హుస్నాబాద అంగడి

సుక్కురారంగోలె  ఎగిలి వారంగ
సురువైతది  హుస్నాబాద అంగడి
సుట్టుముట్టు  ఇరువై  ఊర్ల పెట్టు
రాకడ పోకడకిరాంలేదు
పైస పుట్టేది మాయమయ్యేది 

మంది గూడేది మర్మందెలిసేది గీన్నే

ఊరూరా చెక్కర్లు గొట్టే ఎర్రబస్సు
నెత్తిమీన  మూటలతో కాన్పు కొచ్చే
ఆడిబిడ్డ నాడు …
పెయ్యదుడ్డెనమ్మి పిండి బత్తలు
మ్యాకపిల్లలగొట్టి ఇత్తనపు  సంచులు
మోటర్లల్ల  మొలుకొచ్చిన  గోదల  మారుబ్యారం
పులుకు పులుకునజూసే ముసలిగొడ్ల
ఆల్ కబీర్ పాల్జేసుడు ఇక్కడ్నే
కీస్ పిట్ట పిల్లనగొయ్యలు
లబ్బరి గాజులు నితానురిబ్బెన్లు
ల్యాత కంకులు జామపండ్లు
కూరగాయ కుప్పలు కొర్రమట్ట చాపలు
ఎర్రెర్రటి మిరిపోరుగు బజాట్లనే  ఊరిత్తాయి
రంగురంగుల రైక గుడ్డలు రుమాల్లు
బాటంట యాల్లాడుతయి
వాటు నర్సయ్యపేనిన  తల్లులూ తాల్లూ
అంగట్లనే  దొరుకుతయి
రోల్లూ  రోకండ్లూ చాట్లూ జల్లెన్లు
మర్తమాన్లు  మారెసరు  గుడ్లు ముద్దత్తయి
పసుపు కుంకుమ బుక్కగుల్లాలు
మల్లెచెట్టుకింది పొట్లం గట్టిచ్చే బుక్క సువ్వమ్మ
చినిగిన చెత్రిర్లు అనుంచెడ్డ  తాళాలు
మల్ల జీవునం పోసుకునేది ఎల్లంబజార్ల
కోతులాటలు  చిలుక  పంచాంగాలు
మల్లవారం దాక మొసదీసుకునుడే
తల్లిగారిండ్లకు  మతులాబులు
తెలిసినోల్లతారని ఉప్పొసలు
సంటిపోరల నుంచి  సచ్చేటోల్లదాక
సుక్కురారం అంగడి జాసే …
వామ్మో .. రిలయన్స్ తోడేల్లు
హెరిటేజి  గడ్డలు గిట్ల
మా జాగల వాలదిక్క …!

 – నాంపల్లి సుజాత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , , , , , , , , , , Permalink

3 Responses to హుస్నాబాద అంగడి