ఇంగ్లాండ్ సాహస కన్య గ్రేస్ డార్లింగ్

 అపాయం లో ఉన్న వారిని రక్షించటం కనీస మానవ ధర్మం .దానికి ఆడా  మగా తేడా లేదు .సాయమ అందుకొనే వారు  తన వారా ,పరాయి వారా అన్న భేదం ఉండదు .ఆర్తులను కాపాడటమే ధ్యేయం .దీనికి సాహసం, ధైర్యం కావాలి .ఆ రెండూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాయి .సంకల్పం గట్టిదైతే కృషి తప్పక ఫలిస్తుంది .అలాంటి అద్భుత సాహసం చేసి తీవ్ర ప్రమాదం లో చిక్కుకొన్న నావికా ప్రయాణీకులను అరుదైన ధైర్య సాహసాలతో రక్షించిన మానవీయ మూర్తి ఇంగ్లాండ్ దేశానికి చెందిన గ్రేస్ డార్లింగ్ అనే కన్య ..ఆ సాహసి విశేషాలను తెలుసుకొని ఉత్తెజితులమవుదాం .

     ఇంగ్లాండ్ దేశం లో నార్త్ ఆంబ్రియా  దగ్గర ఉన్న తూర్పు సముద్రం లోని ఫారన్ ద్వీపాలలో ఒకటైన లాంగ్ స్టన్ ద్వీపం లో  లైట్ హౌస్ రక్షకుడు గా ఉన్న విలియండార్లింగ్ కు ఏడవవసంతానం గా   గ్రేస్ డార్లింగ్ 1815 లో జన్మించింది .ఈ ఫారన్ ద్వీపాలు ఆ కాలం లో నిర్మానుష్యం గా ఉండేవి .జంతు వృక్ష సంతతి ఎక్కడా ఉండేది కాదు .అంతా కొండలు, రాళ్ళ మాయం .సముద్రం ఎప్పుడూ అల్లకల్లోలం గా ఉండి అలలు ఉవ్వెత్తున ఎగసి పడటం ఇక్కడ సహజ లక్షణం .ప్రవాహవేగం ఎక్కువ .ప్రమాద భరిత ప్రాంతం గా పేరు పొందింది .అప్పటికే అనేక నౌకలిక్కడ మునిగి పోయి వేలాది మంది ని పొట్టన బెట్టుకొన్న ప్రాంతమిది .1782లో అమెరికా నుండి తిరిగి వస్తున్న ఓడ ఇక్కడి అలల తాకిడికి ముక్కలై సముద్ర గర్భం లో కలిసి పోయింది .1823 లో అయిదు ఓడలిక్కడే జల సమాధి చెందాయి .అందుకని ఇక్కడ లైట్ హౌస్ నిర్మించి దానికి గార్డ్ గా విలియం ను నియమించింది ఇంగ్లాండ్ ప్రభుత్వం .ఆయన చాలా ఓర్పుగా నేర్పుగా కావలి కాస్తున్నాడు అతని సమర్ధతను  ప్రభుత్వం గుర్తించింది కూడా .

         తన పని చాలా కష్టం తో కూడుకోన్నదైనందున తన పిల్లలకు మంచి విద్యా బుద్ధులను నేర్పించాలని విలియం తపన చెందే వాడు ..గ్రేస్ డార్లింగ్ చాలా శాంత స్వభావం కలది .ఆమె సూక్ష్మ బుద్ధి కలదై నందున  చురుకుగా చదవటం రాయటం నేర్చుకొన్నది .తండ్రికి పడవ నడపటం లో ఎప్పుడూ సాయం చేసింది కాదు .ఇంటి పనులన్నీ తల్లే చూసుకొనేది ..గ్రేస్ కు ఇరవై రెండేళ్ళ వయసులో1838 లో సెప్టెంబర్ ఏడవతేది ఆమె జీవితం లో ఒక అత్యద్భుత మైన సంఘటన జరిగి ,ఆమె చరిత్ర ప్రపంచ ప్రసిద్ధ మైంది .

            1838 సెప్టెంబర్ అయిదవ తేదీన ‘’ఫోర్ ఫార్ ఫైర్’’అనే పొగ ఓడ హాల్ నగరం నుంచి బయల్దేరింది. దాని కెప్టెన్ జాన్ హంబుల్ .అందులో విలువైన వస్తువుల ను వర్తకం కోసం తీసుకొని పోయే వారున్నారు .ఓడ సిబ్బందితో కలిపి అరవై రెండు మంది ప్రయాణీకులున్నారు .ఓడ కొత్తదే కాని దాని స్టీం బాయిలర్లు అడుగున చిల్లి పడి నీరు కారటం ప్రారంభ మైంది .ఎంతో తంటాలు పడి అందులో నీళ్ళు నిలవచేసే ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం .ఆరోజు అర్ధ రాత్రి పన్నెండు గంటలకు గాలి తీవ్రమైనది సముద్రపు అలలు ఎంతో ఎత్తుకు లేచి యెగిరి పడుతున్నాయి .వెంటనే పెద్ద గాలివాన ప్రారంభ మైంది .గాడాంధకారం .ప్రకృతి ప్రకోపం మానవ నిస్సహాయత .అందరు కళవళ పడిపోతున్నారు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని క్షణమొక యుగం గా గడుపుతున్నారందరూ ..స్టీం బాయిలర్ల లో నీరు నిలవటం లేదు .చక్రాలు పని చేయటం ఆగిపోయింది .గాలి వేగానికి ఓడ అటూ ఇటూ ఒక దిశా నిర్దేశం లేకుండా తీవ్రం గా ఊగిపోతోంది .ప్రయాణీకులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు ఆందోళన తో దిక్కు తోచటం లేదు ఆక్రందనలు చేస్తున్నారు .ప్రకృతి ముందు మానవుని నిస్సహాయత ప్రస్పుటం గా కని  పించింది .

            ఓడ ఏదో ఒక గట్టు వైపుకు కొట్టుకు పోతున్నట్లు అని పించి ధైర్యం కూడా దీసుకొని కెప్టెన్ తెరచాపలు ఎత్తించాడు ..కాని అతని కృషి ఫలించలేదు .ప్రవాహం బలంగా దక్షిణ దిశకు పరిగేట్టుతోంది దానితో బాటు  నౌక అలానే సాగి పోతోంది గమ్యం లేకుండా .దూరం గా ఫారన్ ద్వీపపు లైట్ హౌస్ కాంతి కనీ పిస్తోంది .అందరికి తమ ఓడ ఎంత అపాయకర స్థలం లో ఉందొ అర్ధమై పోయింది .కెప్టెన్ హంబుల్ ఓడను ఆద్వీపం మధ్యలోకి నడిపి రక్షిద్దామని తీవ్రం గా ప్రయత్నించాడు కాని ఫలితం లేకుండా పోయింది .తెల్ల వారు ఝామున నాలుగింటికి ఓడ ‘’హార్కార్ రాక్’’అనే  కొండకు ఢీ కొని ముందుభాగం ముక్కలైంది వెనుక భాగం అలల తాకిడికి అల్ల కల్లోలమైంది .ఎవరికి వారు తమ ప్రాణాలను దక్కించుకోవాలనే ప్రయత్నం లో ఉన్నారు ఆత్మ రక్షణార్ధం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ప్రారంభించారు స్వార్ధ పరులైన కొందరు నావికులు నౌక లో ఉన్న ఒక చిన్న ‘’లైఫ్ బోట్’’ ను  సముద్రం లో కి దింపి దానిలో ఎక్కి పారిపోవటానికి ప్రయత్నించారు .ప్రయాణీకుల ప్రాణాలను కాపాడాల్సిన నావికులే స్వార్ధ బుద్ధితో ఆత్మ రక్షణకు అందర్నీ నట్టేట ముంచి పలాయనం చిత్త గించి వృత్తికీ దేశానికీ  అవమానం తెచ్చారు .స్వార్ధం ఎంతటి నీచానికైనా దిగ జారుస్తుందనితెలియ జేసే సంఘటన ఇది . .

          నావికులు పడవలో పారి పోతున్నారని అలికిడి ద్వారా తెలుసుకొన్న ఒకరిద్దరు తామూ ఆ పడవలోకి దూకారు కొందరు దూకే ప్రయత్నం లో సముద్రం లో పడి మునిగి అక్కడికక్కడే చని పోయారు .కళ్ళ ముందే వాళ్ళు చని పోతుంటే ఓడలో ఉన్న వారి ఆర్తనాదాలతో ,హాహా రావాలతో ఆ ప్రదేశం అంతా శోక సముద్రమే అయింది .భగవంతుని ప్రార్ధించటం తప్ప వారింకేమీ చెయ్య లేని నిస్సహాయ స్తితి .ఓడ విరుగుతున్న ధ్వనులు, రోదనలు మిన్ను ముట్టాయి .ఈ దెబ్బతో ,నౌకమధ్య కు  రెండు ముక్కలైంది .మొదటి భాగం అగాధ సముద్ర జలాల్లో మునిగి కంటికి కని  పించకుండామునిగి  అదృశ్యమైంది .నౌక లోని గదులన్నీ మునిగిన ఈభాగం లోనే ఉన్నాయి .ఓడనాయకుడు,భార్య కూడా ఇందులోనే ఉన్నారు పాపం . .

               తెరచాపకోయ్యలు, చక్రాలు ఉన్న ముందుభాగం మాత్రం కొండలో చిక్కుకొని ఉండి పోయింది .ఇందులో తొమ్మిది మంది మాత్రం ప్రాణాలు ఉగ్గ బట్టుకొని బతికి ఉన్నారు .వీరిలో అయిదుగురు ప్రయాణీకులు ,నలుగురు మాత్రం నావికులు .ప్రయాణీకులలో ‘’సారా డాసన్ ‘’అనే ఆమె తన ఇద్దరు పిల్లల్ని రోమ్మునకు హత్తుకొని భీతావహి యై ఉంది .సాయం కోసం అందరు అరుస్తున్నారు ఆమె పిల్లలిద్దరూ ఆ చలికి, గాలికి, నీటికి బిర్ర బిగుసుకొని ఆమెచేతుల్లోనేమరణించారు ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది .  .ఆమె మాత్రం కోన ఊపిరితో ఉంది ..గాలి వాన క్రమం గా తగ్గు ముఖం పట్టింది .కాని సముద్రం మాత్రం భయంకరం గా గర్జిస్తూనే ఉంది .తెల్ల వారుతోంది .చీకట్లు ఇంకా విచ్చుకోలేదు  . .ఎవరైనా వచ్చి రక్షిస్తారని ఆ తొమ్మిది మందిఎదురు చూస్తున్నారు .

                మన కధా నాయకి గ్రేస్ డార్లింగ్ కు నావ లోని వారి ఆర్త నాదాలు విని పించాయి ఆమె నిరుపేద బాలిక .వెంటనే తండ్రిని నిద్ర లేపింది . ఎలా వారికి వారికి సాయమందించ గలమని తల్లీ కూతురు ఆలోచించారు.ఇంతలో తెల్ల వారింది పగిలిన ఓడ భాగం కని పించింది .కాని సముద్రం ఇంకా అల్లకల్లోలం గా ఉంది వెళ్ళ టానికి ఎవరికి ధైర్యం చాలటం లేదు అవకాశమూ కనిపించటం లేదు .‘’స్మేదిల్‘’అనే ధన వంతుడు సముద్రం లో చేపలు పట్టే వారికి అయిదు పౌన్లు డబ్బు  ఇస్తానని ఆశ పెట్టి పిలిచినా వాళ్ళు కూడా సముద్రం లోకి పడవలతో వెళ్ళ టానికి సాహసం చెయ్య లేక పోయారు .సముద్రం లోకి వెళ్ళటం ప్రాణాంతకం అని పించింది అందరికి .ఎవరి ప్రాణం వారికి తీపి కదా .నీటిలో నిత్యం చేపల్లా ఈదేవాళ్లేభయపడితే సామాన్యులకు వెళ్ళే ధైర్యం ఎక్కడుంటుంది ?

       లైట్ హౌస్ గార్డు అయిన డార్లింగ్ మొదట సంశయించినా కూతురు గ్రేస్ చొరవ తీసుకొనటం తో ధైర్యం గా ముందడుగు వేసి ఓడ లోని వారిని రక్షించాలని బయలు దేరాడు .ఒక ‘’లైఫ్ బోట్’’ ను సముద్రం లోకి దింపి చెరొక తెడ్డు పట్టుకొని నడపటం ప్రారంభించారు .అయితే ఆమె కు పడవ నడపటం ఇంతకు ముందెప్పుడూ చేయలేదని ముందే చెప్పుకొన్నాం .కాని అవతలి వారిని రక్షించాలన్న తాపత్రయం ఆమె కు ఆ విద్య ను అప్పటి కప్పుడు నేర్చుకోనేట్లు చేసింది .అత్యంత వేగం గా ,సామర్ధ్యం గా పడవను నడిపి తండ్రికే ఆశ్చర్యాన్ని కలిగించింది ..రక్షించాల్సిన వారంతా కొండ మీద చిక్కు కొన్నారు వారి దగ్గరకు చేరా లంటే ఆ కొండ ఎక్కాలి .పడవ పగలకుండా చూసుకోవాలి కెరటాల తాకిడికి ,..వేగానికి పడవ కొండకు ఢీకొంటే మొదటికే మోసం .నెమ్మదిగా పడవను కొండ దగ్గిరికి చేర్చారు తండ్రీ తనయలు గబుక్కున తండ్రి ఒక్క సారి కొండపైకి దూకాడు .కూతురు  గ్రేస్  లాఘవం గా పడవను లోతు నీటి లోకి నడిపి నీటి పై తేలేట్లు చేసింది .ఒక్కోకర్ని అతి  జాగ్రత్తగా పడవ లోకి చేర్చాడు .తొమ్మిది మందిని ఎక్కించుకొని సురక్షితం గా తమ లైట్ హౌ లోకి చేర్చారు .వీరి ప్రాణాలను కాపాడటానికి గ్రేస్  ఎంత ఆత్రుత పడిందో అంతే ఆత్రుత ను మరో మూడు రోజులు చూపించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించి తల్లి కి చేదోడు గా ఉంది .వారి మనోవేదనను శాంత పరచటానికి గ్రేస్ కుటుంబం శక్తి వంచన లేకుండా చేసి మానవత్వాన్ని ప్రదర్శించారు .తను పడుకొనే పరుపును ఇద్దరు పిల్లలను కోల్పోయిన అభాగ్యురాలు డాసన్ దొరసాని కి  ఇచ్చి గ్రేస్ బల్లమీదే నిద్రపోయింది .ఆ తర్వాత ఓడలలో వచ్చి ఇక్కడ చిక్కుపడ్డ వారిని కూడా ఇంటికి తెచ్చిమొత్తం ఇరవై మందికి  తండ్రీ కూతురు వారి ఆలనా పాలనా చూశారు .మానవత్వం వికశించిన మహాద్భుత సన్నీ వేశం ఇది .చరిత్రలో నిలిచి పోయింది .

                  గ్రేస్ తండ్రి జీతం మీద ఆధార పడి బతికే పేద ఉద్యోగి .అయినా ఆయన కూతురు గ్రేస్ ఒక సాహస కార్యం తో అందరి దృష్టిని ఆకర్షించింది. పేరు పుట్టుక తో రాదు. చేసేపనులవల్ల,వస్తుందని రుజువు చేసింది ప్రపంచానికి..గ్రేస్ చేసిన సాహస చర్య  ఆనోటా ఆనోటా పడి  అందరి దృష్టికీ చేరింది ఎక్కడెక్కడి నుంచో జనం ఆమెను చూడ టానికి తీర్ధ ప్రజ గా వచ్చేవారు ధనికులు, అధికారులు,సామాన్యులు  అందరు వచ్చి ఆమె ను అభినందించారు .రాణి రాజు ఈ తండ్రీ కూతుర్లను పిలిపించి సత్కరించారు బంగారు గడియారాన్ని గ్రేస్ కు కానుక గా ఇచ్చారు .దాన్ని ఆమె తనను చూడ టానికి వచ్చిన వారందరికీ చూపిస్తూ మురిసి పోయేది .అనేక మంది ఎన్నో విలువైన కానుకలను గ్రేస్ కు పంపారు .ఆమె కు ఆర్ధిక సాయం చేయాలనే సంకల్పం తో చందాలు వసూలు చేసి700 పౌన్ల ధనాన్ని ఆమె కు అందించారు ..గ్రేస్ సాహసం పై నాటకాలు రాసి ప్రదర్శించారు .ఆమె కొద్దిసేపు పడవలో కూర్చుని నాటకం చూస్తె బోలెడు ధనమిస్తామని ఆశ పెట్టారు .కాని ఆమె దేనికీ ప్రలోభ పడలేదు వీటిని  తృణప్రాయం గా భావించి తిరస్కరించింది .త్యాగానికి ప్రతి ఫలం కోరుకొని మనీషి అని పించి,నిజం గా నే గ్రేస్ అని పించుకోంది .తానేదో గొప్ప ఘనకార్యం చేశానని ఆమె ఎప్పుడూ ప్రగల్భాలు పలకలేదు .ఈ సంఘటన తర్వాత మూడేళ్ళు తలిదంద్రులతోనే ఉంది వారు బతికి ఉండగా వేరుగా ఉండనని చెప్పింది .వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేసినా వివాహం కూడా  చేసుకోకుండా జీవించి కన్య గానే మిగిలి పోయింది . .

           1841 లో గ్రేస్ కన్య కు క్షయ రోగం సోకింది ..వీలైన మంచి వైద్యం చేయించినా గుణం కనపడ లేదు ,క్రమంగా క్షీణించి పోయింది .మరణ సమయం లో ఆమె బంధువు లందర్నీ  పిలిపించుకొని తన వద్ద ఉన్న అమూల్య వస్తువలను తన స్మృత్యర్ధం కానుకలు గా అందజేసిన త్యాగ శీలి గ్రేస్ .జీవితాన్ని ‘’గ్రేస్ ‘’తో జీవించి ,అందరికి ‘’డార్లింగ్ కన్య’’అయిన గ్రేస్ డార్లింగ్  ‘’1842 అక్టోబర్20 న  బాంబరోనగరం లో కీర్తి శేషురాలైంది .ఆమె శవ యాత్రలో అశేష జనం పాల్గొని ఆమెకు శ్రద్ధాంజలి ఘటించి చరిత్ర సృష్టించారు .ఆమెను ‘’సెయింట్ ఐడాన్స్ చర్చి యార్డ్ ‘’లో ఆమె తలిదండ్రుల సమాధుల ప్రక్కనే  సమాధి చేశారు .

       ఆమె సాహసజీవితం పై ఎన్నో కధలు నాటికలు పాటలు వచ్చాయి .’’Grece Darling or Maid of the isles ‘’పేరైత జేరోల్ద్ వేర్మాన్ 1839  లో ఒక నాటకం రాసి  ప్రదర్శించాడు .ప్రఖ్యాత ప్రకృతి కవి విలియం వర్డ్స్ వర్త్ 1843 లో ‘’గ్రేస్ డార్లింగ్ ‘’అనే అద్భుత కవిత రాసి ఆమె త్యాగాన్ని ప్రస్తుతించాడు .ప్రభుత్వం గ్రేస్ పేరుమీద ఒక లైఫ్ బోట్ ను హోలీ ఐలాండ్ లో ఏర్పాటు చేసింది .విలియం బెల్ స్కాట్ అనే ప్రముఖ చిత్రకారుడు డార్లింగ్ జీవితం పై చిత్రించిన అనేక చిత్రాలను నార్త్ అంబర్ లాండ్ లోని ‘’వాషింగ్ టన్’’హాలులో ప్రదర్శించాడు .బామ్బర్గ్ లో ఒక మ్యూజియం లో ఆమె సాహసాలను భద్ర పరచారు .దేవ్ కజిన్స్ ఆమె పై ఒక గొప్ప భావాత్మక ప్రేమ గీతాన్ని రాశారు .వెస్ట్ గెట్ గ్రేస్ జీవితం లోని అపూర్వ ఘట్టాలపై ఒక సంగీత రూపకాన్ని సమకూర్చి ప్రదర్శించాడు .ఆమె పరోప కార పారీణత అందరికి ఆదర్శమే .చిరస్మరణీయురాలు గ్రేస్ డార్లింగ్ ..

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో