గౌతమీ గంగ

ఆమె ఆరవ ఏటనే సంపన్న కుటుంబీకులు తమ కోడలిగా చేసుకున్నారు. నోములూ, వ్రతాలూ,  పండుగలూ,  పబ్బాలకు వచ్చే వియ్యాలవారి మర్యాద రత్తమ్మగారికి తలకు మించిన భారం అయ్యేది. ఇంట్లో మరో ఆడతోడు లేదు. లచ్చన్నగారికి పురుషాహంకారం. ఆమెకు తోడు పడనీయకపోగా ఆయన పరిచర్యలలో ఏపాటి లోపం వచ్చినా ఆమెపై తాడి ఎత్తున లేచేవారు. సుబ్బన్నతల్లి పరిస్థితి చూసి ఆమెకు సహాయం చేస్తూ వెంట వెంటనే వుండేవాడు. మడి అంగవస్త్రం కట్టుకొని వీధి నూతినుంచి నీరు తేవడం, పప్పులూ,  పచ్చళ్ళు రుబ్బి పెట్టడం,  తమ్ముడూ,  చెల్లి తానూ చల్దన్నాలు పెట్టుకొని తిని కంచాలు కడుగుకోవడం, తమ తలలు దువ్వుకొని నూతి నీరు తోడుకొని స్నానాలు చేయడం వంటి పనులు చేసి పెట్టేవాడు. వీటిలో ఏ ఒక్కటి తండ్రి కంటపడినా ఆడంగి వెధవా నువ్వేదో చదువుకొని ఇంటిని  ఉద్ధరిస్తావనుకుంటుంటే ఇలా ఆడంగి పనులా చేస్తున్నావు అని మందలించేవారు. సుబ్బారావు తండ్రిని అలా వెళ్ళనిచ్చి,  అమ్మా ఎంతసేపు చిటికెలో ఇవన్నీ చేసేసి నేను చదువుకుంటాను కదా. నువ్వేం బాధపడకూ అనేవాడు తల్లితో. కొడుకును ఎదకు హత్తుకుని తన కష్టాలన్నీ తీరిపోయినట్లు సంబరపడేది ఆ తల్లి.   

                తల్లి మరణమే అశనిపాతమైతే ఆ తరువాత తాము పడ్డ పాట్లు ఎన్నని. కోరుకొండలో తండ్రి తెల్లవారు ఝామున లేచి నూతి వద్ద స్నానం చేసి జపం చేసుకుని ఇంత  అన్నం పుడకేసి పడేసి,  చంటిదానికి నీళ్ళు పోసి ఊళ్ళోకి వెళ్లేవారు. తెల్లవారేక సుబ్బన్న,  తమ్ముడూ, లేచి స్నానాలు చేసి చల్దన్నాలు పట్టుకొని తిని స్కూలుకు వెళ్ళేవారు. ఇరుగు పొరుగువారు వాకిట్లో ఆడుకుంటున్న సుబ్బుల్ని చూసి తలదువ్వి, బొట్టూ కాటుకా పెట్టి ఆడుకోమని ఇంత బెల్లం ముక్కో చారెడు కందిపప్పో పెట్టేవారు. వారికి చెయ్యి ఖాళీ అయ్యాక చూస్తే ఆ బాలిక వాకిట్లో నిద్రపోతూ వుండేది  సుబ్బారావు స్కూలు నుంచి వచ్చాక ముగ్గురూ మధ్యాహ్నం  అన్నాలు పెట్టుకొని కూర్చొని తినేవారు సాయంత్రం పాఠశాల నుంచి వచ్చి ఆకలితోనే వాకిట్లో కూర్చొని చదువుకునేవారు. దీపాల వేళకు తండ్రి తిరిగి వచ్చి రాత్రి వంట చేసేవారు. ఓపిక వుంటే ఏదైనా కూర చేయడం లేకపోతే ఊరగాయబద్దా, మధ్యాహ్నం మజ్జిగే గతి. ఈ విధంగా ఆడదక్షత లేకుండా అవస్థలు పడ్డ తండ్రి అకాల వార్థక్యం పాలపడ్డాడు. నాన్న మాత్రం తనను ఏమంత కోరరాని కోరిక కోరాడు. నాలుగు ఏళ్ళ తరువాత అయినా తాను ఎటూ పిల్ల పెళ్ళి చేయాలి కదా. అదేదో కాస్త పెందరాలే చేస్తే నాన్న సంతోషిస్తాడు అనుకున్నారాయన. సంబంధాలు వెదకడం ప్రారంభిస్తే మనకు అనుకూలమైనది దొరికినప్పుడు చేయవచ్చు అనుకుంటూ వరుడి అన్వేషణలో పడ్డారు సుబ్బారావు గారు.

                     పన్నెండవ ఏట మహాలక్ష్మమ్మ ఈడేరింది. అత్తింటి వారు పుట్టినింటి వారు చేయవలసిన వేడుకలన్నీ శాస్త్రి గారే జరిపించారు. స్నానం రోజుకు పెద్ద కృష్ణ సోమయాజులుగారు బంధువులలో ఇద్దరు ముత్తయిదువుల్ని ముందు వుంచుకుని మనుమనితో వియ్యాలవారింటికి వచ్చారు. శాస్త్రిగారు శుభలేఖ ఇచ్చి పంపిన బ్రాహ్మనికి తలంటి స్నానం చేయించి, వింధుభోజనం పెట్టి ఒక రూపాయి దక్షిణ ఇచ్చి అతడిని కూడా తమతో పాటు తీసుకొని వచ్చారు వారు. అమ్మాయి రజస్వల అయిన వేళ నిర్థుష్ఠమైనదై ఏ విధమైన శాంతులు అవసరం  లేకపోవడం విశేషం. సోమయాజులు గారి ఆధ్వర్యంలో స్వస్తి పుణ్యహవచనం,  వేదస్వస్తి జరిగాయి దంపతులకు. శాస్త్రిగారూ ‘‘మామగారూ పిల్ల ఇంకా పసిది పునస్సంధానం కొంతకాలం వాయిదా వేసి అల్లుణ్ణి పండుగ పర్వాలకు పంపుతో వుండమని నా మనవి అన్నారు. సోమయాజులు గారు అంగీకరించారు.    

                    అల్లుడు వచ్చిన ప్రతిరోజూ శాస్త్రిగారికి సంక్రాంతి సంబరమే. తన పరిచయస్తులు అందరిని పిలిచి సభతీర్చి అల్లుడి పాండిత్యాన్ని ప్రదర్శింప చేసేవారు. వారంతా అల్లుణ్ణి పొగడుతూ వుంటే పుత్రోత్సాహాన్ని మించిన ఆనందం వారికి కలిగేది. వారింట అల్లుని మాటకు తిరుగులేదు. సర్వులూ అతడి కనుసన్నల్లో మెలగవలసిందే. ఇక భూదేవమ్మ గారు చేసే విందులకైతే పరిమితి లేదు. మిగతా అతిథులు ఈ విందులు స్వీకరించలేక ‘ఇదేమిటండీ  బాబూ.. వీరి ఇంట రోజూ పెళ్ళేనా’’ అనేవారు. ఎప్పటికైనా ఆడపిల్లని అత్తవారింటికి పంపవలసిందే కదా. ఏడాది గడిచాక కృష్ణ సోమయాజులుగారు ముహుర్తం పెట్టుకొని వచ్చి ‘‘అల్లుడా ఎట్టి సాధ్యులకును పుట్టిన ఇంట పెద్దకాలమునికి తద్ద తగదు’’ అని నన్నయ్య గారు కణ్వుని చేత అనిపించారు కదా. నాకు ఉన్నంతలో నీ బిడ్డకు నా ఇంట ఏ లోటు రానివ్వను నా వస్తువు నాకు అప్పగించవయ్యా! అన్నారు. సారి సంబారాలతో మహాలక్ష్మమ్మ అత్తవారింటికి వెళ్ళింది. ఆమె పయనించే గూడు బండి వెంట మరో రెండు బళ్ళ మీద బియ్యం బస్తాలు పప్పులూ,  కొబ్బరికాయలూ,  కూరలూ వున్నాయి. మేలిరకం ఆవు నెయ్యి వున్న కుంచెడు గిన్నె బండికర్రకు వేలాడతీసారు. మహాలక్ష్మమ్మ పురిషెడు నిండేటట్లుగా నేయి వేసుకుంటుంది. వారి ఇంట ఏమేం సామానులు వున్నాయో తాను ఏం సారె పెట్టాలో వారికి తోచలేదు. పెద్దవారు మామగారు తాను ఏం చేస్తే ఏం అనుకుంటారోనని వీరికి జంకు. 116 రూపాయలు అల్లుడి చేతిలో పెట్టి బాబు సారెలో ఏమి ఇవ్వాలో నాకు తోచడం లేదు. మీకు కావలసినవి నీవే కొనుక్కో అన్నారు ఆయన. ఇంటిల్లి పాదికీ క్రొత్త బట్టలు పంపారు. అల్లునికి రెండు జతలపంచల చాపులూ,కుమార్తెకు క్షత్రియ సంప్రదాయం ప్రకారం 10 కావిళ్లపై కొత్త చీర మడతలు పరచి పంపారు. చలిమిడి, బెల్లం మిఠాయి, కొబ్బరికోరులో బెల్లం కలిపి పాకం కట్టారు. మూడు ఇత్తడి బిందెలలో పసుపు, కుంకుమా, నలుగుపిండి పెట్టి పసుపు బట్టలు వాసెన కట్టారు. కొబ్బరికాయల గుత్తులు,  అరటి గెలలు, ఈ సంబారాల్ని కావిళ్ళలో పెట్టుకొని ఆరుగురు చాకళ్లు వెంట వచ్చారు. మహాలక్ష్మమ్మ గారు వాడు కొనే కట్టుడు చీరలు దుప్పట్లు, తువ్వాలు రెండు కావడి పెట్టెల్లో వున్నాయి. వీరంతా మధ్య మధ్యలో మజిలీలు చేస్తూ రెండు రోజులు ముందుగా నడవపల్లిలో బయలుదేరి మహాలక్ష్మమ్మ వచ్చే వేళకు ఊరు చేరారు. మహాలక్ష్మమ్మ తోడు వచ్చి బంధు స్త్రీ అయిన పెద్ద ముత్తయిదువును ఒక బండిలో సంబారాల బండ్లు సారె కావళ్లు ముందరగా వస్తూ వుంటే ఊరివారంతా ఊరేగింపుగా చూసారు.    

                       నడవపల్లిలో నడవడికీ, ఆత్రేయపురంలో ఆచారాలకూ చాలా భేదం వుంది. ఇక్కడ పని మనుషులు అంటూ ఎవరూ వుండరు. వున్న పొలాల్ని రైతులకు కౌలుకిచ్చుకోవడమే కాని వారికి పొలం పనులకు పాలేర్లు వుండరు. ఇంటిలోని స్త్రీలు వేకువనే లేచి వాకిళ్ళు ఊడ్చి, కల్లాపుజల్లి, గుమ్మాలు అలికి ముగ్గులు పెడతారు. తరువాత వంట సామాన్లు పెరట్లో అరటిబోదె క్రిందె వేసుకొని తోముకుంటారు.  ఎండెక్కేవేళకు గోదావరికి వెళ్ళి స్నానంచేసి, బట్టలు ఉతుక్కుని, రెండు మూడు పెద్ద సైజు బిందెలతో మంచినీరు తీసుకొని ఇంటికి వస్తారు. ఈలోగడ ఇంటిలోని ఆడపిల్లలూ కోడళ్ళు గదులు ఊడ్చి, చెంబులూ, పూజ సామాను విడివిడిగా తోమి (పూజ సామాను మంచినీరు త్రాగే చెంబులు ఎంగిలి కనుక వాటితో కలిపి తోమరాదు.) చిన్నపిల్లలు ధరించేబట్టలు ఉతికి తమ బట్టలు ఉతుక్కుని తమ ఇంటి ఎదురుగా వున్న నూతిలో స్నానాలుచేసి త్రాగే  నీరు రెండు బిందెలు తెచ్చుకుంటారు. పెద్ద వారు తెచ్చిన నీరు మడినీరు అది పిల్లలు తాకరాదు. ఉతికిన పట్టులాగులూ,పరికిణీలు,  ధరించి చల్దన్నాల గదిలో మూత పెట్టిన చల్దన్నాలు అందరూ పెట్టుకొని తింటారు. అది గది బయటకు తేరాదు. చల్ది భోజనాలు ముగిసాక ఆడపిల్లలు స్థలం శుద్ధి చేసి కంచాలు కడుగుకుంటారు. దేవతార్చనచేసే పెద్దలూ, వంటచేసే ఆడవారు తప్ప పిల్లలంతా చల్దన్నాలు తింటారు.   

                             మహాలక్ష్మమ్మకు పుట్టినింట అపురూపం. ఆమెచేత పని చేయించే సాహసం అక్కడ ఎవరికీ లేదు. కలిగినఇంటిపిల్ల అనే గౌరవంతో అత్తగారు ఆమెకు కొంతకాలం పనిచెప్పలేదు. కొన్నాళ్ళు గడిచేసరికి ఎంతకాలం దీన్ని కూర్చోపెట్టి మేపుతాం అన్నభావం ఆడవారిలో కలుగసాగింది. ఉదయం లేస్తూనే అందరూ కాలకృత్యాలు తీర్చుకొని తమ తమ పనుల్లో నిమగ్నం అయ్యేవారు. మహాలక్ష్మమ్మ పుట్టింటిలో అలవాటు ప్రకారం కొంచెం పొద్దు ఎక్కాక లేచేది.
శాస్త్రిగారింట్లో అందరూ అరుణోదయం  వేళ లేచినా మహాలక్ష్మమ్మ మాత్రం కాస్త ఆలస్యంగా లేవడం అలవాటు. గారం వలన ఆమెను ఎవరూ లేపటానికి సాహసించరు. ఒకవేళ ఎవరైనా లేవబోతే శాస్త్రిగారు, అప్పగారు వాళ్ళని తీవ్రంగా మందలించేవారు. ఈ పాచి పనులేవో ఆమెకు తెలియవు. ఒకరోజున ఆడపడుచులు ‘‘వదినా వాకిలి వూడుద్దువుగాని రా’’ అన్నారు. ఇలాంటి పనులు నేను చేయలేను, కావాలంటే పనివాళ్ళను పెట్టండి అంది ఆ బాలిక. ఇంకేం వుంది. గొడవ రగులుకుంది. ఆమెకు నిద్ర లేచేసరికి పాలేరు చెంబులో నీరుపెట్టి పీట వాల్చి వుంచటం అలవాటు. అత్తవారింట కాలు పెట్టిన మరుసటి రోజు నిద్రలేచి పెరటిలోకి వస్తూ ముఖం కడుగుకోవడానికి నీళ్ళేవి అంది. ఇక్కడ ఎవరూ పెట్టరు నీవే తెచ్చుకోవాలి అన్నారు ఎవరో. కృష్ణ సోమయాజులు మాట్లాడకుండా చెంబులో నీరు తెచ్చి అక్కడ పెట్టారు. అది మొదలు ఆయన ప్రతిరోజూ తాను ముఖం కడుగుకున్నాక మరో చెంబు నీరు అక్కడ పెట్టేవారు. పెద్దింటిపిల్ల ఆమెకు పనులు ఎలా వస్తాయి అని రామలక్ష్మమ్మ గారు సర్దుకు పోయినా ఇంట్లో మిగతా ఆడవారు ఊరుకునేవారు కాదు.

                            పచ్చని శరీరచ్ఛాయతో పుష్టి అయిన శరీరంతో వుండే మహాలక్ష్మమ్మకు మేనత్త పుట్టింట్లో రోజూ వెన్నపూస రాసి సెనగపిండిలో పచ్చిపాలు పోసి నలుగుపెట్టి నీరు పోసేది. ఇక్కడ ఎవరూ చేసేవారు లేరు కదా. తానే చేసుకొందాంలే అని వెన్నపూస పాలూ తీసుకొని స్నానానికి బయలుదేరింది. వెలగకాయంత వెన్నముద్ద,  అరసోలడు పాలూ చూసిన రామలక్ష్మమ్మ ఇదేమిటీ ఇవన్నీ ఎక్కడికి అంది. ఇటువంటి వైభవాలు ఆమె ఎరుగరు. ఈ వస్తువులు ఇంటెడుమందికి ఒక పూట  భోజనంలో నెయ్యి, మజ్జిగకు సరిపోతాయి వారికి. మీలాదడిలో స్నానాలు నాకు అలవాటు లేదు. నలుగు పెట్టుకోవాలి అంది కోడలు. ఎంత సహనశీలి అయినా అత్తగారి ఆత్మాభిమానం దెబ్బతింది. ఇరువురి మధ్యా పోట్లాట  ప్రారంభమైంది.

                         వీధిలోకి కూరలు గాని మరేవస్తువుగాని అమ్మకానికి వస్తే జాగ్రత్తగా బేరం చేసి కొనుక్కోవడం దిగువ మధ్య తరగతి వారికి అలవాటు. మహాలక్ష్మమ్మ గానీ కూరల వాడు రావడం చూసిందా ఏ ‘‘అయ్యా! నాయనా నిండు కావడి భుజం మీద వేసుకొని వచ్చావు. మేము కొనే రెండు వీశల కాయలకు బేరం ఎందుకులే నీవు అన్నట్లే తీసుకో’’ అని వాడు అడిగిన ధర ఇచ్చి కొనేది. చిల్లర లేకపోతే పోనీలే తమ్ముడూ పిల్లలు గల వాడివి వుండనియ్యి అనేది. ఇవి ఇంటి ఇంటివారికి ఆపాత్రదానాలుగా  తోచేవి. ఒకరోజు మహాలక్ష్మమ్మ గారు కొన్నాక ఆ కూరలవాళ్ళు కోడలిగార్ని పిలవండి అనేవారు. ఇంటివారు బేరమాడబోతే.

                      ఆమె రుచులూ వారి రుచులకు భిన్నమైనవే. మాఘ, పాల్గుణ మాసాల్లో ఉసిరికాయలూ,  చింతకాయలూ బాగా వస్తాయి. ఇంటిలో అందరికీ సరిపడా కుంచెడు పచ్చళ్ళు పెట్టుకుంటారు వారు. దానిలో రెండు పచ్చిమిరపకాయలూ,  కాస్త కొత్తిమీర వేసి నూరితే ఉదయం పూట మంచి ఆధరువు. పెరట్లో నారదబ్బ చెట్టుగాని వుంటే కాయలు ఊరగాయ పెట్టుకుంటారు. మహాలక్ష్మమ్మకు ఇవేవీ గిట్టవు కాణీ పెట్టి కొబ్బరికాయ కొని పచ్చడి చేసుకోవడం ఆ ఇంటి వారికి పండుగనాడే. ఆ ప్రాంతాల కొబ్బరిచెట్లు ఆనాటికి కల్పవృక్షమంత అపురూపం. మామిడి చెట్లు కూడా విస్తారంగా వుండేవి కావు. నీరు నిలువ వుండే ప్రదేశాల్లో పొన్నగంటికూర, పొదిలికూర, కోయ్యతోటకూర వంటి ఆకుకూరలు వుండేవి. అవి పులుసు పెట్టుకొనేవారు. ఎప్పుడైనా పప్పులో వండుకొనేవారు. చెమ్మకాయలు అనే ఒకరకం కాయలు చెట్ల కొమ్మలకు కాస్తాయి. అవి మూడు వేళ్ళు వెడల్పు, జానెడు పొడవుగా వుంటాయి. అవి మధ్యకు చీల్చితే లోపల   ఉల్లిపొరగా వుంటుంది. ఆ పొర వలచి చిన్న ముక్కలుగా తరగి పులుసు బెల్లం పెట్టి వండుకుంటారు వారు. పెరటిలో కాకరపాదు రోజు విడిచి రోజు కూరలు ఇస్తుంది. అది పులుసూ బెల్లం పెట్టి వండుతారు.

                      ములగకాడలు పిండి బెల్లం వేసి వండుకుంటారు. తోటకూరకాడలు పులుసు బెల్లం వేసి వండుతారు. ఇవేవి మహాలక్ష్మమ్మకు నచ్చవు. ఆమె దృష్టిలో వంకాయ అరటికాయలే కూరలు. పెరటిలో కూరలు వుండగా కొనడం ఎందుకు అనుకునేవారు ఇంటివారు. అణా పెట్టి పెరుగు ముంతకొని ఇంటిల్లిపాది మజ్జిగ చేసుకొని పోసుకోవడం వీరికి అలవాటు. మహాలక్ష్మమ్మ ఒక్కత్తెకు అణా పెరుగు చాలనే చాలదు. పనివద్ద భోజనాల వద్ద రోజూ జగడాలు తప్పనిసరి అయ్యేవి. పెద్ద కృష్ణ సోమయాజులు గారు యోచించారు. పాపం పెద్దింటి పిల్ల ఆమెను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు అనుకున్నారు వారు. మనవణ్ణి పిలిచి ‘‘నాయనా మనింటి ప్రక్క ఖాళీ స్థలం కొని ఇల్లు కట్టిస్తా ఆ అమ్మాయి నీవు అందులో కాపురం పెట్టండి’’ అని చెప్పి   ఆ ప్రకారంగానే చేసారు.

                         పొలంలో వాటా పంచి ఇచ్చి ఇల్లు వేసుకోవడానికి కొంత పైకం ఇచ్చారు తాతగారు. అది చాలక మరికొంత అప్పు చేసారు కృష్ణ సోమయాజులు గారు. ఎక్కడైనా యజ్ఞం జరిగినప్పుడు భూరిదక్షిణ సత్కారం లభించేది కాని, ఒక నికరమైన ఆదాయం లేదు వారికి. వివాహాది శుభకార్యాలప్పుడు ఇచ్చే సంభావన స్వీకరించడం వారి అభిమత్యానికి తగదు. తాతగారి హయాంలోలా డబ్బుతో నిమిత్తం లేకుండా వున్నదానితో బ్రతకడం వారికి సాధ్యం కావడం లేదు. మామగారు కనిపెట్టి చూడబట్టి బండి నడుస్తూంది. వారైనా తమకు పండిన సంబారాలు ఇస్తారు కానీ, డబ్బు ఎత్తి ఇవ్వడం వారికి కుదరదు. భార్యకు కష్టసుఖాలు తెలియజెప్పబోతే ఆమెకు కోపం వచ్చేది. కానీ పరిస్థితి అర్థం చేసుకునే విధానం ఆమెకు వుండేది కాదు.  తన మాటకు ఎవరైనా ఎదురుపడితే నేను లక్షాధికారి కడుపున పుట్టాను. నన్ను మాట అంటే పడతానా? అనేది ఆమె. ఆమె ఆహార్యం కూడా నాటి చాలామంది కన్నా భిన్నంగా వుండేది. ఆ రోజుల్లో చాలా మంది స్త్రీలు ఉతుకు ఓర్వాలని ముదురురంగు చీరలు ధరించేవారు. అవి వారు రోజూ స్నానం చేసేటప్పుడు ఉతికి ఆరవేసుకొనేవారు. వాటిని చాకలి వుతకనవసరం లేదు. మహాలక్ష్మమ్మకు మేలిరకం తెల్లదైన చీర నల్లని రవిక ధరించడం అలవాటు. ఆ తెల్ల చీరలు రోజూ చాకలి ఉతకవలసిందే జుట్టు ముడివేసుకొని కుడివైపుగా గాని,  ఎడమవైపు గాని చెవులపైన జుట్టు లోనికి ముడవడం కొప్పు ముడవడం మహాలక్ష్మమ్మకు ఈ పద్దతి నచ్చదు. ఆమె జుట్టును ముచ్చటపడి అనేక విధానాలలో ముడిగానే వదులుతారు.

                         అది నాటి రోజుల్లో నవ నాగరికతగా పరిగణించేవారు. అదే విధంగా ఆ రోజుల్లో ముఖం నిండా పసుపు పూసుకొని, కంటినిండా కాటుక పెట్టుకొని ముఖాన కాణీ అంత బొట్టు పెట్టుకోవడం నిండు ముత్తయిదవతనం. మహాలక్ష్మమ్మ గోరెడు పసుపు అలదుకొని కనుబొమ్మల నడుమ అసలు బొట్టుపై కొద్దిగా కుంకుమా అలదుకొని కన్నులకు సన్నగా కాటుక రేఖ దిద్దుకునేవారు. ఈ అలంకారాన్ని సాటి ఆడవారు సంప్రదాయ వ్యతిరేకతగా భావించేవారు. ఆమెను విమర్శించేవారు. అయినా ఆమె సరకు చేసేవారు కాదు. నాటి స్త్రీలు కాళ్ళకు అందెలు, కడియాలు,  గొలుసులు అని మూడు రకాల ఆభరణాలు ఏకకాలంలో ధరించేవారు. మహాలక్ష్మమ్మకి అవన్నీ బరువు. ఆమె అల్లికతోడాలు అనబడే సన్నని కడియాలు నగిషీలు చెక్కినవి మాత్రమే ధరించేవారు. మధ్యాహ్న భోజనాలు అయ్యేక రామలక్ష్మమ్మ, కుమార్తెలు బియ్యం దంపుకోవడం, పప్పులు చేసుకోవడం వంటి పనులు చేసుకునేవారు. మహాలక్ష్మమ్మకు అది విశ్రాంతి సమయం. మహాలక్ష్మమ్మా ఆ కందులూ ఇలా పప్పు చేసి పెడతాం అంటూ ఆమె పనులు చేసేవారు సోమయాజులుగారి మీద అభిమానంతో అలాగే గోదావరి స్నానానికి వెళ్ళేటప్పుడు మహాలక్ష్మమ్మా! గోదావరికి వెడుతున్నాం చంటిపిల్లాడి  బట్టలు ఇవ్వు అని అడిగి మలమూత్రాలు విసర్జించిన ఆ బట్టలు ఉతికి తెచ్చేవారు.  నిష్కపటి పిల్లలు తల్లి అయిన ఆమెపట్ల వారి మదిలో ఆదరమే వుండేది.

              అందరిలా పన్నెండు గంటల వరకూ ఏమీ తినకుండా వుండటం మహాలక్ష్మమ్మ శరీరస్థితికి సరిపడదు. ఆమె పిల్లలకు కూడా రాత్రి వండిన అన్నం పెట్టరు. ఉదయం లేస్తూనే పెరటి వసారాలో పొయ్యి అంటించి అన్నం వండి ఏ వంకాయ పచ్చడో చేస్తుంది ఆమె. కాపువీధిలోకి అణా ఇచ్చి పిల్లల్ని పంపుతుంది. వారు ఆదరంగా మహాలక్ష్మమ్మ గారి అబ్బాయి వచ్చాడు భోషాణంలో పెరుగుముంత ఇవ్వండి అనుకుంటూ ఆమెకోసం పెరుగు ముంత ఇస్తారు. వారి కష్ట సుఖాలు అర్థం చేసుకుని, తమ పట్ల ఉదారంగా వుండే ఆమె అంటే వారికి గౌరవం. పిల్లలతో పాటు ఆమె అన్నం తింటుంది. తరువాత నూతి నుంచి స్నానం చేసి మడినీరు తెచ్చుకుంటుంది.  ఇంటి పనులకు ఆమెకు పనిమనిషి ఉండవలసిందే.

                     ఈ లోగడ కృష్ణసోమయాజులుగారు శిష్యులకు వేదపాఠం చెప్పి లోనికి వచ్చి మడి కట్టుకొని వంటపని చూస్తారు. వారు నిత్యం పంచసూక్తాలు పఠిస్తారు. శ్రీసూక్తము, పురుషసూక్తము, అగ్ని సూక్తము, శివసూక్తము, దుర్గాసూక్తము అనునవి పంచ సూక్తములు. శ్రీసూక్తము లక్ష్మీదేవిని స్తుతించును. పురుష సూక్తము విష్ణుదేవుని విరాడ్రూపమును వర్ణించును. అగ్నిసూక్తము అగ్ని దేవతాకము, శివసూక్తము శివుని అష్టమూర్తిత్వము ఏకాదశరుద్ర స్వరూపమును కొనియాడబడును`దుర్గాసూక్తము సర్వదేవతా సమిష్టి రూపమై దుర్గాదేవి స్వరూపము,  మహిమలు కొనియాడును. పిదప మధ్యాహ్నం సంధ్యావందనము చేసి వైశ్యదేవము అను యష్టిచేసి, దేవతార్చనా సంపుటిలోని దేవతామూర్తులను యదావిధిగా అర్పించుదురు. సంధ్యావందనము, ఉషఃకాలమున  మధ్యాహ్నమున సాయం సంధ్యావేళ చేయుదురు. ప్రాతఃసంధ్యలో సావిత్రిని,  మధ్యాహ్న వేళలో సరస్వతిని,  సాయంత్రము గాయత్రి స్వరూపముగా సంధ్యాదేవిని ఉపాశించుట శాస్త్ర విధి. ఈ అనిష్టానము ముగిసాక రెండు విస్తర్లు పరచి వడ్డన చేసి అమ్మన్నా! దేవతార్చన అయింది భోంచేద్దాం రావయ్యా అని భార్యను పిలుస్తారు. మహాలక్ష్మమ్మ గారి పుట్టిల్లు రాజుల ఊరు కదా అక్కడ స్త్రీలను అన్న,  అయ్యా అని పురుష సూచకాలైన సర్వనామాలతోనూ, పిలవడం పరిపాటి. భార్యను ఆమె పేరుతో పిలవడం ఆ రోజుల్లో అలవాటు లేదు. అందుచేత ఆమెను తండ్రి పిలిచే పేరుతో అమ్మన్నా అనే కృష్ణసోమయాజులుగారు పిలుస్తారు.        

                   కృష్ణసోమయాజులుగారు మజ్జిగ అన్నంలోకి వచ్చే వరకూ ఈ పని   ఆ పనీ చేస్తూ తారాడి, వారు    ఉత్తరాపోశన పట్టే వేళకు మహాలక్ష్మమ్మ గారు వచ్చి ఆమె విస్తరి ముందు కూర్చొంటారు. భోజనం ముగిసిన కృష్ణ సోమయాజులు గారు చేయి కడుగుకొని వచ్చి ఆమె ఎదుట పీట జరుపుకొని కూర్చొని పిచ్చపాటి ముచ్చటిస్తూ వుంటారు. భోజనం చేసి చెయ్యి కడుగుకోగానే ఏదైనా ఉపాహారం తినడం కృష్ణసోమయాజులు గారికి అలవాటు. వారు పెరట్లో చెయ్యి కడుగుకోవడం చూస్తూనే వారి తల్లి చెగోణీలో, జంతికలో ఒక పళ్ళెంలో పెట్టి తెచ్చి వారికి ఇచ్చేవారు. దంతాలకు పనిచెప్పి వాటిని నములుతూ మహాలక్ష్మమ్మ గారు భోజనం ముగించి వంటిల్లు చక్కబెట్టుకొనే వరకూ అక్కడ కూర్చొంటారు వారు. పిదప ఇరువురు కాసేపువిశ్రమిస్తారు. పొద్దు వాటారుతుంటే వీధి అరుగుమీద కూర్చొని కృష్ణ సోమయాజులు గారు తమ కుమార్తెలనూ, ఇరుగుపొరుగు ఆడపిల్లలనూ చెంత కూర్చొండబెట్టుకొని,  ముహూర్త చింతామణి, జాతకదర్శిని అనే జ్యోతిష్య శాస్త్రాన్నీ, దిగ్మాత్రంగా తెలియజేసే గ్రంథాలను ఆడపిల్లకు పాఠం చెప్తారు. ఈ గ్రంథాలు చదివిన బాలికలు తాము ఏపని అయినా చేయాలంటే తిథి వార,  నక్షత్రాల్ని పరికించి ముహూర్త నిర్ణయం చేయగల ప్రాథమిక పరిజ్ఞానం కలుగుతుంది, ఉదాహరణకు ఏదైనా శుభకార్యం చేయాలంటే ప్రాతఃకాలాన ఉన్న తిథిని ఆ రోజు తిథిగా పరిగణిస్తారు. జన్మదినోత్సవ వేడుకలు ప్రాతఃకాలాన యున్న తిథిని పాటిస్తూ చేయాలి. పితృ కర్మలకు మధ్యాహ్నం పన్నెండు గంటల వేళకు వున్న తిథిని పాటించాలి. రాత్రి వేళ జరిపే వ్రతాలూ, చంద్రుని అర్చించే వ్రతాలు రాత్రివేళనే ఆచరించాలి. వానికి సూర్యాస్తమయము తర్వాత వున్న తిథిని పరిగణించాలి.

                 వినాయక వ్రతం మాత్రం ఉదయం ఆచరించే వ్రతమయినా రాత్రి చవితి చంద్రుని చూడకముందే వినాయకుని పూజించాలి కనుక ఉదయవేళ తదియ తిథి అయినా ఆ రాత్రి చవితి వున్న రోజునే వినాయకచతుర్థి వ్రతం ఆచరిస్తారు. ఈ విధంగా సమయ నిర్ణయం చేయగల పరిజ్ఞానాన్ని వారు బాలికలకు కలిగించేవారు. రఘువంశం,  కుమారసంభవం,  మేఘసందేశం, కిరాతార్జునీయం(భారవి) శిశుపాలవధ(మాఘం) అను పంచ కావ్యాల్లో ప్రాథమిక సంస్కృత పరిచయానికి అవసరమైన రఘువంశం కుమార సంభవం కావ్యాల్లో తలో రెండు సర్గలు మాత్రం పాఠం చెప్పి భాషా అలంకార, వ్యాకరణ విషయాలను లోతుగా చర్చించవలసిన మిగతా మూడు కావ్యాలనూ విడిచిపెట్టి సంస్కృత భాషకు నిఘంటుప్రాయమైన అమరసింహుడు అనేవారు వ్రాసిన అమరకోశం అనే గ్రంథాన్ని పాఠం చెప్పేవారు. అమరా, నిర్జరా, దేవా,  త్రిదశా అని అమరులు అంటే  ఎవరో చెప్పడంలోనే నానార్థాలు వస్తాయి. అలాగే ఉమా, కాత్యాయనీ, గౌరి, కాళీ, హైమావతీశ్వరీ, అపర్ణా, చండికా, దుర్గా, శర్వాణీ, సర్వమంగళా అంటారు. ఇలాగే అనేక పదాలు చెప్పబడతాయి. ఈ గ్రంథంలో భోజ కాళిదాసు కథలుగా ప్రచారంలో వున్న చమత్కార శ్లోక రూపంలో వున్న సంస్కృత గ్రంథాన్ని పిల్లలకు చెప్పేవారు. భోజరాజు గారు సభలోకి వస్తూ ఒక శ్లోకపాదం చెప్తారు. రవిగానననిచో కవిగాంచును అని ఆర్యోక్తికదా. కవులు తమ క్రాంతి దర్శిత్వంలో జరిగిన విషయాన్ని ఊహించి శ్లోకం మిగతా పాదాల్ని పూరించాలి.
            

– కాశీచయనుల వెంకటమహాలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో