోర్  పుట్టినరోజు మే 7 న పెద్ద ఎత్తున ఘనంగా సాంస్కృతికకార్యక్రమాలు జరుపుతుంది. దీవాన్ బనారసి ఘోష్,చంద్రమోహన్ చటర్జీ,కాలి ప్రసన్న సింఘాస్,కృష్ణ దాస్ పాల్ మొదలైన ప్రముఖులు వారసులుగా ఆ ఇంట్లో నివశించారు. జోరాశాంకో ఆది బ్రహ్మొ సమాజ్ లాంటి సాంస్కృతిక సంస్థలు,ద జోరాశాంకో భారతి లాంటి నాట్య సమాజం,కాలికాతా హరిభక్తి ప్రదాయని సభ,ద మినర్వా లైబ్రరీ,ద ఓరియంటల్ సెమినరీ మొదలైన ఎన్నో సంస్థలకు పుట్టినిల్లు ఠాకూర్ బరి.

టాగోర్ కుటుంబం ఆ రోజుల్లోనే ప్రపంచ ప్రముఖుల స్థాయిని  అందుకుంది. ద్వారకనాథ్ , ఆయన కుమారుడు దేవేంద్రనాథ్ బ్రిటీష్ ఇండియాలో చాలా ప్రముఖమైన వ్యక్తులు. రవీంద్రనాథ్ టాగోర్ గారి ఒక అన్నయ్య ద్విజేంద్రనాథ్ టాగోర్  గొప్పకవి,తత్వవేత్త. ఇంకో అన్నయ్య జ్యోతీంద్రనాథ్ టాగోర్ గాయకుడు,స్వరకర్త,నాటక రచయిత- సత్యేంద్రనాథ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ లోకి ప్రవేశించిన మొట్టమొదటి భారతీయుడు. రవీంద్రనాథ్ టాగోర్  ఆసియాలోనే మొట్టమొదటి నాన్ యూరోపియన్ నోబెల్ బహుమతి గ్రహీత. వారి సోదరి స్వర్ణకుమారి నవలారచయిత్రి. వీరందరూ  భారత దేశం లో సాంస్కృతిక పునరుజ్జీవనానికి గొప్ప దోహదం చేశారు.

ఇక స్త్రీల విషయానికొస్తే ఈ నవల 1859 లో జ్ఞానదానందినీ దేవి పెళ్ళి నుంచి మొదలై 1902 లో మృణాళినీ దేవి మరణం వరకూ జోరశాంకొ మహిళల జీవితాల్ని అంత ప్రసిద్ధి చెందిన భర్తలతో ఎలా నెగ్గుకొచ్చారో విశదపరుస్తుంది. సమాజంలో కీలకమైన పురుషుల వెనక ఉండి ఆరేడు ఏళ్ళకే పెళ్ళిళ్ళై పన్నెండు సంవత్సరాలకు తల్లులై అంత చిన్నతనంలో అంత పెద్ద సంస్థానంలోని వివిధ బాధ్యతలను నెత్తికెత్తుకున్న స్త్రీల జీవితాలను చిత్రీకరిస్తుంది .

19 వ శతాబ్దంలో సమాజంలో శిష్ట వర్గంగా చెలామణీ అయ్యేవారు కూడా స్త్రీలను వంటింటికే పరిమితం చేసి  “జనానా” అనే ఏకాంతవాసంలో ఉంచేవారు. వంటిల్లు,పూజ గది ఆ రెండే వారి నివాస స్థలాలు.చీరను వంటిచుట్టూ చుట్టుకునేవారు.బ్లౌజ్ (జాకెట్),పెటీకోట్ లాంటివేవీ ఆ స్త్రీలకు తెలియదు.ఈ రకమైన చీర కట్టుడు వల్ల వారి కదలికలు నియంత్రించబడి రెండో కంటికి కనబడకుండా వంటిళ్ళలో,పూజగదుల్లో మగ్గిపోయేవారు.సరైన బట్ట కట్టే స్వేచ్చ లేదు.ఇంటి వాకిలి బయట పడి స్వచ్చమైన గాలి పీల్చుకునే వీలుకూడా లేదు. భారతసమాజంలో ఎన్నో విషయాల్లో ఎంతో నాగరికత సాధించిన టాగోర్ కుటుంబంలో కూడా మహిళల విషయానికొచ్చేసరికి అవే చాంధసభావాలు రాజ్యమేలుతుండేవి.

మన రవీంద్రనాధ్ టాగోర్ గారి అన్నయ్య సత్యేంద్రనాధ్ టాగోర్ గారి భార్య”జ్ఞానదానందినీ దేవి” 1863 లో ఇండియన్ సివిల్ సర్వీస్ లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయ వనిత. జ్ఞానదానందిని తన శక్తి యుక్తులతో బెంగాల్ భూస్వామ్య కుటుంబాల సంప్రదాయంలోని చాంధస ఘోషా పద్ధతికి తెర తీసి ఆనాటి స్త్రీలకి విముక్తి కలిగించిన ధీర వనిత.

సత్యేంద్ర నాథ్ భార్యను తనతో తీసికెళ్ళడానికి తండ్రి దేవేంద్రనాథ్ ని పర్మిషన్ అడిగితే ఆయన నిరాకరిస్తాడు.అయినప్పటికీ ఆమె భర్తతో పాటు లండన్ కి బయల్దేరి వెళ్తుంది. భర్త ఉద్యోగార్ధం వేరే పట్టణానికెళ్ళినప్పుడు ఆయనతో పాటు జ్ఞానదానందిని ధైర్యంగా వెళ్తుంది.అంతకు ముందు ఆ కుటుంబాల్లో స్త్రీలకి భర్తతో పాటు ఉద్యోగం చేసే స్థలాలకి వెళ్ళే  అలవాటెవరికీ లేదు. ఏణ్ణర్ధం పాటు అసిస్టెంట్ కలెక్టర్ గా పని చేసిన భర్తతో పాటు బొంబాయిలో ఉంటుంది జ్ఞానదానందిని . అక్కడినుంచి వచ్చేటప్పుడు పార్శీ స్త్రీలు చీర ధరించే విధానాన్ని నేర్చుకుని  వస్తుంది . యాంకర్ “ఇప్పుడు మనందరం ధరిస్తున్న అందంగా హుందాగా చీర కట్టే విధానాన్ని పరిచయం చేసింది జ్ఞానదానందినే” అని అన్నప్పుడు అది తెలిసి తెగ ఆశ్చర్యపడి సంతోషపడిపోయాను. బెంగాల్ స్త్రీలకు అందంగా చీర కట్టడం నేర్పడమే కాక ఆ రోజుల్లో “ఎవరైనా శారీ ఎలా ధరించాలి అనే విషయాన్ని నేర్చుకోవాలంటే నేను నేర్పుతాను”అని ఒక పేపర్ ప్రకటన కూడా ఇచ్చారట జ్ఞానదానందిని.  అంతకు ముందు వరకూ చీరను వంటి చుట్టూ ఒకపొరతో చుట్టుకునేవారు.కుచ్చిళ్ళు పోసి కట్టడం గానీ పైటను ఎద మీదుగా భుజాలచుట్టూ తేవడం గానీ బెంగాల్ స్త్రీలకు తెలియదు. నవనాగరికతకు పెట్టింది పేరైన బెంగాల్ స్త్రీలకే  తెలియకపోతే ఇక దేశంలోని వేరే ప్రాంతాలకు తెలిసే అవకాశమే లేదు!

ప్రయాణానికి సౌకర్యంగా ఉండే మొగల్ స్టైల్ కుర్తా-పేంట్స్ వేసుకోవడం మొదలు పెట్టి అందరికీ మార్గదర్శనం చేసింది కూడా జ్ఞానదానందినే. ఒకరకంగా ఉమ్మడి కుటుంబానికి దూరంగా న్యూక్లియస్ కుటుంబానికి నాందీ పలికింది కూడా ఆమే! డ్రెస్సింగ్,వంట,ఇంటిని అధునాతనంగా ఉంచడం మొదలైనవాటిలో పాశ్చత్య ఆలోచనలను స్వీకరించింది.!

రవీంద్రనాథ్ టాగోర్ తల్లి గారైన ’ శారదా సుందరి’-సనాతనాచారాలను నిష్ఠగా  పాటించేవారు. అంత పెద్ద సంస్థానంలో అందరికీ పెద్ద దిక్కుగా ఉండి సంసార బాధ్యతనంతా ఆమె సమర్ధవంతంగా నిర్వహించేవారు. ఆమె రోజు రోజుకి మారిపోతున్న  కుటుంబ విలువల గురించి ఆవేదన చెందేవారు.దీనంతటికీ కారణం జ్ఞానదానందిని అని ఆగ్రహపడేవారు. అధికార క్రమంలో  శారదా సుందరి తర్వాత ఆమె గారి ఆడ పడుచు ‘జొగ్ మాయ’ కుటుంబ పెద్ద. అయినప్పటికీ ఈవిడ పూర్తిగా భిన్నమైనది.ఇంట్లోని ప్రతి ఒక్కరి అవసరాన్నీ గమనించి కనిపెట్టి చూసుకునేది.ఆమె తన సంతానానికే కాక ఇంట్లో పిల్లలందరికీ అమ్మే!

రవీంద్రుని తాతగారు ద్వారకానాథ్ టాగోర్ గారి భార్య దిగంబరి విపరీతమైన వైరాగ్యంతో ఉండేవారు. ఆయన రోజుల తరబడి ఇంట్లో లేకపోయినా పల్లెత్తుమాట అనకపోయేవారు.ఆమె వైరాగ్యం బ్రాహ్మణ పండితులను కూడా అనంతమైన ఆశ్చర్యానికి లోను చేసేది. ద్వారకానాథ్ టాగోర్ బ్రిటీష్ పాలకులతో మమేకమవడం,వేశ్యలతో గడపడం, వైష్ణవుడైనప్పటికీ ఏమాత్రం నిష్ట,నీతి నియమాలు లేకుండా మాంసాహారం తింటూ,మద్యంలో మునిగితేలుతుండడం  లాంటి తన భర్త చేసే పాపాలనుంచి విముక్తి కోసం దిగంబరి రోజులతరబడి తన పూజ గదినే తన నివాసం చేసుకుంది.

రవీంద్రుని ఇంకో అన్నగారైన జ్యోతీంద్రనాథ్ భార్య ‘కాదంబరీ దేవీ’ బాగా చదువుకున్న సౌమ్యురాలు. సౌజన్యమూర్తి.మంచి శాస్త్రజ్ఞానంతో,ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా వెంటనే గ్రహించగలిగేది.జ్ఞానం పట్ల తీరని దాహంతో ఉండేది. కవిత్వమంటే విపరీతమైన అభిమానం. సంగీతం అంటే చెవి కోసుకుంటుంది కానీ ఆమె భర్త నిర్లక్ష్యానికి గురవుతుంది. ఆయనకు జ్ఞానదానందిని అంటే ఆరాధన, పరవశత్వం. ఎందుకో గాఢమైన దుఃఖంలో మునిగిపోయిన కాదంబరి 1884 లో రవీంద్రుని పెళ్ళికి కొన్నిరోజులముందు ఆత్మహత్య చేసుకుంటుంది. రవీంద్రుని అపూర్వమైన కవితాశక్తి వెనక కాదంబరి ప్రభావముం ముందంటారు కొందరు. ఆమె మరణం తర్వాత రవీంద్రనాథ్ టాగోర్ చాలా కలవరపాటుకి లోనయ్యారట . రవీంద్రుని పెళ్ళికి ముందు చనిపోవడంవల్ల కాదంబరి ఆదిగులుతో ఆత్మహత్య చేసుకున్నారనే ప్రచారమున్నప్పటికీ  రచయిత్రి అరుణా చక్రవర్తి  భర్త నిరాదరణ వల్లే ఆమె అలాంటి అఘాయిత్యానికి పాల్పడిందని చెప్తారు. అసలు కాదంబరీ దేవి చనిపోయినరోజు ఆమెను జ్యోతీంద్రనాథ్ ఒక పార్టీకి అదీ ఆయన స్వంత నౌకా లాంచింగ్ కి తీసుకువెళ్ళాల్సి ఉంది.కానీ కాదంబరి ఎంత నిరీక్షించినా ఇంటికి ఆయన ఇంటికి రాలేదు. అతని అంతులేని నిర్లక్ష్యానికి ఆమె కలత చెంది నిగ్రహించుకోలేని పరిస్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది.

ఇక రవీంద్రుని సతి “మృణాళినీ దేవి” మనుషులలోని అత్యున్నతమైన గుణాలన్నీ కలబోసిన స్త్రీమూర్తి. ఆమె చాలా తక్కువకాలం 28 సంవత్సరాలే జీవించినప్పటికీ రవీంద్రుని మెరుపుల విజయాలన్నిటి వెనక గొప్ప దన్నుగా ఉన్న స్త్రీశక్తి. ప్రతి మహానుభావుని వెనకా  ఒక మహిళ ఉంటుంది అన్న మాటలకి సరిగ్గా సరిపోయేలా మృణాళినీ దేవి ఆయనకి ప్రతి విషయంలో గట్టి మద్దత్తు నిచ్చారు.ఆయన కల “విశ్వ భారతి” కి తన నగలనన్నిటినీ మనస్ఫూర్తిగా ఇచ్చి ఆదుకున్నారు మృణాళినీ దేవి.అయినా రవీంద్రనాథ్ టాగోర్ కేమీ ఖాతరు లేదు. ఆమె అంటే పెద్ద విలువ లేదంటారు రచయిత్రి.సెషన్ నిర్వాహకురాలు ఇప్పటి స్త్రీ-పురుష సంబంధాల అవగాహనతో  “Companionship ” అని అన్నప్పుడల్లా  షర్మిలా టాగోర్ తల అడ్డంగా తిప్పుతూ ఆ పదం అప్పటి దాంపత్యాలకు సరితూగదని చెప్పుకొచ్చారు.ఒకమ్మాయి అడిగిన ప్రశ్నకు”మగవాళ్ళను విలన్లు చేయనవసరం లేదు. ఒక  మహిళకు ఇంటిలో ఉండి పిల్లాపాపల్ని చూసుకోవాలనిపిస్తే,అలా చేయగలగాలి.లేదూ,బయటికి వెళ్ళి ఉద్యోగం గాని,లేక ఏదైనా తనకిష్టమైన పని గాని చేయదలచుకుంటే  అదీ చేయగలగాలి. ఎవరిష్టమొచ్చినట్లు వారుండి,ఇష్టమైన పనులు చేయగలిగే స్వేచ్చను చర్చలద్వారా సాధించుకోవాలని షర్మిలా టాగోర్ చెప్పారు.

ఆ  ఇంటి మహిళలు ఆ రోజుల్లోని అందరు మహిళల్లా కాకుండా నాగరికతను సంతరించుకొని ఎంతో ఆదునిక భావాలతో ఉండేవారు.గుర్రపు స్వారీ చేసేవారు.కవిత్వం రాసేవారు.వివిధ సాంఘిక,తాత్విక,రాజకీయ చర్చల్లో పాల్గొనేవారు. ఆ వారసత్వం వల్లే షర్మిలా టాగోర్ అట్టడుగు స్త్రీల -పిల్లలగురించిన స్థానిక సాహిత్యాన్ని “KATHA” అనే స్వచ్చంధసంస్థ ద్వారా ఇంగ్లీష్ లోకి అనువాదం చేయించి వెలుగులోకి తెచ్చిప్రపంచానికి పరిచయం చేసినందుకు ఆమెకు 2005 లో”యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్”గా ఎన్నికైంది. షర్మిలా టాగోర్ తాను ఆకుటుంబంలో మొట్టమొదటిగా జాకెట్-పెట్టీకోట్ ధరించిన వనితగా తన అనుభవాలను వర్ణిస్తుంది.ఆరోజుల్లో ఒక బట్టను ఒంటిపొరతో ఒంటిచుట్టూ చుట్టుకోమనే పురుషుల ఆధిపత్యధోరణివల్ల స్త్రీల కదలికలు నియంత్రించబడి చీకటి గదులకి పరిమితమయ్యేవారు. జోరాశాంకో నాగరికతకూ,ఆధునిక భావాలకీ ప్రతీక. అయినప్పటికీ వేషధారణ,సనాతనాచారాలు,బాల్య వివాహాలు,మూఢ భక్తి వంటి విషయాల్లో ఆధునిక ఆలోచనలను సంతరించుకోలేదు. మహిళా విముక్తి గురించిన ఆలోచనలను వారు జీవించిన కాలాన్ని బట్టి ఊహించలేం!

ఇక ఆ కుటుంబంలోని పురుషులు విభిన్న రంగాలలో ఎన్నో “ఫస్ట్”లు సాధించారు.ఒక్కొక్కరూ ఒక్కో విభాగంలో నిష్ణాతులు. రవీంద్రనాథ్ టాగోర్ తన సాహిత్యం “బినోదిని”,”ద రెక్”(The Wreck),”చతురంగ”మొదలైన రచనలలో స్త్రీ-పురుష సమానత్వం గురించీ,లింగ వివక్ష గురించీ,స్త్రీల అణచివేత, అవమానకర,దురదృష్టకరమైన పరిస్తితుల గురించి హృద్యంగా పాఠకులను కదిలించేటట్లుగా చర్చించారు. అన్నిటినీ మించి ” నా ప్రజలను స్వేచ్చా పధం వైపు నడిపించమని”ఎలుగెత్తి ప్రార్ధించారు. సత్యేంద్ర నాథ్ కూడా అభ్యుదయ భావాలు గలవ్యక్తి.ఆయన స్తీ స్వేచ్చ కోసం రాజా రామ మోహన్ రాయ్,ఈశ్వర చంద్ర విద్యా సాగర్ వంటి వారితో కలిసి పనిచేశారు.ప్రచారోద్యమాలలో పాల్గొన్నారు.1853 లో మహిళలకు మొట్టమొదటి “హిందూ కాలేజీ ” స్థాపన కోసం కీలకంగా ,బలంగా పని చేశారు.

సమాజంలో అంతగొప్ప సాంఘిక స్థాయి,బలమైన వ్యక్తిత్వమున్న కుటుంబంలోని పురుషులే స్వంత ఇంట్లో తమ స్త్రీల అధోగతిని,వారి ఉనికిని పట్టించుకోలేదు. స్వేచ్చ అంటే ఏమిటో తెలియని గాలి కూడా చొరబడని అమావాస్య చీకటి జీవితాలు గడిపిన అతిసాదారణ స్త్రీలు అంటే మన అమ్మమ్మలు,నాయనమ్మలు వాళ్ళ పూర్వీకుల గురించి ఊహించడానికే భయంగా ఉంది!

“అయిందేదో ఐపోయింది – ఇక మేము ఎంతమాత్రం సహించబోము”అని మహిళలు తమ రక్షణ కోసం గొంతెత్తి నినదిస్తున్న ఈ సమయంలో మహిళలు దాటివచ్చిన పాతరాతియుగపు పోకడల గురించి , భారత్ లో స్త్రీలను కాస్తంత వెలుగు లోకి తెచ్చే ప్రయత్నం చేసిన టాగోర్ కుటుంబంలోని  స్త్రీల కంట్రిబ్యూషన్  గురించి తెలియజేస్తుందీ “జోరశాంకొ”  పుస్తకం.

స్పార్టకస్ కాలానికి ముందు మనుషులు అతికౄరమైన నీచాతినీచమైన బానిసత్వంలో మగ్గి పోతూకూడా అది తమ విధి అనుకుంటూ అలవాటు పడిపోయి రెండో ఆలోచన లేకుండా  దారుణమైన హింసను భరించేవారట.అలాగే తరతరాలుగా సమాజపు దాష్ఠీకాన్ని నోరెత్తకుండా భరించ డం, సమస్తమైన అణచివేతల్ని అలవాటు చేసుకుని తలరాతలనుకుంటూ అనుభవించడం తప్ప ఇంకో ఆలోచనకు తావు లేకుండా దిన దిన గండంగా దుర్భర జీవితాలు గడిపారు.ఆడవాళ్ళకి ఉగ్గుపాల నుంచీ నూరిపోసిన సంస్కృతి,కుటుంబ గౌరవం,సామాజిక విలువలు,లాంటివన్నీ నిరంతరం పనిచేస్తూ సంఘం పట్ల భయంతో , ఆందోళనతో  అనుభవించేది హింస అని కూడా తెలియనంత భ్రమలో బతికారు ఆ రోజుల్లో మహిళలు. ఎలాంటి బట్టలు వేసుకోవాలో వంటగదికే అంకితమైపోయి భర్తకీ,అత్తవారింటి పరివారానికీ ఎలాంటి సేవలు చెయ్యాలో మనువు నుంచి భూస్వామ్య,పితృస్వామ్య సంస్కృతులు ముందే స్త్రీలకోసం పకడ్బందీగా నిర్దేశించిపెట్టాయి. వీటి పునాదులు చాలాబలమైనవి. టాగోర్ పురుషులు ఆరోజుల్లో సంఘంలో ప్రముఖులైనప్పటికీ వేళ్ళూనుకున్న పునాదుల్ని కదిలించలేకపోయారు. సత్యేంద్రనాథ్ టాగోర్, రవీంద్రనాథ్ టాగోర్ తమ కుటుంబంలోని స్త్రీల విషయంలో సంప్రదాయ కుటుంబ భావజాలంలోనే ఉంటూ బయటి ప్రపంచంలో ఆధునికంగా వ్యవహరించారనుకోవాలి. బీజరూపంలోనైనా స్త్రీ-పురుష సమానత్వమో,ప్రజాస్వామ్య ఆలోచనలో చేసే దిశలో తమ ఇంట్లో మహిళలను ప్రోత్సహించకుండా ,అంత నిష్క్రియాపరత్వంతో ఎందుకున్నారో ఆలోచించదగినవిషయమే!

ఇప్పుడు ఇది చాలా చిన్నవిషయంగా అనిపించొచ్చు! వినడానికి అదేముంది?అనిపించే విషయమే అనుభవించేవారికి నరకంగా ఉండి దాని తీవ్రత అనుభవంలోకొస్తుంది. కానీ ఆడవాళ్ళకి చిన్న చిన్న విషయాలకే ఎన్నె న్నో వందల సంవత్సరాలు, జీవిత కాలాల తరబడి నిరీక్షించాల్సి వస్తుం ది.

చీర ధరించడంలో ఎన్నో అత్యాధునిక పద్ధతులొచ్చినప్పటికీ మొదటి అడుగు చాలా కష్టభూయిష్టమైనది! దుర్భర పరిస్థితి ల్ని ఎదుర్కోవటానికి ఎంత చిన్న ప్రయత్నం ఎక్కడ మొదలయినా సరే ,ఆకృషి భవిష్యత్తరాలకు చాలా కీలకమైనది!!

మనందరం ఇప్పుడింత హాయిగా నలుగురిలో ధీమాగా,దర్జాగా తలెత్తుకు తిరగగలిగేలా దారి చూపిన ” జ్ఞానదానందిని ” గారూ.ఆమె చూపిన తెగువా,సాహసం చీర ధరించే మహిళలందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

-శివలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

5 Responses to ఠాకూర్ బరి మహిళలు- జ్ఞానదానందినీదేవి విశిష్టత!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో