ఈ విశాల ప్రపంచంలో ఎన్ రికొజోనా ఎవరు?అన్నిటికి మించి అతనొక కవి.కవి గారి హృదయం అందరికన్నా శక్తివంతమయిన కారుణ్యంతో నిండి ఉంటుంది. తన తల్లికి క్రిస్మస్ శుభాకంక్షలు తెలిపేందుకు అతనో కవిత రాశాడు. దానితో ఇంటిల్లిపాదీ మొత్తానికీ ముద్దుల,గారాబాల పిల్లాడయిపోయాడు.అతి ప్రేమ వల్ల అతనిలో బాల్యపు చిలిపి చేష్టలు అంతరించి పోయాయి. ఎన్ రికొ కవితాత్మక ధోరణి అతని తల్లిదండ్రులను కదిలించి వేసింది.సహజంగానే బడిలో చాల ఇబ్బందుల పాలయ్యాడు. తనను అభిమానించే ఉపాధ్యాయుల మీద వ్యంగ్య కవితలు రాసినా,ఇంటికి వచ్చేసరికి పాలిపోయి,రోగిష్టిలా ఉండేవాడు. అతని సున్నితమైన,నాజూకు స్వభావానికి,మిగిలిన పిల్లల అల్లరిచిల్లర పనులు,కష్టమైన చదువులూ సరిపడలేదు. దాంతో ఇంట్లోనే ఉంచారు.ఎన్ రికొ అన్నల్లో ఒకడేమో నావికా పాఠశాలలో,ఇంకొకడు సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఉండటంతో,దొరికిన ఏకాంతంలో అతను సాహిత్యంలో స్నేహితులను పొందగలిగాడు.బాగా చదివి,పైకి రావాలని గాంభీర్యమైన భాష,భావాలతో సోదరలకు ఉత్తరాలు రాసేవాడు.ఏదో ఒక వృత్తిలో తాను నిమగ్నం కాలేనని,అలాంటి అసహ్యకరమైన పనులవల్ల తన కవి హృదయం నలిగిపోతుందనే వాడు.
అతను చదువుతాడు,అతను బాగా చదువుతాడు,కాసేపు వైజ్ఞానిక గ్రంధాలు,మరి కాసేపు సాహిత్యం,కానీ రచయితలందరితోనూ అతను విసిగిపోయాడు.ఎందుకంటే వారికి తనలాగా ఆలోచించటం,భావించటం,అనుభవించి పలవరించటం తెలియదు కాబట్టి. తనసోదరికి చదువు చెప్పే ఆంగ్ల యువతితో మొదటిసారి అతను ప్రేమలో పడ్డాడు .ఆమె కూడా నిజాయితీగా,గాఢంగా ప్రేమించింది.ఆమె పేరిట ఎన్ రికొ ఎన్నో ప్రేమ కావ్యాలు రాసాడు. అంతులేని తన బాధలను ఆమెతో చర్చించాడు. పాపం ఆమె కూడ ప్రేమికుడి ఆవేదన చూసి ఎంతగానో వ్యధ చెందేది.కానీ కవిగారి తల్లి టీచరమ్మను ఇంటినుంచి సాగనంపింది.అంతేనా?ఆమెకు విధ్యార్ధులే లేకుండా పోయారు.ఆ సంధర్భంలో మనకవి ఆత్మహత్య గురించి ప్రస్తావించే వాడు,కవితలు కూడా రాశాడు.తడిసిపోయిన కళ్ళతో తప్ప మనం ఆ కవితలను చదవలేము. ఇల్లంతా విషాదమయం,ఏదో ఉపద్రవాన్ని ఊహిస్తున్న వారిలాగా ఒకరినొకరు చూసుకునేవారు.
* * * * *
కవిఎంతో,ప్రగాఢంగా , భావావేశంతో ప్రేమించాడు. అతని అత్యంత సున్నిత మనఃస్తితి బలవర్ధకం కావటం చాలా అవసరం. ఎన్ రికొ కుటుంబం పెద్ద కలిగిన కుటుంబం కాక పోయినప్పటికీ,ఎన్నో బాధలు పడి,ఎన్నో గడపలు తొక్కి,వెయ్యి లీరాలు సంపాదించి కొద్దిరోజులు ఎక్కడికయినా తిరిగి రమ్మని యాత్ర లాగా పంపించారు.ఆ వీడ్కోలు సన్నివేశం వర్ణనాతీతం.అందరి కంటా కన్నీరే- ఎన్ రికొకు తప్ప.అయితే అందరికీ తెలుసు,తీవ్రమైన వేదనలు కన్నీటి ద్వారా బయటకు రావని.అతను మౌనంగా ఉండిపోయాడు.రైల్లో,తన వ్యధనంతా వ్యక్తం చేస్తూ ఒక కవిత రాసి తల్లి తండ్రులకు పంపాడు,అదే చేత్తొ ఒక పత్రికకు కూడా. సందర్శిస్తున్న దేశాలన్నిటినుంచి బహుబాధతో,ఇంటి మీద బెంగ పెట్టుకుని చచ్చిపోతున్నాని,తనకు ప్రియమయిన వారి దగ్గరకు వచ్చేయాలని ఉందనే కోరికను వర్ణిస్తూ ఉత్తరాలు రాసేవాడు.ఆ ఉత్తరాలను ఇంట్లో బిగ్గరగా చదివేవారు. అందులో తన వేదనను వర్ణించే భాగాలు వచ్చినప్పుడు అందరి కళ్ళూ కాలువలయ్యేవి.పేరుప్రఖ్యాతులు పెరుగుతున్నాయి,అతను మాత్రం ఇంటికి రాలేదు.కవిగారి గురించి తెలుసుకోవాలీ,అతన్ని కలుసుకోవాలనుకునే వారందరూ ఎన్ రికొకు ఆతిధ్యమిచ్చి సత్కరించారు.వయసులో చిన్నవాడయినా కీర్తి కాంత అతన్ని వెతుక్కుంటూ వచ్చి నుదుటి మీద చుంబించింది.
* * * * *
తిరుగు ప్రయాణంలో మహా ప్రణయావేశంతో ఒక గొప్పింటి వివాహితతో నడిపిన వ్యవహారం కవిగారి పేరుప్రతిష్టలను మరింత ఇనుమడింప చేసింది.ఆమె ఎన్ రికొతో బాగ సర్దుకు పోయింది.అంటే తనస్థ్హాయి బాగా తగ్గించుకుని.ఎందుకనగా,యువరాణులయినా సరే,మన కవిలాగా తనకు తెలిసిన ధోరణిలో ప్రేమించే వారి ముందు స్థాయి తగ్గించుకుని సర్దుకుపోవాల్సిందే.ఎన్ రికొ ప్రచురించిన కవితల చిన్న పుస్తకం ద్వారా కీర్తో,అపకీర్తో బాగా పాకిపోయింది.పఠితలను ముగ్ధులను చేసే ధ్వనులతో,కదిలించే కల్పనలతో ప్రేమచరితను హృదయరక్తంతో రచించాడు.ప్రేయసి పేరు మాత్రం వెళ్ళడించలేదు గానీ,పోలికలు ఎంత స్పష్టంగా ఉన్నాయంటే అచ్చయినంత వేగంగా ప్రతులన్నీ అమ్ముడుపోయాయి. జనఘోష దద్దరిల్లి పోయింది. ఆ హడావుడికి నెమ్మదస్తుడయిన ఆ భర్త విడిపోదామన్నాడు.విడిపోయారు.ఇద్దరు కొడుకులు తండ్రికి,ఒక కొడుకు తల్లికి వాటాలుగా వచ్చారు.ఒక కాపురం ఆవిధంగా నలిగి,నాశనమైపోయింది. ఎన్ రికొ పూర్తిగా కలత చెందినా,చట్టాన్ని మాత్రం అక్షరాలా శిరసావహించాడు. ఆ యువరాణిని మళ్ళీ చూడలేదు.అతని జీవితంలో అదో పెద్ద విఘాతం.కొడుకు చచ్చిపోతాడేమోననే భయంతో అతని తల్లి తల్లడిల్లిపోయింది.రాత్రింబవళ్ళూ సేవలు చేసింది.తల్లిచల్లని చూపుతో,స్ఫర్శతో కవి కోలుకున్నాదు,ఆమె మాత్రం అలసిపోయి,బలహీనపడింది.
* * * * *
ఇరవై ఎనిమిదేళ్ళు వయసు వచ్చేసరికి ఇటలీ కవిలోకానికి ఎన్ రికొ పెద్ద తలకాయగా మారాడు.రచయితలు,రాజకీయనాయకులు,పాత్రికేయులు అందరికీ స్నేహితుడయ్యాడు. రాజాస్థానాలు,కులీనకుటుంబాలు అతన్ని ఆహ్వానించాయి.కానీ అలాంటి జీవితానికి డబ్బు చాలా అవసరం.ఒక నౌకకు కెప్టెన్ గా చేస్తున్న సొదరుడు తన వాటా అమ్మి సొమ్ము కవికిచ్చి,ఇంగ్లాండు,అమెరికాల మధ్య తిరిగే ప్రయాణానికి ఐదు సంవత్సరాలు ఒప్పందం కుదుర్చుకుని వెళ్ళాడు.చిన్న తమ్ముడు కూడా దూరంగా ఒక ఫ్యాక్టరీలో మెకనికల్ ఇంజనీరుగా చేరి తన వంతు ఆస్తీ ఇచ్చేశాడు.స్వచ్చందంగా వారు అజ్ఞాతంలోకి వెళుతున్నదున ఎన్ రికొ విపరీతంగా విలపించాడు,వారిని పోనివ్వనన్నాడు,చివరకు మగతతో తూలి పడిపోయాడు.తల్లి మాత్రం కొడుకులోని సొదరప్రేమకు మురిసిపోయింది.
అతనికి ప్రస్తుతం చాలినంత ఆదాయం ఉంది.దానితో అతను మరీ విలాసవంతంగా కాకపోయినా,సౌకర్యంగా,కవిగా,చక్కగా బతకొచ్చు.మధ్య తరగతికి చెందిన వారి ఇల్లు,ప్రఖ్యాత సందర్శకులు వచ్చినప్పుడు చాలక ఇరుకు అనిపించేది.ఐతే ఈ ఆలోచన ఎన్ రికొది కాదు.వాళ్ళ అమ్మది.ఆవిడే మంచి పేరున్న,పెద్దబజారులో పెళ్ళి కాని యువకులుండే ఇల్లు చూసుకొమ్మని తొందర చేసింది.కవికి ఇష్టంలేదు గానీ,ఆమె గృహప్రవేశం చేసి,ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది.చక్కటి సువాసనలు వెదజల్లుతూ,జల్సాగా ఉన్న ఆ ఇంట్లోకి కవి అయిష్టంగానే మారాడు. పాపం కొడుకు బలవంతాన,ఎంతో కష్టం మీద ఇల్లు వదిలాడు లేదా వాళ్ళ అమ్మ అందరికీ అలా చెప్పుకుంది.
ఇప్పుడు అతని స్థానం సుస్థిరమయ్యింది. ఎన్ రికొ మానవత్వం,సామ్యవాద ధొరణితో,కార్మికకర్షకుల ఆకలిని,పేదరికాన్ని వర్ణిస్తూ,శ్రామికుల సమస్యల మీద కవితలు రాశాడు.అతని పంక్తుల్లో ప్రేమ,మంచితనం ధారాపాతంగా పారేవి.మానవత్వాన్ని తరచితరచి ప్రస్తావించే వాడు.ఇటలీ మొత్తం మీద అంత మంచి మనసున్న కవి మరొకడు లేడని ప్రజలు ఏకాభిప్రాయానికి వచ్చారు.కుటుంబం గర్వ పడింది.ఎంతో కాలం నుంచి తన కోసం వేచి చూస్తున్న ఒక యువకుడిని పేదవాడనే నెపంతో కవి చెల్లెలు కాదు పొమ్మంది, సొదరుడి పేరు ప్రఖ్యాతుల మూలంగా. కవి అదంతా అర్ధం చేసుకున్నాడు.చెల్లిని సుతారంగా ముద్దాడి, ఆ అమ్మాయి కోసం అధ్భుతమయిన కావ్య ఖండికను రాశాడు.అతని కలం నుంచి వెలువడ్డ గొప్ప కవితల్లో అది ఒకటి.
ఎన్నో సన్మానాల్లో మనవాడు తడిసి ముద్దయ్యాడు.ఒక కవితా ఉత్స్తవానికి ఇటలీ ప్రతినిధిగా వెళ్ళాడు .అక్కడ అతనికి స్వాగతాలు,సత్కారాలు,సంభావనలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈమధ్య కాలంలో వాళ్ళ అమ్మ మంచం పట్టింది.ఆ కబురు కవితోత్సవం మధ్యలో వచ్చింది,కానీ కార్యక్రమం పూర్తయ్యేవరకూ అతనికి చేరలేదు.చేరిన వెంటనే ఎంతో ఆందొళనగా ఉంది,వెంటనే బయల్దేరుతున్నాను అని టెలిగ్రామిచ్చాడు. సమయానికి అతను రాలేదు కానీ,టెలిగ్రాము చేరింది.కొడుకు ఉన్నత హృదయాన్ని దీవిస్తూ ఆ తల్లి కన్ను మూసింది. ఇల్లు చేరగానే తల్లి మృతదేహంపై పడి,జుట్టు పీక్కుంటూ,భోరున విలపించాడు.శ్మశానవాటికకూ వెళ్ళాడు.ఒక సంవత్సరం పాటు అతని కవితలన్నీ తల్లి మరణ విషాద సంకేతాలే.మరొక సోదరి పెళ్ళి ఆలోచన పూర్తిగా వదిలేసి ఎన్ రికొ ఇల్లు చూసుకునేందుకు వెళ్ళింది.
ఎన్ రికొ ముప్ఫైఐదేళ్ళ వయసులో అతన్ని ఒక యువతి ప్రేమించింది.కానీ కవి అవేమీ పట్టించుకోలేదు.ఆమె బెంగతో మంచాన పడి,చిక్కి సగమై పోయింది.ఆ పిల్ల తండ్రి ఇతగాడి కాళ్ళ మీద పడి,కట్నంగా మూడు వందల లీరాలు ఇస్తానని చెప్పినా వద్దన్నాడు. ఆమె ఇక చచ్చిపోయిందీ అనుకునే సమయంలో పెళ్ళాడాడు.పెళ్ళితో సంతొషం,స్వాతంత్ర్యం అన్నీ త్యాగం చేస్తున్నానని అందరితో చెప్పాడు. మహిళాభిమానులు ఎంతో నొచ్చుకున్నారు.భార్య మాత్రం అతన్ని అర్ధం చేసుకోలేక పోయింది.అందుకు ఓదార్పుగా కవికి కొందరు ఆదర్శవనితల తోడు దొరికింది.తనను ప్రేమిస్తున్న స్త్రీలకు,ప్రపంచపు బాధల గురించి తన హృదయం మోస్తున్న బరువుల గురించి వర్ణించాడు.కానుపు కష్టం కావటంతో భార్య కన్ను మూసింది.పుట్టిన బిడ్డ కూడా ఎక్కువ రోజులు బతకలేదు.కానీ,ఎన్ రికొ జొయనాకు మాత్రం భార్య,కూతురి వాటాగా మూదు వందల వేల లీరాలు వచ్చాయి.
ఇటాలియన్ మూలం:మెటిల్డే సెరావ్
ఇంగ్లీషు అనువాదం:గ్రేస్ జెల్ఫ్
తెలుగు అనువాదం:రాజేంద్ర కుమార్ దేవరపల్లి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~