పూర్తిగా జీవించామా అన్నదే ప్రశ్న!

 

ఏదో ఒక దాహం మెదడును పిండుతూనే ఉండాలి కదా!

ఏదో ఒక కొత్త ఆలోచన ఆచరణకు మళ్ళుతుండాలి కదా!

ఇదే జీవితం కాదా?!

ఏదో ఒక నొప్పి మనుసును గిల్లుతూనే ఉండాలి కదా!

ఏదో ఒక వార్త సమాజాన్ని కుదుపుతూనే ఉండాలి కదా!

ఇదే చైతన్యపు దోవ కాదా?!

ఏదో ఒక కంపనం చేతిరాతలై ముగియాలి కదా!

ఏదో ఒక గీత వేలిచివరినుండి విదల్చాలి కదా!

ఇదే కవిత్వానికి దారి కాదా?!

ఏదో ఒక జలపాతం మనుసులో ఉరుక్కుంటూ రావాలి కదా!

ఏదో ఒక కడలి అల కల్లోలాన్ని స్రుష్టించాలి కదా!

ఇదే బ్రతికున్నామనడానికి నిదర్శనం కాదా?!

ఏదో ఒక సంతోషం పెదాల నవ్వును పట్టుకు ఊగాలి కదా!

ఏదో ఒక కల రెప్పలను వదిలిపోనని మారాం చేయాలి కదా!

ఇదే జీవన స్రవంతిలో దొరికే తెడ్డు కాదా?!

ఏదో ఒక విజయం వెన్నును నిటారుగా నిలబెట్టాలి కదా!

ఏదో ఒక ధైర్యం మనపేరును ప్రపంచానికి వినిపించాలి కదా!

ఇదే అందమైన వాస్తవానికి అద్దం కాదా?!

క్షణాలు దొర్లిపోతూనే ఉంటాయి…

వాటిలో మనం పూర్తిగా జీవించామా అన్నదే ప్రశ్న!

– విజయ భాను కోటే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , , , , , , , , , , , , Permalink

3 Responses to పూర్తిగా జీవించామా అన్నదే ప్రశ్న!

 1. దడాల వెంకటేశ్వరరావు says:

  ఎవరి లోకంలో వారు కాలంతో పాటుగా జీవిస్తారన్నదే సమాధానం
  ఉదయ భానుడి దయవల్ల అందరూ వేడిగా బ్రతుకుతునారు
  భానుడితో పాటూ విజయాన్ని కూడా
  పేరులోనే ఇముడ్చుకున్న వారికి
  ఏదైనా సాద్యపడుతుంది

  ఏమ్చేస్తాం కాలంతో ప్రయాణించలెం కదా
  మనం(మేము) మామూలు మనుషులం
  ” ఇదే ఇదే మన జీవన గీతం
  కపాలశ్రుతిలో కరాళరాగం

  కాలు కదిపితే కధ రణరంగం
  చేయి కలిపితే విధి చదరంగం
  వెన్నెల శ్రుతిలో కలల విహారం
  బ్రతుకు బాటలో ప్రళయ ప్రవాహం

  తెలుసు జీవితం మూడునాళ్ళని
  గడచిన కాలం తిరిగిరాదని
  వేచినదేహపు తీరని దాహం
  జీవితకాలం అలమటించుటే
  ఇదే ఇదే మన జీవన గీతం
  కపాలశ్రుతిలో కరాళరాగం

  ఇదే ఇదే మన జీవన గీతం
  కపాలశ్రుతిలో కరాళరాగం….”

  దడాల వెంకటేశ్వరరావు

 2. vali says:

  భాను గారు మీ కవిత చాలా బాగుంది .
  ఏదో ఏదో అంటూనే మనం ఎలా బతుకు తున్నామో కళ్ళకు కట్టినట్లు చెప్పారు .

 3. మీ ముందొక లక్ష్యం మీ వెనకొక విజయం ప్రతీ క్షణం …అదీ జీవితం అంతేకదా శుభమ్ జయం ….