గౌతమీ గంగ

         3వ ఫారం పూర్తి చేసిన సుబ్బారావు తణుకులో ఒక ప్లీడరు గారి వద్ద గుమాస్తాగా చేరాడు. అప్పుడే భార్య సుబ్బమ్మ కాపురానికి వచ్చింది. ఆమె పుట్టి పెరిగిన కొమాన్లపల్లికి పూర్తిగా భిన్నమైనది ఈ ఊరు. ఆ ఊరు వర్షాకాలంలో ఓ దివిలా వుండేది. చుట్టూ ప్రక్కల గ్రామాలతో సంబంధం వుండేది కాదు. మామూలు రోజుల్లో కూడా మిగతా ఊర్లతో ఆ ఊరికి రాకపోకలు తక్కువే. వర్షాల వల్ల, వరదల వల్ల ఆహారం దొరకని రోజుల్లో ఆ ఊరి జనం పెద్దసైజు  గుమ్మడిపండుకు అడుగున రంధ్రం చేసి అందులో దాని నిండా బెల్లంపొడి కూరేవారు. ఆ కాయను మంటపై కాల్చి పొట్టు వలచి తలోకాస్త ముక్కా తినేవారు.

               ఊరి జనాభా కూడా చాలా తక్కువే. సూరన్న గారు తమకు వచ్చిన కొద్దిపాటి వైదిక విద్యతో గ్రామ పౌరోహిత్యం నిర్వహిస్తూ రోజులు వెళ్ళదీస్తున్నారు. వారి పెద్ద కుమార్తె బాల్యంలోనే వైధవ్యం పొంది తల్లితండ్రుల వద్దనే వుండేది. రెండవ కుమార్తెను కొంచెం భూవసతి కలవారికి ఇచ్చి పెళ్ళి చేసారు. మూడవ కుమార్తె వరకు వచ్చే సరికి పెళ్ళి చేసే  స్తోమత లేకుండా  పోయింది. ఆ కుమార్తె పైవాడు సుబ్బన్న, ఏకపుత్రుడు అతడికి అటు చదువు అబ్బలేదు. ఇటు తండ్రి చేసే వైదిక వృత్తిపట్ల ఆసక్తి లేదు. తల్లిదండ్రుల గారాబంతో నిర్విరామంగా రోజులు గడుపుతున్నాడు.

                ఆడపిల్లల కొరకు ఆస్తులు వెచ్చించరాదని ఉన్నదంతా జాగ్రత్త చేసి తలకొరివి పెట్టే కొడుక్కి ముట్టచెప్పాలని నాటి వారి భావన. లచ్చన్నగారు తమ పెద్ద కుమారునికి పిల్లనిస్తామని వచ్చినా సూరన్న గారితో తమ కుమార్తె ఐదు ఏళ్ళ సుబ్బుల్ని వారి కుమారుడికి చేసుకోమని, రెండు వివాహాలూ బాధ్యత వహించి వారి ఇంటి వద్దనే నిర్వహించమనీ, తనకు రాగి డబ్బు చేతికి ఇవ్వనవసరం లేదనీ, తమకు ఆడదక్షత లేకపోవడంతో ఈ విధంగా కోరుతున్నాననీ అన్నారు. సూరన్నగారికి ఇది సబబుగానే తోచింది. ఈ రెండు కార్యాలు జరిగిపోతే తనకు నిశ్చింత, గ్రామస్తుల్ని బ్రతిమాలుకుంటే తలొకరూ, తలోసాయం చేసి గట్టెక్కిస్తారు అనుకున్నారాయన.

                     ఈ విధంగా సుబ్బమ్మలిద్దరూ పెళ్ళి కూతుళ్ళ ఈ కుండమార్పిడి పెళ్ళి ద్వారా వదినా,  ఆడబిడ్డలు అయ్యారు. సూరన్న  గారి కుమార్తె భర్త ఉద్యోగం చేసే తణుకు గ్రామానికి,  లచ్చన్నగారి కుమార్తె కొమాన్లపల్లి గ్రామానికి కాపురానికి వచ్చారు. సుబ్బమ్మగారు తణుకులో ఊరి ప్రక్కగా పారే గోస్తనీ నది నుంచి నీరు తెస్తూ, ఇల్లూ,  వాకిలీ పూడ్చి అంట్లుతోమి, బట్టలు వుతికి, పప్పులూ బియ్యాలు చేసుకుంటూ వంట చేయాలి. ఇంట్లో మరో ఆడతోడు లేదు.

                 పన్నెండేళ్ళ ఆ బాలిక ఈ అధిక శ్రమకి తట్టుకోలేక కళ్ళు తిరిగి గోస్తనీనదిలో పడిపోయింది ఓసారి. సమీపాన బట్టలు ఉతుక్కుంటున్న చాకళ్ళు చూసి ఆమెను బయటకు తీసి సేదతీర్చారు. ఆమె మెల్లగా ఇంటికి వచ్చి భర్తకీ, మామగారికీ జరిగింది చెప్తుంది. సుబ్బారావుగారు మొదట  మండిపడ్డా తరువాత నిదానంగా ఆలోచించారు. ఇక్కడ తనకు చేతినిండా పనిలేదు. అర్జితంలేదు. ఏలూరు  కొంత పట్టణం లాంటిదీ. అక్కడ మంచి ప్లీడరుగా పేరుపొందిన రాంపల్లి బుచ్చి వెంకన్నగారు తమ శాఖవాడే. ఆయన వద్ద గుమాస్తాగా చేరితే తన కష్టానికి తగిన ఫలితం పొందుతూ మరికాస్తా వెసులుబాటుగా బ్రతకవచ్చు.

                  ఆయన బాగా ఆలోచించుకుని తన అభిప్రాయం తండ్రికి చెప్పారు. ఇద్దరూ కలిసి ఏలూరు పట్టణం చేరారు. అతిధుల పట్ల ఆదరాభిమానాలు కల బుచ్చి వెంకన్నగారు వారిని బాగా ఆదరించారు. భోజనాలు  అయి కొంత విశ్రాంతిగా వున్న వేళ లచ్చన్నగారు వారి చెంతకు చేరి రెండు చేతులు పట్టుకొని వెంకన్నబాబూ! వయస్సులో పెద్దవాడినీ,  సాటి కులం వాడిని మీ తాహతుకు తూగని వాడనైనా ఓ కోరిక కోరుతాను మీరు మన్నించాలి’’ అన్నారు. వృద్ధుడైనా ఈ బ్రాహ్మడు ఏమి కోరతాడా? అనకుంటూనే చెప్పండి అన్నారు వారు. వీడు నా పెద్ద కొడుకు వీడి తరువాత ఇంకో ఇద్దరు పిల్లలు  వున్నారు నాకు. నా ఇంటిది కాలం చేసింది. వీడికి వివాహం చేసాను. భార్య కాపురానికి వచ్చింది. వీడికి తమరు అభిమానించి ఏదైనా పని ఇప్పిస్తే  నా సంసారాన్ని నిలబెట్టిన పుణ్యం తమకు వుంటుంది అన్నారు వెంకన్నగారు. సుబ్బారావుని మాట్లాడిరచి చూసారు పిల్లవాడు బుద్దిమంతుడూ,  చురుకైన వాడు,  కష్టపడి పనిచేసే వాడిలానే వున్నాడు అనుకున్నారు ఆయన. నా వద్ద ఇప్పటికే ఇద్దరు గుమాస్తాలు వున్నారు. రేపటినుండే వారివద్ద పని నేర్చుకో అన్నారు సుబ్బారావుతో. తండ్రీ కొడుకులిద్దరూ ఊళ్ళో తిరిగి ఒక గదీ, వంట ఇల్లు వున్న వాటా అద్దెకు మాట్లాడుకున్నారు. కుమారుని మరునాడే పనిలో చేరమని చెప్పి తాను కోడల్నీ, సామాను తీసుకురావడానికి తణుకు వెళ్ళారు లచ్చన్నగారు.

                   ఏలూరులో సుబ్బమ్మగారు ఇద్దరుబిడ్డల తల్లి అయ్యింది. మొదటివాడు కుమారుడు తండ్రిలా నల్లని వాడు కాని పొడుగు మనిషి. తల్లిదండ్రులకూ, తాతకూ,  ముద్దుబిడ్డ. మొదటి సంతానం అవడం వల్ల కొంచెం మంకుతనం హెచ్చే. సుబ్బమ్మగారు వయస్సులో చిన్నదైనా పిల్లవాని పెంపకంలో బహు నేర్పరి. తల్లి ఆ పల్లెటూరు వదిలిరాదు. అమాయకురాలు. అత్తగారు ఏనాడో గతించింది. పదమూడేళ్ళ ఆ బాలిక గృహకృత్య నిర్వహణలో క్షణం తీరిక లేకపోయినా పిల్లవాని సంరక్షణలో బహునేర్పుగా చేసేది. బియ్యం దోరగా వేయించి ఓ పాత్రలో పోసుకొనేదామె. వాము ఎర్రగా వేయించి పొడికొట్టి ఒక మట్టిపాత్రలో పోసుకునేది కొంచెం ఉప్పు కలిపి. తాము ఇంటిలో వాడుకోవడానికి కొంచెం ప్రియం అయినా ఆవుపాలనే కొనేవారు.  ఆ పాలు ఎర్రగా కాచి మళ్ళీ ఒక పిడతతో భద్రపరచి నాలుగు రోజులకోసారి వెన్న చిలికి నేయి తయారు చేసేవారు. ఆ ఆవునెయ్యి పసివానికి అన్నంలో వేసేవారు. ఇంటి వారు అవసరమైతే మరి కాసిని నీళ్ళు కలుపుకొనిఅయినా చిన్నవాడికి రెండు పూటలా పెరుగు బిళ్ళ వేయవలసిందే. ఒక  మట్టి పిడతలో అన్నం, మరో మట్టి  పిడతలో ఓ చారు పోయిలో వంట చేసేటప్పుడు వచ్చే నిప్పులు మట్టి కుంపటిపై వండేవారు. ఒక చెక్కపీట మీద పచ్చమట్టితో అర్థచంద్రాకారంగా తయారుచేసి దానికి మధ్యలో సన్నని ఇనుప ఊచలు అమరుస్తారు. అది మట్టి కుంపటి. దాని మీద సన్నని సెగతో పదార్థాలు నిదానంగా మెత్తగా ఉడుకుతాయి. అప్పటికింకా ఇనుపకుంపట్లు వాడుకలోకి రాలేదు. మెత్తగా అలా ఉడికిన అన్నంలో ఆవునెయ్యి ఉప్పు వాము చేర్చి పెట్టేక పెరుగు అన్నం పెట్టేవారు. ఇది బ్రహ్మయజ్ఞమంత పని. భర్త, మామగారి భోజనాలు ముగిశాక పిల్లవాడికి పెరట్లో కాకినీ, పిచుకనీ,  ప్రక్కవారి పెరట్లో దడిమీదుగా కనిపించే పిల్లినీ, కుక్కనీ చూపిస్తూ అన్నం పెట్టడం ప్రారంభిస్తే భోజనం ముగిసే సరికి తల్లికీ కొడుక్కీ కూడా అన్నాభిషేకం జరిగిపోయేది. నీళ్ళపొయ్యి మీద మిగిలివున్న నీటితో పిల్లవాడి ఒళ్ళు కడిగి తుడిచి వాకిట్లో కునుకు తీస్తున్న మామగారి వద్ద వదిలి  సుబ్బమ్మగారు పెరటినూతి వద్ద  స్నానం చేసి పొడిచీర కట్టుకొని భోజనం చేసి ఆకు బైట పారవేసే లోపల నరసింహం అమ్మా చూడు అంటూ ఛత్రధారిjైు వచ్చేవాడు. ప్రక్కింటివారు తిని పారవేసిన పులివిస్తరాకు పుల్లకు గుచ్చి తలపైన పెట్టుకొని సుబ్బమ్మగారు లబోదిబోమంటూ అతడిని నూతి వద్దకు తీసుకొని పోయి అతడిపై నాలుగు చేదల నీరు పోసి తాను ఇన్ని నీళ్ళు దిమ్మరించుకునే సరికి

                    ‘‘ఎందుకే వాడిపైన అలా అరుస్తావు’’ అని కోడల్ని మందలించి తిరిగి నిద్రపోయేవారు లచ్చన్నగారు. ఇటువంటి స్నానాలు, భోజనాలు రెండూ, మూడుసార్లు అయ్యేవి ఆమెకు. ఒకసారి నరసింహం తల్లి పెరట్లో పనిలో వుండగా గూట్లో అగ్గిపెట్టె తీసి,  ఒక పుల్ల వెలిగించాడు. మండుతున్న అగ్గిపుల్లను చూసేరికి అతడికి కంగారు పుట్టింది. దాన్ని ఏం చేయాలో తెలియక ప్రక్కనున్న మాసిన బట్టల బుట్టలో వేసి మెదలకుండా మూత పెట్టేశాడు. కాలిన బట్టల వాసనకు సుబ్బమ్మగారు  లోనికి వచ్చి చూసి బిందెడు నీళ్ళు పోశాక మంట ఆరింది కాని ఆమె గుండెదడ ఎప్పటికో కాని తగ్గలేదు. ఆ సందడికి మెళకువ వచ్చిన లచ్చన్నగారు ఏమిటే పసివెధవను అలా తిట్టిపోస్తావు అని కోడల్నే మందలించేవారు. పిల్లవాడికి భయం చెప్పక నన్నే అంటున్నారు అని బాధ కలిగేది ఆమెకు. సాయంత్రం ఇంటికి వచ్చిన  భర్తముందు సానుభూతిని ఆశించి తన గోడును భర్త వద్ద వెళ్ళబోసుకునేది. ఆయన పసివాడిని మందలించబోతే ‘‘ఏమిట్రా మీరిద్దరూ కలిసివాడిని చంపేస్తారా ఏమిటీ’’ అని కొడుకూ,  కోడలితో తగాదాకు దిగేవారు లచ్చన్న్గగారు. ఆ చిన్నవాడి మనస్సులో అమ్మా నాన్నకూ తన మీద కోపమనీ తాత తనని ఆదుకొనే వాడనీ అనిపించసాగింది. మూడవ ఏడాది వెళ్ళబోతూంటే నరసింహానికి జబ్బు చేసింది. ఊళ్ళో ఆచార్యుల వారి వద్ద నుంచి మందు తెచ్చి వాడుతున్నారు. నాటి రోజుల్లో అనారోగ్యం కలిగితే గుళ్ళో పూజారి వారు పసరులూ మూలికలతో వైద్యం చేసేవారు. ఏదైనా ముల్లు గుచ్చుకోవడం కానీ, వ్రణం వేయడం కాని జరిగితే ఊరి మంగలే శస్త్ర వైద్యుడు. అతడు తాను క్షురకర్మ చేసే కత్తితో గాట్లు పెట్టి శస్త్ర చికిత్స చేసేవాడు. ఆచార్యుల వారి వైద్యం వలన పసివాడికి గుణం కనిపించడం లేదు. ఓ రోజు మధ్యాహ్నం సుబ్బారావు గారు కోర్టుకు వెళ్లాక పిల్లవాడిపై చేయి వేసుకొని వాడి మంచం వద్ద దిగులుగా కూర్చొని వుంది సుబ్బమ్మగారు. పొరుగింటి గున్నమ్మ గారికి సుబ్బమ్మగారంటే పుత్రికా వాత్సల్యం. చిన్న వయస్సులో పెద్ద దిక్కులేకపోయినా సమర్థంగా ఇల్లు  దిద్దుకొంటున్నా ఆమె అంటే కొంత గౌరవంకూడా. అమ్మాయి! అల్లుడు కచేరికి వెళ్లాడా అంటూ లోనికి వచ్చిన ఆమె సుబ్బమ్మగారి దీనవదనం చూసి ఇదేమిటీ తల్లీ అలా వున్నావు. పిల్లలన్నాక సుస్తి చేయదా ఏమిటీ? నా తల్లివి కదా! లే, లేచి చిన్న తిరుపతిలో వున్న వెంకన్నబాబుకు ముడుపు కట్టి మ్రొక్కుకో, రేపటికల్లా నీ కొడుకు హాయిగా లేచి ఆడుకుంటాడు అంటూ సుబ్బమ్మగార్ని రెక్క పట్టుకొని పెరట్లోకి తీసుకొని వెళ్ళి నూతివద్ద తలస్నానం చేయమని ఆ తడి బట్టలతో వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసి,  ఒక పాత  బట్ట ముక్కకు పసుపు పూసి అందులో ఓ రాగి కాణీ అక్షితలు వుంచి పిల్లవాడికి నెమ్మదిస్తే ద్వారకాతిరుమలకు వచ్చి వెంకటేశ్వరస్వామి సన్నిధిలో పిల్లవాడి  తలనీలాలు సమర్పించి స్వామి పేరు పెట్టుకుంటామని  మ్రొక్కుకున్నారు. తరువాత పసుపు గుడ్డమూట  ఓ మట్టి పిడతలో మ్రొక్కు తీర్చుకొనే వరకూ ప్రతీ నెలా కృష్ణ పక్షంలో శుక్షపక్షంలో వచ్చే రెండు ఏకాదశలలో రాగిడబ్బు ముడుపుకట్టి క్రొత్త పిడతలో వెయ్యమనీ తిరుమల వెళ్ళినప్పుడు ఆ డబ్బు స్వామి హూండీలో వెయ్యమనీ చెప్పారు. సుబ్బమ్మగార్ని  పొడిచీర కట్టుకొని రవ్మని చెప్పి తాను చనువుగా వంటింట్లోకి వెళ్ళి విస్తరి వేసి అన్నం వడ్డించి దగ్గర కూర్చొని ఆదరంగా భోజనం పెట్టారు. చిత్రంగా మరునాటికి పిల్లవాడు లేచి ఆడుకోసాగాడు. సుబ్బమ్మగారికి వెంకన్న బాబుపై అచంచల విశ్వాసం ఏర్పడిరది. నాటి నుంచి ప్రతి శనివారం తలస్నానం చేసి ఆవునేతితో వెంకటేశ్వరునికీ దీపారాధన చేసి  పానకం,  వడపప్పూ, చలిమిడి నైవేద్యం పెట్టేవారు. జీవిత  పర్యంతం ఆవిడ ఆ విధంగా ఆచరించారు. ఏడుకొండలపై తిరుమలలో   వెలసిన శ్రీవేంకటేశ్వరుడు ఆంధ్రుల ఆరాధ్యదైవముగా  నాటికి ప్రసిద్ధి పొందలేదు. చాలా దూరం నాటి పాసింజరు రైళ్ళలో అనేక చోట్ల మారుతూ ప్రయాణించి ఏడుకొండలూ కాలినడకన ఎక్కి మోకాలు పర్వతం ఎగబ్రాకి వెంకటరమణుణ్ణి సందర్శించడం కష్టసాధ్యమైన పని. తరిగొండ వెంగమాంబగారి వెంకటాచల మహత్యం గ్రంథం ద్వారానే ఆంధ్రులకు వెంకటేశ్వరుని క్షేత్రం పరిచయం అయ్యింది. చాలా  కొద్ది మందికి మాత్రమే తిరుమల తిరుపతి యాత్ర సాధ్యమయ్యేది. ఏలూరుకు సమీపంలో ద్వారక తిరుమల వుంది. ప్రజలు దాన్ని చిన్న తిరుపతి అని పిలుచుకుంటారు. ఇక్కడ స్వామి భక్త శులభుడు. ద్వారకుడు అనే ముని ప్రార్థనపై పర్వత రూపం దాల్చిన అతడి శిరస్సుపై స్వామి ఇక్కడ వెలిశాడు.

                   నెల తిరరగకుండానే ద్వారక తిరుమలలో పిల్లవాడికి కేశఖండన చేయించి వేంకటేశ్వరుని నామం ముందుంచి వెంకటలక్ష్మీ నరసింహారావు అని పిల్లవాడికి నామకరణం చేసి మ్రొక్కు తీర్చుకున్నారు. సుబ్బారావు దంపతులు. తిరుమల కొండపై ఎందరో శిశువులకు, కేశఖండన, అన్నప్రాశన జరిగిన ద్వారక తిరుమలేశుని నామంతో పిల్లల్ని పిలుచుకోవడం ఆంధ్రులకు ఎప్పటినుంచో ఆచారం. వారి ఇల్లు రైలుకట్టకు దగ్గరగా వుండేది. సాయంత్రం నీరెండ వుండగానే పిల్లవాడికి అన్నం పెట్టేవారు సుబ్బమ్మగారు. ఆ వేళకు రైలు వెళ్ళడం చూచి అమ్మా ‘‘కూ’’ వచ్చింది అన్నం పెట్టు అనేవాడు ఆ బాలుడు.

                సుబ్బమ్మగారు మాలిచూలు గర్భం ధాల్చారు. ఎడ పిల్లవాడు శ్రద్ధతోనూ, వివేకంతోనూ కూడిన ఆమె పెంపకంలో ఆరోగ్యంగా పెరుగుతున్నాడు. ఈసారి సుబ్బమ్మగారికి ఆడపిల్ల కలిగింది. ఆ బాలికకు వెంకటరత్నమ్మ అని పితామహి పేరు పెట్టారు. చూడ వచ్చినవారంతా తెల్లగా రుబ్బరు బొమ్మలా, పెద్ద పెద్ద కళ్ళు బుల్లి నోరుతో నల్లనితలకట్టుతో వున్న పిల్లని ముద్దుచేస్తూ సుబ్బమ్మ అదృష్టవంతురాలివి చక్కనిచుక్కను కన్నావు అని అభినందిస్తూనే ప్రక్కన వున్న నరసింహాన్ని చూచి ఏరా చెల్లాయి నీలా కాదు ఎంత బాగుందో చూడు అనేవారు. నరసింహానికి అతడికి తెలియకుండానే చెళ్ళెలుపట్ల ద్వేషభావం ఏర్పడసాగింది. చెల్లి ఏడ్చే సరికల్లా ఎత్తుకొనే తల్లి తనను నీవు పెద్దవాడివయ్యావు ఏడవకూడదు అంటూంది. తనను అమ్మ ప్రక్కలో కాకుండా వేరేగా పడుకోమన్నారు. అతడు  ఎవరూ చూడకుండా చెల్లెల్ని మంచం మీద నుంచి క్రిందకు లాగివెయ్యడం. ఆమె పొట్టమీద కూర్చోవడం చేయసాగాడు. పెద్దవారు మందలించే కొద్ది అతడికి అల్లరి ఎక్కువ అవుతూంది. అతడిని దగ్గర కూర్చోబెట్టుకొని తెలియజెప్పడానికి ఎవరూ ప్రయత్నించలేదు. అతడికి బాల్య సహజమైన దుడుకుతనమే కాని ఇవన్ని కోరి చేసేవి కాదు.

                      ప్రసవానికి కొంతకాలం ముందు నుంచీ  సుబ్బమ్మగారు తాను దాల్చే ఎరుపు, నీలం,  ముదురు ఆకుపచ్చ, నలుపు, ఊదారంగు రవికలు కొంత పాతవయ్యాక జాగ్రత్త చేసేవారు. అవి కత్తిరించి గుండ్రనిబట్ట చుట్టూ కుచ్చెలుగా సన్నని ముక్క అతికి పసిపాపకు టోపీలు కుట్టేవారామే. ఆ టోపీలతో చాలా ముద్దుగా వుండేది పసిబిడ్డ. పిండి జల్లించుకొనే జల్లెడకు, బియ్యపు బస్తాలు కుట్టే దబ్బనంతో రంధ్రాలు చేసి ముదురు ఆకుపచ్చ, ఎరుపు, పాలపిట్ట రంగు బట్టలను ముక్కోణపు ముక్కలుగా కత్తిరించి వాటిని రెండు ముక్కలుగా అతికి మధ్యలో ఊక కూరేవారు. రంగు కాగితాలతో ఆ చిలకలకు రెక్కలూ, ముక్కు అతికించేవారు. వాటిని దబ్బనంతో జల్లెడకు అతికించి కుట్టేవారు. ఈ పనిలో ఆమెకు మామగారు సహాయం చేసేవారు. గాలికి చిలకలు ఊగుతూ వుంటే పాప కేరింతలు కొడ్తూ ఆడేది. నరసింహం ఎవరూ చూడకుండా వచ్చి వాటిని తెంపి పోసేవాడు. తల్లి, తాత మందలిస్తే ఉయ్యాలలో వున్న చెల్లిని గిల్లి పారిపోయేవాడు. తల్లిదండ్రులకు తనపై కోపమని, చెల్లెలు తనకు ప్రత్యర్థి అనీ అతడి మదిలో అభిప్రాయం ఏర్పడి అతడితో పాటు పెరగసాగింది. వెంకటరత్నం అందంతో పాటు తెలివితేటలు వున్న బిడ్డగా ఎదగసాగింది.  మూడవ ఏడు వచ్చినప్పటినుంచీ తన బుల్లి బుల్లి చేతులతో తల్లికి ఇంటి పనుల్లో సహాయపడేది. ఆ రోజుల్లో ఆంగ్లేయులు నూతనంగా ప్రవేశపెట్టిన విద్యా విధానం ప్రకారం అప్పుడు పట్టణాల్లో నేటి మాంటిస్సోరి విధానం వల్ల మూడు  సంవత్సరాల పిల్లల్ని పాఠశాలలో చేర్చుకునేవారు. బేబి క్లాస్‌, ఇన్‌ఫెంట్‌ క్లాస్‌ అన్నవి, నేటి ఎల్‌.కె.జి, యు.కె.జి వంటివి. మాతృభాషలో నర్సరీ రైమ్స్‌ ఆటలు నేర్పేవారు ఆ క్లాసులో. ఐదవ ఏట ఒకటవ తరగతికి వచ్చేవారు. తెలివిగల వెంకటరత్నం తన అందచందాలతో అందరిని మురిపెంగా చూరగొంటూ ఇన్‌ఫెంట్‌ క్లాసు నుండి రెండవ తరగతి చదువనక్కర లేకుండా ఒకటవ తరగతిలోకి, ఒకటవ తరగతి నుండి రెండవ తరగతి చదువనక్కరలేకుండా మూడవ తరగతిలోకి డబుల్‌ ప్రమోషన్లు పొందింది. శ్రద్ధగల తల్లి పోషణలో ఏపుగా ఎదుగుతున్న రత్నాన్ని చూస్తుంటే తాతగారికి తొందర కలుగసాగింది. ‘‘ఒరేయ్‌ సుబ్బాయ్‌! అష్టావర్షా భవేత్‌ కన్యా అన్నారు. కానీ… ఇది ఈలోగడే ఈడేరేటట్టుంది. దీన్ని తగిన వరుడి చేతిలో పెట్టి కన్యాధార ఫలితంతో స్వర్గం చేరాలని ఆశపడుతూన్న నన్ను,  మిమ్మల్ని కూడా వెలివేయించి ఊరి బైటకు సాగనంపేటట్టు వుంది దీని వాటం చూస్తే’’ అని మొత్తుకోసాగారాయన.

                  ఆ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళి కాకుండా రజస్వల అయితే పీఠాధిపతులు వేంచేసి ఆ ఇంటి వారికి వెలి విధించి, వారిని బ్రాహ్మణ వీధి నుండి వెళ్ళగొట్టి, చాకలి, మంగలి మొదలైన కులవృత్తుల వారిని వారి ఇంటికి పనికి వెళ్లకుండా కట్టడి చేసేవారు. ఏలూరులో ఒక బాల వితంతువు ప్రకృతి ధర్మాన్ని మీరలేక చీకటి తప్పు చేసింది. ఆ కుటుంబంతో విరోధం వున్న మరికొన్ని కుటుంబాలవారు ఐదవనెలలో గుట్టు రట్టు చేసి, పీఠాధిపతులకు పిర్యాదు చేసి ధర్మ నిర్ణయం చేయడానికి వారిని ఆహ్వానించారు.  గురువుగారు మందీ మార్బలంతో అర్చాపీఠాన్ని వెండి పల్లకిలో వుంచుకొని గ్రామానికి వేంచేశారు. ఊరిలోని పండితులు వేదస్వస్తి చెప్పి బాజా భజంత్రీలతో ఎదురేగి, పూర్ణకుంభంతో స్వాగతం చెప్పి వారిని ఆహ్వానించారు. ఊరి మొత్తానికి సంపన్నులయిన వారి ఇంట వారికి విడిది ఏర్పాటు చేసారు. ఉదయమే పీఠాధిపతులు మంగళవాయిద్యాలతో ఏటికి స్నానానికి వెళ్లివచ్చి శిష్యుడు వెంట బిందెతో తెచ్చిన తీర్థోదకంతోనూ, ఆవుపాలు, పెరుగు, నెయ్యి,  తేనె, చక్కెర పానకంతోనూ, పంచామృతాభిషేకం, శుద్ధోదకస్నానం, శారదాంబ సహిత చంద్రమౌళేశ్వరస్వామి అర్చాపీఠానికి సమర్పించి, నమక చమకాలతోనూ, శత రుద్రాయంతోనూ అర్పించి మహా నివేదన సమర్పించి పూజ విధి నిర్వరిస్తారు. పూరిలోని బ్రాహ్మణ్యమంతా పీఠానికి 116 రూపాయలు దక్షిణ సమర్పించి ఒకరోజు తమ ఇంటికి భిక్షకు ఆహ్వానిస్తారు. క్షత్రియులూ, వైశ్యులూ, కొద్దిపాటి స్థితిమంతులైన శూద్రులూ కూడా భిక్షాధనం సమర్పించి ఊరి పురోహితుని ఇంట తన పేర భిక్ష ఏర్పాటు చేసి తమ జన్మ ధన్యమైనట్లుగా భావిస్తారు. పురోహితుని ఇంటికి బియ్యం, పప్పులూ, ఉప్పులూ, నెయ్యి, బెల్లం, కూరలూ, పాలూ, పెరుగు మొదలైనవి సమస్త సంబారాలూ పుష్కలంగా పంపిస్తారు భిక్ష జరిపించుకునేవారు. వారు ఉదారంగా పంపిన సంబారాలు ఇంటి వారికి ఒక నెల గ్రాసానికి వచ్చేవి. ఈ విధంగా విందులు స్వీకరిస్తూ గ్రామంలో బసచేసిన పీఠాధిపతులు నేరం ఆరోపించబడిన వారిని తమ ఎదుటకు పిలిపించి అశేష ప్రజానీకం ఎదుట విచారణ జరిపిస్తారు. ఈ విచారణలో వాదోపవాదాలు వుండవు. తమకు అర్పించబడిన ఫిర్యాదును స్వీకరించి అపరాధం ఆరోపింపబడిన వారిని నోరెత్తనీయకుండా పీఠాధిపతులే వారికి తగిన శిక్ష విధిస్తారు. నేరం సామాన్యమైనదైతే జుర్మానా చెల్లిస్తే సరిపోతుంది. ఇక్కడ నేరం వర్ణ సంకరానికి కారణమైనది. ఇది సామాన్యమైనది కాదు. సామాన్యంగా ఆచారాలు పాటించడంలో కలిగే లోపాలు చిన్న పరిధిలోనివి. అపరాధ తీవ్రతను బట్టి ఊరి వారికి వెలి విధింపబడిరది. ఆ ఇంటివారంతా బిగ్గరగా విలపిస్త్తూ, మోయగలిగిన సామాను చేతబట్టుకొని మిగతావన్నీ అక్కడే వదిలి తమ ఇల్లు వీడి ఏటి ఒడ్డుకు తరలిపోయారు. అక్కడ ఒక రోజంతా నిరాహారంగా గడిపాక, ఆ చుట్టు ప్రక్కల నివసించే శ్రమజీవుల సహకారంతో ఏటి ఒడ్డునే చిన్న పాక ఏర్పరచుకుని మట్టి పాత్రలతో వండుకుని తింటూ, కటిక నేలపై పరుండసాగారు. తమను ఆదరించిన వారి జాతిలో కలువలేక సాటివారు బహిష్కరించగా ఆ ఇంటివారు అనుభవించిన చిత్తక్షోభ కళ్ళారా చూసిన లచ్చన్నగారికి కంగారు పుట్టింది. తనకూ ఇటువంటి స్థితి సంప్రాప్తిస్తుందేమోనని. మనుమరాలి పెళ్ళికి తొందరపడసాగారు. ఆయన  ఆరోగ్యం కూడా దెబ్బతిన్నట్టు కనపడసాగింది.

             ‘‘ఒరేయ్‌ సుబ్బన్నా… నీకు పదేళ్ళప్పుడు మీ అమ్మ పోయింది. తల్లీ,  తండ్రీ నేనే అయి నిన్ను తమ్ముణ్ణీ, చెల్లెల్నీ పెంచాను. ద్వితీయం చేసుకోమని ఎందరు పోరినా, ఆ వచ్చేది మిమ్మల్ని సరిగ్గా చూస్తుందో, చూడదో అనే భయంతోనూ, నాకు వచ్చే నాలుగు రాళ్ళతో దానికి కూడా పిల్లలు బయలుదేరితే పెంచలేననే భయంతోనూ పెళ్ళిమాట తలపెట్టలేదు. ఏలాగో తంటాలుపడి రోజులు నెట్టుకొని వచ్చాను. నాకు అరవై ఏళ్ళు వచ్చాయి. ఏ క్షణాన హరీమంటానో మనుమరాలి పెళ్ళి కళ్ళారా చూసుకునే అదృష్టం కలిగించారా!’’ అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు.

          సుబ్బారావుగారికి తల్లి అనారోగ్యం,  ఆమె మరణం,  ఆడదిక్కులేక చిన్నతనంలో తాము పడ్డ అగచాట్లూ కళ్ల ముందు మెదిలాయి. మనసంతా బరువెక్కిపోయింది. ఏటా ఏటా చూలింత బాలింతలతో రత్తమ్మ గారికి ముఫ్పై ఏళ్ళకే దారుఢ్యం తగ్గిపోయి ముసలివాటం పడిపోయింది. ఇంట్లో ఆమెకు క్షణం విశ్రాంతి లేదు. సుబ్బారావు కన్నా పెద్దది కృష్ణమ్మ. ఆమె తల్లివలే బక్కపలుచనిది. పసిమిఛాయతో చక్కని తలకట్టు,  కను ముక్కు తీరు కలది.

– కాశీచయనుల వెంకటమహాలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

52
Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో