ఓయినం

                తూర్పున వెలుగు రేకలు విచ్చుకొనక ముందే మసక చీకట్లో మేలుకుంది నీలమ్మ.అప్పటికే తల్లిదండ్రులిద్దరు మిలట్రీలో చీపురు పనికిపోయారు. పక్కనే నిద్రపోతున్న చెల్లెలిపై దుప్పటిని సరిచేసి, బయటకొచ్చి చన్నీళ్ళతో ముఖం కడుక్కొని, పొయ్యి మీదున్న డికాషను గ్లాసులో పోసుకొని తాగింది.బయట చీకటి తెరలింకా తొలగిపోలేదు.గుమ్మం దిక్కు చూస్తూనే గిన్నె, గ్లాసు సంచిలో ఏసుకొని చెల్లెలి దగ్గరకు వచ్చి, ”ఏ బుజ్జి పన్కి బోతున్న జెల్దీ లెవ్వు” అంటూ లేపింది. బుజ్జి నిద్రలో అటు ఇటు మసులుతూ ”గట్లనే నువ్వు పోక్కా మస్తు నిద్రొస్తుంది” అంటూ అటు తిరిగి పడుకుంది.నీలమ్మ తలుపులు చేరేసి వాకిట్లోకి వచ్చేసరికి ఆకాశంలో చందురుడు పడమటి పయనం కాలేదు, తూర్పున సూరీడు అమ్మవడి నుంచి రాలేదు. తెల్లని వెన్నెల్లో నల్లని నీడను చూస్తూ రివ్వున వీచే చలిగాలికి చిగురుటాకులా ఓన్కుంటూ గిన్నెల సంచిని అదిమి పట్టుకుని బంగాళా దిక్కు సాగిపోయింది.

బంగాళాను చేరేసరికి పొద్దుతిరుగుడు పువ్వులెక్క సూర్య కిరణాలు విచ్చుకుంటున్నాయి.
గచ్చు దగ్గరకు వెళ్ళి తన కోసమే ఎదురుచూస్తున్నట్లున్న వాకిలిని చిమ్మి, నీళ్ళు జల్లి, ముగ్గేసి అంట్లన్ని తోమి, బట్టలుతికే సరికి దొరసాని చాయి తెచ్చి గ్లాసులో పోస్తూ ”చాయి తాగవే” అంటు గిన్నెలన్నీ తీసుకొని లోపలికి పోయింది.
రెండు నిమిషాల్లో  చాయి తాగి గదులన్ని ఊడ్చి తుడ్చే సరికి పదకొండైంది.
అప్పటికే దొరసాని సద్దన్నం చారుకూరని గిన్నెల్లో ఏసి అరుగుమీద పెడ్తే వాటిని సంచిలో పెట్టుకొని ”అమ్మ నేను పోతున్నా” అంటూ ఇంటికి బయలుదేరింది.
నీలమ్మ యింటికి పోయేసరికి తల్లి తోవలోనే ఎదురొచ్చి ”బిడ్డా యింట్లకి పోకు” అని మెల్లగా చెప్తు చేతిలోని సంచిని తీసుకుని చెయ్యి పట్టి పక్కకు తీసుకెళ్తుంటే ”ఏందే గీడికి తీసుకొస్తున్నవు” అన్నది.
”బిడ్డా మనింటికి సుట్టాలొచ్చిండ్రు గాళ్ళ ముందల నువ్వు గిట్లుంటే బాగుండదు. జెల్దీ జాలట్లకుపోయి తానం జేసిరా” అంటూ పక్కనే తాడుమీద వేసిన బట్టలను చేతికిస్తూ ”ఇంగో గియ్యల గీ లంగ వోణి ఏసుకో” అన్నది.
”లంగ వోణీనాయే నాకు గివి ఎస్కోనికి రాదు, అయినా గివి గిప్పుడెందుకే” అన్నది విషయమేమిటో అర్ధంగాక.
‘ఓ పిల్లా గియ్యాల గూడా లంగా జాకెట్టు ఏస్కుంటావా ఏది మా తమ్ముడు నిన్ను సూడొచ్చిండు పిల్లా” అంటూ బుగ్గమీద నొక్కి ”మా తమ్మునికి నువ్వు మస్తుగా కనపడాలంటే ముద్దుగా తయారుగావాలె” అని పక్కున నవ్వింది వదిన వరుస అయిన సంగమ్మ.
”ఆ గీసూసుడు గీసుడు ఏందోగాని మొన్న పండ్గజేసినప్పుడు గూడా గిట్లనే లంగవోణి ఏసి ఇస్కించిండ్రు గది నాకేసుకోనికి రాదొదినా” అన్నది.
”సరే నేనేస్త తియ్యి పోయి బిరాన తానం జేసిరా” అంటూ నీలమ్మను జాలట్లకి నెట్టింది.
”ఓ సంగమ్మ మీ మరదలు తానం జేసినంక జేర మీ యింట్లనే తయారు జేయ్యి. ఒకటే రూంల ఆళ్లముందు పిల్లను ఎట్ల తయారుజేద్దు” అంటూ ఎల్లమ్మ అద్దము, పౌడరు బొట్టు కాటుకను సంగమ్మ చేతిలో పెట్టింది.
అరగంటలో నీలమ్మ చూడొచ్చిన వాళ్ళముందు తలొంచుకుని కూర్చుంది.
అటు పెద్దలు ఇటు పెద్దలు పరస్పరం అబ్బాయిని అమ్మాయిని చూసుకున్నాక తమలో తామే ముచ్చటించుకుంటుంటే అందరికి చాయి అందించింది సంగమ్మ.
అందరు చాయి తాగి సేదతీరాక
”మాకు పిల్ల నచ్చింది. మా యిష్టమే మా కొడుకు ఇష్టం” అని పోచమ్మ అంటుండగానే
”ఇంగ మావోడు మీకు పసందైతే జెప్పుండ్రి పెట్టుపోతలు మాట్లాడుకుని పూలు పండ్లు పెట్టుకుందాం” అంటూ అందరి దిక్కుచూశాడు సత్తయ్య.
సాలయ్య ఎల్లమ్మలకు మొగులయ్య నచ్చాడు. తమ పెద్దలతో మాట్లాడి ”పిల్లగాడు మాకు నచ్చిండు. నా బిడ్డను మీకియ్యనీకి మాకు సమ్మతమే యింగ పెట్టుపోతలు దిక్కెల్లి మీరు మాట్లాడుండ్రి” అన్నడు సాలయ్య.
”ఇంగో పిల్లకు అద్దతులం కమ్మలు, చెయ్యనెత్తు ఓంకు, యింగ పుస్తె మెట్టెలు నేను దెస్తా” అన్నడు సత్తయ్య.
”నా శాతనైన కాడ్కి రెండు మడుముల బాసాన్లు, పావులెత్తు ఉంగరం, ఒక సైకిలు నేనిస్తా” అన్నడు సాలయ్య.
ఇరుపక్షాలకి పెట్టుపోతలు నచ్చాయి.
”ఇంగేందే సత్తెన్న మనకు పిల్ల నచ్చింది. ఆళ్లకు మన పిల్లగాడు నచ్చిండు, ఇక పూలుపండ్లు పెట్టుకొని లగ్గం తారీఖు దీస్తే అయిపోయే” అన్నడు చంద్రయ్య.
సత్తయ్య అక్కడ్నించి లేచి సాలయ్య భుజంమీద చెయ్యేసి బయటకు తీసుకొని పోతుంటే అందరు వాళ్లవెనకే నడిచారు.
బయటకు నడిచిన సత్తయ్య చెట్టుకింద ఆగి
”ఇంగో మా పిల్లగాని దిక్కెల్లి కొన్ని సుద్దులు ముందుగాళ్ళనే మీతోటి జెప్పాలే. ఏదైనా ముందుగాళ్ళ సెప్తనే బాగుంటది లేకపోతే పెండ్లయినంకా గీసుద్ది జెప్పలే, గాసుద్ది జెప్పలే అనొద్దు” అని అంటుంటే
”ఏం సుద్ది” అన్నాడు సాలయ్య.
”గదే ఆని తల్లిదండ్రుల సుద్ది”
”తల్లిదండ్రులు లేరంటిరిగా బావా మల్లమేమేమన్న అంటిమా” అంటుంటే ”లేలే  మొత్తం కిస్స చెప్తనే బాగుంటది మా మొగిలిగాడు నా తమ్ముని కొడుకు. ఈడు బుడ్డగుండంగానే నా తమ్ముడు సచ్చిపోయిండు. తల్లి ఈడిని ఇడ్సిపోయింది. గప్పట్నించి మా అవ్వ ఈడ్ని సాకింది. ఆమె పోయినకాడి నుంచి ఈడు నా పంచలనే ఉంటుండు. నా సేండ్లనే పన్జేస్తుండు. ఆడికి ఈడొచ్చింది. ఇంగ పెండ్లిజేస్తే ఆడి బతుకు ఆడు బత్కుతడని మీ పిల్ల నడ్గొచ్చినా. ఈని పెండ్లయితే నా బరువు తీర్తది” అంటూ నిట్టూర్చాడు.
”గది సరే బిడ్డా గిదంతా జెప్పినవు. మంచిగనే ఉంది మల్లా పోల్లగానికి యింత పొలం పుట్రా ఏమన్నా ఉన్నదా లేదా” అన్నడు సిద్దయ్య తాత.
”ఇంగోయే తాత నీకాడ దాచేదేముంది మాకు ఎనిమిది ఎకరాల పొలం ఒక పొత్తుల ఉంది. అదిగూడా ఒకటే పట్టకాయితంల ఉంది. గిండ్ల నాలుగు పాళ్ళు. నాలుగు పాళ్లల్లో రెండు పాళ్ళు నాది నా తమ్మునిది. మిగతా రెండు పాళ్ళు ఇంగో మా కాకయ్యల కొడుకులు చంద్రిగానిది, ఎల్లిగానిది, రంగనిది. గట్లనే యింకో తమ్ముడి కొడుకు రాజుగానిది” అంటూ అక్కడే నిల్చొన్న అందర్ని చూయించాడు. ”యింగ గిప్పటిదాకా నా పొలం నా తమ్ముని పొలం అంతా నేనే జేస్తుంటి. ఈని పెండ్లయితే ఈని తండ్రిపాలు ఈనికే ఇస్త ఇంకేంది” అన్నాడు.
”ఏంరా సాలయ్య పిల్లగాని దిక్కెలి అన్ని సుద్దులు ఇంటివిగా ఇంగ నీకు సమ్మతమేనా” అన్నాడు ఎంకయ్య.
”అన్నా మీ అందరికి సమ్మతమైతే నాకు సమ్మతమేనే” అంటూ పెద్దవాళ్ల పైననే నిర్ణయాన్ని ఓదిలేశాడు.
”మేమేం అంటంరా పిల్లగానికి పిల్ల సరింగా ఈడుజోడైంది. తల్లిదండ్రులు లేకపోతేంది పెద్దదిక్కుగా ఆళ్ళ పెద్దమ్మ, పెద్దనాయినా కాకయ్యలుండ్రు, బత్కనీకి పొలం ఉంది, ఉండనీకి ఇల్లుంది. యింగ మన పిల్లకేం లోటురా తమ్మి ఇస్తేనే బాగుంటుంది” అన్నడతను.
”సరే మా పెద్దయ్య జెప్పినట్లనే కానిండ్రి” అంటూ ఇంట్లోకి దారితీశాడు. కులపెద్దలందరి ముందు అబ్బాయిని, అమ్మాయిని చెరోపక్క కూర్చోబెట్టాక నీలమ్మకు పోచమ్మ పిల్లమాదన్నట్లు బొట్టుపెట్టి, చేతిలో డబ్బులు పెడ్తే, మొగులయ్యకు సాలయ్య బొట్టు పెట్టంగానే.
”ఇంగ మా పిల్ల మీ ఇంటి కోడలు, మీ పిల్లగాడు మా యింటి అల్లుడు” అంటూ సంతోషపడ్డాడు సిద్దయ్య తాత.
అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.
                                                                     **************
మరుసటి ఐతారం పూలుపండ్లు పెట్టుకుందామని సత్తయ్య సుట్టాలతో కల్సి సాలయ్య ఇంటికి వచ్చాడు.
మొదట అమ్మాయికి పూలుపండ్లు పెట్టాలని కొత్త చాపలో పీటలేసి నీలమ్మను కూర్చోపెట్టి, నుదుట కుంకుమను దిద్ది తాంబూలంలో తెచ్చిన కొత్త బట్టలను ఒడిలో పెట్టింది పోచమ్మ.
ముత్తైదువలు నీలమ్మకు కొత్తబట్టలు కట్టించి పసుపు, కుంకుమలు, గంధం పెట్టి పాపిట్ల చెమికి అద్దుతుంటే చుట్టు ఉన్న వాళ్ళు ”ఏ ఒకపాట పాడుండిరా” అనంటుంటే ముసిముసిగా నవ్వుతూనే ఓ పండు ముసలమ్మ

”మంచి నీళ్ళ బాయికాడా
అంచు లేని ఆకు పుట్టె
ఎంచుకోండ్రి సెలియలారా
ఎంత సోధ్యమో
సుక్క బొట్టుపెట్టుకొని
సూర్యచంద్రులెల్లి రాంగ
సూర్యచంద్ర రాజులంతా
సూడ వచ్చిరి
అడ్డ బొట్టుపెట్టుకొని
అరిచ్చెంద్రు లెల్లిరాంగ
అరిచ్చెంద్ర రాజులంతా
అడ్గవచ్చిరి
మేనమామా పంపినాడు
మంచిదైనా పట్టుచీర
సింగులేసి కట్టరమ్మ
చిన్ని చెలియకు
మేనమామా పంపినాడు
మంచిదైనా గుండిరైక
ముద్దుగుమ్మ చెలియకు
తొడుగరమ్మలు
వాడవాడ చెలియలంతా
ఈడుజోడు గూడుకోని
చెలియా నీ కొప్పులోని
చిన్ని మల్లెలు
చెలియా నీ కొప్పులోని
జాజి మల్లెలు”

అని పాడుతుండంగానే ముస్తాబైన నీలమ్మను తీసుకొచ్చి పీటపై కూర్చోబెట్టి పక్కన మరో అమ్మాయిని కూర్చోపెట్టాక తలలో పూలుపెట్టి మెడలో మల్లెల దండ వేసింది సుక్కమ్మ.పోచమ్మ, సత్తయ్య, సుక్కమ్మ, మల్లమ్మ, కనకమ్మ ఈ ఐదుగురు కల్సి ఒకరెనక ఒకరు నీలమ్మ నుదుట కుంకుమ బొట్టుపెట్టి ఒకేసారి తాంబూలంలోని ఐదు పండ్లు దోసిల్లోకి తీసుకొని ఓడిలో పెట్టి నోట్లో మిఠాయి పెట్టారు. వాళ్ళు పక్కకు తప్పుకోగానే ఒకరేనక ఒకరు భార్యాభర్తలు ఇద్దరిద్దరు వచ్చి వడిలో పండ్లుపెట్టి నీలమ్మ నోరు తీపిచేశారు.అందరు అయిపోయాకా నీలమ్మను లేపి అదే పీటలపై మొగులయ్యని కూర్చోపెట్టి అమ్మాయి తరఫువాళ్ళు కొత్త బట్టలు పెట్టాకా మొగులయ్య వాటిని తోడ్కుకొని పీటలపై కూర్చోగానే నొసట కుంకుమ బొట్టు పెట్టి మెడలో పూలదండేసి చెల్లలో పండ్లుపెట్టి ఒడినింపారు.పూలుపండ్ల కార్యక్రమం అయ్యాకా బైండ్లయినను తీసుకొచ్చి పెళ్ళి ముహూర్తం నిర్ణయించి లగ్నపత్రికను రాయించారు.ఆ రోజుకి సరిగ్గా యింకోనెల ఉండేటట్లు పెండ్లి ముహూర్తాన్ని నిర్ణయించాడు బైండ్లయిన.పెండ్లి, పెళ్ళికొడుకు యింటి దగ్గర జరగాలని పెద్దల మధ్య నిర్ణయం జరిగింది.పప్పన్నం తిన్నాకా సాయంత్రం అందరు తిరుగు ప్రయాణం అయ్యారు. బస్సులో పోతుంటే మొగులయ్య పక్కనే కూర్చున్న పెద్దయ్య మురిపెంగా చూస్తూ ”ఓరి మొగులయ్య యింగ నువ్వు పెండ్లికొడుకువైపోతున్నవన్నమాట” అని అంటుంటే”అన్న మాటేంటి తాతా గది ఉన్నమాటనే” అంటూ హుషారుగా నవ్వాడు.”అబ్బో అప్పుడే మొగోడివైనవురో” అంటూ చెవి దగ్గరకు ఓరిగి ”పిల్లెట్లుంది పిల్లను బాగా సూస్కున్నావా” అంటూ గేలిచేశాడు.”లే తాతా” అని సిగ్గు పడ్తూ ”నువ్వు జూడ లేదా ఏంది నన్నడ్గుతున్నావు’ అంటూ నవ్వుతూ కిటికి దిక్కు ముఖం పెట్టాడు.”గట్లగాదూ పిల్లగా ఇయ్యలరేపు పోరగాండ్లు పిల్లలను జూసి పెండ్లి జేస్కుంటుండ్రంట నువ్వు గూడ గట్లనే పిల్లను జూస్కున్నావా లేదా” అంటూ మోచేత్తో పొడిచాడు.”గా సుద్ది పోనీ తాతా ముందుగాళ్ళ గిదిజెప్పు నువ్వు మా అవ్వను జూసే పెండ్లి చేస్కున్నావా” అంటూ ఎదురు ప్రశ్నించేసరికి తాత ముఖంలో ముసిముసి నవ్వు.”ఓ మీ అవ్వను నేను జూసినా, మీ అవ్వ నన్ను జూసింది” అన్నాడు హుషారుగా. ”నువ్వే నయం తాతా గానాడే నువ్వు మా అవ్వను జూసినవుగాని నేను మీ మనవరాల్ని సూడలే” అన్నడు నిజాయితీగా.మొగులయ్య మాట వినే సరికి పెద్దయ్య పకపకా నవ్వుతూ”ఓ మొగులయ్య మీ అవ్వ నా మేనమామ బిడ్డరా దాన్ని సిన్నప్పట్నించి నా భుజాల మీద ఎత్తుకున్న, జెర పెద్దగైనంకా ఇద్దరం గల్సి ఆడుకున్నం, పాడుకున్నం, బాయిలల్ల ఈతకొట్టినం, చెట్లమీదెక్కి సీమసింతకాయలు కోసుకుతిన్నం, సింతసెట్లెక్కి సింతసిగురు తెంపుకున్నం ఓనగాయలు కోసుకున్నం ఓరాల మీద ఉర్కులాడి, పోలాలల్ల పొర్లాడినం గింత తిర్గినోల్లం ఏడ రుకాయించినమో దెల్సా” అంటూ మొగులయ్య కళ్ళలోకి చూస్తు నవ్వుతుంటే.”ఏడ తాతా ఏడ రుకాయించిండ్రే” అని ఆసక్తిగా అడుగుతూ ముందుకు వంగాడు.”అది సమర్త అయి మూలకు కూకునే తాల్లకు నాముందుగాళ్ళకు రాకపోతుండే యిగ జూసిన అగ జూసిన ఒగపారి యింట్ల ఎవళ్ళు లేనప్పుడు పోయి ఆడుకుందాం రమ్మని సెయ్యి వట్టి గుంజినా గానీ అది శరంతోటి ఉర్కిపోతుండే.నేనూ దాని ఎనకెనక వడి సందు దొర్కినప్పుడల్లా ఏడ్పిస్తుంటే గిట్లనే రెండు మూడు ఏండ్లయినంకా నేను గూడా రుకాయించే టయిమొచ్చి దాన్ని జూస్తె నాకెందుకో సిగ్గెయ్య వట్టింది. గానీ దొంగతనంగా మీ అవ్వను సూడవట్టినా. యింగ నేనూ గూడ నీ అంత అయ్యేతాళ్ళకు మాకు ఒగనాడు గిట్లనే పూలుపండ్లు పెట్టి లగ్గం జేసిండ్రు”  అంటూ ఈ భూమిపై లేని అవ్వ గురించి చెప్తుంటే తాతకళ్ళలోని వెలుగును తదేకంగా చూశాడు.తన దిక్కే చూస్తున్న మనుమడిని మురిపెంగా చూస్తూ” ఓరి మొగులయ్య నీ పెండ్లాము ముద్దబంతి లెక్కుందిరా మీరిద్దరు సీతారాముండ్ల లెక్కుంటరురా” అన్నడు సంతోషంగా.    క    క    కమర్నాడు పొలంలో మడికి నీళ్ళు మళ్ళించి ఓరం గట్టుమీద కూర్చుంటే రాతికి బస్సులో వస్తున్నప్పుడు తాత అన్నమాటలే మొగులయ్యకు గుర్తుకు రాసాగాయి.చిన్నప్పట్నించి అవ్వతో ఆడిపాడిన తాతకీ సిగ్గెందుకయ్యిందో అర్ధం అయ్యి పెదవులపై చిర్నవ్వు వెలిసింది.”మరి అంతా తెల్సిగూడ నీలమ్మ ఎదురుగా ఉన్నా తనెందుకు చూడలేదు. అందరి ముందు సూడాలంటే కొంచెం బయం, ఇంకొంచెం బుగులు, గుండేల నుంచి పెయ్యంత పాకుతుంటే, కండ్లు భూమిని తాకినయి. సిగ్గంటే గదేనేమో శరమంటే గదేనేమో, నీలమ్మ అన్న పేరైతే దెల్సుగానీ, మనిసెట్లుంటదో తాత అన్నట్లు ముద్దబంతి లెక్కుంటుందో, చామంతి లెక్కుంటుందో, లేక పోతే పేరున్నట్లనే గీపారే నీళ్ళలెక్కుంటుందో, ఏమో ఎట్లుంటుందో” అని ఆలోచిస్తు మడిలోకి పారే నీళ్ళనూ చూస్తున్న మొగులయ్య ఆలోచనలు నీళ్లలాగే సుడులు తిరుగుతూ ఎత్తు పల్లాలమీద సరసరా సాగిపోతున్నయి.”మొగిలిగా ఓ మొగిలిగా ఎన్నిసార్లు పిల్వలేబే గంతగనం ఏం సోంచాంచు తున్నావురా. మడ్ల నీళ్ళన్ని నిండి ఓరం దాటి పొర్లిపోతున్నయి పెయ్యిమీద ఓసి లేదేందిరా” అంటున్న పెద్దనాయిన మాట వినేసరికి అదిరి పడి అటుచూశాడు.

– జాజుల గౌరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

4
కథలుPermalink

Comments are closed.